కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు రూ 52,878 కోట్లకు(5.55 బిలియన్ డాలర్లు) షేరుకు రూ 81 చొప్పున విక్రయించిన ఐడీబీఐ బ్యాంక్ వివాదాస్పద ప్రైవేటీకరణలో నిబంధనలను ఎలా మార్చారో వెల్లడిస్తూ, డిజిన్వెస్ట్‌మెంట్(పెట్టుబడుల ఉపసంహరణ) కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌కు చెందిన అంతర్గత మినిట్స్(సమావేశ వివరాలు) ఆధారంగా ‘బిజినెస్ వరల్డ్’ మ్యాగజైన్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది.
ఫెయిర్‌ఫాక్స్, మరో సంస్థ మొదట్లో సీలు వేసిన బిడ్లు, ప్రభుత్వం నిర్దేశించుకున్న కనిష్ట రిజర్వ్ ధర రూ 94.42 కంటే చాలా తక్కువగా ఉన్నట్లు ఆ అంతర్గత మినిట్స్ వెల్లడిస్తున్నాయి. ఫెయిర్‌ఫాక్స్ తన బిడ్‌లో షేరుకు రూ 75 చొప్పున వేసింది.
అప్పుడు ఆ అధికారులు ఏం చేశారు? వారు ముందెన్నడూ లేని విధంగా ఒక అసాధారణమైన చర్యకు పాల్పడ్డారు, కాకపోతే దాన్ని బహిరంగంగా, పారదర్శకంగానే చేశారు. వారు మరో వాల్యుయేషన్ పద్ధతికి మారి, కొత్త బిడ్లను ఇవ్వాల్సిందిగా ఫెయిర్‌ఫాక్స్‌ను, మరో బిడ్డర్‌ను(భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ సంస్థ పేరును వెల్లడించలేదు) కోరారు.
రిజర్వ్ ధర కంటే తక్కువకు బిడ్లు
ఈసారి ఫెయిర్‌ఫాక్స్ ఒక్కో షేరుకు రూ 81 చొప్పున బిడ్ దాఖలు చేసింది. ఇది కూడా అసలు రిజర్వ్ ధర రూ 94.42 కంటే చాలా తక్కువే. అప్పుడు ఫెయిర్‌ఫాక్స్ ఇది తమ చివరి ఆఫర్ అని, ఒకవేళ దీన్ని అంగీకరించకపోతే తాము వెనక్కి తగ్గుతామని చెప్పింది. ప్రభుత్వం దీన్ని అంగీకరించింది.
ఐడీబీఐ బ్యాంక్‌పై ఉన్న వివాదాస్పద పన్ను దావాలపై కూడా కొంత వెసులుబాటు కల్పించింది. ఆ రకంగా పన్ను చెల్లింపుదారుల సొమ్మును కూడా భారీ రాయితీగా ఇచ్చారు.
ఒక్కో షేరుకు రూ 81 చొప్పున ఒప్పందం కుదిరింది. ప్రస్తుత తరుణంలో ఈ విక్రయం ఎందుకు అవసరమైందనే విషయమై ప్రభుత్వం విచిత్రమైన కారణాలు చెబుతోంది.
అధిక ఇంధన ధరల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై పడిన ఆర్థిక భారం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం లేకపోవడం, ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం కారణంగా కరెన్సీపై పడుతున్న ఒత్తిడి వంటివే ఆ కారణాలు అని నమ్మబలుకుతోంది.
నిబంధనల్లో మార్పులు
‘బిజినెస్ వరల్డ్’ నివేదిక ప్రకారం, ఐడీబీఐ బ్యాంక్ విక్రయం కోసం నిబంధనలు, పద్ధతిని మార్చడానికి ప్రభుత్వ భౌతిక ఆస్తుల (కానీ షేర్లు కావు) విక్రయం కోసం నిర్దేశించిన జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌ను ఆశ్రయించింది. దానికి తోడుగా స్క్రాప్ వేలంపై రైల్వే స్టోర్స్ కోడ్‌ను కూడా ఉటంకించింది.
“అయితే, అధీకృత అధికారి సముచితం అని భావిస్తే రిజర్వ్ ధరల కంటే తక్కువ బిడ్లను ఆమోదించవచ్చు, కాకపోతే సదరు అధికారి అందుకు తగిన కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి.” నా 40 ఏళ్ల జర్నలిజం కెరీర్లో ప్రైవేటీకరణకు సంబంధించి ఇటువంటి సమర్థనను నేను ఎప్పుడూ చూడలేదు.
కొత్త బిడ్డర్లకు అవకాశం ఇవ్వరా?
ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మాజీ కార్యదర్శిగా పనిచేసిన సత్యనారాయణ మొహంతి మాట్లాడుతూ- షార్ట్‌లిస్ట్ చేసి బిడ్లను తెరిచిన తర్వాత ప్రభుత్వం బిడ్డింగ్ నిబంధనలను మార్చినప్పుడు, ఆఫర్‌ను అందరికీ కొత్తగా అందించాలని, ఎందుకంటే మారిన నిబంధనల ప్రకారం కొత్త బిడ్డర్లు కూడా పాల్గొనాలని భావించాలనేది చట్టపరమైన ప్రాథమిక నిబంధన అని వివరించారు.
స్పష్టంగా చెప్పాలంటే, కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఈ సూత్రాన్ని పాటించకూడదని నిర్ణయించుకుంది. ప్రభుత్వం ఈ వైఖరిని చట్టపరంగా ఎలా సమర్థించుకోగలదో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా మరో బిడ్డర్‌ను హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించింది, ఆ సంస్థ పేరును గోప్యంగా ఉంచారు.
ఓడిపోయిన బిడ్డర్ పేరును ఎందుకు గోప్యంగా ఉంచవలసి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.
‘బిజినెస్ వరల్డ్’ కరస్పాండెంట్ పాలక్ షా ఈ విషయాలు వెలికితీసినందుకు గాను అభినందనలకు అర్హులు.
(పోస్ట్ స్క్రిప్ట్: 2017-2018 నాటికి, ఐడీబీఐ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 28-30%కి చేరి పతన అంచున ఉంది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచింది. ఇది బ్యాంక్ కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేసింది. మరింత తీవ్రమైన బ్యాంకింగ్ సంక్షోభాన్ని నివారించడానికి, 51% నియంత్రణ వాటాను చేజిక్కించుకోవడానికి రూ 21,624 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)ను ప్రభుత్వం ఆదేశించింది. 2019 జనవరిలో ఎల్ఐసీ ఈ పెట్టుబడి పెట్టింది.)
అనువాదం: కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
