ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (నాటో) 36వ శిఖరాగ్ర సమ్మేళనం ఇటీవల టర్కీ రాజధాని అంకారాలో ముగిసింది. 2004 ఇస్తాంబుల్ సమావేశం తర్వాత 22 ఏళ్లకు టర్కీ మరోసారి ఈ భారీ భద్రతా వేదికకు ఆతిథ్యమిచ్చింది.
32 మంది సభ్య దేశాల నాయకులు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, ఇండో-పసిఫిక్ భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా నేతలు పాల్గొన్న ఈ సమావేశం ప్రస్తుత ప్రపంచ అస్థిరత నేపథ్యంలో కీలకమైంది.
ఈ సమావేశం నుంచి వెలువడిన ఆర్థిక, సైనిక నిర్ణయాలు మాత్రం చెప్పుకోదగినవి. ముఖ్యంగా రానున్న రోజులలో సైనిక బడ్జెట్ భారీగా పెంచుకోవడానికి ఈ ఒప్పందాలు దారితీస్తాయి.
ముఖ్యమైన అంశాలు..
గత ఏడాది హేగ్ సమావేశంలో 2035 నాటికి జీడీపీలో 5% రక్షణ వ్యయంగా నిర్ణయించగా, ప్రస్తుతం సగటు 4%కు చేరుకుంది.
ఇప్పుడు ఈ లక్ష్యాన్ని మరింత పటిష్టం చేసుకుని, 2035 నాటికి తప్పనిసరిగా 5% సాధించాలని తీర్మానించారు.
రష్యాను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు కనీసం 70 బిలియన్ యూరోల(సుమారు రూ 6.4 లక్షల కోట్లు) సైనిక సహాయం అందించాలని నిర్ణయించారు.
50 బిలియన్ డాలర్ల కొత్త రక్షణ ఒప్పందాలు, 40 బిలియన్ డాలర్ల ‘నాటో డ్రోన్స్’ కార్యక్రమం, 27 బిలియన్ యూరోల ఇంధన లాజిస్టిక్స్ ఆధునీకరణ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
మొత్తంగా 72 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందాలు కుదిరాయి. ఇది నాటో చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటి.
టర్కీ ఆతిథ్యం..
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ సమావేశాన్ని టర్కీ సైనిక, దౌత్య సత్తాను ప్రదర్శించేందుకు వినియోగించుకున్నారు.
నాటోలో టర్కీదే రెండవ అతిపెద్ద భూ సైన్యం అని, ఆగస్టు 2026 నుంచి ఎస్టోనియాలో ఎఫ్-16 విమానాలను మోహరిస్తామని ప్రకటించారు.
దేశీయ ఆయుధ పరిశ్రమను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, యుద్ధ విమానాలు, ట్యాంకులు, యుద్ధ నౌకలు, వైమానిక రక్షణ వ్యవస్థలను సొంతంగా తయారు చేసే దేశాల్లో టర్కీ ఒకటని, మానవ రహిత డ్రోన్ల(యూఏవీ) రూపకల్పనలో ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని గర్వంగా ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో, ఎఫ్-35 యుద్ధ విమానాల కార్యక్రమానికి తిరిగి రావడం, దేశీయ కాన్ యుద్ధ విమానం కోసం ఎఫ్110 ఇంజిన్ల సరఫరా లాంటి కీలక అంశాలపై పురోగతి సాధించారు.
ఫలితాలు – విభేదాలు..
ఈ సమావేశంలో సైనిక బడ్జెట్ పెంపుదలకు ఒప్పందాలు కుదిరాయి. కానీ నాటోలో నెలకొని ఉన్న అంతర్గత చీలికలను కప్పిపుచ్చలేకపోయింది.
ఐరోపా దేశాలు రక్షణ వ్యయాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేయగా, ఐరోపా నాయకులు ఇప్పటికే 4% సాధించామని, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇది సాధ్యం కాదనే వైఖరి తీసుకున్నారు.
టర్కీకి నాటోలో పూర్తి స్థాయి భాగస్వామ్యం లేదని, నాటో కార్యకలాపాల్లో తమను పక్కన పెడుతున్నారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రత్యేకించి, టర్కీపై ఉన్న ఆయుధ ఆంక్షలను తొలగించాలన్న డిమాండ్‌కు స్పష్టమైన హామీలు రాలేదు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విధానం, మధ్యప్రాచ్యంలో స్థిరత్వం కోసం చేయాల్సిన చర్యలపై సభ్య దేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం రాలేదు.
విజయమా, వైఫల్యమా?..
ఈ సమావేశాన్ని ‘పూర్తి విజయం’ లేదా ‘పూర్తి వైఫల్యం’ అని నిర్ధారించలేము. ఇది ‘మిశ్రమ ఫలితం’.
టర్కీ దృష్టికోణంలో ఇది స్పష్టమైన విజయం. ఎందుకంటే, 22 ఏళ్ల తర్వాత తమ నేలపై జరిగిన ఈ కూటమికి ఆతిథ్యమిచ్చి, తమ సైనిక ఆధునికత, పెరుగుతున్న ఆయుధ ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు. అమెరికాతో దీర్ఘకాలంగా నిలిచిపోయిన ఎఫ్-35 చర్చను కదిలించడం పెద్ద పురోగతి సాధించారు.
మొత్తం నాటో సంకీర్ణం దృష్టికోణంలో ఇది ‘పాక్షిక విజయం’ మాత్రమే. వందల కోట్ల డాలర్ల ఒప్పందాలు, ఆర్థిక నిబద్ధతలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, సమిష్టి ఐక్యత అనే అతిపెద్ద ప్రమాణంలో ఈ కూటమి విఫలమైంది.
సభ్య దేశాల మధ్య పరస్పర అవిశ్వాసం, స్వార్థపరమైన జాతీయ ఆసక్తులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
భవిష్యత్తుకు ఓ హెచ్చరిక..
అంకారా నాటో శిఖరాగ్రం సైనిక, ఆర్థిక రంగాల్లో ఘనత సాధించినా, రాజకీయ దౌత్యంలో మాత్రం పూర్తి స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది.
నాటో ఇప్పుడు ఒకే బలమైన కూటమి కంటే, వేర్వేరు ఆసక్తులు, డిమాండ్లు, అనుమానాలు కలిగిన దేశాల సమూహంగా మారుతోందనే ఆందోళన ఈ సమావేశం మరింత హైలైట్ చేసింది.
టర్కీ విషయానికొస్తే, అది తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రాముఖ్యతను నిరూపించుకున్నప్పటికీ, తనకు ఆంక్షలు విధించబడటం, పూర్తి గౌరవం దక్కకపోవడం రాబోయే రోజుల్లో కూటమిలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.
‘ఐక్యమైన బలం’ అనే నాటో ఆదర్శ నినాదం ఆచరణలో నిలబడాలంటే ఈ అంతర్గత విభేదాలను అధిగమించడమే ఆ కూటమికి ఇకపై మిగిలిన ముఖ్యమైన పరీక్ష.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ పంథా అనుసరిస్తున్న దేశాలన్నీ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని రైట్ వింగ్ శక్తులు విజృంభిస్తున్నాయి. ఫ్రాన్స్, యూకే తదితర దేశాలలో ఈ పరిణామాలను మనం చూస్తున్నాం.
కెనడా అమెరికా దేశంలోని 51వ రాష్ట్రమని ట్రంప్ మాట్లాడిన మాటలు కెనడాలో అమెరికా పట్ల వ్యతిరేకతను పెంచాయి. దీంతో కెనడా ప్రధాని యూరప్ దేశాలను అమెరికా నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అలాగే జర్మనీ నాయకత్వంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. యూరప్ స్వతంత్రంగా వ్యవహరించాలనే దానిపై గతంలో వ్యతిరేకంగా ఉన్న జర్మనీ నేడు సానుకూలంగా మారుతున్నది.
గ్రీన్లాండ్ కూడా అమెరికాదే అని ట్రంప్ తీసుకున్న వైఖరి డెన్మార్క్‌కు అమెరికాకు మధ్య విభేదాలకు కారణమైంది.
అదే సందర్భంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో కూడా నాటో దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి.
ముఖ్యంగా యూకే, ఫ్రాన్స్, ఇటలీ దేశాధినేతల పట్ల ట్రంప్ అహంకారపూరితంగా వ్యవహరించడం ఆ దేశాధినేతలకు మింగుడు పడటం లేదు.
ఈ పరిస్థితులలో రానున్న రోజులలో నాటో దేశాల మధ్య సంపూర్ణ ఐక్యత ఎండమావిలో నీరు లాంటిదే అని చెప్పుకోవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
