రసవాదంపై విధించిన ఆంక్షల ప్రభావంతోనే జోసిమస్తో పాటు ఇతర రసవాదులు తమ రచనల్లో సంకేత భాష, గూఢ చిహ్నాలు, ప్రతీకాత్మక రూపాలను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించినట్లు భావిస్తారు.
తమ జ్ఞానాన్ని అందరికీ నేరుగా వెల్లడించకుండా దర్శనాలు, కలలు, రూపకాల రూపంలో వ్యక్తీకరించడం ద్వారా వారు తమ భావాలను దాచిపెట్టేవారు.
దీని వల్ల వారి గ్రంథాలు నేటి వరకు నిలిచి ఉన్నప్పటికీ వాటి అసలు అర్థాన్ని పూర్తిగా గ్రహించడం చాలా సందర్భాల్లో కష్టంగా మారింది.
అంతేకాక జోసిమస్ తన వృత్తికి సంబంధించిన రహస్యాలను ప్రత్యర్థి రసవాదుల నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ గూఢశైలిని అనుసరించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
కారణం ఏదైనా కావచ్చు కానీ కాలక్రమేణా రహస్య సంకేతాలు, ప్రతీకలు, గూఢ భాష రసవాద సంప్రదాయంలో విడదీయరాని లక్షణాలుగా మారాయి.
తరువాతి శతాబ్దాల్లో రచించబడిన అనేక రసవాద గ్రంథాలపై కూడా ఇదే సంప్రదాయం స్పష్టమైన ప్రభావాన్ని చూపింది.
క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో అరబ్బుల ఆధీనంలోకి ఈజిప్టు వెళ్లిన తరువాత ప్రాచీన ఈజిప్టు–గ్రీకు రసవాద సంప్రదాయంలో మరో పెద్ద మార్పు చోటుచేసుకుంది.
ఈ పరిణామాల ప్రభావంతో ఐరోపాలో రసవాదంపై ఉన్న పాండిత్య సంప్రదాయం క్రమంగా క్షీణించింది.
అయితే అరబ్ ప్రపంచం మాత్రం ఈ విద్యను విస్మరించకుండా స్వీకరించి దానిని మరింత అభివృద్ధి చేసింది.
‘ఆల్కెమీ’ అనే పదమే అరబిక్ భాష ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ పదంలోని అల్ అరబిక్ ఉపసర్గ కాగా కిమియా అనే పదానికి మూలం గ్రీకు భాషలోని లోహాలను కరిగించి పోతపోయే ప్రక్రియను సూచించే పదమని భాషావేత్తలు వివరిస్తారు.
ఈ పద ప్రయాణం రసవాద జ్ఞానం ఒక నాగరికత నుంచి మరొక నాగరికతకు ఎలా సంక్రమించిందో సూచిస్తుంది.
తదుపరి శతాబ్దాల్లో జాబిర్ ఇబ్న్ హయ్యాన్(గెబర్), అబూ బకర్ అల్-రాజీ లాంటి అరబ్ పండితులు రసవాదంపై ప్రభావవంతమైన గ్రంథాలను రచించారు.
ఈ రచనలు తరువాత లాటిన్ భాషలోకి అనువదించబడటంతో రసవాద సంప్రదాయం మళ్లీ ఐరోపాకు చేరి అక్కడి మేధో ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
రసవాదం (ఆల్కెమీ) మళ్లీ ఐరోపాకు చేరిక..
మధ్యయుగ ఐరోపాలో రసవాదం (ఆల్కెమీ) పునరుజ్జీవనానికి క్రీస్తు శకం 1144 సంవత్సరం ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించబడుతుంది.
ఆ సంవత్సరంలో రాబర్ట్ ఆఫ్ చెస్టర్ అరబిక్ భాషలో లభ్యమైన ఖాలిద్ ఇబ్న్ యజీద్ రచన ‘లిబెర్ డే కంపోజిషియోనే ఆల్కెమియే’ను లాటిన్లోకి అనువదించాడు. ఈ అనువాదం ద్వారా అరబ్ ప్రపంచంలో సంరక్షించబడిన రసవాద జ్ఞానం ఐరోపా పండితులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ పరిణామం తరువాత రసవాదంపై అనేక అరబిక్ గ్రంథాలు వరుసగా లాటిన్లోకి అనువదించబడ్డాయి.
అల్బెర్టస్ మాగ్నస్, రోజర్ బేకన్ లాంటి ప్రముఖ మధ్యయుగ పండితులు ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేసి దాని వ్యాప్తికి తోడ్పడ్డారు.
ఫలితంగా రసవాదం ఐరోపా మేధో ప్రపంచంలో మళ్లీ ప్రాధాన్యం పొందింది.
క్రైస్తవ ప్రపంచం రసవాదాన్ని స్వీకరించడానికి ఒక ముఖ్యమైన తాత్విక కారణం కూడా ఉంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఆదాము పతనం తరువాత మానవుడు తన అసలు దైవ సాన్నిధ్యం నుంచి దూరమయ్యాడు. ఆత్మను శుద్ధి చేసుకుంటూ మళ్లీ దేవునితో ఏకమవడమే మానవ జీవిత లక్ష్యమని వారు నమ్మారు. ఈ భావన రసవాదం ప్రతిపాదించిన ఆధ్యాత్మిక శుద్ధీకరణ సిద్ధాంతంతో సారూప్యత కలిగి ఉండటంతో రసవాదానికి క్రైస్తవ మేధావులలో కూడా ఆమోదం లభించింది.
ఈ విధంగా రసవాదం కేవలం లోహాల రూపాంతర విద్యగా కాకుండా మానవ ఆత్మను పరిపూర్ణత వైపు నడిపించే ఆధ్యాత్మిక సాధనగా కూడా మధ్యయుగ ఐరోపాలో స్థిరపడింది.
సుమారు 15వ శతాబ్దం నుంచి రసవాదం (ఆల్కెమీ) ఐరోపాలోని గూఢవిద్యలు, రహస్య తాత్విక సంప్రదాయాలతో మరింతగా ముడిపడింది. ఈ కాలంలో రసవాదాన్ని కేవలం లోహాల రూపాంతర విద్యగా కాకుండా ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకునే ఒక ప్రత్యేక జ్ఞానవ్యవస్థగా కూడా భావించడం ప్రారంభమైంది.
ఈ దృక్పథానికి ప్రముఖ ప్రతినిధుల్లో హెయిన్రిచ్ కార్నేలియస్ అగ్రిప్పా ఒకరు. ఆయన అభిప్రాయం ప్రకారం రసవాదం అనేది ప్రకృతి మాయావిద్యకు చెందిన ఒక శాఖ. ఇది నక్షత్రాల ప్రభావంతో సంబంధం ఉన్న జ్యోతిష మాయావిద్యకూ, ప్రత్యేక మతపరమైన క్రతువులపై ఆధారపడే ఆచార మాయా విద్యకూ భిన్నమైనదని ఆయన వివరించాడు.
ఇక ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ మొదటి ఆస్థానంలోని ప్రముఖ పండితుడు జాన్ డీ రసవాదంపై విస్తృతమైన గ్రంథ సంపదను సేకరించాడు.
ఆయన దృష్టిలో రసవాదం పదార్థాల రూపాంతరానికే పరిమితమైన విద్య కాదు, దాని ద్వారా దేవదూతలతో సంభాషించే స్థాయికి కూడా మనిషి చేరుకోవచ్చని ఆయన విశ్వసించాడు.
ఈ విధమైన భావనలు రసవాదాన్ని శాస్త్రం, తత్వశాస్త్రం, మతం, గూఢవిద్య అను నాలుగు రంగాల సంగమంగా మరింత విస్తరించాయి.
రసవాదం (ఆల్కెమీ) చరిత్రలో నిజమైన అన్వేషకులతో పాటు మోసగాళ్లూ ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు.
ఈ విషయం కొత్తది కాదు. ప్రాచీన రసవాది జోసిమస్ కూడా తన కాలంలో రసవాదం పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తుల గురించి విమర్శిస్తూ రాశాడు. అంటే రసవాదం ఎంతగానో ఆకర్షించిన విద్య అయినప్పటికీ దాని చుట్టూ అనుమానాలు, మోసాలు కూడా సమాంతరంగా పెరిగాయి.
16వ శతాబ్దంలో జీవించిన ఎడ్వర్డ్ కెల్లీ అనే వ్యక్తి ఒక రహస్యమైన ఎర్రని పొడి సహాయంతో సాధారణ లోహాలను బంగారంగా మార్చగలనని ప్రకటించాడు.
అయితే తన వాదనను నిరూపించలేకపోవడంతో చివరికి అతడు కారాగార శిక్షను ఎదుర్కొన్నాడు.
అదే కాలంలో హొనౌర్ అనే మరో స్వయంఘోషిత రసవాది కూడా ఇనుమును బంగారంగా మారుస్తానని ప్రకటించాడు. కానీ తన వాదనను కార్యరూపంలో చూపలేకపోవడంతో అతనికి కూడా తీవ్ర శిక్ష విధించబడింది. ఈ సంఘటనలు రసవాదంపై ప్రజల్లో ఉన్న అపారమైన ఆసక్తిని మాత్రమే కాదు ఆ ఆసక్తిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడిన వారి పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తాయి.
ఈ కారణంగానే రసవాద చరిత్రను పరిశీలించే ఆధునిక చరిత్రకారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తారు.
రసవాదం అనేది ఒకవైపు లోహాల స్వభావాన్ని అర్థం చేసుకోవాలనే నిజమైన మేధో ప్రయత్నాలకు వేదిక కాగా మరోవైపు అసాధ్యమైన వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టిన మోసగాళ్లకు కూడా అవకాశమిచ్చిన రంగం.
ఇరవైవ శతాబ్దంలో స్విస్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కార్ల్ యుంగ్ రసవాదాన్ని (ఆల్కెమీ) పూర్తిగా కొత్త కోణంలో అధ్యయనం చేశాడు.
ఆయన దృష్టిలో రసవాదం కేవలం లోహాలను బంగారంగా మార్చే ప్రయత్నం కాదు అది మానవ అచేతన మనస్సులో జరిగే అంతర్ముఖ పరివర్తనకు ఒక ప్రతీక.
యుంగ్ అభిప్రాయం ప్రకారం రసవాద గ్రంథాల్లో కనిపించే లోహాల శుద్ధీకరణ, రూపాంతరం, పరిపూర్ణత లాంటి భావనలు నిజానికి మనిషి తన అంతరంగాన్ని అర్థం చేసుకుంటూ తనలోని విభిన్న పార్శ్వాలను సమన్వయం చేసుకుంటూ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించే మానసిక ప్రయాణాన్ని సూచిస్తాయి.
ఈ ఆలోచనల ఆధారంగా ఆయన మనోవిజ్ఞానంలో ఒక ప్రత్యేక దృక్పథాన్ని అభివృద్ధి చేశాడు. మనిషి తన అచేతనలో దాగి ఉన్న భయాలు, కోరికలు, సంఘర్షణలను గుర్తించి వాటిని చైతన్యంతో ఏకీకృతం చేసుకున్నప్పుడే నిజమైన పరిపక్వత, ఆత్మపరిణతి సాధ్యమవుతుందని ఆయన వివరించాడు.
అందువల్ల యుంగ్ దృష్టిలో రసవాదం ఒక పురాతన రహస్య విద్య మాత్రమే కాదు మానవుడు సంపూర్ణ వ్యక్తిత్వం వైపు చేసే అంతర్ముఖ యాత్రకు శక్తివంతమైన ప్రతీక కూడా.
సీసాన్ని నిజంగా బంగారంగా మార్చవచ్చా?
రసవాద గ్రంథాలు చాలావరకు గూఢ సంకేతాలతో నిండిపోయి ఉన్నప్పటికీ వాటిలో కొన్ని లోహాలు, ఇతర పదార్థాలను రూపాంతరం చేయడానికి సంబంధించిన చాలా నిర్దిష్టమైన విధానాలు, ప్రయోగాలు, ఆచారాలను కూడా వివరిస్తాయి.
అయితే వాటిలో పేర్కొన్న ప్రతి విధానం నిజంగా పనిచేస్తుందనే ఆధారాలు లేవు.
ఉదాహరణకు కొన్ని పాత గ్రంథాలు మగ జింక రక్తంతో గాజును మెత్తగా చేయవచ్చని పేర్కొంటాయి.
ఆధునిక ప్రయోగాల ద్వారా ఈ వాదన తప్పని సులభంగా నిరూపించవచ్చు. అయినప్పటికీ ఇలాంటి వైఫల్యాలు రసవాదులను తమ అన్వేషణ నుంచి వెనక్కి తగ్గించలేదు.
వారి దృష్టిలో ప్రకృతి అత్యంత సంక్లిష్టమైనది. ఒక ప్రయోగం విఫలమైతే వెంటనే ఆ విధానమే తప్పని వారు అనుకోరు.
బదులుగా సరైన సమయాన్ని ఎంచుకోలేదేమో, సరైన పదార్థాన్ని ఉపయోగించలేదేమో లేక ప్రయోగ పరిస్థితుల్లో ఏదో లోపం జరిగిందేమో అని భావించి మళ్లీ మళ్లీ ప్రయత్నించేవారు.
అందువల్ల రసవాదంలో ప్రయోగాలు నిరంతర ప్రక్రియగా కొనసాగాయి. అయితే అనేక మంది రసవాదులు ఒక విషయాన్ని స్వయంగా అంగీకరించారు.
ఎన్ని విధాలుగా లోహాలను శుద్ధి చేసినా, రూపాంతరం చేయడానికి ప్రయత్నించినా, చివరికి తమ వద్ద ఉన్న బంగారం పరిమాణం మొదట ఉన్నదానికంటే పెరగలేదని వారు గమనించారు.
ఈ అనుభవం రసవాదం ఎదుర్కొన్న ఆచరణాత్మక పరిమితులను కూడా స్పష్టంగా తెలియజేస్తుంది.
శతాబ్దాలుగా అనేక మంది రసవాదులు తాము సీసాన్ని బంగారంగా విజయవంతంగా మార్చగలిగామని ప్రకటించారు. అయితే ఈ వాదనల్లో చాలా వరకు చారిత్రకంగా నిర్ధారించబడిన ఆధారాలు లేవు.
అత్యంత ప్రసిద్ధ కథనాల్లో ఒకటి 14వ శతాబ్దానికి చెందిన లేఖకుడు నికోలస్ ఫ్లామెల్ గురించినది. ఆయన ఫిలాసఫర్స్ స్టోన్ (పరమ రసశిల)ను కనుగొని దాని సహాయంతో బంగారాన్ని సృష్టించాడని తరువాతి తరాల్లో ప్రచారం జరిగింది. కానీ ఈ కథలు ఆయన జీవించి ఉన్న కాలంలో కాకుండా ఆయన మరణించిన దాదాపు మూడు శతాబ్దాల తరువాత మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అందువల్ల వాటి చారిత్రక విశ్వసనీయతపై పరిశోధకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటివే మరెన్నో వాదనలు చరిత్రలో కనిపించినప్పటికీ రసవాద పద్ధతుల ద్వారా సీసాన్ని నిజంగా బంగారంగా మార్చినట్లు నిర్ధారించే స్పష్టమైన, శాస్త్రీయంగా ధ్రువీకరించబడిన ఆధారం ఇప్పటివరకు లభించలేదు. అందువల్ల ఈ కథనాలు చరిత్రలో ఆసక్తికరమైన సంప్రదాయాలుగా నిలిచినా నిరూపితమైన వాస్తవాలుగా మాత్రం పరిగణించబడవు.
అయితే ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఒక ఆశ్చర్యకరమైన మైలురాయిని నమోదు చేసింది.
ఇటీవలి కాలంలో సెర్న్ శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా రసవాదులు కలగన్న లక్ష్యాన్ని పూర్తిగా భిన్నమైన శాస్త్రీయ పద్ధతిలో సాధించారు.
దీనికోసం వారు లార్జ్ హాడ్రాన్ కొలైడర్ అనే అత్యంత శక్తివంతమైన కణత్వరణ (కణాలను అత్యంత వేగంగా ప్రసరింప చేసే యంత్రం) యంత్రాన్ని ఉపయోగించారు. ఇందులో సీసపు పరమాణు కేంద్రకాలను కాంతి వేగానికి అత్యంత సమీపమైన వేగంతో ప్రయాణించేలా చేసి వాటి మధ్య అత్యంత శక్తివంతమైన పరస్పర సంఘర్షణను సృష్టించారు.
ఈ ప్రక్రియలో సీసపు కేంద్రకాల నుంచి కొన్ని ప్రోటాన్లు తొలగిపోవడంతో అవి క్షణకాలం పాటు బంగారం పరమాణువులుగా మారాయి.
అయితే ఇది రసవాదులు ఊహించిన విధంగా సాధారణ లోహాన్ని విలువైన బంగారంగా తయారు చేసే ప్రక్రియ కాదు. ఈ ప్రయోగంలో ఏర్పడిన బంగారం పరిమాణం అత్యంత సూక్ష్మమైనది. అది కేవలం పరమాణు స్థాయిలో క్షణిక కాలం మాత్రమే ఉండేంత చిన్న పరిమాణం. అందువల్ల దీనికి వాణిజ్యపరంగా బంగారం తయారు చేసే ఉపయోగం లేదు. అయినప్పటికీ శతాబ్దాలుగా మనుషులు కలగన్న ఒక ఆలోచనను ఆధునిక అణు భౌతికశాస్త్రం సూత్రాల ద్వారా ప్రయోగాత్మకంగా సాధించడం శాస్త్ర చరిత్రలో ఒక విశేషమైన ఘట్టంగా నిలిచింది.
అనువాదం: మనోహర రాజు
మూడు భాగాలుగా ప్రచురితమైన ఈ వ్యాసంలో ఇది చివరి భాగం మొదటి భాగం, రెండవ భాగం కోసం వీటి మీద క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
