భారతీయ రిపబ్లిక్కు, ఆశ్చర్యకరంగా, అపారమైన విషయాలను జీర్ణించుకునే శక్తి ఉంది. మీరు ఏ మంచి పుస్తకాల దుకాణానికైనా వెళితే అక్కడ హిట్లర్ రాసిన ‘మెయిన్ కాంఫ్’ కొనుగోలు చేయవచ్చు. దాని పక్కనే ‘ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్’ ఉంటుంది. ఇందులో పర్వేజ్ ముషారఫ్ భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన యుద్ధానికి సంబంధించి తన వాదనను చెప్పుకొచ్చారు.
మహాత్మా గాంధీ హత్యను తాను ఎందుకు చేసిందీ సమర్థించుకుంటూ గాడ్సే రాసిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’, కశ్మీర్ పాకిస్తాన్లో కలవాలని జీవితాంతం వాదించిన సయ్యద్ అలీ షా గీలానీ రాసిన ‘ప్రిజనర్ ఆఫ్ కాన్సైన్స్’ అక్కడ ఉన్నాయి.
హిందూ మహాసభ తొలి దశ నాయకుల్లో ఒకరైన, తర్వాతి కాలంలో శత్రువుల మహిళలపై లైంగిక హింస గురించి ప్రవచించిన సావర్కర్ రాసిన ‘హిందుత్వ: హూ ఈజ్ ఎ హిందూ?’ కూడా అక్కడే ఉంది.
ముస్లింలను, క్రైస్తవులను, కమ్యూనిస్టులను అంతర్గత శత్రువులుగా పేర్కొంటూ, సెక్యులరిజం అనే భావననే తీవ్రంగా వ్యతిరేకించే గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకం దొరుకుతుంది.
ఇక కల్పిత కథల విషయానికి వస్తే, ఈ ఆగస్టులో రేప్ కేసులో దోషిగా తేలి పదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న తరుణ్ తేజ్‌పాల్ రాసిన ‘ది వాలీ ఆఫ్ మాస్క్స్’ అందుబాటులో ఉంది.
మన దగ్గర జిన్నా, శోభరాజ్, సైకో శంకర్, దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. ప్రభాకరన్, భింద్రన్‌వాలే, యతి నర్సింగానంద్ ప్రసంగాలు ఒక్క క్లిక్ దూరంలో అందుబాటులో ఉన్నాయి.
మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే టెలివిజన్ ఛానెల్స్ కేవలం అందుబాటులో ఉండటమే కాకుండా, జోరుగా నడుస్తున్నాయి.
సినిమాలు కూడా వెనుకబడలేదు
సినిమాలు కూడా ఏమాత్రం వెనుకబడి లేవు. రేప్, హత్య కేసులో దోషి అయిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మానవాళి రక్షకుడిగా నటించిన ‘MSG: ది మెసెంజర్’, దాని సీక్వెల్స్ ఉన్నాయి.
‘షేక్స్పియర్ ఇన్ లవ్’, ‘పల్ప్ ఫిక్షన్’ చిత్రాలను లైంగిక నేరస్థుడు హార్వీ వైన్‌స్టీన్ నిర్మించారు. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా ఉపసంహరించుకోలేదు, అలా చేయాల్సిన అవసరమూ రాలేదు.
వీటన్నింటినీ చదవవచ్చు, కొనుగోలు చేయవచ్చు, వీక్షించవచ్చు, విమర్శించవచ్చు, అధ్యయనం చేయవచ్చు.
సృష్టికర్తలు చేసిన నేరాలు వారి సృష్టిని నేరపూరితం చేయవు. అభ్యంతరకరమైన ఆలోచనలను పరిశీలించి, వాటిని తిరస్కరించే పరిపక్వత తన పౌరులకు ఉందని నమ్మే గణతంత్ర దేశంలో అలా ఉండటమే సరైనది.
ముఖ్యంగా ఒక గ్రంథాలయంలో, దాని పాఠకులు విభేదించే పుస్తకాలు కూడా ఉండాలి. లేదంటే అది కేవలం ఆమోదించబడిన అభిప్రాయాల గది మాత్రమే అవుతుంది, దాన్ని మరో మాటలో చెప్పాలంటే ‘ప్రచార సాధనం’ అనవచ్చు.
డాక్టర్ ఉమర్ ఖాలిద్ పుస్తకం
ఇక మరోవైపు జేఎన్‌యూలో సమర్పించిన తన పీహెచ్డీ థీసిస్ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్: ఆదివాసీ హిస్టరీస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ పవర్’ అనే పుస్తకం ఉంది. దీని రచయిత డాక్టర్ ఉమర్ ఖాలిద్. ఇతను చరిత్రకారుడు, పండితుడు, కార్యకర్త, ఎటువంటి విచారణ లేదా దోషిగా తేలకుండా ఆరేళ్లకు పైగా జైల్లో మగ్గుతున్న వ్యక్తి.
జైలు పాలయ్యే ముందే ఆయన జేఎన్‌యూలో తన డాక్టరల్ థీసిస్‌ను సమర్పించారు. ఈ పుస్తకం బ్రిటిష్ పాలనలో సింగ్భమ్ ప్రాంతంలోని ఆదివాసీ సమాజాలను విశ్లేషించింది.
ఈ పుస్తకాన్ని జుగర్‌నాట్ అనే వాణిజ్య ప్రచురణా సంస్థ ముద్రించింది. రామచంద్ర గుహా దీనికి ముందుమాట రాశారు.
క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ఒక చరిత్ర పుస్తకం. పరిశోధించినది, రిఫరెన్సులు కలిగినది, విశ్లేషించినది.
ఐఐఎస్ఈఆర్ పూణేలో కలకలం
ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడ కలకలం సృష్టించిందో ఆలోచించండి. 2006లో శాస్త్రీయ పరిశోధనలను విద్యతో అనుసంధానించడానికి ఐఐఎస్ఈఆర్ పూణే స్థాపించబడింది.
2012లో పార్లమెంటు దీన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. జిజ్ఞాసను, సంశయవాదాన్ని, ఇతరులు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడమే దీని లక్షిత ఉద్దేశం.
సైన్స్ అనేది చరిత్ర, సమాజం నుంచి వేరుగా ఉండదనే ప్రాతిపదికన ఇది హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాన్ని కూడా కలిగి ఉంది.
ఈ సంస్థ లైబ్రరీ ఇటీవల ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసింది. ఎవరో దీన్ని సిఫార్సు చేశారు, ఎవరో ఆమోదించారు, ఎవరో కేటలాగ్ చేశారు.
2014 ముందునాటి భారతదేశంలో అయితే మనం దీన్ని ‘తన ఉద్యోగం తాను సరిగ్గా చేస్తున్న లైబ్రేరియన్’ అని పిలిచేవాళ్లం. కానీ ఇది న్యూ ఇండియా. విషయం బయటకు పొక్కింది, ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
“అర్థం చేసుకోవడంలో పొరపాట్లు లేదా అశాంతిని” నివారించడానికనే పేరిట ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకున్నారు.
పంతొమ్మిదో శతాబ్దపు ఆదివాసీ చరిత్రపై ఒక విద్యార్థి పుస్తకాన్ని చదవడం కంటే ఏదీ పరిశోధనా సంస్థకు అంత పెద్ద ముప్పును కలిగించదు.
శాస్త్రీయ దృక్పథం.. రాజ్యాంగ విధి
డిసెంబర్ 2025 నుంచి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాడభూషి మదన్‌గోపాల్ ఈ పుస్తక కొనుగోలును “అల్లరిచిల్లరి పని”గా అభివర్ణించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు(ఎక్కడో ఒకచోట ఒక లైబ్రేరియన్ కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాడు).
అంతేకాకుండా నోట్స్ చెక్ చేసుకోకుండా, ఒక చరిత్ర పుస్తకం కొనుగోలు చేయడాన్ని “మళ్లీ జరగకుండా” చూస్తామని హామీ ఇచ్చారు.
రసాయన శాస్త్రవేత్త, ఐఎన్ఎస్ఏ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సునీల్ ఎస్ భగవత్ “వెంటనే చర్యలు తీసుకున్నారు”. వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ నుంచి విజ్ఞానాన్ని తొలగించడాన్ని పర్యవేక్షిస్తున్న ఒక విశిష్ట శాస్త్రవేత్త.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(హెచ్) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని, విచారణా దృక్పథాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. ఆ ఉద్దేశంతోనే నిర్మించిన ఒక సంస్థ తన బాధ్యతను ఎంత కారుచౌకగా వదులుకుందో చూడండి.
రాజ్యంలో సహనం – అసహనం
కాబట్టి మన ఆదర్శ రాజ్యం దేనిని భరించగలదు, దేనిని భరించలేదు అనే దానిపై ఒకసారి బేరీజు వేసుకుందాం. ఇది హిట్లర్, గాడ్సే, ముషారఫ్, గీలానీ, సావర్కర్, గోల్వాల్కర్లను భరించగలదు. గ్యాంగ్స్టర్ల జీవిత చరిత్రలు, అత్యాచార నేరస్థుల సినిమాలు, ప్రతిరోజూ ప్రసారమయ్యే మతపరమైన ప్రచారాలను భరించగలదు.
ఒకప్పుడు హత్య కేసులో అరెస్టై, తన సొంత రాష్ట్రం నుంచే బహిష్కరించబడిన ఒక వ్యక్తి ఎదిగి కేంద్ర హోంమంత్రి కావడాన్ని కూడా ఇది భరించగలదు. చౌకీదార్ యే చోర్‌గా మారినా భరించవచ్చు.
నేరం రుజువు కాని, ఏ శిక్షా పడని ఒక భారతీయ స్కాలర్ వలస కాలం నాటి సింగ్భమ్ చరిత్రపై రాసిన ఫుట్నోట్లతో కూడిన చారిత్రక గ్రంథాన్ని మాత్రం అది భరించలేదు, సహించలేదు.
రచయిత ఎవరో ఆలోచించండి – ఒక డాక్టరేట్, అపారమైన పరిశోధనా శక్తి కలిగినవాడు, రాజ్యాంగ స్వేచ్ఛను పరిరక్షించినవాడు, తనను తాను నాస్తికుడిగా, కమ్యూనిస్ట్‌గా అభివర్ణించుకునే తత్వం కల ఒక విద్యార్థి, సహచరుడు, స్నేహితుడు, కుమారుడు. వీటన్నింటిలోనూ ప్రాధాన్యం సంతరించుకున్న ఏకైక అంశం ఏమిటో తెలుసా? ఆయన తల్లిదండ్రులు ఏ మతంలో జన్మించారనేది మాత్రమే. ఆయన చేసిన పరిశోధన అప్రస్తుతం. ఆయన నమ్మకాలు అప్రస్తుతం. ఆ పుస్తకంలో అభ్యంతరకరమైనది ఏదైనా ఉందా లేదా అనేది విచారించామా లేదా అనేది కూడా అప్రస్తుతం.
అతని పేరు ఉమర్ ఖాలిద్. న్యూ ఇండియాలో, ఒక పుస్తకానికి ఇంతకంటే మించిన రివ్యూ మరొకటి అవసరం లేదు.
ఒక పుస్తకం అట్టమీద ముస్లిం పేరు ఉండటం మినహా, ఈ ఆదర్శ రాజ్యం దాదాపు దేనినైనా తట్టుకుని నిలబడగలదు అనిపిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
