ఒకప్పుడు యూరప్ స్వతంత్రతపై సందేహవాదిగా ఉన్న జర్మనీ, ట్రంప్ చర్యల తర్వాత కొత్త రక్షణ వైఖరి వైపు మళ్లుతోంది.
ఒకవేళ అమెరికా నాటో నుంచి వైదొలిగితే, నాటో ప్రస్తుత సైనిక వ్యవస్థలను ఉపయోగించి ఐరోపా తనను తాను రక్షించుకోగలదనే ప్రత్యామ్నాయ ప్రణాళికపై యూరోపియన్ దేశాలు చర్చించుకుంటున్నాయి.
యూరప్ స్వతంత్రంగా ఉండాలనే విధానానికి దీర్ఘకాలంగా వ్యతిరేకి అయిన జర్మనీ నుంచి ఆమోదం పొందడంతో ప్రస్తుత ప్రణాళిక ఆదరణ పొందుతోంది.
‘యూరోపియన్ నాటో’ దిశగా అడుగులు..
కొందరు అధికారులు “యూరోపియన్ నాటో” అని పిలుస్తున్న ఈ ప్రణాళికలపై పనిచేస్తున్న అధికారులు, ఈ కూటమి కమాండ్-అండ్-కంట్రోల్ పాత్రలలోకి మరింత మంది యూరోపియన్లను తీసుకురావాలని, అమెరికా సైనిక ఆస్తులకు తమ సొంత ఆస్తులను జోడించాలని కోరుకుంటున్నారు.
నాటో లోపల జరిగే చర్చలు, విందు సమావేశాల ద్వారా అనధికారికంగా ముందుకు సాగుతున్న ఈ ప్రణాళికలు ప్రస్తుత నాటో కూటమికి పోటీగా ఉద్దేశించినవి కావని సమావేశంలో పాల్గొన్నవారు తెలిపారు.
అధ్యక్షుడు ట్రంప్ బెదిరించినట్లుగా, వాషింగ్టన్ ఐరోపా నుంచి బలగాలను ఉపసంహరించుకున్నా లేదా దాని రక్షణకు రావడానికి నిరాకరించినా కూడా, తమ రక్షణకు కార్యాచరణ కొనసాగింపును, అణు విశ్వసనీయతను కాపాడుకోవడమే ఐరోపా అధికారుల లక్ష్యమని చెబుతున్నారు.
గత సంవత్సరం తొలిసారిగా రూపొందించిన ఈ ప్రణాళికలు, అమెరికా విశ్వసనీయతపై ఐరోపాలో నెలకొన్న ఆందోళన తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
నాటో సభ్య దేశమైన డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ బెదిరించిన తర్వాత ఇవి మరింత వేగవంతమయ్యాయి.
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి ఐరోపా నిరాకరించింది. దీంతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో, ఇప్పుడు వీటికి కొత్త ప్రాధాన్యత చేకూరుతోంది.
జర్మనీ వైఖరిలో చారిత్రాత్మక మార్పు..
ముఖ్యంగా, బెర్లిన్‌లోని(జర్మనీ) రాజకీయ పరిణామం ఈ ఊపును పెంచుతోంది. దశాబ్దాలుగా తన రక్షణ విషయంలో ఐరోపా సార్వభౌమాధికారాన్ని పెంచాలన్న ఫ్రాన్స్ నేతృత్వంలోని పిలుపులను జర్మనీ ప్రతిఘటిస్తూ, ఐరోపా భద్రతకు అమెరికానే అంతిమ హామీదారుగా ఉండాలని ప్రాధాన్యతనిచ్చింది.
అయితే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఆలోచనా విధానం తెలిసిన వారి ప్రకారం, ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలో, ఆ తర్వాత కూడా ఒక మిత్రదేశంగా అమెరికా విశ్వసనీయతపై ఉన్న ఆందోళనల కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది.
ఈ సవాలు చాలా పెద్దది. ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ మొత్తం నిర్మాణం, లాజిస్టిక్స్- ఇంటెలిజెన్స్ నుంచి కూటమి అగ్ర సైనిక కమాండ్ వరకు, దాదాపు ప్రతి స్థాయిలో అమెరికా నాయకత్వంపైనే ఆధారపడి ఉంది.
ట్రంప్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆ బాధ్యతలలో ఎక్కువ భాగాన్ని ఇప్పుడు యూరోపియన్లు భుజాన మోయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ కూటమి “మరింత యూరోపియన్ల నేతృత్వంలో” ఉంటుందని దాని సెక్రటరీ-జనరల్ మార్క్ రుట్టే ఇటీవల అన్నారు.
అమెరికా హెచ్చరికలు – యూరప్ స్పందన..
అమెరికా రెచ్చగొట్టడం వల్ల, ట్రంప్‌లో పెరుగుతున్న శత్రుత్వం కారణంగా యూరోపియన్లు ఇప్పుడు తమ సొంత చొరవతో చర్యలు తీసుకోవడమే పరిష్కారమని భావిస్తున్నారు.
ఇటీవలి రోజుల్లో, ట్రంప్ యూరోపియన్ మిత్రదేశాలను “పిరికివాళ్ళు” అని ముద్రవేసి, నాటోను కాగితపు పులి అని ఎద్దేవా చేశారు.
“అమెరికా రక్షణ, జాతీయ భద్రతా వ్యూహం భారం మొత్తం యూరప్ పై మోపుతున్నది. ఇది కొనసాగుతుంది” అని ఈ ప్రణాళికలలో పాలుపంచుకున్న వారిలో ఒకరైన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అన్నారు.
“ఇది జరుగుతోందని అర్థం చేసుకోవడం, అలాగే[అమెరికా] హఠాత్తుగా వైదొలగకుండా, దీనిని చాలా వ్యవస్థీకృత, నియంత్రించదగిన పద్ధతిలో చేయడం అత్యంత ముఖ్యమైన విషయం” అని స్టబ్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన కొద్దిమంది యూరోపియన్ నాయకులలో స్టబ్ ఒకరు.
ఫిన్లాండ్ దేశం యూరప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన సాయుధ దళాలలో ఒకటిగా ఉంది. అలాగే రష్యాతో అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉంది.
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతునివ్వడానికి యూరోపియన్ దేశాలు అంగీకరించకపోవడంతో నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ బెదిరించారు.
అలా నాటో నుంచి వైదొలగాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ అన్నారు. అధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా తన అధికారాన్ని ఉపయోగించి, యూరప్ నుంచి దళాలను లేదా ఆస్తులను తరలించవచ్చు లేదా మద్దతును నిలిపివేయవచ్చు.
ట్రంప్ బెదిరింపు తర్వాత వెంటనే, యూరప్ తన రక్షణను బలోపేతం చేసుకునే ప్రణాళికల గురించి వివరించడానికి స్టబ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు.
“ఇన్ని దశాబ్దాల తర్వాత ఐరోపా తన సొంత భద్రత, రక్షణకు మరింత బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నదే మన అమెరికన్ మిత్రులకు ప్రాథమిక సందేశం” అని స్టబ్ అన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం, అణు, గూఢచార రంగాల్లో సవాళ్లు..
యూరప్‌కు నిర్ణయాత్మక రాజకీయ ఉత్ప్రేరకం జర్మనీలో జరిగిన చారిత్రాత్మక మార్పు. కొన్ని అమెరికా అణ్వాయుధాలు అక్కడే ఉన్నాయి.
నాటోలో యూరోపియన్ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అంటే అమెరికా తన పాత్రను తగ్గించుకోవడానికి ఒక సాకుగా ఉపయోగపడుతుందని జర్మన్లు, ఇతర యూరోపియన్లు గతంలో భయపడ్డారు.
అయితే, ట్రంప్ ఉక్రెయిన్ను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత, గత సంవత్సరం చివర్లో మెర్జ్(జర్మనీ) తాను చాలాకాలంగా పాటిస్తున్న ఆ అభిప్రాయాన్ని పునఃపరిశీలించడం ప్రారంభించారని, ఆయన ఆలోచనా విధానం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
యుద్ధంలో ట్రంప్ బాధితుడిని(ఉక్రెయిన్), దాడి చేస్తున్న వారిని(రష్యా) తికమక పెడుతున్నారని, నాటోలో అమెరికా విధానానికి మార్గనిర్దేశం చేసే స్పష్టమైన విలువలు ఇకపై లేవని మెర్జ్ ఆందోళన చెందారని ఆ వ్యక్తులు చెప్పారు.
జర్మన్ నాయకుడు కూటమిని బహిరంగంగా ప్రశ్నించడానికి ఇష్టపడలేదని ఆ వ్యక్తులు చెప్పారు. దానికి బదులుగా, యూరోపియన్లు మరింత పెద్ద పాత్రను పోషించాల్సి ఉంటుంది.
ఆదర్శవంతంగా, అమెరికా కూటమిలోనే కొనసాగుతుంది. రక్షణలో అధిక భాగం యూరోపియన్లకే వదిలివేయబడుతుందని ఆ వ్యక్తులు తెలిపారు.
నాటో నుంచి అమెరికా బయటకు వెళ్తే అమెరికా అణు, గూఢచార సామర్థ్యాలు వదిలిపెట్టిన ఖాళీలను పూరించడం కష్టమవుతుంది.
“అయితే, ఐరోపావాసులుగా మన రక్షణకు మరింత బాధ్యత వహించాలనేది కూడా స్పష్టం. మేము అదే చేస్తున్నాము” అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ అన్నారు. “ట్రాన్స్-అట్లాంటిక్‌గా కొనసాగాలంటే నాటో మరింత ఐరోపాగా మారాలి.”
ఏకమవుతున్న యూరోపియన్ దేశాలు..
జర్మనీ వైఖరి మారడంతో యూకే, ఫ్రాన్స్, పోలాండ్, నార్డిక్ దేశాలు, కెనడాతో సహా ఇతర దేశాల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరిందని, ఈ దేశాలు ఇప్పుడు ఈ అత్యవసర ప్రణాళికను నాటోలోని ‘ఇష్టపూర్వక కూటమి’గా అభివర్ణిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
“మేము ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, భావసారూప్యత గల మిత్రదేశాల బృందంతో అనధికారిక చర్చలు జరుపుతున్నాము. అవసరమైనప్పుడు నాటోలోని లోటును పూరించడానికి మా వంతు సహకారం అందిస్తాము” అని జర్మనీలోని స్వీడన్ రాయబారి వెరోనికా వాండ్-డానియల్సన్ అన్నారు.
బెర్లిన్ కదిలిన తర్వాతే, అమెరికా అధికారులు తప్పుకుంటే నాటో వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, ప్రధాన విన్యాసాలను ఎవరు నిర్వహిస్తారు వంటి ఆచరణాత్మక సైనిక ప్రశ్నల వైపు ఆకస్మిక ప్రణాళిక మళ్లింది. ఇవే అతిపెద్ద సవాళ్లుగా మిగిలిపోయాయని అధికారులు తెలిపారు.
జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, అంతరిక్ష, నిఘా సామర్థ్యాలు, గాలిలో ఇంధనం నింపడం, వాయు చలనశీలత వంటి రంగాలలో యూరప్ అమెరికా కంటే వెనుకబడి ఉన్నందున, ఈ రంగంలో కీలకమైన పరికరాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు కోరుకుంటున్నారు.
స్టెల్తీ క్రూయిజ్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి గత నెలలో జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రకటించిన ఉమ్మడి ప్రాజెక్టును ఈ కొత్త చొరవకు ఉదాహరణగా అధికారులు పేర్కొంటున్నారు.
నాటో కమాండ్-అమెరికా ఆధిపత్యం..
ఐరోపా ప్రయత్నం ఆలోచనా విధానంలో ఒక ప్రాథమిక మార్పును సూచిస్తున్నప్పటికీ, ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది.
ఐరోపాకు సర్వోన్నత మిత్రరాజ్యాల కమాండర్ ఎప్పుడూ ఒక అమెరికన్ ఉంటారు. ఆ పదవిని వదులుకునే ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారులు చెప్పారు.
నాటోలో అమెరికా స్థానంలో సైనిక నాయకురాలిగా బాధ్యతలు చేపట్టేంత స్థాయి ఏ యూరోపియన్ సభ్య దేశానికి లేదనీ అమెరికా భావన.
దీనికి ఒక కారణం ఏమిటంటే, ఈ కూటమి వ్యవస్థాపక సూత్రమైన పరస్పర నిరోధానికి ఆధారమైన అణు రక్షణను కేవలం అమెరికా మాత్రమే అందించగలదు.
అయితే పరివర్తన ఇప్పటికే ప్రారంభమైంది. మరిన్ని కీలకమైన నాటో కమాండ్ పోస్టులు ఇప్పుడు యూరోపియన్ల ఆధీనంలో ఉన్నాయి.
ఇటీవల జరిగిన లేదా రాబోయే నెలల్లో జరగనున్న అనేక ప్రధాన విన్యాసాలకు యూరోపియన్ దళాలే నాయకత్వం వహిస్తాయి.
ముఖ్యంగా గూఢచార, అణు నిరోధక రంగాలలో ఉన్న లోపాలు చాలా క్లిష్టమైనవి. అమెరికా ఉపగ్రహ, నిఘా, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలే నాటో విశ్వసనీయతకు వెన్నెముక అని యూరోపియన్ అధికారులు తెలిపారు. ఇప్పుడు నిఘా, రక్షణ రంగాలలో ఫ్రాన్స్ బాగా అభివృద్ధి చెందిందని కొందరి అభిప్రాయం.
చమురు సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాలు – ఒంటరిపోతున్న అమెరికా..
దీనికితోడు రష్యా చమురు కొనడానికి వీలు లేదని అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో జర్మనీ 3 రెట్లు అదనపు ఖర్చుతో అమెరికా నుంచి గ్యాస్, చమురు కొనాల్సి వస్తున్నది. ఈ భారం భరించలేని కొన్ని జర్మన్ కంపెనీలు మూతపడుతున్నాయి.
అనేక యూరోపియన్ దేశాలలో చమురు ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం వల్ల పరిస్థితి మరింత క్షీణించింది. అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటా చమురు కొరత, ధరల పెరుగుదల ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నది.
ఇరాన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా, శాంతి ప్రబోధిస్తూ వాటికన్ పోప్ సందేశం ఇచ్చారు. దానిపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
పచ్చి నియంత ముస్సోలినీ(ఇటలీ) వారసత్వ పార్టీ ఇప్పుడు ఇటలీలో అధికారంలో ఉంది.
పోప్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటలీ అధ్యక్షురాలు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా క్రైస్తవులందరూ ఏకం కావాలని ప్రకటనలు చేస్తున్నారు.
యూరప్‌లో మరొక ముఖ్యమైన దేశం స్పెయిన్. ఇటీవల ఈ దేశం చైనాతో వాణిజ్య సంబంధాలను బాగా మెరుగుపరుచుకుంటున్నది.
కెనడా కూడా విద్యుత్ వాహనాల తయారీ తదితర అనేక రంగాలలో చైనాతో ఒప్పందాలు చేసుకుంటున్నది.
అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది.
భారత్‌తో సహా అనేక దేశాలు చమురు కొనుగోలుకు తమ స్థానిక కరెన్సీలు లేదా చైనా యువాన్‌తో వాణిజ్యం చేస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచంపై అమెరికా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతున్నది. ఒంటరిపాలవుతున్నది.
(ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్తలు జెఫ్రీ సాక్స్, రిచర్డ్ వోల్ఫ్‌లు చేసిన వీడియో ప్రసంగాల ఆధారంగా ఈ వ్యాసం రాయబడింది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
