ఆగస్టు 20 జాతీయ వైజ్ఞానిక దృక్పథ దినోత్సవం. 2013 ఆగస్టు 20న మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా, హేతుబద్ధమైన ఆలోచన కోసం జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యకు గురయ్యారు.
డా నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ మహారాష్ట్రకు చెందిన వైద్యుడు, సామాజిక సంస్కర్త, హేతువాది, రచయిత. సుమారు 12 సంవత్సరాలు వైద్య వృత్తిలో పనిచేసిన తరువాత, 1980ల ప్రారంభంలో వైద్య వృత్తిని వదిలి సామాజిక సంస్కరణల కోసం, ముఖ్యంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
1989లో మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి(ఎంఏఎన్‌ఎస్) ని స్థాపించారు. మూఢనమ్మకాలు, నకిలీ వైద్యం, చేతబడులు, మంత్రతంత్రాల పేరుతో ప్రజలను మోసం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, మానవతావాదం, హేతుబద్ధతను ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేశారు. మూఢనమ్మకాలు, చేతబడుల పేరుతో ప్రజలను దోచుకోవడాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన నిరంతరం పోరాడారు.
ఈ క్రమంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత, బెదిరింపులు ఎదురైనా తన పోరాటాన్ని కొనసాగించారు. 2013 ఆగస్టు 20న పుణేలో ఉదయం నడకకు వెళ్లిన సమయంలో ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు.
గౌరవ సూచకంగా ఆయన జ్ఞాపకార్థం, ఈ రోజును జాతీయ వైజ్ఞానిక దృక్పథ దినోత్సవంగా జరుపుకోవడం మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి సహకారంతో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్(ఏఐపీఎస్ఎన్), 2018లో ప్రారంభించింది.
భారతదేశం అంతరిక్ష పరిశోధన, డిజిటల్ టెక్నాలజీ, వైద్యం, అణుశక్తి, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో పురోగతిని సాధిస్తున్నది. కానీ అదే సమయంలో జ్యోతిష్యం, మూఢనమ్మకాలు, నకిలీ వైద్యం, ఆధారాలు లేని వాదనలు, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కూడా విస్తరిస్తున్నాయి.
విజ్ఞానశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందినా శాస్త్రీయ దృక్పథం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? అనే ప్రశ్న సహజంగానే ఈ సందర్భంగా మన మదిలోకి వస్తుంది.
సాంకేతికత వాడకం వేరు.. శాస్త్రీయ ఆలోచన వేరు..
విజ్ఞానశాస్త్రం అనేది పరిశీలన, ప్రశ్నించడం, ప్రయోగం, ఆధారాలు, విశ్లేషణ, ధృవీకరణ ద్వారా జ్ఞానాన్ని సంపాదించే పద్ధతి.
శాస్త్రీయ వైఖరి అంటే ఏ విషయాన్నైనా సందేహంతో, ఓపెన్ మైండ్‌తో, ఆధారాలను పరిశీలిస్తూ చూడటం. శాస్త్రీయ దృక్పథం అంటే ఈ ఆలోచనా విధానాన్ని ప్రయోగశాలకే పరిమితం చేయకుండా రోజువారీ జీవితంలో కూడా పాటించడం.
ఒక విద్యార్థికి సైన్స్ జ్ఞానం బాగా ఉండవచ్చు. కానీ తన పరీక్ష ఫలితాన్ని జాతకం నిర్ణయిస్తుందని నమ్మవచ్చు. ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో అత్యంత కచ్చితంగా పనిచేసినా, వ్యక్తిగత జీవితంలో జ్యోతిష్యాన్ని నమ్మవచ్చు. అందువల్ల శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన శాస్త్రీయ దృక్పథం ఉన్నట్లు కాదు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, విజ్ఞానశాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. శాస్త్రీయ వైఖరి ఎలా ప్రశ్నించాలో నేర్పుతుంది. శాస్త్రీయ దృక్పథం ఆ విధానాన్ని జీవన విధానంగా మారుస్తుంది.
శాస్త్రీయ దృక్పథం ఎందుకు పెరగడం లేదు?
సాంకేతిక ఉత్పత్తులను ఉపయోగించడానికి వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
స్మార్ట్‌ఫోన్, జీపీఎస్, ఎంఆర్ఐ, ఏఐలను ఉపయోగిస్తాం, కానీ వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. విజ్ఞానశాస్త్రం మన జీవితంలో విస్మరించలేని భాగం అయింది కానీ శాస్త్రీయ ఆలోచనా విధానం మాత్రం మన జీవితాల్లో కొరవడింది.
మానవ మనస్తత్వం కూడా దీనికి కారణం. మనలో ధృవీకరణ పక్షపాతం(కన్ఫర్మేషన్ బయాస్) ఉంటుంది. అంటే మనం ఇప్పటికే నమ్ముతున్న విషయాలకు అనుకూలమైన సమాచారాన్ని మాత్రమే ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, దాన్నే అంగీకరిస్తూ ఉంటాం. వ్యతిరేక ఆధారాలను పట్టించుకోము.
మనం నమ్మే అనేక విషయాలకు పునాది చిన్నతనం నుండే జరిగే సాంస్కృతిక నిబంధన(కల్చరల్ కండిషనింగ్) ప్రధాన కారణం అవుతుంది.
ఒక పూజ చేసిన తర్వాత ఏదో ఒక మంచి సంఘటన జరిగితే దాన్ని బాగా గుర్తుంచుకుంటాం. కానీ అదే పూజను చేసిన అనేక సందర్భాలలో ఏమీ జరగదు, కానీ ఆ సందర్భాలను అన్నింటినీ మర్చిపోతాం.
మన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కూడా పరిశీలించే ధైర్యమే శాస్త్రీయ ఆలోచనకు ముఖ్యమైన లక్షణం అవుతుంది. కానీ ఈ విధంగా ఆలోచించడానికి సమయం లేని జీవన శైలిని గడుపుతూ ఉంటాము, అలాగే చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయం అంతగా సురక్షితం కాదన్న భయంతో కూడా ఈ శాస్త్రీయ దృక్పథం కొరవడుతూ ఉంటుంది.
సూడో సైన్స్ ప్రమాదం – ఆధారమే గీటురాయి..
శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించినంత మాత్రాన ఒక వాదన శాస్త్రీయమైనది కాదు. శాస్త్రీయంగా కనిపిస్తూ, సరైన ఆధారాలు, పరీక్షలు, నిరూపణలు లేని వాదనలను సూడో సైన్స్ అంటాం. జ్యోతిష్యం దీనికి ఒక ఉదాహరణ.
జ్యోతిష్యులు గ్రహాల స్థానాల ఆధారంగా వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును చెప్పగలమని వాదిస్తారు. కానీ ఇలాంటి వాదనలకు శాస్త్రీయంగా నమ్మదగిన ఆధారాలు లేవని అనేక పరిశోధనలు సూచించాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి: ఒక వాదనను ఎవరు చెప్పారు అనేది కాదు; దానికి ఆధారం ఏమిటన్నదే ముఖ్యం.
ఒక సాధారణ వ్యక్తి మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం ఒక సమస్యే. కానీ ప్రభావశీలమైన పదవుల్లో ఉన్నవారు, సెలబ్రిటీలు ఆధారాలు లేని విషయాన్ని శాస్త్రీయ సత్యంగా చెప్పడం మరింత ప్రమాదకరమైన సమస్య.
ఎందుకంటే ప్రజలు వారి మాటలకు అధిక విశ్వసనీయత ఇస్తారు. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు అధికారికంగా యజ్ఞ, యాగాలను నిర్వహించడం, బాబాలను సందర్శించడం తప్పుడు సందేశాన్ని ఇస్తుంది.
2014లో ముంబైలో ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గణేశుడికి ఏనుగు తల ఉండటం ప్రాచీన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉన్నదనడానికి ఉదాహరణ అని, మహాభారతంలోని కర్ణుడి జననం ప్రాచీన జన్యు శాస్త్రానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను చరిత్రకారులు, శాస్త్రవేత్తలు విమర్శించారు. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా మేఘాల కారణంగా రాడార్‌కు విమానాలు కనిపించకపోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్య కూడా శాస్త్రీయంగా చర్చకు దారితీసింది.
2017లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలికి గర్భం వస్తుందని వ్యాఖ్యానించారు. ఇది జీవశాస్త్రానికి విరుద్ధమైన వాదన. ఇలాంటి అనేక సందర్భాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి: ఒక వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఆయన చెప్పిన ప్రతి శాస్త్రీయ వాదనను ఆధారాల ఆధారంగానే పరీక్షించాలి.
ఇది ప్రభావశీలమైన పదవుల్లో ఉన్న ఎవరికైనా, సెలబ్రిటీలకైనా వర్తిస్తుంది. శాస్త్రీయ దృక్పథం అంటే ఎవరు చెప్పారో కాకుండా, దానికి ఆధారం ఏమిటో చూడడం. ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా దీనికి అతీతం కావు.
2019లో, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదికపై, కౌరవులు ఆధునిక స్టెమ్ సెల్, టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ద్వారా జన్మించారని ఆంధ్రా యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్(వీసీ) ప్రొఫెసర్ జీ నాగేశ్వరరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
ఈ మధ్య జూన్ నెలలో ఐఐటీ మండి(హిమాచల్ ప్రదేశ్)లో పునర్జన్మలపై సదస్సు నిర్వహించడం కూడా శాస్త్రీయ వర్గాల్లో ప్రశ్నలకు దారితీసింది. ఈ సదస్సులో పునర్జన్మ, జ్యోతిష్యం వంటి అశాస్త్రీయ అంశాలపై సెషన్లను ఏర్పాటు చేసి, వాటికి విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
విద్యాసంస్థల్లో స్వేచ్ఛ – పరిశోధనలో నిజాయితీ..
విద్యా సంస్థల్లో స్వేచ్ఛ, ఆధారాల ఆధారంగా విధాన నిర్ణయాలు, సామాజిక సమానత్వం, పారదర్శక పాలన శాస్త్రీయ సమాజానికి అవసరమైన పునాదులు. శాస్త్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది. విద్యార్థి ఉపాధ్యాయుడిని ప్రశ్నించగలగాలి. పరిశోధకుడు ప్రస్తుత సిద్ధాంతాన్ని ప్రశ్నించగలగాలి.
శాస్త్రవేత్త ప్రభుత్వ విధానాలను ఆధారాలతో విమర్శించగలగాలి. ప్రశ్నించే స్వేచ్ఛ శాస్త్రానికి అడ్డంకి కాదు; అది శాస్త్రానికి ప్రాణవాయువు. అలాగే పరిశోధనలో పేపర్ల సంఖ్య కంటే వాటి నాణ్యత, నిజాయితీ ముఖ్యం.
భారత్‌లో పరిశోధనా పత్రాల ఉపసంహరణలు(రీసెర్చ్-పేపర్ రిట్రాక్షన్స్) పెరుగుతుండటం, పరిశోధనలో సంఖ్య కంటే నాణ్యత, నిజాయితీ, పరిశోధనా సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ప్రభుత్వ విధానాలు కూడా నమ్మకమైన డేటా, నిపుణుల సలహా, పరిశోధనల ఆధారంగా రూపొందాలి. ఆధారాలు మారితే విధానాలను మార్చడానికి సిద్ధంగా ఉండటం బలహీనత కాదు—అది మేధో నిజాయితీ అవుతుంది.
సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, పరిశోధనలో సమాన అవకాశాలు కల్పించడం కూడా చాలా అవసరం. భిన్నమైన సామాజిక అనుభవాల నుంచి వచ్చే ప్రశ్నలు శాస్త్రాన్ని మరింత సమృద్ధిగా చేస్తాయి.
విద్యా సంస్థలు ఏం చేయాలి?
మన పాఠశాలలు, కళాశాలలు సమాధానాలు కంఠస్థం చేసే విద్యార్థులను తయారు చేస్తున్నాయా? లేక ప్రశ్నించగల విద్యార్థులను తయారు చేస్తున్నాయా? అన్నది ఆలోచించాలి.
ఒక ప్రయోగం ఊహించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, విద్యార్థి ప్రయోగాన్నే తప్పు అనకుండా తన పద్ధతిని, కొలతలను, ఊహలను పరిశీలించడం నేర్చుకోవాలి. వాస్తవం మన అభిప్రాయానికి విరుద్ధంగా ఉంటే, వాస్తవాన్ని మార్చడానికి ప్రయత్నించకుండా మన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. శాస్త్ర విద్యతో పాటు మానవీయ శాస్త్రాలు, నైతికత, సమాజంపై సాంకేతికత ప్రభావం వంటి అంశాలను కూడా విద్యలో భాగం చేయాలి.
కేవలం పరీక్షల కోసమే చదువులు అన్న విద్యా నమూనాను మార్చుకోవాలి. విద్యార్థులు ప్రశ్నించడాన్ని, చర్చించడాన్ని ప్రోత్సహించాలి.
విద్యార్థులు నిర్దేశిత సమాధానాలను సమర్పించడం గొప్ప విషయం కాదు అది వారి విజయానికి ప్రాతిపదిక కాదు, వారు ఊహించని ప్రశ్నలను ఎన్నింటిని అడుగుతున్నారు అన్నదే వారి విజయానికి ప్రతీక కావాలి, తప్పిదాల వలననే నేర్చుకుంటారని నమ్మాలి.
స్కూలు నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అందరూ టీచర్లు ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ఆచరణలో చూపగలగాలి.
రాజ్యాంగం కోరుతున్న శాస్త్రీయ దృక్పథం..
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51ఏ(హెచ్) “శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, ప్రశ్నించే, సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి చేసుకోవడం” ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా పేర్కొంది.
అంటే రాజ్యాంగం కేవలం “విజ్ఞానశాస్త్రాన్ని నేర్చుకోండి” అని మాత్రమే చెప్పలేదు; “శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోండి” అని స్పష్టంగా పేర్కొంది.
ఇది కేవలం శాస్త్ర విద్యకు సంబంధించిన విషయం కాదు; ఒక పౌరుడిగా ఆధారాలను గౌరవిస్తూ, ప్రశ్నిస్తూ, తర్కబద్ధంగా ఎలా ఆలోచించాలో చెప్పే రాజ్యాంగ విలువ.
ఈ నేపథ్యంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలే శాస్త్రీయ ఆధారాలు లేని నమ్మకాలకు వేదికగా మారుతున్నప్పుడు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు వాటిని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.
కాక్రోచ్ ఉద్యమం, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల శాంతియుత నిరసన వంటి ఇటీవలి ఘటనలు ప్రస్తుత తరం విద్యార్థుల్లో పెరుగుతున్న ప్రశ్నించే స్వభావానికి అద్దం పడుతున్నాయి.
కెరీర్‌పై ప్రభావం పడుతుందనే భయాన్ని అధిగమించి, తమకు నచ్చని విధానాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్త మద్దతును కూడగట్టడం ఈ తరంలో కనిపిస్తున్న కొత్త చైతన్యానికి సంకేతం.
ఒకవైపు అధికారంలో ఉన్నవారు, మరోవైపు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు శాస్త్రీయ దృక్పథాన్ని విస్మరించి మూఢనమ్మకాలకు, ఆధారాలు లేని భావనలకు స్థానం కల్పిస్తున్నప్పుడు, వాటిని అంగీకరించకుండా ప్రశ్నించడం ద్వారా జెన్-జీ యువత రాజ్యాంగం కోరుతున్న శాస్త్రీయ దృక్పథాన్ని ఆచరణలో చూపుతోంది.
విద్య అంటే కేవలం సాంకేతిక నైపుణ్యాలను, వృత్తిపరమైన జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాదు; భావప్రకటన స్వేచ్ఛను కాపాడటం, ఆధారాలను గౌరవించడం, అధికారాన్ని ప్రశ్నించడం, శాస్త్రీయంగా ఆలోచించడం కూడా విద్యలో అంతర్భాగాలేనని వారు గుర్తుచేస్తున్నారు.
దభోల్కర్కు నిజమైన నివాళి..
నరేంద్ర దభోల్కర్ పోరాటం కేవలం కొన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకమైనది కాదు. మనిషి తన జీవితాన్ని భయం, అంధవిశ్వాసం కాకుండా హేతుబద్ధమైన ఆలోచనతో నడిపించుకోవాలన్నది ఆయన లక్ష్యం.
ఈ రోజు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, సూడో సైన్స్ మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. అందువల్ల ఆయన సందేశం మరింత ప్రాసంగికం.
ఆయనకు నిజమైన నివాళి: ఎందుకు అని అడగడం. ఆధారం ఏమిటో అడగడం. మనకు నచ్చని ఆధారాలను కూడా పరిశీలించడం. అధికారాన్ని ప్రశ్నించడం. “నాకు తెలియదు” అని అంగీకరించడం. కొత్త ఆధారాలు వచ్చినప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకోవడం.
భారత దేశం ఇప్పుడు గొప్ప శాస్త్రీయ సంస్కృతిని నిర్మించుకోవాలి. ప్రశ్నించే స్వేచ్ఛ, ఆధారాల పట్ల గౌరవం, మానవతావాదం, సమానత్వం, పారదర్శకత, పరిశోధనలో నిజాయితీ మన జీవితాల్లో భాగమయ్యే సంస్కృతి కావాలి. అదే నరేంద్ర దభోల్కర్కు నిజమైన నివాళి. అదే మన రాజ్యాంగం కోరుతున్న శాస్త్రీయ దృక్పథం. అదే మనం నిర్మించాల్సిన శాస్త్రీయ భారతదేశం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
