విశ్వవిద్యాలయంలో విద్యాసాగర్, ఠాగూర్ లేదా స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ చిత్రపటాలకు స్థానం ఉండదని, క్యాంపస్‌లో ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీల ఫోటోలు మాత్రమే వేలాడుతాయని కొందరు వ్యాఖ్యానించారు.
కోల్‌కతా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు మే 5న పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఉన్న విద్యాసాగర్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోకి దూసుకెళ్లి, “జై శ్రీరామ్” అని నినాదాలు చేస్తూ ప్రాంగణంలో విధ్వంసం సృష్టించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ. అయితే, ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ పేర్కొంది.
బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి, ఆ పార్టీ నాయకుడు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు అదే వారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

చిత్రపటాల ధ్వంసం, అధికారుల పై బెదిరింపులు..
బెంగాల్ పునరుజ్జీవనానికి చెందిన ఇద్దరు గొప్ప దిగ్గజాలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ల చిత్రపటాలు మూసి ఉన్న విద్యార్థి సంఘం కార్యాలయం లోపల వేలాడుతుండేవి.
వాటిని కిందికి లాగేసి తీవ్రంగా ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఏబీవీపీ కార్యకర్తలమని చెప్పుకున్న ఈ వ్యక్తులు వైస్-ఛాన్సలర్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించి, ఆయన చేత కూడా “జై శ్రీరామ్” అని పలికించేందుకు ఒత్తిడి తెచ్చారని ఈ విలేకరితో మాట్లాడిన క్యాంపస్ సిబ్బంది తెలిపారు.
విశ్వవిద్యాలయం ఏబీవీపీ “ఆదేశాల” ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని కూడా వారు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ సంఘటన కొన్ని రోజుల క్రితమే జరిగినప్పటికీ, మే 11 సాయంత్రం వార్తలు దావానలంలా వ్యాపించింది.
దీంతో, విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు అయితే పెట్టారో ఆ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్వస్థలమైన మేదినీపూర్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు బెంగాల్ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం కార్యాలయాలు మూతపడ్డాయి.
విద్యాసాగర్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యాలయానికి కూడా ఇది మినహాయింపేమీ కాదు.
విశ్వవిద్యాలయంలో చురుకైన ఏబీవీపీ శాఖ ఏదీ లేదని అనేక మంది సిబ్బంది ఈ విలేకరికి తెలిపారు.
విశ్వవిద్యాలయంపై దాడి చేసిన వారిలో సౌమ్యదీప్ బేరా అనే ఎంబీఏ విద్యార్థి ఉన్నాడు. అతను ఏబీవీపీ విద్యార్థి నాయకుడినని చెప్పుకుంటూ క్యాంపస్‌లోకి ప్రవేశించాడు.
అతని వెంట వచ్చిన వారు బయటి వ్యక్తుల్లా కనిపిస్తున్నారని ఈ విలేకరితో మాట్లాడిన సిబ్బంది తెలియజేశారు.
ఏబీవీపీ ఖండన..
మే 11న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, “విద్యాసాగర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు సంబంధించిన ఈ దురదృష్టకర సంఘటనను” తమ సంస్థ ఏమాత్రం సమర్థించదని ఏబీవీపీ దక్షిణ బెంగాల్ విభాగం పేర్కొంది.
“విద్యాసంస్థల్లో శాంతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య వాతావరణం, ఆరోగ్యకరమైన విద్యార్థి రాజకీయాలకు ఏబీవీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని ఆ ప్రకటన తెలిపింది.
“మే 8న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో తృణమూల్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు తమ రాజకీయ గుర్తింపును దాచిపెట్టి, ఏబీవీపీ పేరును ఉపయోగించుకుని అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది” అని అందులో పేర్కొన్నారు.
ఆందోళనకారుల డిమాండ్లు..
ఒక బృందం మూసి ఉన్న విద్యార్థి సంఘం కార్యాలయం తాళాలను పగలగొట్టిందని అనేక మంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆ తర్వాత ఆ వ్యక్తులు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జయంత కిశోర్ నంది, వైస్-ఛాన్సలర్ దీపక్ కుమార్ కర్ కార్యాలయాల వైపు దూసుకెళ్లారు.
ఈ ప్రదర్శన సందర్భంగా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ ఇద్దరు సీనియర్ అధికారుల టేబుళ్లపై ఉన్న పత్రాలను నేలపైకి విసిరేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
వీసీ చేత కూడా “జై శ్రీరామ్” అని పలికించేలా ఒత్తిడి చేసినట్లు తెలిసింది.
విద్యాసాగర్ చిత్రపటాన్ని నేలపైకి విసిరేసి గట్టిగా “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ దానిని తొక్కిపట్టారని విశ్వవిద్యాలయ సిబ్బంది తెలిపారు.
విశ్వవిద్యాలయంలో విద్యాసాగర్, ఠాగూర్ లేదా స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ చిత్రపటాలకు స్థానం ఉండదని, క్యాంపస్‌లో ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీల ఫోటోలు మాత్రమే వేలాడుతాయని కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన 22 మంది విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించాలని, ఏబీవీపీ మినహా మరే ఇతర విద్యార్థి సంఘాన్ని విశ్వవిద్యాలయంలో పనిచేయడానికి అనుమతించబోమని కూడా ఆందోళనకారులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఈ దాడిలో పాల్గొన్న అనేక మంది వ్యక్తులు కొద్ది రోజుల క్రితం వరకు టీఎంసీ అనుబంధ తృణమూల్ ఛాత్ర పరిషత్‌తో సంబంధం కలిగి ఉన్నారని ది వైర్‌తో మాట్లాడిన వారు తెలిపారు.
ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి వీసీ కర్ నిరాకరించారు. పరిపాలనా విభాగానికి ఆయన ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదని విశ్వవిద్యాలయ సిబ్బంది తెలియజేశారు.
విశ్వవిద్యాలయంలోకి దూసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరితో ది వైర్ మాట్లాడగా, తన పేరు గోప్యంగా ఉంచాలని ఆయన కోరారు.
“మా డిమాండ్ల గురించి వైస్-ఛాన్సలర్‌ను కలవడానికి మేము వెళ్లాము. కొంతమంది ఉత్సాహవంతులైన కార్యకర్తలు నినాదాలు చేస్తూ అరిచారు, కానీ అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు” అని ఆయన చెప్పారు.
విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల స్పందన..
ఈ సంఘటన మేదినీపూర్‌లోని విద్యా వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందనలకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్ కళాశాల, విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సంఘం నాయకుడు, ప్రొఫెసర్ బిమల్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఎపిసోడ్‌ను విద్యాసాగర్ విశ్వవిద్యాలయానికి “ఒక సిగ్గుచేటైన సంఘటన”గా అభివర్ణించారు.
విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఇదిలా ఉండగా, విద్యాసంస్థల్లో అరాచకం సృష్టించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మే 12న జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేదినీపూర్ జిల్లా కార్యదర్శి రణిత్ బేరా ప్రకటించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
