భారత దేశంలో డిజిటల్ చెల్లింపులు దేశీయ సర్వీసు ప్రొవైడర్లకు, ముఖ్యంగా రూపే (RuPay)కి అనుకూలంగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రెప్రెసెంటేటివ్ (USTR) భారత దేశాన్ని విమర్శిస్తున్నది.
UPI ప్రారంభ మైనప్పటి నుండి, వినియోగదారులు కార్డ్‌లకు బదులుగా ఉచిత UPI చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard)లు తమ ద్వారా జరగాల్సిన వ్యాపారాన్ని కోల్పోయాయి.
భారతదేశ ప్రజలు వినియోగిస్తున్న జీరో-ఛార్జ్ డిజిటల్-పేమెంట్ వ్యవస్థ లో మార్పులు చేస్తూ, ఎంపిక చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను అనుమతించే చట్టాన్ని ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. “పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007” లోని సెక్షన్ 10A కు సవరణలు చేస్తూ ఆగస్టు 4న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది డిజిటల్ లావాదేవీల ధరలను నిర్ణయించే విధానాన్ని మార్చవచ్చు.
ప్రస్తుతం బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు UPI, రూపే డెబిట్ కార్డ్‌లతో సహా నిర్దేశించిన చెల్లింపు పద్ధతుల కోసం వినియోగదారుల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఛార్జీలు వసూలు చేయడానికి వీలు లేదు. ఇక నుండి ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు లేదా లావాదేవీలు ఉచితంగా ఉండాలో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని ఈ బిల్లులోని ప్రధాన అంశం.
ఈ బిల్లు నేరుగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను ప్రవేశపెట్టదు లేదా నిర్దిష్ట రుసుమును నిర్ణయించదు. అయితే, ఇది జీరో-MDR విధానాన్ని తరువాత సవరించడానికి ప్రభుత్వానికి అవసరమైన చట్టపరమైన అధికారాన్ని కల్పిస్తుంది.
పరిశీలనలో ఉన్న రెండు ఛార్జింగ్ మోడళ్లు:
విధానాన్ని రూపొందించేవారు రెండు రకాల ఛార్జింగ్ మోడళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మోడల్ ప్రకారం, రూ. 2,000 కంటే ఎక్కువ ఉన్న UPI చెల్లింపులపై దాదాపు 0.25–0.5% వరకు MDR వర్తించవచ్చు. అంటే ఇప్పటిదాకా ఫోనే పే, గూగుల్ పే వంటి పధ్ధతుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించే వారిపై ఇక నుండి ఛార్జీలు ఉంటాయి. చిన్న లావాదేవీలు, వ్యక్తి నుండి వ్యక్తికి చేసే చెల్లింపులు మాత్రం ఉచితంగానే ఉంటాయి. రెండవ మోడల్ ప్రకారం, కోటి యాభై లక్షల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు స్వీకరించే చెల్లింపులకు మాత్రమే ఛార్జీలు వర్తించవచ్చు. అంటే నెలకు 12 లక్షల కంటే ఎక్కువ వ్యాపారం చేసే దుకాణాలలో మనం UPI ద్వారా చెల్లిస్తే మనం కొన్న సరుకుల బిల్లుకు అదనంగా ఛార్జీలు వర్తిస్తాయన్న మాట. ఈ రుసుమును అధికారికంగా వ్యాపారస్తులే భరించాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో వారు ధరలను పెంచడం, కన్వీనియెన్స్ ఛార్జీలు విధించడం లేదా కస్టమర్లను నగదు రూపంలో చెల్లించమని ఒత్తిడి చేయడం ద్వారా అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుంది.
UPI అనేది అత్యంత కీలకమైన ప్రజా మౌలిక సదుపాయం:
ప్రస్తుతం ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రజలు వారు కొనుగోలు చేసే ప్రతి దానికి ఫోన్ పే, గూగుల్ పే లాంటి (UPI)డిజిటల్ చెల్లింపుల ద్వారా ఉచితంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇది అత్యంత కీలకమైన అంశంగా మారింది. 2026 జూలై లో రూ. 29.9 ట్రిలియన్ల విలువైన 23.6 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.
వినియోగదారులు, చిన్న దుకాణాలు, వీధి వ్యాపారస్తులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లింపులు చేయడానికి, స్వీకరించడానికి జీరో MDR గణనీయంగా దోహదపడింది. అయితే, బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), పేమెంట్ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సర్వర్లు, వివాదాల పరిష్కారం, వ్యవస్థ విస్తరణలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, నిలకడగా కొనసాగే ఫండింగ్ మోడల్ అవసరం కావచ్చు. కానీ ఈ వ్యవస్థకు నిధులు సమకూర్చడానికి సాధారణ మర్చంట్ ఛార్జీని విధించాల్సిన అవసరం దానికదే ఉండదు. ప్రత్యామ్నాయాలలో నిర్దిష్ట బడ్జెట్ మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెద్ద వాణిజ్య లావాదేవీలపై ఛార్జీలు, ఆర్థిక సేవల నుండి క్రాస్-సబ్సిడైజేషన్, అధిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు మాత్రమే వర్తించే పరిమిత రుసుములు ఉన్నాయి.
పిక్స్, యుపిఐ, రూపేలను విమర్శించిన యుఎస్టిఆర్:
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్-చెల్లింపు పధ్ధతుల పై అమెరికా చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుత చట్ట సవరణను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది., బ్రెజిల్ లో ఉన్న ‘పిక్స్’ (Pix), భారతదేశం లో ఉన్న ‘యుపిఐ’, ‘రూపే’ విధానాలను అమెరికాకు చెందిన ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) యొక్క 2026 నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ రిపోర్ట్ ఆన్ ఫారిన్ ట్రేడ్ బారియర్స్ విమర్శించింది.
బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ‘పిక్స్’ను సృష్టించి, తానే యజమాని గా వ్యవహరిస్తూ, నిర్వహిస్తూ, నియంత్రిస్తోందని, ఇది అమెరికన్ పేమెంట్ ప్రొవైడర్ల కంటే ఆ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ నివేదిక పేర్కొంది. సెక్షన్ 301 విచారణ తర్వాత, అమెరికా జూలై 2026లో అత్యధిక బ్రెజిలియన్ వస్తువులపై అదనంగా 25% సుంకాన్ని విధించింది. డిజిటల్ వాణిజ్యం, మేధో సంపత్తి, ఇథనాల్ మార్కెట్ లభ్యత, అవినీతి నిరోధక అమలు, అటవీ నిర్మూలనతో పాటు ఎలక్ట్రానిక్ చెల్లింపులను కూడా ఒక కారణం గా ఆ నివేదిక పేర్కొంది.
పిక్స్ వ్యవస్థను మార్చడానికి నిరాకరించిన బ్రెజిల్:
‘పిక్స్’ వ్యవస్థను మార్చడానికి బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. వ్యక్తుల మధ్య ఉచిత లావాదేవీలు, తక్కువ మర్చంట్ ఖర్చులు, సెంట్రల్ బ్యాంక్ నిర్వహణ, పెద్ద ఆర్థిక సంస్థల నిర్బంధ భాగస్వామ్యాన్ని దాని ప్రభుత్వం సమర్థించుకుంది. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆ దేశ పిక్స్ విధానానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అమెరికా తమ దేశ కార్డు కంపెనీల ఫీజులు, మార్కెట్ వాటాను కాపాడుకోవడానికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని బ్రెజిల్ అధికారులు తెలిపారు.
వ్యాపారాన్ని కోల్పోతున్న వీసా మరియు మాస్టర్‌కార్డ్:
భారతదేశం విషయంలో, చెల్లింపు విధానాలు దేశీయ సర్వీసు ప్రొవైడర్లకు, ముఖ్యంగా రూపేకి అనుకూలంగా ఉన్నాయని USTR విమర్శిస్తున్నది. UPI ప్రారంభమైనప్పటి నుండి, వినియోగదారులు కార్డ్‌లకు బదులుగా ఉచిత UPI చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వీసా, మాస్టర్‌కార్డ్‌లు(ATM కార్డులు) వాటిద్వారా జరిగే తమ వ్యాపారాన్ని కోల్పోయాయి. UPI, రూపేలకు జీరో లావాదేవీ ఛార్జీలు ఉండటం, రూపేకి ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటం, UPI ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు రూపేకి ముందస్తు ప్రవేశం లభించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రూపేని బలోపేతం చేసింది, యు.ఎస్. కార్డ్ కంపెనీల ఫీజు ఆదాయాన్ని తగ్గించింది.
భారతదేశం లో జరిగే చెల్లింపు విధానం విదేశీ కార్డ్, పేమెంట్ కంపెనీలకు సరిపడా ఫీజు ద్వారా ఆదాయం వస్తుందా లేదా అనేది ప్రధాన సమస్య. వీసా, మాస్టర్ కార్డ్ లు బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు, కార్డ్ నెట్‌వర్క్‌లు వ్యాపార లావాదేవీల నుండి ఫీజులు సంపాదించే నమూనాపై పనిచేస్తాయి. UPI వంటి విస్తృతంగా అందుబాటులో ఉన్న, పరస్పరం అనుసంధానించబడిన, ఎలాంటి అదనపు ఛార్జీలు లేని విధానం వల్ల అమెరికన్ కంపెనీల ఆదాయాలకు పరిమితి ఏర్పడింది. భారత దేశ విధాన లక్ష్యాలకు అనుగుణంగా అనుబంధం కలిగిన భారతీయ కార్డ్ నెట్‌వర్క్‌ను అందించడం ద్వారా “రూపే” అమెరికా కంపెనీలకు సవాలుగా మారింది.
యుపిఐ యాప్‌లలో ఇప్పటికే అమెరికా కంపెనీలదే ఆధిపత్యం:
ప్రతి థర్డ్-పార్టీ పేమెంట్ అప్లికేషన్‌కు NPCI ప్రతిపాదించిన 30% లావాదేవీల పరిమితిపై కూడా అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. గూగుల్ పే, వాల్‌మార్ట్ నియంత్రణలోని ఫోన్‌పే లు కలిసి 80% కంటే ఎక్కువ UPI లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. మార్కెట్ కేంద్రీకరణను, క్రమబద్ధమైన ప్రమాదాన్ని తగ్గించడానికే ఈ పరిమితిని ప్రతిపాదించినట్లు NPCI చెబుతోంది. దీని అమలు డిసెంబర్ 2026 వరకు వాయిదా వేయబడింది.
చెల్లింపు వ్యవస్థల డేటాను దేశంలోనే నిల్వ ఉంచాలనే భారతదేశపు డేటా-లోకలైజేషన్ నిబంధనలను కూడా అమెరికన్ కంపెనీలు వ్యతిరేకించాయి. అయితే, UPI వాస్తవంగా అమెరికన్ కంపెనీలకు తలుపులు మూసివేయ లేదు. గూగుల్ పే, ఫోన్‌పే లు వాటి వినియోగదారుల పేమెంట్ అప్లికేషన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభేదాలు మార్కెట్ వాటా పరిమితులు, డేటా నియంత్రణ, రూపే స్థానం, ఫీజు ఆదాయం లేకపోవడం గురించే.
అమెరికా ఒత్తిడికి లొంగి ఆ దేశ వీసా, మాస్టర్ కార్డ్, ఇతర విదేశీ పేమెంట్ కంపెనీల లాభాలను కాపాడటానికి మాత్రమే భారతదేశంలో MDRను ప్రవేశపెట్టకూడదు. ఛార్జీలపై తీసుకునే ఏ నిర్ణయమైనా UPIని నడపడానికి అయ్యే ఖర్చు, దాని దీర్ఘకాలిక నిలకడను కొనసాగడంపై మాత్రమే ఆధారపడి ఉండాలి. అమెరికన్ కంపెనీలకు ఇప్పటికే భారతదేశపు చెల్లింపుల మార్కెట్లో పెద్ద వాటా ఉంది. భారతదేశ ప్రజా మౌలిక సదుపాయాలను ఉపయోగించి UPI సృష్టించబడి, భారతీయ సంస్థలచే నియంత్రించబ డుతున్నప్పటికీ, మొత్తం UPI లావాదేవీలలో ఐదవ వంతు కంటే ఎక్కువ గూగుల్ పే, ఫోన్‌పే నిర్వహిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఆర్థిక మౌలిక సదుపాయాలలో విదేశీ నియంత్రణలోని అప్లికేషన్లకు ఇంతటి ఆధిపత్యం ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ.
30% పరిమితి పోటీని కాపాడుతుంది:
ప్రతి పేమెంట్ యాప్‌కు NPCI ప్రతిపాదించిన 30% మార్కెట్ వాటా పరిమితి పోటీకి మించి అనుమతించకుండా, ప్రమాదాన్ని తగ్గించే చర్యగా చూడాలే తప్ప, వివక్షగా చూడకూడదు. గూగుల్ పే, ఫోన్‌పే లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల భారతీయ పోటీదారులకు అవకాశాలు పరిమిత మవుతాయి. ఈ రెండింటిలో ఏదైనా సాంకేతిక లేదా వ్యాపార సమస్యలను ఎదుర్కొంటే మొత్తం వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉంది.
డేటా లోకలైజేషన్‌ను నిలుపుకోవాలి, రూపేకి మద్దతు ఇవ్వాలి:
భారతదేశం తన చెల్లింపుల డేటా లోకలైజేషన్ నిబంధనలను కూడా కొనసాగించాలి. చెల్లింపుల డేటా అత్యంత సున్నితమైనదే కాక వాణిజ్యపరంగా విలువైనది. ఈ డేటాను భారతదేశంలో ఉంచడం వల్ల మోసాలను దర్యాప్తు చేయడానికి, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి, జాతీయ భద్రతను కాపాడటానికి నియంత్రణ సంస్థలకు సహాయపడుతుంది. రూపేకి ప్రభుత్వం నుండి మద్దతు కొనసాగాలి. విదేశీ కంపెనీలపై ఆధార పడటాన్ని తగ్గించడానికి చాలా దేశాలు తమ దేశీయ చెల్లింపు వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా అభ్యంతరాల కారణంగా రూపేకి మద్దతు ఇవ్వడం నుండి లేదా వీసా, మాస్టర్‌కార్డ్, ఇతర అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లతో పోటీని కొనసాగించడం నుండి భారతదేశం వెనక్కి తగ్గకూడదు.
అమెరికా ఒత్తిడికి తలొగ్గవద్దు:
అమెరికా యాజమాన్యంలోని గూగుల్ పే, వాల్ మార్ట్ మద్దతు ఉన్న ఫోన్‌పే లు ఇప్పటికే దాదాపు 80% UPI లావాదేవీలను నియంత్రిస్తున్నాయి. అందుచేత అటువంటి కేంద్రీకరణను తగ్గించడానికి రూపొందించిన 30% మార్కెట్ వాటా పరిమితిని అమెరికా కోరుకున్నట్లుగా భారతదేశం పదేపదే వాయిదా వేసింది. ఇది భారతదేశపు అత్యంత విలువైన డిజిటల్ ప్రజా ఆస్తులలో ఒకటైన UPIపై అమెరికన్ ప్లాట్‌ఫారమ్‌లకు దాదాపు ఉచిత నియంత్రణను ఇచ్చింది.
బ్రెజిల్ దేశానికి అమెరికా హెచ్చరిక స్పష్టంగా ఉంది. బ్రెజిల్ యొక్క ప్రజా తక్షణ-చెల్లింపుల వ్యవస్థ అయిన ‘పిక్స్’ అమెరికన్ పేమెంట్ కంపెనీలకు నష్టం కలిగిస్తోందనే ఆరోపణలతో పాటు ఇతర ఫిర్యాదులతో, సెక్షన్ 301 చర్య కింద అమెరికా బ్రెజిలియన్ దిగుమతులపై 25% సుంకాలను విధించింది. వాషింగ్టన్ డిమాండ్లకు ముగింపు ఉండదు. ప్రతి మినహాయింపు లేదా సడలింపు మరొక డిమాండ్‌కే దారితీస్తుంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారతదేశం తన UPI విధానాలను తిరగరాయకూడదు. ఇది తన పోటీతత్వాన్ని, పాలసీ స్వయం ప్రతిపత్తిని, చెల్లింపుల వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక నిలకడను కాపాడుకోవాలి.
ది వైర్ ఇంగ్లీష్ లో అజయ్ శ్రీవాస్తవ, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (GTRI) వ్యవస్థాపకుడురాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
