హిందూ దేశం అన్నది ఈ దేశంలో విస్తరించిన విభిన్న మతాలు, వాటి శాఖలు, విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనం. కానీ హిందుత్వవాదులు హిందూ దేశాన్ని ఒకేఒక జాతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తమది ఒక అఖండ మతమని ప్రకటించుకుంటూ ఉన్నారు. ఇతర జాతులకంటే, ఇతర మతాలకంటే తమ జాతే గొప్పదని, తమ మతమే ఉత్కృష్టమైందని భావిస్తున్నారు.
భిన్నత్వాన్ని తిరస్కరించే ఈ విచిత్రమైన ధోరణే ఒక అయోమయపు హిందూ అస్తిత్వవాదాన్ని సృష్టించింది. అదే ఆవేశాలకు, అరాచకత్వాలకు దారితీస్తూ ఉంది. దానికి అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, వారికి వత్తాసు పలికే సనాతన ఛాందస మత సంస్థలూ ఉన్నందువల్ల నానాటికీ విషయం జటిలమవుతూ ఉంది.
చీకటి యుగంలోకి దేశం
ఈ హిందుత్వవాదులకు ఆవును పూజించడం ఒక ప్రధాన కార్యక్రమం. దాని మూత్రం, పేడ వీరికి పవిత్రం. ఇక అందరి దేవుళ్ల కన్నా తమ దేవుడు రాముడే గొప్ప మహిమగల వాడని నిర్ధారించడం, ఇతర మత గ్రంథాల కన్నా తమ రామాయణం సర్వోన్నతమైందని తేల్చి చెప్పడం హిందుత్వ సంస్థలు చేస్తున్న పని. వీటితో పాటు మనుస్మృతిని కూడా ఈ కాలంలో చలామణి చేయడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది.
ఇదంతా ఒక కృత్రిమ వికృత పరిస్థితి. దీనివల్ల దేశంలో సాంస్కృతిక, రాజకీయ వాతావరణం కలుషితమవుతూ ఉంది. వెరసి దేశం చీకటి యుగంలోకి నెట్టివేయబడుతూ ఉంది.
ఇలాంటి మూఢత్వం కేవలం హిందూ మతతత్వవాదుల్లో మాత్రమే లేదు. ఇతర మతాల్లో కూడా ఉంది. ఉదాహరణకు ముస్లిం, క్రైస్తవ మతతత్వవాదుల్ని చూద్దాం. కేవలం వారి దేవుణ్ణి నమ్మితేనే స్వర్గం లభిస్తుందని, లేకపోతే నరకానికి వెళ్లక తప్పదని ముస్లింలు, క్రైస్తవులు కలిపి మూడు వందల ఎనభై కోట్ల మంది గుడ్డిగా నమ్ముతున్నారు.
వాస్తవానికి రెండువేల సంవత్సరాల క్రితం ఈ రెండు మతాలు గాని, వారి దేవుళ్లు గానీ లేరు. మరి లక్షల సంవత్సరాల క్రితం పుట్టి పెరిగిన మనుషుల సంగతేమిటి? అప్పుడు కూడా ప్రపంచం ఉంది, జీవితం ఉంది. అంటే ఏ దేవుడి అవసరం లేకుండానే ప్రపంచముంది. మానవ జీవితమూ ఉందనేది అర్థం చేసుకోవాలి.
తమ రామాయణమే సర్వోన్నతమైందని ప్రగల్భాలు పలికేవారు రామాయణం ఆధారంగా పుష్పక విమానాలు ఎందుకు తయారు చేయడం లేదు?
రాఫెల్ యుద్ధ విమానాలు కొనడమెందుకు? అందులో మళ్లీ అవినీతి ఎందుకు? వెరసి, ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తూ వారి సొమ్ము మింగడమెందుకు? అందుకే మన తెలుగు కవి ఆరుద్ర తన ‘కూనలమ్మ పదాల్లో’ ఇలా అన్నారు.
“కసిని పెంచె మతము/ కనులు గప్పె మతము
కాదు మనకభిమతము/ ఓ కూనలమ్మా!”
ఓ రాజకీయ దేవుడు
ఈ దేశంలో రాముడు ఓ రాజకీయ దేవుడు. అయోధ్యలో రామమందిరం అంశంపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయాలు వేడెక్కుతుంటాయి.
వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఉత్తర భారతదేశంలో పదిహేడో శతాబ్దం చివరి వరకు, పద్దెనిమిదో శతాబ్దం ప్రారంభం వరకూ రాముడికి ప్రత్యేకంగా ఆలయం లేదని ప్రఖ్యాత భారత చరిత్రకారుడు డీఎన్ ఝా చెప్పారు.
ప్రతిసారీ రాముడు ఒక రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్న వేళ, ఈ చరిత్రకారుడి ప్రకటన ప్రకంపనలు సృష్టించింది.
హిందుత్వవాదులు చెప్పే విషయాలు పక్కనపెడితే, ఒక్క మధ్యప్రదేశ్లో తప్ప ఉత్తర భారతంలో పదిహేడు-పద్దెనిమిది శతాబ్దాలకు ముందు రామాలయాలుండేవని ఆధారాలు లేవు.
పరిశోధనలు చేసి నిగ్గు తేల్చిన చరిత్రకారుల మాట మనం విశ్వసించాలి. మధ్యప్రదేశ్లో మాత్రం వారి పరిశీలనలో పన్నెండో శతాబ్దపు రామాలయాలు ఒకటి రెండు బయటపడ్డాయి, అంతే.
అయోధ్యలో జైనమతం, బౌద్ధమతం వంటి ఇతర మతాలు ప్రముఖంగా ఉండేవని, 1528లో మీర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించే నాటికి అక్కడ రామాలయం లేదని ప్రొఫెసర్ డీఎన్ ఝా రాశారు. ఇలాంటివి దేశంలో చాలా ఉన్నాయి.
ఉదాహరణకు హైదరాబాదులో చార్మినార్ నిర్మాణం జరిగినపుడు ప్రస్తుతం చుట్టూ ఉన్న హిందూ దేవాలయాలు లేవు. అవన్నీ తర్వాతి కాలంలో కట్టబడ్డాయి. ఆర్కియాలజీ వారి ఛాయాచిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది.
తిరోగమనానికి తిరుగులేని ఉదాహరణ
హిందూ మతతత్వవాదులు “భారతమాత” అనే పదం కూడా విరివిగా వాడుతుంటారు. వీళ్లు ఒక దేశాన్ని ఒక మాతగా ఎలా మార్చారో చూద్దాం. ఇటీవల ఒక ముఖ్యమంత్రి తెలుగు తల్లిని విడదీసి తమది తెలంగాణ తల్లి అని ప్రకటించుకున్నారు.
క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలో మొదటిసారి ఖారవేలుడి శాసనంలో “భరతవర్ష” అని ఒక ప్రస్తావన కనిపిస్తుంది. బహుశా అది ఉత్తర భారతదేశాన్ని ఉద్దేశించింది కావచ్చు.
అయితే అందులో మగధ లేదు. అలాగే మహాభారతంలో “భారత” పదం ఉత్తర దేశంలోని ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది కానీ, దక్షిణ భారతదేశం గురించి అందులో ఏమీ చెప్పలేదు. అవి రాసిన ఆనాటి రచయితలు వారికి తెలిసిన ప్రాంతాల గురించి మాత్రమే రాసి ఉంటారు.
“భరతవర్ష” అనే పదం ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది కానీ, అవి ఈ దేశపు ఆకారాన్ని సరిగా వర్ణించలేకపోయాయి.
కొన్ని పురాణాలు ఈ దేశాన్ని చంద్రుడితో పోల్చాయి. ఇది త్రిభుజాకారంలో ఉన్నట్లు కొన్నింటిలో ఉంది. మరికొన్నింటిలో ఇది నారి చాచిన విల్లు ఆకారంలో ఉందని ఉంది. చతుర్భుజాకారంలో ఉందని కొన్ని, అసమ చతుర్భుజాకారంలో ఉందని మరికొన్నింటిలో ఉంది. పురాణాలు సృజనాత్మక రచనలు గనక రచయితలు ఎవరి సృజనాత్మకత వారు చూపించారు.
అయితే వీటన్నింటిలో ఎవరూ ఇండియాను తల్లిగా చిత్రించలేదు. అలాంటి భావన తర్వాతి కాలంలో వచ్చింది.
మొదటిసారి భారతదేశాన్ని ఒక స్త్రీమూర్తిగా, తల్లిగా వర్ణించడం ద్విజేంద్రలాల్ రాయ్(1863-1913) రాసిన ఒక పాటలో కనిపిస్తుంది. ఆ తర్వాత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ (1882) నవలలో కనిపిస్తుంది.
హేమన్ గుప్త దర్శకత్వంలో ఆనందమఠ్-1952 హిందీ చలనచిత్రంగా వెలువడినప్పుడు పృథ్వీరాజ్ కపూర్, గీతాబాలి, ప్రదీప్ కుమార్, భరత్ భూషణ్ వంటి నాటి మేటి నటీనటులంతా అందులో పాత్రలు పోషించారు. హేమంత్ కుమార్ సంగీతం దేశాన్ని ఒక్క కుదుపు కుదిపింది.
ఒక భావనగా రచనల్లో వర్ణించడం అయ్యాక “భరతమాత” తొలిసారి మానవ రూపంలో అవనీంద్రనాథ్ ఠాగూర్ గీసిన వర్ణచిత్రం(1905)లో కనిపించింది.
“భరతమాత”ను ఆయన ఒక హిందూ వైష్ణవ సన్యాసిని రూపంలో చిత్రించారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు వారణాసిలో నిర్మించిన భరతమాత ఆలయంలో మొదటిసారి ఆమెను దేశపటం రూపం(1936)లో రూపొందించారు.
ఒక ఊహా భావనగా మొదలై వాస్తవంగా మారింది కానీ ఇప్పుడు మన వీర హిందూ మతతత్వవాదులు వాస్తవాన్ని ఊహగా మార్చాలనుకుంటున్నారన్నమాట. తిరోగమనానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ.
గోవు మాత ఎలా అయ్యింది?
గోవు ఒక సాధు జంతువు. దాన్ని మనవాళ్లు గోమాతగా ఎలా చేశారో చూద్దాం. మధ్యయుగంలో గోవు ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా ఆవిర్భవించింది.
శివాజీ సారథ్యంలో మరాఠా శక్తి బలపడటంతో అది మరింత భావోద్వేగభరితంగా మారింది. శివాజీ బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించడానికే దేవుడిగా అవతరించాడని కొందరు ఆయన్ని కీర్తించారు కూడా.
1870లలో సిక్కుల కుకా ఉద్యమం ఊపందుకున్నప్పుడు సామాన్య జనాన్ని రాజకీయంగా సమీకరించడానికి గో చిహ్నం బాగా ఉపయోగపడింది.
దయానంద సరస్వతి తొలి గోరక్షణ సమితిని ప్రారంభించింది కూడా దాదాపుగా ఆ కాలంలోనే కావడం, గోరక్షణ ఉద్యమం బాగా బలపడటం ఫలితంగా గోవు జంతువు స్థాయి నుంచి మాత స్థాయికి ఎదగడం జరిగింది.
గోవు మాత కావడంతో పాటు దేశం దేశమాత అయ్యింది. అంటే భారతదేశం భారతమాతగా మారింది. వేదకాలంలో తమని తాము బలంగా ఉంచుకోవడానికి గోమాంసం తిన్నవారు, తర్వాతి కాలంలో బౌద్ధమత ప్రభావంతో శాకాహారులయ్యారు. అంతవరకు ఫరవాలేదు కానీ ఈరోజు గోమాంస భక్షకుల మీద మళ్లీ వారే దాడులు చేయడం విడ్డూరం. వారు తింటే తినాలి, వారు మానేస్తే మానేయాలా? ఇదేం ఆధిపత్యం?
ప్రజల నిత్యావసరాలు చూడటం మాని రాముడిని, గోవుని, పురాణాల్ని తమ స్వార్థపూరిత కుళ్లు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న వారిని తెలుగు కవి జ్వాలాముఖి తీవ్రంగా దుయ్యబట్టారు.
“చచ్చిన రాజుల పుచ్చిన గాథల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవుల కోసి అడగాలనుంది/ మానవ పరిణామం నేర్పిందేమని?” మెదడు ఉన్నవారికి, ఆలోచించడం ప్రారంభించిన వారికి విషయం బోధపడుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
