విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌధరికి గానీ, సీనియర్ జర్నలిస్ట్ సత్యం వర్మకు గానీ పోలీసులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని న్యాయవాది అలీ జియా కబీర్ చౌధరి చెప్పారు.
న్యూఢిల్లీ: నోయిడా కార్మికుల నిరసన కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై – విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌధరి, సీనియర్ జర్నలిస్ట్ సత్యం వర్మలపై – ఉత్తరప్రదేశ్ పోలీసులు జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ), 1980 నిబంధనలను ప్రయోగించారు.
“పోలీసు మీడియా విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలు మాత్రమే మా వద్ద ఉన్నాయి. ఏ ఆధారాల ప్రాతిపదికన ఎన్ఎస్ఏ ప్రయోగించారో తెలిపే ఎలాంటి పత్రాలు మాకు ఇవ్వలేదు. చట్టం ప్రకారం పోలీసులు కోర్టులో పత్రాలు దాఖలు చేసి, ఆ విషయాన్ని న్యాయవాదులకు తెలియజేయాలి, కానీ అవేమీ జరగలేదు” అని ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు కార్యకర్తలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది అలీ జియా కబీర్ చౌధరి చెప్పారు.
న్యాయవాది అలీ జియా కబీర్ చౌధరి ప్రస్తావించిన ఆ పత్రికా ప్రకటన గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ మీడియా సెల్ తరపున విడుదలైంది.
ఎన్ఎస్ఏ ప్రయోగానికి కారణాలు..
“కార్మికుల నిరసనల సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి ఇద్దరు నిందితులపై ఎన్ఎస్ఏ కింద చర్యలు తీసుకున్నాము.
మజ్దూర్ బిగుల్ దస్తాతో సంబంధం ఉన్న ఈ ఇద్దరు నిందితులు, కార్మికుల నిరసన సందర్భంగా చెలరేగిన హింస, దహనకాండలో ప్రముఖ పాత్ర పోషించారు” అని చౌధరి, వర్మల పేర్లను ప్రస్తావిస్తూ ఆ పత్రికా ప్రకటన పేర్కొంది.
ఢిల్లీకి చెందిన కార్యకర్త చౌధరి, జర్నలిస్ట్ వర్మలపై ఎన్ఎస్ఏ చార్జీలు నమోదు చేసిన సమయంపై కార్వాన్- నోయిడా కార్మికులు, కార్యకర్తల విడుదల ప్రచార కమిటీ) మే 13న జారీ చేసిన ఒక ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తింది.
కార్వాన్ తన ప్రకటనలో, “నిన్న సూరజ్‌పూర్ కోర్టులో సత్యం, ఆకృతిల బెయిల్ విచారణ జరిగిందని గమనించాలి.
వాదనలు విన్న తర్వాత సెషన్స్ కోర్టు జడ్జి ఈ అంశాన్ని వాయిదా వేశారు. డిఫెన్స్ న్యాయవాదులు చార్జీల్లో పసలేదని, అరెస్టులు చట్టవిరుద్ధమని హైలైట్ చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం సత్యం లేదా ఆకృతిపై నేరాన్ని మోపడానికి తగిన ఖచ్చితమైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమయ్యారు.
నిందితులు నెలరోజుల కంటే పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, యూపీ పోలీసులు ఇప్పుడు మాత్రమే ఎన్ఎస్ఏను ప్రయోగించారని కూడా గమనించాలి” అని పేర్కొంది.
అరెస్టుల చట్టవిరుద్ధతపై న్యాయవాదుల వాదనలు..
కార్మికుల నిరసన కేసులో పీహెచ్డీ స్కాలర్, ఒక జర్నలిస్టు, విద్యార్థులు, కార్యకర్తలతో సహా 300 మంది వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేసి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఇదివరకే ‘ది వైర్’ కథనం వెల్లడించింది.
“అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాదు, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 (అరెస్టు, నిర్బంధం నుంచి రక్షణ) నిబంధనలో భాగం. సత్యంతో పాటు ఇతరుల కేసులో వారు(అరెస్టయిన వ్యక్తులు) హింసకు పిలుపునిచ్చారని చెప్పడానికి రికార్డులో ఒక్క ఆధారం కూడా లేదని మేము వాదించాము. ఇక సత్యం కేసులో ఆయన ఏ వాట్సప్ గ్రూపులో కూడా లేరు, అలాంటి రికార్డు ఏదీ లేదు” అని న్యాయవాది అలీ జియా కబీర్ చౌధరి ఎన్ఎస్ఏ చార్జీలు నమోదు చేయకముందు సెషన్స్ కోర్టులో జరిగిన వాదనల గురించి చెప్పారు.
గత కేసుల్లో ఎన్ఎస్ఏ దుర్వినియోగం..
క్రూరమైన ఎన్ఎస్ఏ ప్రయోగించబడిన 120 హెబియస్ కార్పస్ పిటిషన్లలో 94 కేసులకు అలహాబాద్ హైకోర్టు ఎలా ఎర్ర జెండా చూపిందో ఏప్రిల్ 2021లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దర్యాప్తు బట్టబయలు చేసింది. ఇది దర్యాప్తు ఏజెన్సీలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో సూచిస్తుంది.
అదేవిధంగా మహ్మద్ ప్రవక్తపై సస్పెండైన బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చెలరేగిన హింసకు సంబంధించి, స్థానిక ముస్లిం ప్రజలపై ఎన్ఎస్ఏ చార్జీలను నమోదు చేయడానికి అనుమతి కోరుతూ కాన్పూర్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపిన ప్రతిపాదనలలో యూపీ పోలీసులు హిందువులు ఎక్కువగా ఉండే చందేశ్వర్ హతా ప్రాంతంలో “ల్యాండ్ జిహాద్” కుట్ర సిద్ధాంతాన్ని ఆశ్రయించారని ఆగస్టు 2022లో ‘న్యూస్‌లాండ్రీ’ కథనం వెల్లడించింది.
ఖండించిన జర్నలిస్టుల సంఘం..
మజ్దూర్ బిగుల్ మ్యాగజైన్ సంపాదకుడైన వర్మపై తీసుకున్న ఈ చర్యను ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఖండించింది.
“మిస్టర్ వర్మ కార్మికుల సమస్యలపై నిరంతరం రాస్తున్నారు. ఆయనపై ఎన్ఎస్ఏ ప్రయోగించాలన్న నిర్ణయం స్వతంత్ర జర్నలిస్టులపై జరుగుతున్న దాడికి మరో ఉదాహరణ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణచివేస్తోంది. సిద్ధిక్ కప్పన్‌తో సహా పలువురు జర్నలిస్టులను క్రూరమైన చట్టాలను ప్రయోగించి అరెస్టు చేసింది. ఇది ఆగాలి” అని పేర్కొంది.
జర్నలిజం నేరం కాదని, “మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, శ్రీవర్మను వీలైనంత త్వరగా విడుదల చేయాలని మేము కోరుతున్నాము” అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి డీయూజే గుర్తుచేసింది.

ఆకృతి చౌధరితో సహా కార్యకర్తలపై ఎన్ఎస్ఏ దుర్వినియోగాన్ని కూడా ఇది ఖండించింది.
బ్యాంకు ఖాతాల్లో నిధులపై పోలీసుల కొత్త వాదన..
ఆ తర్వాత, మే 14న గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ మీడియా సెల్ విడుదల చేసిన మరో పత్రికా ప్రకటనలో “నిందితుడు సత్యం వర్మ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ 1 కోటికి పైగా నగదు ఉన్నట్లు తేలింది, ఆ మొత్తం వివిధ దేశాల నుంచి డాలర్లు, పౌండ్లు, యూరోల రూపంలో జమ అయింది. సత్యం వర్మకు వచ్చిన ఈ మొత్తాన్ని వివిధ సందర్భాల్లో తన ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు” అని పేర్కొన్నారు.
“నిందితుడు సత్యం వర్మకు వివిధ సంస్థలతో సంబంధాలు ఉండటం గమనార్హం, దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. సత్యం వర్మ బ్యాంకు ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు జరుగుతోంది” అని మీడియా సెల్ పత్రికా ప్రకటనలో తెలిపింది.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్..
జర్నలిస్ట్ వర్మపై ఎన్ఎస్ఏ చార్జీలు నమోదు చేయడానికి ఐదు రోజుల ముందు, మే 8న అలహాబాద్ హైకోర్టులో ఆయన భార్య శాకంబరి తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.
‘ది వైర్’ పరిశీలించిన పిటిషన్ కాపీలో, “పిటిషనర్/నిర్బంధించబడిన వ్యక్తి 60 ఏళ్ల సీనియర్ సిటిజన్, సీనియర్ జర్నలిస్ట్ మరియు మేధావి. ఆయనను బలవంతంగా అపహరించారు, చట్టవిరుద్ధంగా నిర్బంధించారు. అనధికారికంగా బందీ చేశారు” అని పేర్కొంది.
లక్నోలోని జన్ చేత్నా బుక్‌స్టోర్ లోపల నుంచి ఏప్రిల్ 17న యూపీ పోలీసులు వర్మను అదుపులోకి తీసుకోగా, నోయిడా పోలీసులు మాత్రం “నిర్బంధించబడిన వ్యక్తిని ఫేజ్-2 నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు కల్పిత అరెస్టును అధికారికంగా చూపించారని” కూడా ఆ పిటిషన్ పేర్కొంది.
వర్మను అదుపులోకి తీసుకున్న లక్నోలోని బుక్‌స్టోర్ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌లను పరిశీలన నిమిత్తం హైకోర్టు ముందు సమర్పించారు.
అలహాబాద్ హైకోర్టులో వర్మ భార్య తరపున వాదిస్తున్న ముగ్గురు న్యాయవాదులలో ఒకరైన న్యాయవాది శాశ్వత్ ఆనంద్ ప్రకారం, “అరెస్టుకు సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు, అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వంటి నిబంధనలను పోలీసు అధికారులు పాటించారా లేదా అని ఈ హెబియస్ కార్పస్ విచారణ ప్రశ్నిస్తుంది.”
మరోవైపు, వర్మ, కార్యకర్త చౌధరిలపై ఎన్ఎస్ఏ చార్జీలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్వాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
“ఇది నిందితులపై ఎలాంటి నిజమైన ఆధారాలు లేని యూపీ ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య. నిందితులకు సుదీర్ఘకాలం పాటు బెయిల్ రాకుండా చూసుకోవడానికే, ఎటువంటి ఆధారాలు చూపించాల్సిన లేదా ఛార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం లేని ఎన్ఎస్ఏను ఉపయోగిస్తున్నారు” అని కార్వాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
