విద్యా వ్యవస్థపై సమాజానికి ఉన్న విశ్వాసం పరీక్షల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది. ప్రశ్నాపత్రాల గోప్యత, భద్రత, పారదర్శకత వంటి అంశాలు కేవలం పరిపాలనా విధానాలు మాత్రమే కావు. అవి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మూల స్తంభాలు. అలాంటి ప్రశ్నాపత్రాలు వర్షపు నీటిలో తేలుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది.
ఇటీవల బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో పరీక్షా పత్రాల కట్టలు వర్షపు నీటిలో కనిపించిన ఘటన విద్యా పరిపాలనలోని నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అధికారులు భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చినప్పటికీ, ఇంత కీలకమైన పత్రాల భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.
ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు రూపొందించడం పరిపాలన బాధ్యత. ప్రశ్నాపత్రాల రవాణా, నిల్వ, పంపిణీ వంటి ప్రక్రియలలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. వర్షపు నీరు చేరని చోట భద్ర పరచాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడటం తప్ప మారెమిటి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎదురుకావు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు ప్రజల్లో అనుమానాలు, భయాలను పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో నీటిలో తేలిన ప్రశ్నాపత్రాల ఘటన ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. విద్యార్థులు సంవత్సరమంతా శ్రమించి పరీక్షలకు సిద్ధ మవుతారు. వారి కృషి ఫలితాలను ప్రభావితం చేసే వ్యవస్థలో అలసత్వానికి స్థానం ఉండకూడదు.
ఈ సంఘటనను ఒక సాధారణ పరిపాలనా తప్పిదంగా పరిగణించడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం.. బాధ్యులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ పర్యవేక్షణ, కట్టుదిట్టమైన బాధ్యతా వ్యవస్థలను అమలు చేయడం ద్వారా పరీక్షల నిర్వహణను మరింత విశ్వసనీయంగా మార్చవచ్చు.
విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. అలాంటి భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్నాపత్రాలు నీటిలో తేలడం కేవలం ఒక సంఘటన కాదు. అది విద్యా పరిపాలనకు ఒక హెచ్చరిక. ఇప్పటికైనా బీహార్ లో రాజ్యమేలుతున్న బి. జె. పి మేల్కొని బాధ్యతగా వివాహరిస్తుందా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
