ప్రతీకార చర్యగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో, దిగుమతులపై ఆధారపడే భారత ఇంధన భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈకి భారత్కు మధ్య ఒప్పందాలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే-15న అబుదాబి సందర్శన సందర్భంగా, భారత్-యూఏఈ మధ్య ఎల్పీజీ సరఫరాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి.
హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుండటంతో భారత ఇంధన భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
చమురు ఉత్పత్తి దేశాల కూటమి విధించే కోటాల నుంచి బయటపడి, సొంతంగా ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలనే ఉద్దేశ్యంతో ఆ కూటమి నుంచి వైదొలగాలని యూఏఈ నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల తర్వాత మోదీ అబుదాబిని సందర్శిస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ తమపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో భారత ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.
సాధారణ శాంతి సమయాల్లో భారత్ దాదాపు 90% ఎల్పీజీ దిగుమతులను, సుమారు 55% ముడి చమురును ఈ జలమార్గం మీదుగానే స్వీకరిస్తుంది.
దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గృహేతర గ్యాస్ సరఫరా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ చర్య రెస్టారెంట్ రంగాన్ని బాగా దెబ్బతీయగా, ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచింది.
సరఫరా కొరత, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో వలస కార్మికులు కూడా తీవ్ర ప్రభావానికి గురవుతున్నారు.
పెట్రోలియం నిల్వల పెంపుపై దృష్టి..
ఈ పరిస్థితుల్లో భారత్కు అతిపెద్ద ఇంధన సరఫరాదారుడైన యూఏఈతో ఎల్పీజీ ఒప్పందం కుదరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగినంత కాలం భారత దిగుమతులపై ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది.
గత ఏడాది భారత చమురు దిగుమతుల్లో గల్ఫ్ దేశమైన యూఏఈ నాల్గవ అతిపెద్ద వనరుగా ఉంది. 2018లో మంగళూరులోని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ కేంద్రంలో దాదాపు ఆరు మిలియన్ బ్యారెల్స్ చమురును నిల్వ చేయడానికి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అంగీకరించింది.
ఒకవేళ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుని, నౌకా రవాణా యుద్ధానికి ముందున్న స్థాయికి చేరుకుంటే.. రోజుకు ఐదు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, ఇతర ద్రవాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకునేందుకే ఓపెక్ నుంచి అబుదాబి వైదొలగిందని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. దీని ప్రభావం భారత ఇంధన దిగుమతులు, వ్యూహాత్మక నిల్వలపై కచ్చితంగా పడుతుంది.
ఐఎస్పీఆర్ఎల్ మొత్తం నిల్వ సామర్థ్యం ఫిబ్రవరి ప్రారంభం నాటికి 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా, అందులో 4.094 మిలియన్ టన్నులు అనగా సుమారు 77% మేర నిండి ఉన్నాయి.
దిగుమతులపై పడ్డ ప్రభావం..
హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా మార్చిలో 1.1 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకున్న భారత్, ఏప్రిల్లో 0.95 మిలియన్ టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంది.
2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలోని సగటు దిగుమతి(రెండు మిలియన్ టన్నులు)తో పోలిస్తే ఈ రెండు నెలల్లో దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయని కెప్లర్ అందించిన డేటాను ఉటంకిస్తూ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక కథనం ప్రచురించింది.
అదేవిధంగా, ఏప్రిల్లో భారత్ రోజుకు సగటున 4.4 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంది.
షిప్ ట్రాకింగ్ సంస్థ డేటాను ఉటంకిస్తూ, ఫిబ్రవరితో పోలిస్తే ఈ సంఖ్య 15% తక్కువగా ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం..
న్యూఢిల్లీ, అబుదాబి దేశాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ పంచుకుంటున్నాయి. 4.5 మిలియన్ల మంది భారతీయులకు స్థిర నివాసమైన యూఏఈ, భారతదేశపు మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్తో మోదీ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకున్నారు. ఆయన గతంలో ఈ గల్ఫ్ దేశాన్ని ఏడుసార్లు సందర్శించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.

