1961లో ఉమ్ఖోంతో వే సిజ్వే(దేశపు ఈటె) అనే సాయుధ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
దాని లక్ష్యం ప్రభుత్వ ఆస్తులపై విధ్వంస చర్యలు. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా చూడడం. ప్రజలపై హింసకు దిగకపోవడం. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసినా, మండేలా దానిని చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే స్వీకరించారు.
ప్రభుత్వం మండేలా కోసం దేశమంతా గాలింపు ప్రారంభించింది. ఆయన మారువేషాల్లో తిరుగుతూ రహస్య సమావేశాలు నిర్వహించారు. ప్రజలు ఆయనను ప్రేమగా “బ్లాక్ పింపర్నెల్” అని పిలిచేవారు. పోలీసులు వెతికినా ఆయనను పట్టుకోలేకపోయేవారు.
ఆఫ్రికా పర్యటన..అరెస్టు..
1962లో మండేలా అనేక ఆఫ్రికా దేశాలకు వెళ్లి విముక్తి ఉద్యమాల నాయకులను కలిశారు. అంతర్జాతీయ మద్దతు కూడగట్టారు.
కొంత సైనిక శిక్షణ కూడా పొందారు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపునిచ్చారు. ఈ పర్యటన తరువాత ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు.
పోలీసులు మండేలాను 1962 ఆగస్టు 5న అరెస్టు చేశారు.
ఆయనపై దేశం విడిచి అక్రమంగా వెళ్లడం, కార్మిక సమ్మెలను ప్రోత్సహించడం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లాంటి ఆరోపణలు మోపారు.
ఈ అరెస్టు ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
కానీ ప్రభుత్వం ఊహించని విషయం ఏమిటంటే—జైలులో బంధించబడిన మండేలా, ప్రపంచ ప్రజల హృదయాలలో మాత్రం మరింత గొప్ప నాయకుడిగా ఎదిగారు.
1944లో యువ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన మండేలా ప్రయాణం, 1962 నాటికి దక్షిణాఫ్రికా ప్రజల ఆశాకిరణంగా మారింది.
ఆయన మాటల్లో “స్వేచ్ఛ అనేది కేవలం సంకెళ్లను తెంచుకోవడం కాదు. ఇతరుల స్వేచ్ఛను కూడా గౌరవించే విధంగా జీవించడం.” ఈ సిద్ధాంతమే తరువాత ఆయనను ప్రపంచ మానవతా చిహ్నంగా నిలబెట్టింది.
“వారిని జైలులో బంధించవచ్చు. కానీ వారి ఆలోచనలను, ఆశయాలను, ప్రజల విశ్వాసాన్ని బంధించలేరు.” ఈ సత్యాన్ని ప్రపంచానికి నిరూపించిన నాయకుడు నెల్సన్ మండేలా.
1962 ఆగస్టు 5న మండేలా అరెస్టు కావడంతో దక్షిణాఫ్రికా విముక్తి ఉద్యమం ముగిసిపోతుందని శ్వేత జాతి ప్రభుత్వం భావించింది. కానీ అదే అరెస్టు ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య ఉద్యమాలకు నాంది పలికింది.
మొదట అక్రమంగా దేశం విడిచి వెళ్లడం, సమ్మెలను ప్రోత్సహించడం లాంటి ఆరోపణలపై ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
అయితే ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఏఎన్సీ నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించింది.
రివోనియా దాడి.. విచారణ..
జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని రివోనియా ప్రాంతంలో ఏఎన్సీ రహస్య కార్యాలయంపై 1963 జూలైలో పోలీసులు దాడి చేశారు.
అక్కడ నుంచి ఉద్యమానికి సంబంధించిన పత్రాలు, ప్రణాళికలు, ఆయుధ శిక్షణకు సంబంధించిన సమాచారం స్వాధీనం చేసుకున్నారు.
దీనిని ఆధారంగా చేసుకొని మండేలా సహా పలువురు నాయకులపై దేశద్రోహం, విధ్వంసక చర్యలకు కుట్ర లాంటి తీవ్రమైన ఆరోపణలు మోపారు.
1963–64 మధ్య జరిగిన ఈ విచారణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, మండేలాకు మరణశిక్ష విధించడం. కానీ విచారణలో మండేలా చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
“నేను మరణించడానికి సిద్ధం” – చరిత్రాత్మక ప్రసంగం..
1964 ఏప్రిల్ 20న కోర్టులో మండేలా దాదాపు నాలుగు గంటలపాటు ప్రసంగించారు.
ఆ ప్రసంగం చివరలో, “ప్రజలందరూ సామరస్యంతో, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య సమాజం నా ఆదర్శం. ఆ ఆదర్శం కోసం నేను జీవించాలనుకుంటున్నాను. అవసరమైతే ఆ ఆదర్శం కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.
ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను కదిలించాయి. ఆ ప్రసంగం తర్వాత మండేలా ఒక దేశ నాయకుడి స్థాయిని దాటి ప్రపంచ మానవ హక్కుల ప్రతీకగా మారిపోయారు.
యావజ్జీవ కారాగార శిక్ష..రాబెన్ దీవి – ఇనుప సంకెళ్ల మధ్య స్వేచ్ఛా దీపం..
1964 జూన్ 12న కోర్టు మండేలా సహా ఎనిమిది మంది నాయకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ప్రభుత్వం మరణశిక్ష విధించకపోవడానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి కూడా ఒక ముఖ్య కారణంగా చరిత్రకారులు పేర్కొంటారు.
మండేలాను రాబెన్ ఐలాండ్ అనే సముద్ర మధ్యలోని ద్వీప జైలుకు తరలించారు. ఈ జైలు అత్యంత ప్రమాదకర ఖైదీల కోసం ఏర్పాటు చేయబడింది.
జైలులోని పరిస్థితులు: సుమారు 8 అడుగులు × 7 అడుగుల చిన్న గది. నేలపైనే నిద్ర. ప్రారంభంలో మంచం లేదు, ఒక దుప్పటి మాత్రమే. చిన్న బకెట్‌ను మరుగుదొడ్డిగా ఉపయోగించాల్సి వచ్చేది. రోజుకు గంటల తరబడి సున్నపు రాతి గనిలో కఠిన శ్రమ. కుటుంబ సభ్యులను సంవత్సరానికి చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే కలిసే అవకాశం. లేఖలు కూడా తీవ్రమైన సెన్సార్‌కు లోనయ్యేవి.
సున్నపు గనిలో శ్రమ..
ప్రతిరోజూ మండేలా, ఇతర ఖైదీలు తెల్లటి సున్నపు రాళ్లను కొట్టాల్సి వచ్చేది. సూర్యకాంతి సున్నపు రాళ్లపై ప్రతిఫలించి కళ్లకు తీవ్ర నష్టం కలిగించింది. జీవితాంతం ఆయన కంటి సమస్యలతో బాధపడటానికి ఇదే ఒక ప్రధాన కారణమని చెబుతారు.
జైలు – ఒక విశ్వవిద్యాలయం..
మండేలా జైలును శిక్షగా కాకుండా ఒక “విశ్వవిద్యాలయం”గా మార్చారు. ఖైదీలకు చరిత్ర, రాజకీయాలు, న్యాయశాస్త్రం, ఆర్థిక శాస్త్రం బోధించేవారు. అందుకే రాబెన్ ఐలాండ్‌ను చాలామంది “మండేలా యూనివర్సిటీ” అని కూడా పిలిచేవారు. జైలులోనే ఆయన దూరవిద్య ద్వారా న్యాయశాస్త్రాన్ని మరింతగా అభ్యసించారు.
జైలు జీవితం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. తల్లి మరణించినప్పుడు అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి లేదు. పెద్ద కుమారుడు థెంబి రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ వెళ్లనివ్వలేదు. భార్య విన్నీ మండేలా కూడా ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. ఈ వ్యక్తిగత విషాదాలన్నింటినీ ఆయన అపారమైన మానసిక ధైర్యంతో ఎదుర్కొన్నారు.
ప్రపంచవ్యాప్త “ఫ్రీ నెల్సన్ మండేలా” ఉద్యమం..
1970ల చివరి నుంచి ప్రపంచవ్యాప్తంగా మండేలా విడుదల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేసింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్మిక సంఘాలు, రచయితలు, కళాకారులు పెద్దఎత్తున ఉద్యమించారు. “ఫ్రీ నెల్సన్ మండేలా” అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛకు ప్రతీకగా మారింది.
జైలులో కూడా రాజీకి నిరాకరణ..
1985లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. “హింసను పూర్తిగా విడిచిపెడితే మిమ్మల్ని విడుదల చేస్తాం” అని తెలిపింది. దానికి మండేలా ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. “నా ప్రజలకు స్వేచ్ఛ లేనప్పుడు నాకు లభించే స్వేచ్ఛకు విలువ ఏమిటి?” ఈ సమాధానం ఆయన వ్యక్తిత్వాన్ని, ఉద్యమ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
జైలు నుంచి ప్రపంచ నాయకుడిగా..
విచిత్రంగా, మండేలా జైలులో ఉన్న కొద్దీ ఆయన ప్రభావం మరింత పెరిగింది. జైలులో ఉన్న ఒక ఖైదీ పేరు ప్రపంచ దేశాల పార్లమెంట్లలో వినిపించింది. విశ్వవిద్యాలయాల్లో ఆయనపై పరిశోధనలు జరిగాయి. పిల్లలకు ఆయన పేరు పెట్టడం ప్రారంభమైంది. ప్రపంచ ప్రజల దృష్టిలో ఆయన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. స్వేచ్ఛ, సమానత్వం, మానవ గౌరవానికి ప్రతీకగా నిలిచారు.
1962 నుంచి 1990 వరకు 27 సంవత్సరాలు మండేలా శారీరకంగా జైలులో ఉన్నారు. కానీ ఆయన ఆలోచనలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి. చరిత్రలో చాలా మంది నాయకులు అధికారంలో ఉండి గొప్పవారయ్యారు. కానీ మండేలా జైలులో ఉండగానే ప్రపంచ నాయకుడిగా ఎదిగిన అరుదైన మహానుభావుడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయాన్ని జయించి ముందుకు సాగడం.
జైలు నుంచి రాష్ట్రపతి వరకు – అపార్థైడ్ అంతం – జాతీయ సయోధ్య – ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా నిర్మాణం..
“27 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీకారం తీర్చుకుంటాడని ప్రపంచం భావించింది. కానీ మండేలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రతీకారానికి బదులు క్షమను, విభజనకు బదులు ఐక్యతను, ద్వేషానికి బదులు మానవతను ఎంచుకున్నారు.”
విడుదలకు దారితీసిన పరిణామాలు..
1980ల చివరినాటికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. కార్మిక సంఘాలు వరుస సమ్మెలు నిర్వహించాయి.
విద్యార్థి ఉద్యమాలు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆంక్షలు అమలయ్యాయి. పెట్టుబడులు తగ్గిపోయాయి. అపార్థైడ్ పాలన అంతర్జాతీయంగా ఒంటరైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మండేలాతో చర్చలు ప్రారంభించక తప్పలేదు.
1990 ఫిబ్రవరి 11 – చారిత్రక విడుదల..
1990 ఫిబ్రవరి 11న, 27 సంవత్సరాల తర్వాత నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు టెలివిజన్ ద్వారా ఆయనను చూశారు. చేతులు కలుపుకొని భార్య విన్నీ మండేలాతో కలిసి జైలు గేటు దాటి బయటకు వచ్చిన ఆ దృశ్యం 20వ శతాబ్దపు అత్యంత చారిత్రక క్షణాలలో ఒకటిగా నిలిచింది.
“ప్రతీకారం కాదు – సామరస్యం”..
విడుదల అనంతరం ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే ఒక గొప్ప సందేశం ఇచ్చారు. “నేను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా ద్వేషాన్ని కూడా జైలులోనే వదిలి వచ్చాను. లేదంటే నేను ఇంకా ఖైదీగానే ఉండేవాడిని” ఈ మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. అపార్థైడ్ పాలనలో ఆయనను జైలులో పెట్టిన వారిపట్ల కూడా వ్యక్తిగత ద్వేషం ప్రదర్శించలేదు.
ఎఫ్ డబ్ల్యూ డి క్లెర్క్‌తో చర్చలు..
అప్పటి అధ్యక్షుడు ఎఫ్ డబ్ల్యూ డి క్లెర్క్‌తో మండేలా దీర్ఘకాల చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా ఏఎన్‌సీపై నిషేధం తొలగించబడింది. రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. అపార్థైడ్ చట్టాలను రద్దు చేయడం ప్రారంభమైంది. ప్రజాస్వామ్య ఎన్నికలకు మార్గం సుగమమైంది.
శతాబ్దాలుగా కొనసాగిన జాతి వివక్ష వ్యవస్థను అంతమొందించడంలో ఈ చర్చలు చారిత్రక మలుపు అయ్యాయి.
నోబెల్ శాంతి బహుమతి..
1993లో మండేలా, డి క్లెర్క్‌లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఒకరు అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. మరొకరు ఆ వ్యవస్థను ముగించడంలో పాత్ర పోషించిన అధ్యక్షుడు. ఈ ఇద్దరికీ కలిసి బహుమతి ఇవ్వడం ప్రపంచానికి శాంతి, సంభాషణ, రాజీ రాజకీయాల ప్రాముఖ్యతను తెలియజేసింది.
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
