పిచ్చితనం అనేది ఒక విశేషాధికారంగా మారుతుంది. ఇది అధికారాన్ని కాపాడుతుంది. హింసను కప్పిపుచ్చుతుంది. జవాబుదారీతనం నైతిక సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తుంది.
డోనాల్డ్ ట్రంప్ డ్రోన్ దాడులకు ఆదేశించినప్పుడు, పౌరులపై దాడుల విషయంలో అధ్యక్షుడిగా తన విశేషాధికారాలతో సామూహిక శిక్షలకు దారితీసే ఉత్తర్వులపై సంతకం చేశాడు.
అయితే పాశ్చాత్య మీడియా దాన్ని సామ్రాజ్యవాద హింసగా కాకుండా, ట్రంప్ అనే వ్యక్తి పట్ల ఒక వైద్యపరమైన ఆందోళనగా వ్యక్తం చేస్తున్నది. అతను ఆవేశపరుడని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని లేదా ఉదారవాద ప్రజాస్వామ్య పాలనా ప్రమాణాల నుంచి అతను పక్కకు జరుగుతున్నాడని చెబుతుంటారు.
ఇలా చెప్పడం మీడియా స్వతంత్రం అనిపించుకోదు. రాజ్య హింసను కప్పిపెట్టి సాంకేతికంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పే మాటలుగా వాటిని చూడాలి.
ఇది రాజ్య హింసను ఒక వ్యక్తిగత వ్యాధిగా చిత్రీకరిస్తూ ‘తీవ్రవాదం’ అనే ముద్రను కేవలం గోధుమ ఛాయ గల, ముస్లిం ప్రజలకు మాత్రమే పరిమితం చేస్తుందని చెప్పడం, రాజ్య హింస తీవ్రతను ఒక చిన్న అంశంగా పరిమితం చేసి తప్పును కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు.
‘ఓరియంటలిజం’ కొనసాగింపు – పక్షపాత విశ్లేషణ..
ఇలాంటి పద మాయాజాలం వెనుక చాలా తెలివైన, ప్రమాదకరమైన మూలాలు దాగి ఉన్నాయి.
పాశ్చాత్యులు ‘ఓరియంట్'(తూర్పు దేశాలను) ఒక వ్యక్తుల సమూహంగా కాకుండా.. హేతుబద్ధత లేని, బెదిరించే, పుట్టుకతోనే హింసాత్మక ప్రవృత్తి గల, ఒకే విధమైన నాగరికతగా ఎలా నిర్మించారో ఎడ్వర్డ్ సయీద్ తన ‘ఓరియంటలిజం'(1978) గ్రంథంలో విశ్లేషించారు.
వలస పాలన ముగిసినంత మాత్రాన ఆ జ్ఞానమీమాంస నిర్మాణం అంతం కాలేదు. అది వేరే రూపంలో కొనసాగుతోంది.
నేడు ఇది జవాబుదారీతనపు నియమాలను శాసిస్తోంది.
ఒక శ్వేతజాతీయుడైన పాశ్చాత్య నాయకుడు “రాజ్య ఉగ్రవాదం”గా పరిగణించబడే పనులను చేసినప్పుడు, వివరణ అంతా అతని మనస్తత్వశాస్త్రం లేదా అతని వ్యక్తిగత వైఫల్యాల వైపు మళ్లుతుంది.
అదే ఒక ముస్లిం లేదా గోధుమ ఛాయ గల నాయకుడు అంతకంటే తక్కువ లేదా సమానమైన పనులు చేసినప్పుడు, అది వారి సంస్కృతి, మతం, సిద్ధాంతం అని దాడి చేస్తుంది. ఆ విధంగా పాశ్చాత్య మీడియా తన వర్గ స్వభావాన్ని బయట పెట్టుకుంటుంది.
శ్వేతజాతి దురహంకారం – నేరాలకు చట్టబద్ధత..
రూత్ విల్సన్ గిల్మోర్ “జాతి వివక్షను” వివరిస్తూ.. “రాజ్యం ఆమోదించిన లేదా చట్టానికి వెలుపల, అకాల మరణానికి గురయ్యేలా సమూహాలను దుర్బలపరచడం, దోపిడీ చేయడం” అని 2007లో నిర్వచించారు.
నేడు పాశ్చాత్య మీడియా అనుసరిస్తున్న పక్షపాత ఏకపక్ష వైఖరికి ఇదొక తాజా ఉదాహరణ.
రాజకీయ హింసను పాశ్చాత్య మీడియా చూపే విధానంలోని వైఖరి యాదృచ్ఛికం కాదు.
ఇది శ్వేతజాతీయులైన నాయకుల చర్యలను మానసిక అసమర్థతగా చూపుతుంది.
ఆ విధంగా వ్యక్తి నైతిక ప్రవర్తన అనే ముసుగులో వారు చేసే చర్యలకు చట్టబద్ధత కల్పిస్తుంది.
ఇది మీడియా చేస్తున్న పొరపాటు కాదు. శ్వేత జాతి దురహంకారం, సామ్రాజ్యవాద దురహంకారమే మీడియాను ఆ విధంగా తయారు చేస్తాయి.
ఇందుకు ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. “బషర్ అల్-అస్సాద్” సిరియన్ పౌరులపై జరిపిన బాంబు దాడులను అనాగరికతగా, ఒక నియంతృత్వ పాలన స్వభావంగా ప్రపంచవ్యాప్తంగా వర్ణించారు. యెమెన్‌లోని హూతీ నాయకత్వాన్ని దాదాపు అన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు ఉగ్రవాద వ్యవస్థలుగా చిత్రీకరిస్తాయి.
కానీ ట్రంప్ దురాక్రమణలను, పౌరులపై సామూహిక శిక్షలకు అతడిచ్చిన ఉత్తర్వులను మాత్రం ఉగ్రవాదంగా కాకుండా, కేవలం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తారు. సిద్ధాంతంగా కాకుండా, అనారోగ్యంగా చూస్తారు.
జార్జ్ లిప్‌సిట్జ్ ప్రతిపాదించిన “శ్వేతజాతీయాధిక్యంపై యాజమాన్య పెట్టుబడి” అనే భావన(అంటే శ్వేతజాతీయుల గుర్తింపు ద్వారా సంస్థలలో లభించే ప్రయోజనాలు) రాజకీయ హింస జ్ఞానమీమాంస వరకు విస్తరించింది. పాశ్చాత్య మీడియా “శ్వేత జాతి మనకు సార్వభౌమాధికారం కల్పిస్తుంది” అని చెబుతుంది.
అంటే వారి చర్యలను ఖండించదు. వాటిని వారి వ్యవస్థ లక్షణంగా కాకుండా, వివరించుకునే హక్కుగా వాటిని జాతిపరంగా చూడకుండా వ్యక్తిగతంగా చూసుకునే హక్కుగా చిత్రీకరిస్తుంది.
ఆ విధంగా చూస్తే, ట్రంప్ ఒక అసాధారణ వ్యక్తి. అతడు సామ్రాజ్యవాద అమెరికా అధిపతి కాదు. అతను పాశ్చాత్య నాగరికత కాదు. అది అతడి ఆరోగ్యకరమైన శరీరంలో ఉన్న ఒక చెడు మెదడు మాత్రమే.
ఇతర తరగతుల వారికి ఇటువంటి వెసులుబాటు లభించదు. వారి విధానపరమైన వైఫల్యాలు వెంటనే లోతైన నాగరికతపరమైన లోపాలుగా చిత్రీకరించబడతాయి.
‘నెక్రోపాలిటిక్స్’- ఎవరు బతకాలి? ఎవరు చనిపోవాలి?..
అకిల్ ఎంబెంబె ప్రతిపాదించిన ‘నెక్రోపాలిటిక్స్’ (2003) అంటే.. ఎవరు జీవించాలి, ఎవరు చనిపోవాలి అని నిర్ణయించే సార్వభౌమాధికారం. మీడియాను అందుకు ప్రతిరూపంగా చూడవచ్చు. శ్వేతజాతీయులైన పాశ్చాత్య నాయకులు తీసుకునే ‘నెక్రోపాలిటికల్’ నిర్ణయాలు కేవలం ‘పరిపాలనాపరమైన పొరపాట్లు’గా పరిగణించబడతాయి.
అదే నిర్ణయాలు, లేదా అంతకంటే తక్కువ తీవ్రత కలిగినవి, శ్వేతజాతీయేతర నాయకులు తీసుకుంటే, వారికి పరిపాలనా సామర్థ్యం లేదని చిత్రీకరిస్తాయి. ట్రంప్ విషయంలో అదే జరుగుతున్నది. ఆయన చర్యలను చిత్తవైకల్యం, మానసిక క్షీణతగా మీడియా చెబుతుంది. కానీ అది సామ్రాజ్యవాద లక్షణం అని మాత్రం చెప్పదు. పైగా ట్రంప్ చర్యలకు చట్టబద్ధ రక్షణ కల్పిస్తుంది.
విధానపరమైన హింసకు మూలాన్ని ఒక వ్యక్తి అనారోగ్య మెదడులో వెతకడం ద్వారా, ఇది అసలైన మూలాన్ని తెలుసుకొనివ్వకుండా కప్పిపెడుతుంది. అంటే, ఆ విధానాలను సాధ్యం చేయడమే కాకుండా, వాటిని ప్రజాదరణ పొందేలా చేసిన సంస్థలు, ఎన్నికల కూటములు, సైనిక నిర్మాణం, జాతి అహంకారం వంటి వాటిని ఇది కప్పిపుచ్చుతుంది. అంతిమంగా తేలిందేమిటంటే, ‘ట్రంప్ పిచ్చితనం’ అనేది గ్లోబల్ సౌత్ దేశాలు భరించలేని ఒక విశేషాధికారం.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
(అరణి బసు, బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ సామాజిక శాస్త్రవేత్త; అమృత దత్తా జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న వలస అధ్యయనవేత్త.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
