“ భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో 1942 ఆగస్టు 8 అత్యంత కీలకమైన రోజు. ఆ రోజున బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో బ్రిటిష్ పాలనను తక్షణమే భారతదేశం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ “క్విట్ ఇండియా” తీర్మానం ఆమోదించబడింది. మహాత్మా గాంధీ దేశ ప్రజలకు “చేయండి లేదా చావండి” (Do or Die) అనే చారిత్రక పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం వెంటనే స్వాతంత్ర్యాన్ని సాధించలేక పోయినప్పటికీ, భారత దేశాన్ని ఇకపై బలవంతంగా పాలించడం బ్రిటిష్ సామ్రాజ్యానికి సాధ్యం కాదనే వాస్తవాన్ని స్పష్టంగా చేసింది. 1947లో బ్రిటిష్ పాలన అంతానికి దారితీసిన రాజకీయ పరిణామాలలో క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది.
క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యం:
క్విట్ ఇండియా ఉద్యమం ఒక్కసారిగా పుట్టుకొచ్చినది కాదు. దాని వెనుక అనేక సంవత్సరాల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామా లు ఉన్నాయి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో, భారతీయ నాయకులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే భారత్ కూడా బ్రిటన్ తరఫున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది. భారత ప్రజల సమ్మతి లేకుండా భారతదేశాన్ని యుద్ధంలోకి నెట్టడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పాలిత ప్రావిన్షియల్ మంత్రివర్గాలు 1939లో రాజీనామా చేశాయి. యుద్ధం లో బ్రిటన్‌కు భారతదేశం నుంచి పూర్తి సహకారం అవసర మైంది. ఈ నేపథ్యంలో 1942 మార్చిలో బ్రిటిష్ ప్రభుత్వం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని భారత్‌కు పంపింది. క్రిప్స్ ప్రతిపాదనలు యుద్ధం అనంతరం భారతదేశానికి డొమినియన్ హోదా వంటి కొన్ని హామీలను ఇచ్చినప్పటికీ, తక్షణమే అధికార బదిలీ చేయడానికి సిద్ధంగా లేవు. కాంగ్రెస్‌కు కావలసింది తక్షణ స్వపరిపాలన. అందువల్ల క్రిప్స్ ప్రతిపాదనలు విఫల మయ్యాయి. గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలను వ్యంగ్యంగా “భవిష్యత్తు తేదీతో ఇచ్చిన చెక్కు”(Post Dated Cheque)గా అభివర్ణించారు.
క్విట్ ఇండియా ఉద్యమం కేవలం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం కాదు. అది భారత ప్రజల సంపూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షకు ప్రతీక. గాంధీజీ హింసను తిరస్కరించారు. ప్రజల శక్తిని అహింస, సత్యాగ్రహం ద్వారా సమీక రించాలనుకున్నారు. గాంధీ గారు “భారతదేశాన్ని భారతీయుల చేతుల్లో పెట్టండి” అని విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు “చేయండి లేదా చావండి”(Do or Die)అని పిలుపునిచ్చారు. దీని అర్థం హింసకు పిలుపు కాదు. స్వాతంత్ర్యం సాధించే వరకు వెనక్కి తగ్గకుండా పోరాడాలనే సంకల్పం. గాంధీజీ ప్రజలకు అహింసను పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని, భయాన్ని విడిచిపెట్టాలని కోరారు. ఆయన దృష్టిలో బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే వెళ్లిపోతే, భారత ప్రజలు తమ అంతర్గత సమస్యలను తాము పరిష్కరించుకునే అవకాశం పొందుతారు.
అయితే ఉద్యమం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అరెస్టు చేయడం వల్ల పరిస్థితులు గాంధీజీ ఊహించిన విధంగా పూర్తిగా సాగలేదు. ఆగస్టు 8న తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే బ్రిటిష్ ప్రభుత్వం చర్యకు దిగింది. 1942 ఆగస్టు 9 తెల్లవారు జామున (ఆగుస్ట్ 10) గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితర ప్రముఖ కాంగ్రెస్ నాయకు లను అరెస్టు చేశారు. గాంధీజీ ని ఆగా ఖాన్ ప్యాలెస్ లో నిర్బంధించారు. కాంగ్రెస్‌ను నిషేధించారు. సభలు, ప్రదర్శనలు, ప్రచారం వంటి కార్యకలాపాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. నాయకత్వాన్ని తొలగించడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని భావించింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ దాని ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. అగ్ర నాయకులు జైలులో ఉన్నప్పటికీ ఉద్యమం ఆగిపోలేదు. విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక ప్రాంతాల్లో సమ్మెలు జరిగాయి. రైల్వే రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు జరిగాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. భూగర్భ రేడియో ప్రసారాలు జరిగాయి. రహస్యంగా ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించ బడ్డాయి.
అరుణా ఆసఫ్ అలీ:
ఆగస్టు 9న గోవాలియా ట్యాంక్ మైదానం (బొంబాయి)లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అరుణా ఆసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలిచారు. యువ కార్యకర్త ఉషా మెహతా తదితరులు రహస్యంగా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రిస్తున్న అధికారిక సమాచారానికి ప్రత్యామ్నాయంగా ఈ రేడియో ఉద్యమ వార్తలను, సందేశాలను ప్రజలకు చేరవేసింది. ఇది ఉద్యమానికి భూగర్భ ప్రచార సాధనంగా మారింది.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత కఠినంగా అణచివేసింది. వేలాది మంది అరెస్టయ్యారు. కాల్పులు జరిగాయి. ప్రజలపై లాఠీచార్జీలు, నిర్బంధాలు, జరిమానాలు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యమకారులు ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. రైల్వే లైన్లు, టెలిగ్రాఫ్ వ్యవస్థ వంటి ప్రభుత్వ మౌలిక వసతులు కూడా కొన్ని చోట్ల ధ్వంసం చేయబడ్డాయి. ఒక భావన ప్రజలను ఆక్రమిస్తే అది ఒక భౌతిక శక్తిగా మారుతుం దనేదానికి ఈ ఘటనలు నిదర్శనం. అందుకే చరిత్ర నిర్మాతలు ప్రజలు అనేది. జైలులో ఉన్నప్పటికీ గాంధీజీ 1943 ఫిబ్రవరిలో ఆయన 21 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. తనపై, కాంగ్రెస్‌పై బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అహింస పట్ల తన నిబద్ధతను పునరుద్ఘా టించారు. గాంధీజీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో దేశవ్యాప్తంగా ఆందోళన ఏర్పడింది. అంతర్జాతీయం గానూ ఆయన నిర్బంధంపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు 1944 వరకు జైళ్లలోనే ఉన్నారు. గాంధీజీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను 1944 మే 6న ఆగా ఖాన్ ప్యాలెస్ నుంచి విడుదల చేసింది. అంతకుముందే ఆయన భార్య కస్తూర్బా గాంధీ 1944 ఫిబ్రవరి 22న ఆగా ఖాన్ ప్యాలెస్ నిర్బంధంలోనే మరణించారు.
రెండవ ప్రపంచ యుధ్ధం-భారత దేశ స్వాతంత్ర్యం:
రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధరలు విపరీతంగా పెరిగాయి. అవసరమైన వస్తువుల కొరత ఏర్పడింది. యుద్ధ అవసరాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం భారత వనరులను విపరీతంగా కొల్లగొట్టింది. ఇదే సమయంలో జపాన్ సైన్యం ఆగ్నేయాసియాలో వేగంగా ముందుకు వచ్చింది. సింగపూర్, బర్మా వంటి ప్రాంతాలు జపాన్ ఆధీనంలోకి వెళ్లడం భారతదేశ భద్రతపై ఆందోళన పెంచింది. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని రక్షించలేక పోతున్నదనే భావన కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో గాంధీజీకి ఒక విషయం స్పష్టమైంది. బ్రిటిష్ పాలన కొనసాగుతున్నంత కాలం భారతదేశం స్వేచ్ఛగా తన భవిష్యత్తును నిర్ణయించుకోలేదని.
మరొక వైపు సోవియట్ యూనియన్ హిట్లర్ దూరాక్రమనకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో యుధ్ధం లోకి దిగింది. 2.5 కోట్ల మంది సోవియెట్ ప్రజలు ఆ యుధ్ధంలో ప్రాణాలు కోల్పోయారు. చివరకు అమెరికా, బ్రిటన్ తో కలసి సోవియెట్ యూనియన్ 1945 ఏప్రిల్ లో హిట్లర్ ను మట్టికరిపించింది. దాంతో హిట్లర్ ఏప్రిల్ 30 న ఆత్మ హత్య చేసి కున్నాడు. తూర్పు యూరప్ లోని పలు దేశాలు సోవియెట్ యూనియన్ సహకారంతో కార్మికవర్గం రాజ్యాధికారం లోకి వచ్చాయి (సోషలిస్ట్ దేశాలు). బ్రిటిష్ సామ్రాజ్యం దెబ్బతిన్నది. ఇక ప్రత్యక్షంగా వలస దేశాలను పాలించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. రెండవ ప్రపంచంలో జరిగిన ఈ గొప్ప మార్పుతో 1947 ఆగుస్ట్ 15 న అధికారికంగా భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. భారత దేశ స్వాతంత్రానికి రెండవ ప్రపంచంలో నియంత హిట్లర్ ను ఓడించడం, హిట్లర్ మరణం కీలక పరిణామం. ఆ తర్వాత అనేక వలస దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.
ముగింపు:
క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని చివరి మహత్తర ప్రజా ఉద్యమాలలో ఒకటి. నేడు భారత దేశ ప్రజల పరిస్థితులు నాటి బ్రిటిష్ పాలన నాటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. నాడు ప్రజలపై ప్రత్యక్షంగా పన్నులు వేస్తే నేడు జి.ఎస్.టీ పేరుతో అన్నింటి పై భారీగా పన్నులు వసూలు చేస్తూ జి.ఎస్.టీ వసూళ్లు పెరగటం ప్రభుత్వ గొప్పగా చెప్పు కుంటున్నది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి జీవితం గడవడం క్లిష్ట తరం అయింది. వైద్యం, విద్య కోసం ఆస్తులు అమ్ముకోవడం తప్పనిసరి అయింది. చదువుకోవడం పోయి కొనుక్కోవడం గా మారిన విద్య అనేక అడ్డదారులు తొక్కి విద్యార్ధుల జీవితాలు, కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. గ్రామీణ పేదలకు కొంత మేర అండగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టం వీ.బి.గ్రామ్ జి పేరుతో పూర్తిగా మారి ఉపాధి హామీ ఎగిరిపోయింది. వ్యవసాయం భారంగా మారి చిన్న, సన్నకారు రైతుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల గొంతు నులిపేందుకు సిధ్ధం అయింది. శాశ్వత ఉద్యోగాల నియామకం పోయి తుమ్మితే ఉడిపోయే ఉపాధి రకరకాల పేర్లతో వచ్చింది. రాజ్యాంగం కల్పించిన వాక్, సభా, పత్రికా స్వాతంత్ర్యాలు పూర్తి నియంత్రణ లోకి వచ్చాయి. కొద్దిపాటి నిరసన వ్యక్తం అయినా తీవ్ర నిర్బంధం అమలు చేయ బడుతున్నది. అతడికంటే గొప్ప ఆచంట మల్లన్న అన్న చందంగా ఇటీవలి విద్యార్థి, యువజన ఉద్యమ సందర్భంగా ఒక నేత “ తానైతే కాల్చి పారేసేవాడిని” అని మాట్లాడే విషమ పరిస్థితి ఏర్పడింది.
నాడు హిందూ-ముస్లిం ఘర్షణలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన కుండా గాంధీ నిరాహార దీక్ష చేస్తే నేడు అధికారికంగానే మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా ముస్లిం ల మీద దాడులకు తెగబడుతున్నారు. మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగ కలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని నాడు గాంధీ అన్నారు. నేడు అర్ధరాత్రి కాదు సరి కదా పట్ట పగలు, నడి రోడ్డుమీద అకృత్యాలు జరుగుతున్నాయి. మణిపూర్ ఘటన మన కళ్ళ ముందు ఉంది.
అందుకే నాటి క్విట్ ఇండియా స్పూర్తితో నేడు “ మోడి-ఎన్.డి.ఏ. హాటావో -భారత్ బచావో” నినాదంతో జులై 31 న ఢిల్లీ లోని తాల్ కటొరా స్టేడియంలో జరిగిన జాతీయ సదస్సులో ఆగుస్ట్ 10 న దేశ వ్యాపితంగా జైల్ భరో కార్యక్రమానికి బి.ఏం.ఎస్. మినహా మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. దీన్ని జయప్రదం చేయడానికి నాటి క్విట్ ఇండియా స్పూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున విధుల్లోకి రావాలని సదస్సు పిలుపునిచ్చింది.
ప్రధాన డిమాండ్లు:
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేయాలి. గిగ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించి వారి కార్మిక చట్టాలను అమలు చేయాలి. గిగ్ వర్కర్స్ పై ILO కన్వెన్షన్ 193 ని రాటిఫై చేసి అమలు చేయాలి. అన్నీ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, ప్రభుత్వరంగ సంస్థలలోని ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. ప్రైవేటీకరణ, నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ లను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పటిష్ట పరచాలి. స్కీమ్ వర్కర్లు అందరికీ కార్మిక చట్టాలను అమలు చేయాలి-వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసుల కనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వీ. బి. గ్రామ్ జీ ని రద్దు చేసి గ్రామీణ ఊపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి. విద్యుత్ బిల్లు 2025 ని ఉపసంహరించుకోవాలి. అందరికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం కల్పించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి. పౌరుల ప్రాధమిక హక్కులను రక్షించాలి. నూతన పెన్షన్ పధకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలి. ఈ. పి. ఎస్.95 పద్ధకం లో కనీస పెన్షన్ ను రు.9000 కి పెంచి కరువు భత్యంతో జత చేయాలి.
ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
