ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య(WFTU) అనుబంధ ‘యూఎస్బీ'(ఇటలీ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె సందర్భంగా ఇటలీలోని అన్ని నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి.
ఇటలీలో పాఠశాలలకు మరింత నిధులు కేటాయించాలని, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. శుక్రవారం జరిగిన ఈ దేశవ్యాప్త నిరసనకు ముందు వారాల తరబడి ఆందోళనలు జరిగాయి.
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో జరిగిన ఇలాంటి ఉద్యమాల స్ఫూర్తితో విద్యార్థులు టెంట్ క్యాంపులు వేసి, పాఠశాలలను ఆక్రమించుకుని తమ డిమాండ్లను వినిపిస్తూ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించారు.
సార్వత్రిక సమ్మెకు కార్మికుల మద్దతు
ఇటలీకి చెందిన ‘యూఎస్బీ’ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెకు శుక్రవారం జరిగిన నిరసనల్లో వేలాది మంది కార్మికులు తరలివచ్చారు. వీరిలో లారీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, రైతులు కూడా ఉన్నారు.
పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా, రక్షణ రంగానికి కేటాయింపులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వీరు గత కొన్ని వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు.
బోలోగ్నా, జెనోవా, నేపుల్స్, టూరిన్ సహా దేశంలోని అనేక నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. టూరిన్‌లో నిరసనకారులకు, అల్లర్లను అణచివేసే పోలీసులకు మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అద్దె భారం భరించలేం: విద్యార్థులు
రోమ్‌లో యూనివర్సిటీ విద్యార్థిని బీట్రిస్ చిలెల్లి ‘ఏఎఫ్‌పీ’తో మాట్లాడుతూ.. విద్యార్థులు సహించే పరిమితి దాటిపోయిందని చెప్పారు.
“అధికంగా ఉన్న కాలేజీ ఫీజులను, ఇళ్ల అద్దెలను భరించే స్థితిలో వారు లేరు. ఇది తల్లిదండ్రులపై పెనుభారాన్ని మోపుతోంది” అని 21 ఏళ్ల ఆ విద్యార్థిని పేర్కొన్నారు.
రోమ్‌లో విద్యార్థుల వసతి గృహం కోసం ఒక గదికి నెలకు 1,200 యూరోల వరకు ఖర్చు అవుతోందని ఆమె తెలిపారు.
ప్రదర్శనలోని ఒక గ్రూప్ “మాకు బాంబులు వద్దు, ఇళ్లు కావాలి” అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో మరో నిరసనకారుల బృందం, గాజాపై బాంబు దాడిలో గాయపడిన ప్రజలను అనుకరిస్తూ ఒక చిన్న ప్రదర్శన ఇచ్చింది.
మిలన్ నగరంలో కూడా నిరసన సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమై, ఆ తర్వాత నగర కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతానికి చేరుకుంది.
అల్లర్లను అణచివేసే దుస్తుల్లో ఉన్న పోలీసులు శుక్రవారం ఆ వీధులను దిగ్బంధించారు, అయితే మధ్యాహ్నం వరకు ఎలాంటి పెద్ద ఘర్షణలు జరిగినట్లు సమాచారం లేదు.
విద్యార్థులతో పాటు, శుక్రవారం జరిగిన ఈ నిరసనలో ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ప్రధాన నగరాల్లోని జనసమూహాల్లో పెద్ద ఎత్తున పాలస్తీనా జెండాలు కనిపించాయి.
‘ఫైనాన్షియల్ టైమ్స్ యూరప్’ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
