గత ఆగస్టు 7న రాయ్‌పూర్‌లో ముగిసిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వార్త, దాదాపు వారం రోజుల తర్వాత వైరల్ కావడంతో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓ ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు.
ఆ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన మహిళలు మామూలు మహిళలు కాదు. కొన్ని నెలల కిందటి వరకూ చేతుల్లో తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరిగిన మావోయిస్టు గెరిల్లా దళాల సభ్యులు. అందుకే వారి ర్యాంప్ వాక్‌పై ఇంత పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దీన్ని తన విజయానికి, ‘సాధికారత’కు ఉదాహరణగా కూడా ప్రచారం చేస్తోంది.
ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకుంటూ, ‘బస్తర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఒకప్పుడు ఆయుధాలు పట్టుకున్న చేతులు, ఇప్పుడు గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలతో కూడిన కొత్త కథనాన్ని అల్లుతున్నాయి’ అని పేర్కొన్నారు.
అయితే, ‘ది వైర్ హిందీ’తో మాట్లాడిన నలుగురు మాజీ మావోయిస్టు మహిళలు తమను కుట్టుపని శిక్షణ పేరుతో మోసం చేసి సుక్మా నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ర్యాంప్ వాక్‌లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఒక మహిళ మాట్లాడుతూ, ‘నాకు ముందే తెలిసి ఉంటే నేను వెళ్లేదాన్ని కాదు’ అని చెప్పారు.
సుక్మా పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న మహిళా పోలీసు సీమా పోయాం కూడా ఈ మహిళలకు ర్యాంప్ వాక్ గురించి ముందుగా తెలియదని ధృవీకరించారు. ఆమె చెప్పిన ప్రకారం, మహిళలను కుట్టుపనికి సంబంధించిన శిక్షణ కోసం తీసుకెళ్తున్నామని మాత్రమే వారికి చెప్పారు.
మరోవైపు, గ్రామోద్యోగ శాఖ సుక్మా ఇన్చార్జి కార్యదర్శి రాజేశ్ సింగ్ రాణా మాత్రం మహిళలు తమ అంగీకారంతోనే కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇందుకు జిల్లా కలెక్టర్ తరఫున అంగీకార పత్రాలు కూడా వచ్చాయని చెబుతున్నారు.
ఆగస్ట్ 7న రాయ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో గ్రామీణ పరిశ్రమల శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఈ మహిళలకు కోసా సిల్క్, సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరింపజేసి, ముఖాలకు మేకప్ వేసి ర్యాంప్ వాక్ చేయించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.
‘కుట్టుపని నేర్పిస్తామని చెప్పి తీసుకెళ్లారు’..
ఈ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న కొందరు మాజీ మావోయిస్టు మహిళలను ‘ది వైర్’ కాంటాక్ట్ చేసింది. వారిలో నలుగురు యువతులు- ర్యాంప్ వాక్‌లో సుక్మా జిల్లా నుంచి మొత్తం 10 మంది మహిళలు పాల్గొన్నారని ధృవీకరించారు. వారిలో తొమ్మిది మంది మావోయిస్టులు. వీరంతా సరెండర్ అయి, కొన్ని నెలలుగా సుక్మాలో పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ‘పునరావాస కేంద్రం’లో ఉంటున్నారు.
మరో మహిళ స్వయంగా పోలీసు ఉద్యోగి. ఆమె ఎప్పుడూ మావోయిస్టు కాదు. ఈ తొమ్మిది మంది గత ఏడాది కాలంలో వేర్వేరు సమయాల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
తమ పేర్లు, గుర్తింపులు వెల్లడించవద్దనే షరతుతో ఈ మాజీ మావోయిస్టు మహిళలు ‘ది వైర్’కు చెప్పిన వివరాల ప్రకారం, జగ్దల్పూర్లో కుట్టుపని శిక్షణ ఇప్పిస్తామని చెప్పి వారిని సుక్మా నుంచి తీసుకెళ్లారు.
అయితే జగ్దల్పూర్కు బదులుగా నేరుగా రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. వారి బృందంలో మొత్తం 11 మంది ఉండగా, అందులో ఇద్దరు పోలీసు సిబ్బంది. వారిలో ఒకరు ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. ఆగస్టు 1 సాయంత్రం వారు రాయ్‌పూర్ చేరుకున్నారు. అక్కడ వారిని ఒక హోటల్లో బస చేయించి, ఆగస్టు 2 నుంచి 6 వరకు ర్యాంప్ వాక్‌లో శిక్షణ ఇచ్చారు.
ముంబై నుంచి వచ్చిన కొందరు వారికి శిక్షణ ఇచ్చారు. ర్యాంప్ వాక్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలను కూడా వివరించారు. వాటి గురించి వారికి అసలు ఏమీ తెలియదు. టైలరింగ్ పనికి బదులుగా తమకు ఈ శిక్షణ ఎందుకు ఇస్తున్నారో అర్థం కాక తాము ఆశ్చర్యపోయామని వారు చెప్పారు.
వారిలో ఒకరు మాట్లాడుతూ, ‘టైలరింగ్ పని నేర్పిస్తామని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కుట్టుమిషన్ శిక్షణకు బదులుగా మాకు నడకలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా కష్టపడి కొద్దో గొప్పో నేర్చుకుని స్టేజీ మీద చూపించాం’ అని చెప్పారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘నేను అక్కడ ర్యాంప్ వాక్ చేయాల్సింది కాదు. ఇప్పుడు నాకు బాగా అనిపించడం లేదు. నాకు ముందే తెలిసి ఉంటే నేను వెళ్లేదాన్ని కాదు’ అని చెప్పింది.
మరో మహిళ కూడా ఇదే తరహాలో మాట్లాడుతూ, ‘ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి తీసుకెళ్తున్నామని ముందే చెప్పి ఉంటే మేం వెళ్లడానికి ఒప్పుకునేవాళ్లం కాదు. కానీ శిక్షణ పేరుతో తీసుకెళ్లారు. ఏదో కొత్తది నేర్చుకుంటాం, అది మనకు పనికొస్తుంది కదా అనుకున్నాం’ అని చెప్పింది.
మరో మహిళ మాట్లాడుతూ, ‘మమ్మల్ని ఉంచిన హోటల్‌కు ముంబై నుంచి కొందరు వచ్చారు. మేం వద్దని చెప్పి చూశాం కూడా. కానీ వాళ్లు మాపై ఒత్తిడి చేశారు. మాకు సరిగ్గా చేయడం రాకపోయేది. వాళ్లు తిట్టి, మందలిస్తూ మాకు నేర్పించేవాళ్లు’ అని చెప్పింది.
‘ది వైర్’తో మాట్లాడిన ఈ మహిళల్లో ఎవ్వరికీ కూడా సరిగ్గా హిందీ మాట్లాడటం రాదు. కేవలం పని నడిచేంత, అంతంత మాత్రం హిందీ మాత్రమే మాట్లాడగలరు. అందుకే ‘ది వైర్’తో వారి సంభాషణ అంతా గోండీ/కోయ భాషలోనే జరిగింది. వీరందరితో విడివిడిగా మాట్లాడినప్పటికీ ఒక మాట మాత్రం అందరూ ఒకే విధంగా, స్పష్టంగా చెప్పారు. తమను మోసం చేసి అక్కడికి తీసుకెళ్లారని. వారి భాషలో, వారి మాటల్లో చెప్పాలంటే, ‘మాకిన్ గత్తి కీసి ఒత్తోర్’ అని.
మాజీ మావోయిస్టు కేడర్ల మాటలను సుక్మా పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న మహిళా పోలీసు సీమా పోయాం కూడా ధృవీకరించారు.
ఈ మహిళలను రాయ్‌పూర్‌కు తీసుకెళ్లడం దగ్గర నుంచి ర్యాంప్ వాక్ తర్వాత తిరిగి సుక్మాకు తీసుకురావడం వరకూ సీమా వారితోనే ఉన్నారు. ఆమె చెబుతున్న ప్రకారం, పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ మహిళలను ఆమె రాయపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరగబోతోందో తనకు కూడా తెలియదని ఆమె చెప్పారు.
అక్కడ ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంటుందని మాజీ మావోయిస్టు మహిళలకు కూడా తెలియదని ఆమె ధృవీకరించారు. ‘టైలరింగ్ పనికి సంబంధించిన ఏదో శిక్షణ కోసం తీసుకెళ్తున్నామని మాత్రమే వారికి చెప్పారు’ అని ఆమె తెలిపారు.
‘ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక జోలెసంచి మాత్రమే ఇచ్చారు’..
అక్కడ ప్రదర్శన చేసినందుకు పారితోషికంగా ఏం ఇచ్చారని ‘ది వైర్’ ఈ మాజీ మావోయిస్టు మహిళలను అడిగినప్పుడు, అందరూ ఒకే మాట చెప్పారు: ‘ఏమీ ఇవ్వలేదు. ఒక జోలెసంచి మాత్రమే ఇచ్చారు. అందులో ఒక చీర ఉంది.’
‘ది వైర్’ గ్రామీణ పరిశ్రమల శాఖ సుక్మా ఇన్చార్జి కార్యదర్శి రాజేశ్ సింగ్ రాణాతో మాట్లాడగా, ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలందరికీ ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పారు. నగదుగా ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అలాగే బహుమతిగా చేనేతతో తయారు చేసిన ఖాదీ, సిల్క్ వస్త్రాలను ఇచ్చామని చెప్పారు.
దీన్ని నిర్ధారించుకోవడం కోసం మహిళలను ఈ విషయం మళ్లీ అడిగితే, తమ బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు ఎలాంటి డబ్బూ పడలేదని చెప్పారు. బహుమతిగా ఒక కాటన్ చీర మాత్రమే ఇచ్చారని, దాంతో పాటు ఒక ట్రాక్‌సూట్ కూడా ఇచ్చారని తెలిపారు.
ఈ వార్త మీడియాలో వైరల్ కావడం గురించి ప్రస్తావిస్తూ, ‘ఇదంతా ఎలా అనిపిస్తోంది?’ అని అడిగితే ఒక మహిళ, ‘మోసం చేసి తీసుకెళ్లి మాతో ఇదంతా చేయిస్తే ఎలా బాగుంటుంది?’ అని చెప్పింది.
మీడియా వారు వరుసగా తమను కాంటాక్ట్ చేయడం పట్ల కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ కార్యక్రమం జరిగినప్పటి నుంచి మీడియా వాళ్లు వరుసగా వచ్చి మమ్మల్ని దీని గురించి అడుగుతున్నారు. మేం మాత్రం ఏం చెప్పగలం? మేం మా ఇష్టంతో ఏమైనా వెళ్లామా? మాకు అబద్ధం చెప్పి తీసుకెళ్లారు’ అని అన్నారు.
ఈ విషయంపై కూడా ‘ది వైర్’ గ్రామీణ పరిశ్రమల శాఖ సుక్మా ఇన్చార్జి కార్యదర్శి రాజేశ్ సింగ్ రాణాతో మాట్లాడింది. సుక్మాలోని నక్సల్ పునరావాస కేంద్రంలోనే ఈ మహిళలను తాను కలిశానని ఆయన చెప్పారు.
‘వాళ్లు ఏయే ఉపాధి పనులు చేస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, వాళ్లు ఏం కావాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలపై వారితో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా, కొందరికి ఇందులో (ర్యాంప్ వాక్‌లో) ఆసక్తి ఉందని తెలిసింది. కొందరు అమ్మాయిలకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. తమకూ ఒక వేదిక కావాలని వాళ్లు కోరుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా కార్యక్రమం ఉంది కాబట్టి వారిని అందులో భాగం చేశాం’ అని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేయించాలనే ఆలోచన ముందే ఉందాని ‘ది వైర్’ అడిగితే, ‘ఇది ముందే నిర్ణయించినది కాదు. చేనేత దినోత్సవం సందర్భంగా ఖాదీ, కోసా సిల్క్, కాటన్ వంటి స్వదేశీ వస్త్రాలను ప్రచారం చేయాలనుకున్నాం. తర్వాత ఈ మహిళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసి, వారిని కూడా ఇందులో భాగం చేయవచ్చని అనిపించింది’ అని ఆయన చెప్పారు.
కుట్టుమిషన్ శిక్షణ పేరుతో ఆ మహిళలను అక్కడికి తీసుకెళ్లారాని అడిగినపుడు, ఈ మహిళలు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు అంగీకార పత్రాలు జిల్లా కలెక్టర్ నుంచి తమకు వచ్చాయని రాణా తెలిపారు.
ఈ ర్యాంప్ వాక్కు సంబంధించి కొన్ని ‘అంగీకార పత్రాలు’ కూడా ‘ది వైర్’కు లభించాయి. వాటిలో ‘స్వదేశీ ఫ్యాషన్ షో/ఎగ్జిబిషన్’లో పాల్గొనేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ కొందరి పేర్లు, ఫోటోలు, సంతకాలు ఉన్నాయి. దీనిపై ఒక మాజీ మావోయిస్టు మహిళను ‘ది వైర్’ అడిగినపుడు, ‘అందులో హిందీలో ఏం రాసి ఉందో మాకు అసలు తెలియదు. అధికారులు సంతకం చేయమంటే చేశాం’ అని చెప్పారు.
ర్యాంప్ వాక్ చేయించి సంతోషపడటం ఓ జోక్: బేలా భాటియా..
‘ది వైర్ హిందీ’తో మాట్లాడిన సామాజిక కార్యకర్త, న్యాయవాది బేలా భాటియా, బస్తర్ మహిళలను, అందులోనూ మావోయిస్టు నేపథ్యం నుంచి వచ్చిన మహిళలను ఇలా ఫ్యాషన్ షోలో ప్రదర్శించడం వెగటు పుట్టించే పరిహాసమని అన్నారు.
‘ఇక్కడి ప్రజలు ఆకలితో పోరాడుతున్నారు. నిరుద్యోగంతో పోరాడుతున్నారు. రకరకాల దోపిడీలతో పోరాడుతున్నారు. వారి వనరులను దోచుకోవడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. వారి హక్కులను అణచివేయడం వల్లే మావోయిజం పుట్టింది. ప్రభుత్వం ఇప్పుడు మావోయిజాన్ని అంతం చేశామని చెబుతున్నా, మావోయిజం అసలు ఎందుకు మొదలైందనే దానిపై సమాజానికి ఇప్పటివరకు జవాబు చెప్పలేదు. బస్తర్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందులో ఎందుకు పెద్ద సంఖ్యలో చేరారు? ఎందుకు ఏకంగా ఆయుధాలు పట్టుకున్నారు? ఇవన్నీ దాచిపెట్టి ఆ మహిళలను ర్యాంప్ వాక్ చేయిస్తూ, సంతోషపడటం ఓ పెద్ద జోక్’ అని ఆమె అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘మహిళలను ర్యాంప్ వాక్‌లో చేర్చడం అంటే వారి శరీరాలను ‘అందం’ అని పిలిచే ఒక మూసలోకి నెట్టడం. ఒకప్పుడు తుపాకీ పట్టిన, రాజకీయ అంశాలను లేవనెత్తిన మహిళలను అందం, అలంకరణ పరిధిలోకి తీసుకువచ్చి, దానినే వారి సాధికారత దిశగా ముందడుగని చెప్పడం పితృస్వామ్య ధోరణి ఫలితమే. వాళ్లు ఫూలన్ దేవిని కూడా ఇలాగే బంధించి ర్యాంప్‌పై నడిపించినా, ఆమెపై ఎంత ఘోరంగా అత్యాచారం జరిగిందనే వాస్తవం మారిపోతుందా? దాని వల్ల ఆమె పుట్టి పెరిగిన కమ్యూనిటీలో మహిళలు ఎదుర్కొన్న సామాజిక దోపిడీ మారిపోతుందా?’ అని ప్రశ్నించారు.
బేలా ఇంకా మాట్లాడుతూ, ‘ఈ మహిళలను ర్యాంప్‌పై 10–15 నిమిషాలు నడిపించారు. కానీ వీళ్లు ఏ పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తుకున్నారో ప్రభుత్వం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటుందా? ఏళ్ల తరబడి అడవుల్లో ఎందుకు తిరిగారు? ఈ మార్గంలో చాలామంది చనిపోయారు కూడా. అయినా వాళ్లు ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు?’ అని ప్రశ్నించారు.
‘మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం’ అనే అంశంపై బేలా మాట్లాడుతూ, ‘వీళ్లంతా అణగారిన సముదాయాలకు చెందిన ప్రజలు. తమ హక్కుల కోసం పోరాడాలనే ఆలోచనతో ఆయుధాలు ఎత్తుకున్నారు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో వారి హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్లు ఆయుధాలు వదిలేశారు. కానీ హక్కుల హననం సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఇప్పటికీ జనాభాలో అత్యధిక భాగం అణగారిన స్థితిలోనే ఉంది. వాళ్లు మెయిన్‌స్ట్రీమ్‌లో లేరు. అవసరాలన్నీ తీరుతున్న వాళ్లే మెయిన్‌స్ట్రీమ్‌లో ఉన్నారు. కాబట్టి హక్కులు అందకుండా పోతున్న వారిని మెయిన్‌స్ట్రీమ్‌లోకి ఎప్పుడు తీసుకువస్తారో ప్రభుత్వాన్ని అడగాల్సిందే’ అని అన్నారు.
అణగారిన ప్రజల హక్కులను కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి. వారి కోసం అందరూ పోరాడాలి’ అని ఆమె అన్నారు.
మాజీ మావోయిస్టుల పునరావాసంపై చర్చ..
‘మెయిన్‌స్ట్రీమ్’లోకి తిరిగి వచ్చిన మాజీ నక్సలైట్ మహిళల ర్యాంప్ వాక్‌ను ప్రభుత్వం వారి పునరావాసం, సాధికారత కోసం చేస్తున్న ప్రయత్నంగా ప్రచారం చేస్తోంది. కానీ దశాబ్దాలుగా కొనసాగిన హింసా వలయం నుంచి బయటకు వచ్చిన ఈ మహిళల పునరావాసానికి ర్యాంప్ వాక్ ఎలా ప్రతీక అవుతుంది? వారిని వేదిక మీదికి తీసుకొచ్చి, వారి ఆదివాసీ సంస్కృతికి, జీవన విధానానికి ఏ మాత్రం పోలికలేని వాతావరణంలో, తమకు తెలియని భాషలు మాట్లాడే పట్టణ, ఆదివాసీయేతర ప్రేక్షకుల ముందు, వారికి పూర్తిగా అపరిచితమైన, అసౌకర్యమైన భంగిమల్లో నడిపించి, ఫోటోలు, వీడియోలు తీసి వైరల్ చేయడం ఎంతవరకు సమంజసం?
వాళ్ల ఇష్టం ఏంటి, వాళ్ల వాదన ఏంటి, వాళ్ల అనివార్యతలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అన్నది తెలుసుకోకుండా, వినకుండా, వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకొని ఇది వారి మెయిన్‌స్ట్రీమ్‌లోకి తిరిగి రావడంలో విజయానికి ప్రతీక అని ప్రకటించడం ఎంతవరకు సమర్థనీయం?
బస్తర్ డివిజన్లోని వేర్వేరు జిల్లాల పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాజీ మావోయిస్టులకు తమ భవిష్యత్తు జీవితం, ఉపాధి గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేనప్పుడు, ఈ ర్యాంప్ వాక్‌ను వారి సాధికారత దిశగా ఒక అడుగుగా చెప్పడం హాస్యాస్పదం కాదా?
సుక్మా పునరావాస కేంద్రంలో ఉంటున్న కొందరు మాజీ మావోయిస్టు మహిళలు ‘ది వైర్’తో మాట్లాడుతూ, అనేక ఆంక్షల మధ్య, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో తాము జీవించాల్సి వస్తోందని చెప్పారు. తమ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్లేందుకు, రావడానికి కూడా అనుమతి లేదన్నారు. ఆదివాసీలు స్వభావరీత్యా ఒకే చోట కట్టిపడేసి ఉండటాన్ని ఇష్టపడరు. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఇప్పటివరకు తమకు పెద్దగా ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని వారు చెప్పారు. కొద్దిమందికి మాత్రమే డ్రైవింగ్, వ్యవసాయ శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.
ఒక మహిళ మాట్లాడుతూ, ‘పై నుంచి చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది. కానీ అలా ఏమీ లేదు. మేం చిన్నప్పటి నుంచీ అడవుల్లో బతకడానికి అలవాటు పడిన వాళ్లం. ఇప్పుడు ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తోంది. మా ఊరు, ఇల్లు ఉన్న చోట జీవించినట్టుగా అసలు లేదు. పైకి సంతోషంగా కనిపిస్తాం కానీ మేం సంతోషంగా లేం. మేం మా ఇంటికి తిరిగి వెళ్లి, అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతకాలని కోరుకుంటున్నాం’ అని చెప్పింది.
ఈ అంశంపై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాసిం మాట్లాడుతూ, ‘మెయిన్‌స్ట్రీమ్‌లోకి తిరిగి రావాలన్న ప్రభుత్వ పిలుపుతోనో, తప్పనిసరి పరిస్థితుల్లోనో వందలాది మంది మావోయిస్టులు వేర్వేరు రాష్ట్రాల్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో మహిళల సంఖ్య కూడా పెద్దదే. ఈశాన్య రాష్ట్రాల్లో లొంగిపోయిన మిలిటెంట్లను ఎలా మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకువచ్చి, గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం కల్పించారో, వీళ్లకూ తమ ఇష్టానుసారం తమ ఇళ్లకు, గ్రామాలకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వాలి. సమాజంలో అశాంతి పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంపై పునరాలోచన చేయాలి’ అని అన్నారు.
సంస్కృతిపై తలెత్తుతున్న ప్రశ్నలు..
మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోవడం, ప్రభుత్వం చేపట్టిన పునరావాసం గురించి చేస్తున్న ప్రచారం మధ్య ఆదివాసీల జల్–జంగల్–జమీన్, వారి సంస్కృతి గురించి చర్చ దాదాపుగా మరుగునపడిపోయింది.
బస్తర్‌లో ఇప్పుడు మార్కెట్ సంస్కృతి, మైనింగ్, పర్యాటకం ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తే, ఇది ఆదివాసీలకు కొత్త ఆందోళనలను సృష్టిస్తోంది.
ఈ ఆదివాసీ మహిళలు ఏళ్ల తరబడి కొనసాగించిన రాజకీయ, సామాజిక ఆచరణను కించపరిచే ఉద్దేశం కూడా ఇందులో దాగి ఉందని ప్రొఫెసర్ కాసిం భావిస్తున్నారు. ర్యాంప్ వాక్‌ను ఆయన మార్కెట్ సంస్కృతిలో, వస్తువాద సంస్కృతిలో భాగంగా చూస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ, ‘ఒకప్పుడు ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ వంటి మహిళలకు వరుసగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు దక్కుతూ ఉండేవి. అది సరళీకరణ గాలులు బలంగా వీచిన కాలం. బహుళజాతి కంపెనీలు తమ వస్తువులను భారతదేశం అనే విస్తారమైన మార్కెట్లోకి విచ్చలవిడిగా తీసుకొస్తున్న కాలం. ఇప్పుడు మావోయిస్టు నేపథ్యం నుంచి వచ్చిన ఆదివాసీ మహిళలను కూడా ఇక్కడ అమలు చేస్తున్నట్లు చెబుతున్న అభివృద్ధి నమూనాకు చీర్లీడర్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది’ అని అన్నారు.
మరి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ సాధారణంగా భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ, స్వదేశీ అంశానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తాయి. అలాంటప్పుడు, చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ ర్యాంప్ వాక్ పాశ్చాత్య సంస్కృతిలో భాగం కాదా అని కొందరు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
తమకంటూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు ఉన్న ఆదివాసీ మహిళలపై పాశ్చాత్య దేశాల ఫ్యాషన్ సంస్కృతిని రుద్దడం వారి పునరావాసానికి ఏ విధంగా దోహదపడుతుంది?
నిజంగానే ఆదివాసీ సంస్కృతి, స్వదేశీ సంస్కృతి పట్ల వారికి గర్వం ఉంటే, భారతీయ సంప్రదాయ కళలు, వస్త్రధారణ, పాటలు, నృత్యాలు, స్థానిక నైపుణ్యాలను ఎందుకు వేదిక మీదికి తీసుకురాలేదు?
మావోయిజం, ఆపరేషన్ కగార్..
దేశంలో దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సల్ లేదా మావోయిస్టు ఉద్యమం కారణంగా, ముఖ్యంగా మధ్య భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య హింసాత్మక ఘర్షణలు కొనసాగాయి.
భద్రతా బలగాలపై దాడులు చేయడం, ఇన్ఫార్మర్ల పేరుతో సాధారణ పౌరులను హత్య చేయడం వంటి ఆరోపణలు నక్సలైట్లపై ఉన్నాయి.
అదే సమయంలో భద్రతా బలగాలపై బూటకపు ఎన్కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగకుండా నిర్వహిస్తున్న కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లలో 2024 కీలక మలుపుగా మారింది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఒక భారీ ఆపరేషన్ ప్రారంభించి, 2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తర్వాత బస్తర్ ప్రాంతంలో అనేక భారీ ‘ఎన్కౌంటర్లు’ జరిగాయి. ఇందులో పదుల సంఖ్యలో మావోయిస్టు కేడర్లు, నేతలు చనిపోయారని ప్రకటించారు. ఆ తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో మావోయిస్టు పార్టీలో ఒక గ్రూపు సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నట్టు ప్రకటించి, 2025 అక్టోబర్‌లో ప్రభుత్వానికి ఆయుధాలతో సహా లొంగిపోయింది. అయితే సంస్థలోని ఇతర నేతలు దేవ్‌జీ, హిడ్మా దీనిని వ్యతిరేకించి, పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హిడ్మా ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ప్రకటించారు. దేవ్‌జీ సహా మరికొందరు నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న చిన్నా, పెద్ద స్థాయి కేడర్లు దాదాపు అందరూ లొంగిపోయారు.
ఆ తర్వాత లొంగిపోయిన దాదాపు అన్ని కేడర్లనూ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోని పోలీస్ లైన్లలో ఏర్పాటు చేసిన ‘పునరావాస కేంద్రాల్లో’ ఉంచింది. వీరిలో మహిళల సంఖ్యే పెద్దది. ఒక్క సుక్మా పునరావాస కేంద్రంలోనే వంద మందికి పైగా మహిళలు ఉన్నారని చెబుతున్నారు. వీరిలో అత్యధికులు మాజీ మావోయిస్టులే. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు గ్రామీణ మహిళలు కూడా ఇందులో ఉన్నారు.
- సంతోషి మర్కాం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
