పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక కేంద్రాలన్నీ ధ్వంసం చేస్తామని ఇరాన్ సమాధానమిచ్చింది.
హైదరాబాద్: హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపై ఉన్న ఆంక్షలను 48 గంటల్లో తొలగించకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ద్వయం సాగిస్తున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ శత్రుదేశాల నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది.
ఈ తరుణంలో ఆ ప్రాంతంలో నౌకా రవాణాపై ఉన్న ఆంక్షలు రద్దు చేసి, స్వేచ్ఛగా చమురు నౌకల రాకపోకలకు అవకాశం ఇచ్చేలా చేయాలన్న ఒత్తిడి అమెరికాపై పెరుగుతోంది.
“48 గంటల్లో హోర్ముజ్ జలసంధిలో రవాణాపై ఉన్న ఆంక్షలను ఇరాన్ తొలగించకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో మొదలుపెట్టి దేశంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నాశనం చేస్తాం”అంటూ ఫ్లోరిడాలోని సొంత ఇంట్లో ఉన్న ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
అయితే ఏయే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై అమెరికా దాడి ఎక్కుపెట్టనుందో ట్రంప్ స్పష్టం చేయలేదు.
ప్రతీకారానికి వెనుకాడమన్న ఇరాన్..
దీనికి స్పందనగా, ఇరాన్ మౌలిక వసతులపై దాడి చేస్తే పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా ఇంధన మార్కెట్ మూలస్తంభాలపై దాడులు చేయడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి వెనుకాడమని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై మొదలుపెట్టిన దాడిని ముగించబోతున్నామని ప్రకటించిన ఒకటి రెండ్రోజుల్లోనే ట్రంప్ ఈ రకమైన ప్రకటన చేయడం గమనించాల్సిన విషయం.
దీనికంటే ముందు ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ యుద్ధ లక్ష్యాలను చేరుకోవడం త్వరలోనే జరుగుతోందని అన్నారు. పశ్చిమాసియాలో సైనిక చర్యలను సాధారణ స్థితికి తీసుకురాబోతున్నామని కూడా అన్నారు.
కీలకమైన జలసంధి..
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు మార్కెట్‌కు వెన్నెముక. సాధారణ సమయాల్లో ప్రపంచంలో అమ్ముడయ్యే చమురులో 20 శాతం ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. తాజా యుద్ధం మొదలయ్యాక ఆ జలసంధి నుంచి చమురు వాణిజ్య రవాణా స్తంభించింది.
ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన చమురు నౌకలు తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన చమురు రవాణాకు ఆటంకాలు లేకుండా చూస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
దాడుల సామర్థ్యాన్ని తగ్గించామన్న అమెరికా సైన్యం..
జలసంధిలో ప్రయాణించే నౌకలపై దాడి చేయడానికి కావాల్సిన కీలకమైన ఆయుధాగారాన్ని ఇరాన్ నేలమాళిగలో దాచిందనీ, ఆ భూగర్భ ఆయుధాగారంపై 2300 కిలోల బాంబులు ప్రయోగించామనీ, ఫలితంగా జలసంధిలో రవాణాను అడ్డుకునే ఇరాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందనీ, నౌకా రవాణాపై ఉన్న అవరోధాలు తగ్గుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ అధినేత బ్రాడ్ కూపర్ ప్రకటించారు.
నౌకా రవాణాను గుర్తించే రాడార్లు, నిఘా వ్యవస్థలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయని కూపర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ జజీరా ప్రతినిధి మాన్యుయేల్ రాపలో “అమెరికా అధ్యక్ష భవనం ఆశిస్తున్నదానికీ, అమెరికా సైన్యం ఇప్పటికే సాధించేశామని చెప్తున్నదానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు కనపడుతుంది” అన్నారు.
“జలసంధిపై అమెరికా పెత్తనం కోసం దాడులు తీవ్రతరం చేయనున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తుంటే, మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని గణనీయంగా ధ్వంసం చేశామని అమెరికా సేనలు ప్రకటిస్తున్నాయి” అని రాపలో తన విశ్లేషణలో తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
