కొన్ని నెలల క్రితం, ఇటీవల తను ఎదుర్కొన్న “మొదటి అనుభవం” గురించి న్యూయార్క్‌కు చెందిన ఒక ఫైనాన్షియర్ నాతో పంచుకున్నారు. 2025లో వచ్చిన సమ్మర్ ఇంటర్న్స్ “నిజమైన ఏఐ నేటివ్స్” అని అతను అన్నారు. అంటే, వారు కేవలం డిజిటల్ టెక్నాలజీ మధ్య కాకుండా, ఏఐ మధ్య పెరిగిన తరం.
అయితే అది ఎలా సాగింది? అతను కొంచెం నిరాశగా స్పందించారు. మొదట్లో ఆ భవిష్యత్ ఫైనాన్స్ నిపుణులు ఎంతో ప్రతిభావంతులుగా కనిపించినా, తరువాత సీనియర్ ఫైనాన్షియర్లు వారి ఆలోచనలను లోతుగా పరిశీలించినప్పుడు అవి చాలా పైపైన మాత్రమే ఉన్నాయని తెలిసింది.
దీని ఫలితంగా, ఆ సంస్థ తక్కువ మందికి మాత్రమే తిరిగి ఉద్యోగ ఆఫర్లు ఇచ్చింది. అలాగే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం విద్యార్థుల కంటే హ్యూమానిటీస్ విద్యార్థులపై ఎక్కువ దృష్టి పెడుతోంది.
“మాకు కేవలం ఏఐ కాదు, విమర్శనాత్మక ఆలోచనా శక్తి కావాలి” అని అతను వివరించారు. సిలికాన్ ఆధారిత మేధస్సును సమర్థంగా ఉపయోగించడానికి మానవ మేధస్సు అవసరమని అతని భావన.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం ఏఐతో సంబంధం కలిగిన కథలు వరదలా వస్తున్నాయి. వాటికి వ్యతిరేక ఉదాహరణలు కూడా ఉండొచ్చు.
ఫైనాన్స్ రంగంలో ఏఐ జ్వరం..
ఫైనాన్స్ రంగంలో ఏఐ జ్వరం వ్యాపిస్తున్నప్పటికీ, టెక్ ప్రచారకులు చెప్పినంత లాభాల స్వర్గాన్ని ఇది ఇంకా ఇవ్వడంలేదనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. అలాగే విమర్శకులు ఊహించిన విధంగా వినాశనాన్ని కూడా కనీసం ఇప్పటివరకు ఇంకా తెచ్చిపెట్టలేదు.
అవును, టెక్నాలజీ నిపుణులు ఉత్పాదకత పెరుగుదలపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జేపీ మోర్గాన్ నుంచి వీసా వరకు అనేక సంస్థలు ఇప్పుడు తమను సంప్రదాయ డబ్బు నిర్వహణ సంస్థలుగా కాకుండా ఏఐ టెక్ కంపెనీలుగా చూపించుకుంటున్నాయి.
నిజానికి Nvidia నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 89 శాతం ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ ఆదాయాలను పెంచుతోందని చెప్పారు. 73 శాతం మంది అది తమ భవిష్యత్ విజయానికి “అత్యంత కీలకం” అని భావిస్తున్నారు.
ఇది నియంత్రణ సంస్థలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లకు అందుతున్న భారీ ప్రైవేట్ క్రెడిట్ ఫైనాన్సింగ్ భవిష్యత్తులో చెల్లింపులలో వైఫల్యాలకు దారితీయవచ్చని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఈ వారం హెచ్చరించింది.
సైబర్ దాడుల వ్యవస్థాపక సంక్షోభం..
ఇంకో ప్రమాదం ఏమిటంటే, ఈ టెక్నాలజీయే స్వయంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రకారం, ప్రస్తుతం ఫైనాన్స్ రంగం ఎక్కువగా భయపడుతున్నది సైబర్ దాడుల వల్ల వచ్చే వ్యవస్థాపక సంక్షోభం గురించి.
అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ మరో కొన్ని ప్రమాదాలను కూడా గుర్తించింది— ఒకే విధమైన ట్రేడింగ్ విధానాలపై కంప్యూటర్లు గుంపులుగా ఆధారపడటం, కొద్ది క్లౌడ్ ప్రొవైడర్లపై అధికంగా ఆధారపడటం, అలాగే ఏఐ మోడళ్ల భ్రమల సమాచారాన్ని సృష్టించడం.
నియంత్రణ సంస్థలు దీనికి స్పందిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్ట్, జే పావెల్ ఇటీవల ప్రముఖ ఫైనాన్షియర్లతో సమావేశమై ఆంత్రోపిక్ రూపొందించిన మిథోస్ మోడల్ వల్ల కలిగే ప్రమాదాలపై చర్చించారు.
అలాగే ఫెడరల్ రిజర్వ్ వైస్-చైర్మన్ మిచెల్లీ బౌమాన్ బ్యాంకుల రిస్క్ మోడళ్లను అంచనా వేయడంలో మరింత “సౌలభ్యం” అవసరమని పేర్కొన్నారు.
కొత్త అడుగు- వాస్తవ పరిస్థితి..
ఈ వారం బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ ఒక కొత్త అడుగు వేసింది. గత సంవత్సరం Nvidiaతో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు ఎఫ్సీఏ “సూపర్-చార్జ్డ్ సాండ్‌బాక్స్”లో పనిచేసే ఫిన్‌టెక్ కంపెనీలకు ఉచిత కంప్యూటింగ్ శక్తి, డేటాను అందిస్తోంది.
“మా ఉద్దేశం ఏమిటంటే, ఆవిష్కర్తలు ఒక సురక్షితమైన, బాధ్యతాయుతమైన వాతావరణంలో సమస్యలకు తమ పరిష్కారాలను పరీక్షించి అమలు చేయగలగాలి” అని ఎఫ్సీఏకి చెందిన జెస్సికా రూసు తెలిపారు.
అయితే ఏఐ గురించి ప్రచారం పెరుగుతున్న కొద్దీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరింత క్లిష్టంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు, జడ్జ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఒక సర్వేను చూడండి.ఇందులో ప్రపంచవ్యాప్తంగా 628 ఫైనాన్స్, ఏఐ కంపెనీలు, నియంత్రణ సంస్థలు పాల్గొన్నాయి.
అయితే, నేను యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో పనిచేస్తున్నప్పటికీ, ఈ పరిశోధనలో భాగం కాలేదు.
ప్రధాన ప్రొవైడర్‌గా ఓపెన్ ఏఐ..
ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో 81 శాతం ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నాయి. అందులో సగం సంస్థలు ఏజెంటిక్ ఏఐ వైపు వెళ్తున్నాయి. వీటిలో ఎక్కువ సంస్థలు బయటి ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్నాయి. అందులో ప్రధాన ప్రొవైడర్ ఓపెన్ ఏఐ.
అయితే ఏఐ ప్రధానంగా బ్యాక్-ఆఫీస్ పనులకే ఉపయోగిస్తున్నారనే మరో విషయాన్ని ఈ సర్వే చెబుతోంది. ఇతర విభాగాల్లో దీని వినియోగం పరిమితంగానే ఉంది.
అలాగే, Nvidia సర్వేకు భిన్నంగా, కేంబ్రిడ్జ్ సర్వే ప్రకారం 76 శాతం పెద్ద ఫైనాన్స్ సంస్థలు, మొత్తం పరిశ్రమలో 55 శాతం మంది ఏఐ విలువను కొలవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేవలం 40 శాతం సంస్థలే ఏఐ వల్ల లాభాలు పెరిగాయని తెలిపాయి. 43 శాతం సంస్థలు ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాయి.
రీ-స్కిల్లింగ్ అవకాశాలు..
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం పావు వంతు సంస్థలే ఉద్యోగాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. కానీ 58 శాతం సంస్థలు ఏఐ వల్ల తమ సంస్థలో మరిన్ని నియామకాలు లేదా రీ-స్కిల్లింగ్ అవకాశాలు వస్తాయని భావిస్తున్నాయి.
ఏఐ ప్రచారకులు దీన్ని కొంతమంది ఫైనాన్షియర్లు ఇంకా పాత ఆలోచనలతో ఉన్నారనే ఉదాహరణగా చూడొచ్చు. ఎందుకంటే ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
మరోవైపు, అనేక నియంత్రణ సంస్థలు ప్రైవేట్ రంగం కంటే ఏఐ వినియోగంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం.
అయితే ఏఐ అమలులో ప్రచారం, వాస్తవం మధ్య ఉన్న ఈ తేడా గురించి మెకన్సీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషల్ ఫైనాన్స్, ఈవై వంటి సంస్థల సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.
ఉదాహరణకు హైలాండ్ సర్వే ప్రకారం, కేవలం 45 శాతం వ్యాపార సంస్థలే ఏఐ తాము ఆశించిన ఫలితాలను ఇస్తోందని భావిస్తున్నాయి.
2026 ఇంటర్న్ బ్యాచ్‌పై నిలిచిన చూపు..
ఇది కేవలం సమయ వ్యత్యాసం ప్రభావం కావొచ్చు. కానీ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలివైన యంత్రాలు స్వయంగా మంచి లేదా చెడు ఫలితాలను సృష్టించవు. వాటిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మానవ వ్యూహమే.
అందువల్ల ఇప్పుడు ఫైనాన్షియర్లు, నియంత్రణ సంస్థలు, విద్యావేత్తల ముందున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే— ఏఐలో నైపుణ్యం కలిగి ఉండి, అదే సమయంలో అవకాశాలు- ప్రమాదాలను గుర్తించే విమర్శనాత్మక ఆలోచనాశక్తి కలిగిన “ఏఐ నేటివ్స్”ను ఎలా తయారు చేయాలి?
ఆ సమతౌల్యాన్ని సాధించే సంస్థలే అసలైన విజేతలు అవుతాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు 2026 ఇంటర్న్ బ్యాచ్‌పై నిలిచింది.
అనువాదం: నాగలక్ష్మి
ఫైనాన్షియల్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
