Army personnel stop Kuki protesters marching towards a 'checkpoint' set up by Naga blockade enforcers, at Kanto Sabal in Imphal, Manipur, Thursday, July 2, 2026. Photo: PTI
కుకీ గ్రూపులు ఆరుగురు పౌరులను చంపారనే ఆరోపణల నేపథ్యంలో నాగా గ్రూపులు చేపట్టిన ఆర్థిక దిగ్బంధనం, గత నెలన్నర రోజులుగా నిత్యావసరాల సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రంలో వివిధ తెగల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
మణిపూర్‌లోని ఇంఫాల్, కాంటో సబల్ వద్ద గురువారం, జూలై 2, 2026 నాడు నాగాల దిగ్బంధన అమలుదారులు ఏర్పాటు చేసిన ‘చెక్ పాయింట్’ వైపు దూసుకెళ్తున్న కుకీ నిరసనకారులను ఆర్మీ సిబ్బంది అడ్డుకుంటున్నారు.
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర రూ. 250. ఒక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 5,000. 50 కిలోల బియ్యం బస్తా ధర దాదాపు రూ. 3,000. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో నెలన్నర రోజులుగా కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా కుకీ-జో తెగలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో, తాము ఈ రకమైన భారీ ధరలు చెల్లించాల్సి వస్తోందని అక్కడి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వం “స్వేచ్ఛా రాకపోకలను” ప్రకటించిన పదహారు నెలల తర్వాత కూడా, భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలు ప్రయాణించడానికి అనుమతి ఉన్నప్పటికీ… ఆహారం, ఇంధనం, వంట గ్యాస్ వంటివి మాత్రం స్వేచ్ఛగా రావడం లేదని కాంగ్పోక్పి ప్రజలు చెబుతున్నారు.
నిత్యావసరాల నిల్వలు అడుగంటిపోవడంతో, రాబోయే రోజుల్లో ఆకలి అనేది మరో పెద్ద మానవతా సంక్షోభంగా మారుతుందేమోనని చాలామంది భయపడుతున్నారు.
రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో నాగాల గ్రూపులు నెల రోజులుగా విధిస్తున్న దిగ్బంధనం కారణంగా కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు సరుకుల రవాణా నిలిచిపోయింది. కాంగ్పోక్పి జిల్లా ప్రధానంగా రెండు సరఫరా మార్గాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి కాంగ్లాటోంగ్బీ మీదుగా రాజధాని ఇంఫాల్‌ను కలుపుతుండగా, మరొకటి సేనాపతి జిల్లా మీదుగా నాగాలాండ్‌లోని దిమాపూర్ను కలుపుతుంది.
రెండు వైపుల నుండి సరఫరా మార్గాలు మూసుకుపోవడంతో, ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువులతో వస్తున్న ట్రక్కులు జిల్లాకు చేరుకోలేకపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
నిత్యావసరాలు అందక కాంగ్పోక్పి ప్రజల అగచాట్లు:
రాజకీయ వివాదాల కారణంగా కాంగ్పోక్పిలో నివసించే ప్రజల రోజువారీ జీవితం మనుగడ కోసం పోరాటంగా మారింది. కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్ పట్టణంలో ఎల్పీజీ సిలిండర్లు దొరకడం గగనమై పోవడంతో, చాలా కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యిలపై వంట చేయడం ప్రారంభించాయి. కట్టెలు సేకరించడం వారి దైనందిన జీవితంలో ఒక పెద్ద కష్టంగా మారింది.

సైకుల్ నివాసితులకు, సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేసే స్థానిక వాలంటీర్ గౌపు మాట్లాడుతూ, ఈ సంక్షోభం ఎప్పుడూ ముగియ లేదని, కాకపోతే ఇప్పుడు సరికొత్త రూపం దాల్చిందని అన్నారు.
“కొందరు వంట చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్నారు, కానీ సైకుల్ పవర్ స్టేషన్ ఆ లోడ్‌ను తట్టుకోలేకపోతోంది. కరెంట్ పోయినప్పుడల్లా ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా కట్ అయిపోతున్నాయి. ఒక సమస్యపై ఇంకో సమస్య వచ్చి పడుతోంది” అని ఆయన చెప్పారు. తరచూ పవర్ కట్లు అవ్వడం, మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలా కుటుంబాలు కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి.
“కాంగ్పోక్పి జిల్లాపై ఉన్న ఆర్థిక దిగ్బంధనం వల్ల ఒక్కో సిలిండర్ రూ. 5,000 నుండి కొన్నిసార్లు రూ. 6,000 వరకు పలుకుతోంది” అని గౌపు తెలిపారు.
ఆయన సమాచారం ప్రకారం, మే 13 నుండి వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.
“మే 13 నుండి సైకుల్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరా లేదు. నిత్యావసర సరకుల స్టాక్ కూడా పూర్తిగా అయిపోయింది. గ్యాస్ సిలిండర్లు లేవు, రేషన్ సరుకులు రావడం లేదు, పెట్రోల్, డీజిల్ కూడా దొరకడం లేదు. మా ముస్లిం, నేపాలీ స్నేహితుల సహాయంతో కొన్ని నిత్యావసర సరకులను తెప్పించుకో గలుగుతున్నాము, కానీ అవి చాలా ఎక్కువ ధరలకు వస్తున్నాయి. ఉదాహరణకు, లీటర్ పెట్రోల్ రూ. 250, గ్యాస్ సిలిండర్ రూ. 5,000, 50 కిలోల బియ్యం బస్తా రూ. 3,000 అవుతోంది” అని వివరించారు.

ఈ సంక్షోభం సాలె గూడులా కాంగ్పోక్పి జిల్లా మొత్తాన్ని చుట్టేసింది. అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాంగ్పోక్పి నగర ప్రాంతంలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడుపుతున్న రాహుల్ (పేరు మార్చబడింది) అనే మణిపూరేతర వ్యక్తి మాట్లాడుతూ, మే 2023 లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జాతి హింస ప్రారంభ మైనప్పటి నుండి తాను ఇలాంటి ఘోరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు.
“2023 నుండి హింస జరుగుతూనే ఉంది, కానీ ఆహార సరఫరాను ఇలా పూర్తిగా నిలిపివేయడం నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది?” అని ఆయన ప్రశ్నించారు.
ఆంక్షలతో కూడిన రాకపోకలు-లెక్కలేనన్ని ‘చెక్ పాయింట్లు’:
రాహుల్ బఫర్ జోన్ (రెండు వర్గాల మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం) దాటగలిగినప్పటికీ, ఆ స్వేచ్ఛపై చాలా ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. “నేను ఇంఫాల్ లేదా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి నా కుటుంబం కోసం ఆహారం కొనుక్కో గలను. కానీ నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారంతో బఫర్ జోన్ దాటడానికి అనుమతిస్తారు. రెండు సార్లు వెళ్తే, బఫర్ జోన్ వద్ద ఉన్న నాగాలు నన్ను ప్రశ్నించడమే కాకుండా సరుకులు మొత్తాన్ని లాగేసుకుంటారు. అంతేకాదు, నన్ను కొడతారేమోననే భయం కూడా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చి 2025 లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ అంతటా “స్వేచ్ఛా రాకపోకలను” పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇది జరగాల్సి ఉన్నప్పటికీ, సాధారణ స్థితిని తీసుకురావడానికి ఇది ఒక అడుగు అని ఆయన అభివర్ణించారు. కానీ కాంగ్పోక్పిలో మాత్రం, ఈ స్వేచ్ఛా రాకపోకలు నిత్యావసర సరకుల ఉచిత రవాణాగా మారలేదని స్థానికులు చెబుతున్నారు.
“నేను ఇద్దరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. నా కుటుంబం, సోదరీమణులను చూసుకోవాలి. ఇప్పటివరకు ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాను. కానీ ఇది ఇంకెంత కాలం సాగుతుంది?” అని రాహుల్ అన్నారు.
రాహుల్ లాగే, కాంగ్పోక్పిలో కేఫ్ నడుపుతున్న సుమీ (పేరు మార్చబడింది) పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. నిత్యావసర సరకుల కొరత కారణంగా ఆమె తన వ్యాపారాన్ని మూసివేయ వలసి వచ్చింది.
“పరిస్థితి ఎలా ఉందంటే, మా దగ్గర చికెన్ ఉంది. కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి బియ్యం లేవు. మేము సగం ఉడికిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించలేము కదా” అని ఆమె అంది.
ప్రతి వస్తువుకూ ఇంత భారీ ధర ఎందుకు?
ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 5,000 నుండి రూ. 6,000 వరకు ఎందుకుంది? పెట్రోల్ లీటరు రూ. 250 కి ఎందుకు అమ్ముడవుతోందో అర్థం చేసుకోవడానికి ‘ది వైర్’ స్థానికులతో మాట్లాడింది.

మణిపూర్ కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాల మధ్య కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే స్వేచ్ఛగా ప్రయాణించ గలగడమే దీనికి కారణమని చాలామంది చెప్పారు. వీరిలో మైతేయి పాంగల్ (ముస్లింలు), నేపాలీలు మరియు ఉత్తర భారతదేశం నుండి వచ్చి అక్కడ నివసిస్తున్న కొందరు మణిపూరేతర ప్రజలు (మెయిన్ ల్యాండర్స్) ఉన్నారు. ఈ కొద్దిపాటి వర్గాల ప్రజలు ఇప్పుడు అనివార్యంగా మధ్యవర్తులుగా మారారు. వీరు ఇంఫాల్ నుండి సరుకులను కొనుగోలు చేసి, ఈ ఘర్షణల తర్వాత ఏర్పడిన అనేక చెక్ పాయింట్లు, దిగ్బంధనాల గుండా వాటిని రవాణా చేస్తారు. కొండలపై ఉన్న కాంగ్పోక్పికి చేరుకోవడానికి మార్గమధ్యంలో చాలా చోట్ల “అనధికారిక రుసుములు” (మామూళ్లు) చెల్లించాల్సి వస్తోంది. రవాణాలో ప్రతి అడుగు, ప్రతి ‘చెక్ పాయింట్’ సరకుల ధరను పెంచుకుంటూ పోతున్నాయి. చివరకు ఆ కొండ ప్రాంత జిల్లాలోని వినియోగదారులే ఈ భారీ ధరను భరించాల్సి వస్తోంది. చాలా కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కొనడం భారం అయిపోయింది. రోజువారీ గృహ అవసరాల వస్తువులు కొనుగోలు చేయడం విలాసంగా మారింది. ఆహారం, ఇంధనం కొనడానికి తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు, మరికొందరు సరఫరా పునరుద్ధరించ బడకపోతే తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోతుందని భయపడుతున్నారు.
ఈ దిగ్బంధనం ఎప్పుడు ముగుస్తుంది?
మే 17 న అంతర్-జిల్లా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రకటించిన యునైటెడ్ నాగా కౌన్సిల్, ఇది ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

‘ది వైర్’ తో కౌన్సిల్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ, కుకీ గ్రూపులు అపహరించి, ఆ తర్వాత శవాలై అపహరణకు గురైన ఆరుగురు నాగా పౌరుల మృతదేహాలు లభ్యమైనంత మాత్రాన దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని చెప్పారు. “మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు దిగ్బంధనం కొనసాగుతుంది” అని ఆ నాయకుడు స్పష్టం చేశారు.
ఆహారం, ఇంధనం, మందుల కొరతతో అల్లాడుతున్న కాంగ్పోక్పి ప్రజలపై ఈ దిగ్బంధనం చూపుతున్న మానవతా ప్రభావాన్ని గూర్చి ప్రశ్నించినప్పుడు, కౌన్సిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.
“ఇక్కడ కేవలం కుకీలు మాత్రమే బాధపడటం లేదు. అక్కడ నివసిస్తున్న మిగిలిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు” అని చెబుతూ, ఈ దిగ్బంధనం కుకీ జనాభాతో పాటు ఇతరులను కూడా ప్రభావితం చేసిందని సదరు నాయకుడు వాదించారు.
ఇదెలా వుండగా, ఆరుగురు నాగా పౌరుల హత్య అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ ఘటనపై బ్రీఫింగ్ ఇచ్చినట్లు భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు ‘ది వైర్’ కు తెలిపాయి. ఆ వర్గాల సమాచారం ప్రకారం… ‘సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్’ ఒప్పందం కింద పనిచేస్తున్న కుకీ ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఒప్పందం ప్రకారం సాయుధ గ్రూపులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కుదుర్చుకునే సెటిల్మెంట్లో భాగంగా తమ ఆయుధాలను వదిలివేయవలసి ఉంటుంది.
చర్చలలో ఎలాంటి పురోగతి లేకపోవడం, దిగ్బంధనం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో, ఈ తెగల మధ్య ఘర్షణలు మరియు రాజకీయ ప్రతిష్ఠంభనకు కాంగ్పోక్పి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
