బిహార్ మఖానా పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. కానీ అధిక శ్రమతో కూడిన దాని సరఫరా వ్యవస్థకు(సప్లై చైన్) ఊపిరిపోస్తున్న మహిళలు మాత్రం తక్కువ వేతనాలు, పరిమిత బేరమాడే శక్తి, తాము సృష్టిస్తున్న విలువపై ఎలాంటి నియంత్రణ లేని స్థితిలోనే చిక్కుకుపోయారు.
మధుబని, బిహార్: సూర్యుడు ఇంకా ఉదయించలేదు. కానీ ఉదయం 4 గంటలకే మంజు దేవి రోజు ప్రారంభమైంది.
ఆమె పొయ్యి వెలిగించి, అల్పాహారం సిద్ధం చేసి, కుటుంబం కోసం భోజనం ప్యాక్ చేసి, పిల్లలను బడికి సిద్ధం చేస్తుంది.
ఆమెకు వృథా చేయడానికి సమయం లేదు. సూర్యోదయానికి ముందే ఆమె గ్రామంలోని చెరువు వద్దకు చేరుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకల్లా ఆమె బిహార్‌లోని ఎంతో ప్రసిద్ధి చెందిన పంట మఖానా(తామర గింజలు/ఫాక్స్నట్) సంరక్షణ కోసం నాచు నీటిలో నడుముల లోతు వరకు దిగుతుంది.
తరువాతి కొన్ని గంటల పాటు ఆమె చెరువులోనే కష్టపడుతుంది.
కొన్ని రోజులు ఆమె మొక్కలను నాటుతుంది. మరికొన్ని రోజులు కలుపు మొక్కలను తొలగిస్తుంది లేదా నీటి ఉపరితలం కింద దాగి ఉన్న గింజలను కోత కోస్తుంది.
ఈ పని చాలా కష్టమైనదే కాక అత్యంత శ్రమతో కూడుకున్నది. గంటల తరబడి వంగి నీటిలో పనిచేయడమే కాకుండా ఈ పని ప్రమాదకరమైనది కూడా.
చెరువు ఉపరితలం పెద్ద పెద్ద తేలియాడే ఆకులతో నిండి ఉంటుంది. నీటి అడుగున ఉండే కాడలకు పదునైన ముళ్ళు రక్షణగా ఉంటాయి.
మురికి నీటిలో వాటిని చూడటం సాధ్యం కాదు కాబట్టి, కార్మికులు జాగ్రత్తగా కదులుతూ, గింజలను కనుగొనడానికి నీటి అడుగున ఉన్న బురద నేలను అంచనా వేస్తూ తడుముతూ పని చేయాలి.
ఈ ప్రమాదకరమైన పని వల్ల తరచుగా వారి చేతులు, కాళ్ళపై లోతైన గీతలు పడటం లేదా దుస్తులు ముళ్ళలో చిక్కుకుని చిరిగిపోవడం జరుగుతుంది.
గంటల తరబడి ఈ శ్రమను భరించిన తర్వాత కూడా ఆమె రోజు పూర్తి కాదు. ఆమె మళ్ళీ ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకోవాల్సిందే.
ఈ దైనందిన కష్టాలన్నింటికీ ఆమెకు దక్కేది రోజుకు కేవలం రూ 250-300 వేతనం మాత్రమే. కానీ ఈ మఖానా రిటైల్ షాప్‌లో 1 కిలో ప్యాకెట్‌ను కొనుగోలు చేయడానికి రూ 750 నుంచి రూ 1200 వరకు ఖర్చవుతుంది. బిహార్‌లోని అభివృద్ధి చెందుతున్న మఖానా ఆర్థిక వ్యవస్థ మధ్యలో ఉన్న వైరుధ్యం ఇదే.
పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, ఎగుమతి అవకాశాల కారణంగా, ఇటీవల కాలంలో మఖానాకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఈ విశిష్టమైన పంట 2022లో భౌగోళిక సూచిక(జీఐ) ట్యాగ్‌ను కూడా పొందింది.
అయినప్పటికీ, అత్యంత శ్రమ, నైపుణ్యంతో కూడిన వివిధ దశలలో శ్రమను ధారపోసే మహిళలు మాత్రం, ఇందులో అతి తక్కువ వేతనం పొందే భాగస్వాములుగానే మిగిలిపోతున్నారు.
వ్యత్యాసాన్ని పెంచుతున్న సాగు విధానం..
దర్భంగాలోని జాతీయ మఖానా పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మనోజ్ కుమార్ మాటల్లో, భారతదేశంలోని మఖానాలో దాదాపు 85 శాతం బిహార్‌లోనే ఉత్పత్తి అవుతుంది.
దాదాపు 15,000 హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తూ, ఏటా సుమారు 10,000 టన్నుల వేయించిన మఖానాను ఉత్పత్తి చేస్తున్నారు.
ఉత్తర బిహార్‌లోని వేలాది కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ నీటి పంటపై ఆధారపడి ఉన్నాయి.
చారిత్రాత్మకంగా, మఖానా సాగు ప్రధానంగా మల్లా(చేపలు పట్టే) తరగతి, కొల్, చైన్, వన్పర్ వంటి అనుబంధ ఉప-జాతుల మధ్య కేంద్రీకృతమై ఉంది.
వీరు తరతరాలుగా ప్రత్యేక సాగు, ప్రాసెసింగ్ నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారు. అయినప్పటికీ, ఈ జాతులలో చాలామంది ఇప్పటికీ ఆర్థికంగా బలహీనంగానే ఉన్నారు.
ఐఐఎం అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్(సీఎంఏ) ప్రొఫెసర్, మాజీ ఛైర్పర్సన్ డాక్టర్ సుఖ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, అసమానత అనేది కేవలం ఆదాయానికే పరిమితం కాకుండా చాలా లోతుగా ఉందన్నారు.
సాంప్రదాయకంగా వెనుకబడిన మత్స్యకార వర్గాలకు చెందిన మహిళలకు ఇది రెట్టింపు ప్రతికూల(డబుల్ డిజడ్వాంటేజ్) పరిస్థితిగా మారుతోందని డాక్టర్ సింగ్ అన్నారు.
వీరు ఉద్యోగాలు, ఆదాయం, నిర్ణయాధికారాలను పొందే అవకాశాలను కుల, లింగ సమీకరణలు పరిమితం చేస్తున్నాయి.
మఖానా సాగు ప్రధానంగా రెండు విధాలుగా జరుగుతుంది. పాత, మరింత సాంప్రదాయ పద్ధతిలో చెరువులలో మఖానాను సాగు చేస్తారు. వీటిలో చాలా వరకు సహకార సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ యజమానుల నుంచి కౌలుకు తీసుకుంటారు.
మరొకటి, కొత్త పద్ధతి అయిన లోతు తక్కువగా ఉండే వ్యవసాయ పొలాలలో మఖానా సాగు చేయడం. కోత సాధారణంగా 2 నుంచి 3 విడతలలో జరుగుతుంది.
సాంప్రదాయకంగా, నీటి లోతు తక్కువ ఉండటం వల్ల పని చేయడం సులభంగా ఉండే పొలాల ఆధారిత సాగులోను, నీటి మట్టం తగ్గడం వల్ల గింజల సేకరణ తేలికయ్యే చెరువుల రెండవ విడత కోతలోను మహిళలు ఎక్కువగా పాల్గొనేవారు.
పురుషులు సాధారణంగా లోతైన నీటిలో పనిచేయాల్సి వచ్చే చెరువు మొదటి కోతను చూసుకునేవారు. కానీ ఆ వ్యత్యాసాలు ఇప్పుడు క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్నాయి.
పురుషుల వలసలు పెరగడం, గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గడంతో, మహిళలు మఖానా సాగు, ప్రాసెసింగ్‌లోని దాదాపు ప్రతి దశను తమ భుజస్కంధాలపై వేసుకుంటున్నారు.
“పురుషులు బయటకు వెళ్ళినప్పుడు, మేము చెరువుతో పాటు ఇల్లు – రెండింటినీ చూసుకోవాల్సిందే” అని మరో మహిళా కార్మికురాలు సునీతా దేవి చెప్పారు.
సరఫరా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న మహిళలు..
కోత కోయడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత జరిగే ప్రక్రియ అంతకంటే కష్టమైనది.
నీటి నుంచి గింజలను తీసిన తర్వాత, వాటిని వేయించి(రోస్ట్ చేసి) పేలాలుగా మార్చేముందు(పోపింగ్) ఎండలో ఎండబెట్టాలి.
మధుబనికి చెందిన దయీ జీ దేవి అనే కార్మికురాలు ఈ కష్టమైన ప్రక్రియను గురించి ఇలా తెలియజేశారు.
“గింజలను తీవ్రమైన ఎండలో దాదాపు ఐదు గంటల పాటు ఎండబెట్టాలి. వాటిని నిరంతరం తిప్పుతూ ఉండాలి, లేకపోతే అవి సరిగ్గా ఎండవు. అంతేకాకుండా వాటిని అదే రోజు వేయించాలి.” ఇది చాలా అలసిపోయే పని.
గింజలను మట్టి పొయ్యిలలో పదే పదే వేడి చేసిన తర్వాత కొన్ని సెకన్లలోనే పేలాలుగా మారుస్తారు. ఒక్క క్షణం ఆలస్యమైనా మొత్తం సరుకు పాడైపోతుంది. “మా చేతులు తరచుగా కాలిపోతుంటాయి” అని దయా జీ దేవి అన్నారు. “కానీ మేము పనిచేస్తూనే ఉంటాము.”
రోస్టింగ్ ఉష్ణోగ్రతలు 250 డిగ్రీల సెల్సియస్ నుంచి 320 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయని డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు. “కొన్ని సెకన్ల ఆలస్యం కూడా నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది ఎంతో నైపుణ్యం కలిగిన ప్రక్రియ. ఇందులో మహిళలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు” అని ఆయన అన్నారు.
మఖానా సాగుపై పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు, ప్రాసెసింగ్, గ్రేడింగ్, కోత అనంతర నిర్వహణ వంటి నాణ్యత ఆధారిత కార్యకలాపాలలో మహిళలు అత్యధికంగా సహకరిస్తున్నప్పటికీ, వేతనాలు, పని పరిస్థితులు, సదుపాయాల విషయంలో మాత్రం మహిళలు దుర్భర పరిస్థితులలో ఉన్నారు. వారి నైపుణ్యానికి దక్కే ఆర్థిక గుర్తింపు చాలా నామమాత్రంగా ఉంది.
మహిళా కార్మికులకు రోజుకు రూ 250-300 కూలి వస్తే పురుషులకు రూ 500-600 లభిస్తోంది. “మగ వారు ఎక్కువ పనిచేస్తారు, అందుకే వారికి ఎక్కువ డబ్బులు వస్తాయి అని యజమానులు అంటారు. కానీ మేము కూడా చెరువు నుంచి పొయ్యి వరకు అన్ని పనులనూ మగవారితో సమానంగా చేస్తున్నాము” అని మంజు అన్నారు.
భారతదేశంలో వ్యవసాయ పనులలో దినసరి ప్రాతిపదికన కూలీ చెల్లించే చోట్ల ఇటువంటి వ్యత్యాసాలు సాధారణమని డాక్టర్ సింగ్ అన్నారు. “కనీస వేతనాలు పేరుకు ప్రకటించినా కానీ ఆచరణలో అమలు మాత్రం జరగడం లేదు” అని ఆయన అన్నారు.
ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువగా ఉండటం మూలంగా ఈ సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోంది. “ఇక్కడ మఖానా తప్ప వేరే పని లేదు” అని మంజు చెబుతూ, “మేము దీనిని కూడా వదిలేస్తే, మా ఇళ్లను ఎలా నడుపుకోవాలి?” అని ప్రశ్నించారు. ఘుడ్నీ దేవి అనే మరొక రైతు మాట్లాడుతూ, “మాకు పని దొరికింది, అదే పెద్ద విషయం. ఎక్కువ డబ్బులు అడిగితే యజమాని మమ్మల్ని పనిలోంచి తీసేస్తారు” అన్నారు.
ముఖ్యంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో బిహార్‌లోని అత్యంత లాభదాయకమైన వైవిధ్యభరితమైన పంటలలో మఖానా ఒకటి.
వరి వంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఇది హెక్టారుకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఉపాధిని సృష్టిస్తుంది.
అంతేకాకుండా దీని ప్రయోజన-ఖర్చు నిష్పత్తి(బెనిఫిట్-కాస్ట్ రేషియో – బీసీఆర్) సగటున 1:89గా ఉంది. అంటే పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి రైతు రూ 0.89 అదనపు లాభం పొందుతాడు. ఇది వరి లేదా జొన్నల వంటి సాంప్రదాయ ధాన్యపు పంటల కంటే చాలా ఎక్కువ.
కానీ ఆ రాబడులు ప్రధానమైన అన్నీ విభాగాలలో సమానంగా పంపిణీ కావడం లేదు. కేవలం మహిళలే కాకుండా చిన్న రైతులు కూడా తమ ఆదాయాలను పెంచుకోవడంలో విఫలమవుతున్నారు.
పప్పు షహానీ అనే రైతు మాట్లాడుతూ, కాంట్రాక్టర్లు తరచుగా తమ ఉత్పత్తులను రూ 300-400లకే కొనుగోలు చేస్తారని, అయితే అదే సరుకు మార్కెట్లలో రూ 1,400-1,800 అధిక ధరలకు అమ్ముతారని అన్నారు. “ఈ వ్యవస్థ ద్వారా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారు” అని ఆయన తెలిపారు.
మక్రందాకు చెందిన రాజేష్ సహానీ అనే మరో రైతు మాట్లాడుతూ, “మాకు మార్కెట్ చేరువగా లేదు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలూ లేవు.
ఎక్కువ ప్రయోజనాలు పెద్ద రైతులు, వ్యాపారులకే దక్కుతున్నాయి” అని అన్నారు.
పెద్ద రైతులకు అవసరం లేని భూమిని తాము కౌలుకు తీసుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి.
“ఒక ఎకరం చెరువును కౌలుకు తీసుకోవడానికి రూ 30,000 నుండి రూ 50,000 వరకు ఖర్చవుతుంది. మొత్తం సాగు ఖర్చులు రూ 60,000 నుంచి రూ 80,000 వరకు పెరుగుతాయి. దాదాపు ఎనిమిది నెలల కష్టం తర్వాత వచ్చే లాభం కేవలం రూ 25,000 నుండి రూ 30,000 మాత్రమే” అని స్థానిక రైతు బిందేశ్వరి మల్లా చెప్పారు.
అదే సమయంలో, భూమి, మూలధనం, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, మార్కెట్లకు నేరుగా రవాణా అవకాశం ఉన్న పెద్ద రైతులు ఎకరాకు కనీసం రూ 2-3 లక్షల లాభం ఆర్జిస్తున్నారని సహానీ తెలిపారు.
ముఖ్యంగా, ఈ ఆదాయాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, మహిళా కార్మికులకు చెల్లించే వేతనాలు అన్నీ గ్రామాలలో ఒకేలా ఉంటున్నాయి.
“చిన్న, పెద్ద రైతుల మధ్య వేతన రేట్లలో పెద్దగా తేడా లేదు. గ్రామంలో మహిళా, పురుష కార్మికుల రోజువారీ వేతనాలు ముందే నిర్ణయించబడతాయి. రైతులందరూ ఒకే రేటును చెల్లించాలి” అని సహానీ వివరించారు. కాబట్టి, రెండు నమూనాలలోనూ మహిళలు ఎక్కువగా రోజువారీ వేతన కార్మికులుగానే నిమగ్నమై ఉన్నారు. అక్కడ వారి సంపాదన అత్యంత తక్కువగా ఉంటుంది.
“డబ్బు అనేది మార్కెట్లో ఉంది, పొలంలో కాదు” అని డాక్టర్ సింగ్ అన్నారు.
“అసలైన విలువ బ్రాండింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్, రిటైల్‌లో ఉంది. మీరు అద్భుత నాణ్యమైన సరుకును ఉత్పత్తి చేయవచ్చు. కానీ మీరు మార్కెట్‌ను నియంత్రించకపోతే, మీరు సృష్టించిన విలువలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే పొందగలరు.” ఇది మఖానా విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
“వ్యవసాయ విలువ గొలుసు అంతటా ఈ సమస్య ఉన్నప్పటికీ, ఇది ఎంతో విలువైన పంట కావడంతో ఇక్కడ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, ఈ రంగానికి అసలైన హీరోలు, హీరోయిన్లు అయిన కార్మికులు మాత్రం తగిన ప్రయోజనం పొందడం లేదు” అని డాక్టర్ సింగ్ అన్నారు.
వ్యాపారులపై ఆధారపడటమే అసలు సమస్య..
పరిమిత మార్కెట్ అవకాశాలు, దళారులపై ఆధారపడటం, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు అధిక విలువను పొందలేకపోతున్నారని పరిశోధనలు చూపుతున్నాయి.
ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకటించి కొనుగోలు చేస్తే వ్యాపారులపై ఆధారపడటం తగ్గుతుందని పలువురు రైతులు నమ్ముతున్నారు.
అయితే, కేవలం ఎంఎస్పీ ప్రకటించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, దానికి ప్రభుత్వ కొనుగోలు మద్దతు కూడా ఉండాలని డాక్టర్ సింగ్ చెబుతున్నారు.
కలపయేతర అటవీ ఉత్పత్తుల కొనుగోలు నమూనాలను ఆయన ఉదాహరణగా చూపారు.
అక్కడ ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తులను మరింతగా మార్కెటింగ్ చేసే ముందు నిర్ణీత ఎంఎస్పీకి నేరుగా ఉత్పాదకుల నుండి కొనుగోలు చేస్తాయి.
అదే విధంగా, ఏదైనా ప్రభుత్వ సంస్థ ప్రకటించిన ధరకు మఖానాను స్వయంగా కొనుగోలు చేస్తే తప్ప ప్రైవేట్ వ్యాపారులు దానిని పాటించడానికి తగిన కారణం ఉండదని ఆయన అన్నారు.
మఖానా సాగులో నిమగ్నమైన చాలా మంది మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక స్వతంత్రతను, ఉమ్మడి బేరమాడే శక్తిని మెరుగుపరచడానికి ఇవి మొదట రూపొందించబడ్డాయి.
“శ్రమ అవసరమైనప్పుడు, రైతులు, కాంట్రాక్టర్లు నేరుగా ఎస్హెచ్జీని సంప్రదించి, మమ్మల్ని అందరినీ కలిపి కూలీకి కుదుర్చుకుంటారు” అని సునీతా దేవి చెప్పారు.
ఇది రైతులు, కాంట్రాక్టర్లకు ఒకేసారి పెద్ద సంఖ్యలో పనిచేసే వారిని పొందడం సులభం చేసింది. అయితే, ఇది మహిళలకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండదు.
స్వయం సహాయక సంఘంలో సభ్యులుగా ఉండటం వల్ల తమ బేరమాడే శక్తి గణనీయంగా ఏమీ పెరగలేదని మహిళలు అన్నారు. “మేము కలిసి పనిచేస్తాము, కానీ వేతనాలను మేము నిర్ణయించలేము. ఏమి ఇస్తే అది తీసుకుంటాము” అని సునీత అన్నారు.
రిజిస్టర్డ్ ఎస్‌హెచ్‌జీలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు లేదా అవకాశాల గురించి తమకు పెద్దగా తెలియదని మరికొందరు చెప్పారు.
స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ) సభ్యురాలైన చంద్రకళ దేవి కూడా ఇదే నిరాశను వ్యక్తం చేశారు.
“ప్రభుత్వ పథకాల వల్ల మాకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కలగడం లేదు. ప్రభుత్వం నిజంగా మాకు సహాయం చేస్తుంటే, మా పరిస్థితి ఇలా ఉండేది కాదు.” సమస్య స్వయం సహాయక సంఘాలతో కాదని, అవి ఏర్పడిన తర్వాత జరిగే పరిణామాలతో అని డాక్టర్ సింగ్ తెలిపారు.
మఖానాను ప్రాసెసింగ్ చేయడం, బ్రాండింగ్ లేదా మార్కెటింగ్ చేయగల సంస్థలుగా ఎదగడానికి చాలా గ్రూపులకు అవసరమైన మార్గదర్శకత్వం లేదా మద్దతు లభించడం లేదు.
ఆ మద్దతు లేకపోతే, అవి వ్యాపార కూటమిగా కాకుండా కేవలం కార్మిక కూటమిగానే ఉండిపోతాయి.
కార్మికుల నుంచి భాగస్వాముల వరకు ఎదగాల్సిన అవసరం..
డాక్టర్ సింగ్ దృష్టిలో, పరిష్కారం అనేది కేవలం ఉపాధి కల్పించడంలో కాకుండా యజమాన్య హక్కులను కల్పించడంలో ఉంది.
మహారాష్ట్రకు చెందిన రైతుల యాజమాన్యంలోని ద్రాక్ష ఎగుమతి సహకార సంస్థ ‘మహాగ్రేప్స్’, ‘అముల్’ వంటి విజయవంతమైన నమూనాలను ఆయన ఉదాహరణగా చెప్పారు.
అక్కడ ఉత్పత్తిదారులు ఉమ్మడిగా బ్రాండ్లు, ప్రాసెసింగ్ సౌకర్యాలు, మార్కెటింగ్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నారు.
“ఆ సంస్థలు సృష్టించే మిగులు తిరిగి ఉత్పత్తిదారులకే చేరుతుంది. ఎందుకంటే ఆ సంస్థకు యజమానులు వారే” మరొకరి వ్యాపారంలో రోజువారీ వేతన కార్మికులుగా మిగిలిపోవడానికి, దీనికి చాలా వ్యత్యాసం ఉందని డాక్టర్ సింగ్ అన్నారు.
అదేవిధంగా, ఎస్‌హెచ్‌జీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్‌పీవోలు), మహిళల నేతృత్వంలోని సహకార సంఘాలను స్థాపించడం, ప్రోత్సహించడం ద్వారా మహిళల పాత్రను కార్మికుల నుంచి భాగస్వాములుగా మార్చడం సాధ్యమవుతుంది.
ఎస్‌హెచ్‌జీలు కూడా ఫెడరేషన్లుగా ఏర్పడవచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పవచ్చు, హోల్‌సేల్ బ్రాండ్లను సృష్టించవచ్చు. ప్యాకేజింగ్, మార్కెటింగ్‌లను స్వయంగా చేపట్టవచ్చు. అసలైన విలువ ఉండేది అక్కడే.
ప్రస్తుతానికి, భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా, మఖానా ఒక విశిష్టమైన ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రత్యేక స్థానాన్ని పొందింది.
మఖానాను గ్లోబల్ ప్రొడక్ట్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన మంజు దేవి వంటి మహిళలకు మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
మఖానా విజయానికి నిజమైన కొలమానం ఈ పంట ఎంత దూరం ప్రయాణించింది అనే దాని ఆధారంగా ఉండదు.
ఈ పరిశ్రమను నిర్మించిన మహిళలు చివరకు దాని ప్రయాణంలో ఫలితాలను పంచుకోవడానికి అనుమతించబడ్డారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
రచయితలు: బీనా కుమారి, శ్రుతి వెంకటేష్. వీరిరువురు స్వతంత్ర విలేకరులు. ప్యాన్-ఇండియా గ్రౌండ్రూట్ రిపోర్టర్ల నెట్వర్క్ 101 రిపోర్టర్స్‌లో సభ్యులు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
