అమెరికా ఆంక్షలను అధిగమించడానికి ఇరాన్ ప్రత్యామ్నాయ మనుగడ వ్యూహాలను రూపొందించుకుంది. ఇది అమెరికాకు చికాకు తెప్పించింది.
డోనాల్డ్ ట్రంప్ విధానపరమైన శూన్యంతో ఇరాన్‌పై బాంబు వేయలేదు.
2020 ప్రారంభంలో ఖాస్సేం సులేమానీని హతమార్చమని ఆదేశించి, 2025 జూన్‌లో ఇరాన్ అణు కర్మాగారాలపై దాడులకు అధికారం ఇచ్చేనాటికి, బహిరంగ యుద్ధానికి దిగకుండానే శత్రు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం చేయబడిన, దేశాల సరిహద్దులకు అతీతమై చట్టాలు, ఆంక్షలతో కూడిన విధానాలు, నిర్బంధ ఆదేశాలతో కూడిన సాలెగూడు వంటి చరిత్రలోనే అత్యంత అధునాతనమైన చట్టబద్ధమైన ఆర్థిక బలప్రయోగ యంత్రాంగం ఒకటి ఉండేది.
ఈ ‘విదేశాంగ విధాన సాధనాలు’ అధ్యక్షులకు ఒక అధికారిక చర్యకు, డ్రోన్‌కు మధ్య చట్టపరమైన సోపానాన్ని అందిస్తాయి.
ప్రత్యక్ష భౌతిక దాడుల వల్ల పౌర ప్రాణనష్టం, ప్రాంతీయ అస్థిరత, దేశభక్తి వెల్లువెత్తడం, ప్రజాగ్రహం వంటి కోలుకోలేని పరిణామాలు సంభవిస్తాయి.
ఇరాన్ వంటి శత్రువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అసాధారణమైన నిర్బంధ చట్టపరమైన సాధనాలు ఉన్నాయి. అయినప్పటికీ బలాన్ని ప్రయోగించడమే విషాదం.
యుద్ధానికి పాల్పడటం అనేది బలప్రదర్శన కన్నా వ్యూహాత్మక అసహనానికి సంకేతం.
ఇది ఒక లోతైన సమస్యను కూడా ప్రతిబింబించి ఉండవచ్చు. ముఖ్యంగా టెహ్రాన్ డాలరేతర మార్గాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఇరాన్‌పై వాషింగ్టన్ నిర్బంధ పాలన బలహీనపడసాగింది.
అమెరికా అమ్ములపొదిలోని మూడు ప్రధాన చట్టాలు
అమెరికా అమ్ములపొదిలో మూడు ముఖ్యమైన చట్టాలు ఉండేవి.
మొదటిది మత స్వేచ్ఛకు జరిగే ‘క్రమబద్ధమైన, నిరంతర, ఘోరమైన ఉల్లంఘనల’కు సంబంధించి, 1998 నాటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం.
ఇది అధ్యక్షుడికి ఏ దేశాన్నైనా “ప్రత్యేక ఆందోళనకర దేశాలు”గా ప్రకటించే అధికారం ఇస్తుంది.
దౌత్యపరమైన చర్యలు తీసుకోవడం, ప్రపంచ బ్యాంకు రుణాలను నిరాకరించడం, ఎగుమతి హామీలను నిరాకరించడం, ఎగుమతి లైసెన్సులను నిషేధించడం, యూఎస్ బ్యాంకు రుణాలను నిరోధించడం, అమెరికా నిబంధనలను ఉల్లంఘించిన అధికారిక వ్యక్తులను అమెరికాలోకి రాకుండా నిషేధించడం వంటి చర్యలను చేపట్టేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది.
రెండవది అక్రమ మానవ రవాణా బాధితుల రక్షణ చట్టం(టీవీపీఏ), 2000. ఈ చట్టం ప్రకారం ఆధునిక బానిసత్వం, వెట్టిచాకిరికి సంబంధించి ఆయా దేశాలకు ప్రతి సంవత్సరం కేటగిరీలు ప్రకటిస్తారు.
దీని ప్రకారం ఇరాన్‌ను టైర్-3 కేటగిరీలో ఉంచడం జరిగింది.
అందుకనుగుణంగా మానవీయేతర సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు రుణాలను కూడా నిలిపివేస్తారు.
మూడవది, యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన ప్రపంచ మాగ్నిట్స్కీ మానవ హక్కుల జవాబుదారీతనం చట్టం, 2016. దీని ప్రకారం అధ్యక్షుడు మొత్తం దేశం మీద ఆంక్షలు విధించకుండా, వ్యక్తుల ఆస్తులను స్తంభింప చేయడం, వీసాలను నిషేధించడం చేయవచ్చు.
ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు చెందిన అనేక మంది కమాండర్లు, నిఘా అధికారులు, వ్యాపారవేత్తలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, డాలర్ వ్యవస్థకు దూరం పెట్టి, పశ్చిమ దేశాలలోకి రాకుండా నిరోధించడం జరిగింది.
ఇరాన్ ఆంక్షల చట్టం, ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం, ఆంక్షల ద్వారా అమెరికా శత్రువులను ఎదుర్కొనే చట్టం, సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులతో సహా ఇరాన్ పై ఆంక్షల చట్రంతో ఈ సాధనాలను కలిపి చూస్తే ఇరాన్‌పై జరుగుతున్న న్యాయయుద్ధం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇరాన్ ప్రత్యామ్నాయ వ్యూహాలు- డాలరేతర మార్గాలు..
ఇన్ని ఆంక్షలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ అస్థిత్వ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం, యువాన్, రూబుల్‌కు అనుకూలంగా మారుతూ డాలర్ ఆధిపత్య ఫైనాన్షియల్ వ్యవస్థకు దూరం జరిగింది. దీంతో ఇరాన్ పాలనపై పెద్ద ప్రభావం పడలేదు.
చట్టాలలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంపై అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో అమెరికా విఫలమవ్వడంతో 2020వ దశాబ్దం మధ్య నాటికి, ఈ సాధనాల ప్రభావం తగ్గిపోయింది.
వీటిని స్థిరంగా ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ఆంక్షల కింద అమలు చేసి ఉంటే- ఈ చట్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిడిని కొనసాగించి ఉండేవి.
అణు ఒప్పందం నుంచి వైదొలగిన తరువాత 2018లో అమెరికా ఇంకా మరికొన్ని ఆంక్షలు విధించింది.
అయినప్పటికీ ద్వంద్వ ప్రయోజన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామగ్రిని సమకూర్చుకుంటూ, అమెరికా ప్రభావానికి అతీతంగా తన రహస్య నౌకాదళం ద్వారా రష్యా, చైనాలకు రహస్యంగా చమురును విక్రయించడం కొనసాగించింది. ఆంక్షలను తట్టుకొని నిలబడగలింది.
మిత్రదేశాలపై ఆంక్షల ప్రభావం..
ఇటువంటి సర్వవ్యాప్తమైన నిర్బంధ పాలనలోకి గానీ లేదా ఇంధన దౌత్యంలోకి గానీ చేరే మిత్రదేశాలకు కలిగే అనుషంగిక నష్టం గణనీయంగా ఉంటుంది.
ఇరాన్, వెనిజులాల నుంచి చమురు కొనుగోలు చేసేటప్పుడు- చాబహార్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేదా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో అనుసంధానాన్ని కొనసాగించేటప్పుడు న్యూఢిల్లీ ఇప్పటికే అమెరికా నుంచి ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఇక వాషింగ్టన్ వేగవంతమైన, ప్రత్యక్ష ఉద్రిక్తతలను పెంచినప్పుడు- దాని ఫలితం వ్యూహాత్మకంగా తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి, రవాణా, బీమా ఖర్చులు అధికమవుతాయి, కార్పొరేట్ ఆదాయాలు, అదృశ్య ప్రవాహాలు తగ్గిపోతాయి.
ఎరువుల విషయంలో వ్యవసాయ రంగం నుంచి, గ్యాస్ విషయంలో గృహాల వరకు, ఇంధనం విషయంలో కార్ల వరకు ధరల వ్యత్యాసాలు చోటుచేసుకుంటాయి.
అదే సమయంలో ఒక వ్యూహాత్మక మిత్రదేశం పట్ల అసంతృప్తి మరింత తీవ్రమవుతుంది.
చట్టపరమైన పట్టు కోల్పోయిన అమెరికా..
అమెరికా అధికారం వ్యూహాత్మకంగా యుద్ధనౌకల నుంచి న్యాయస్థానాలకు, నియంత్రణ కేంద్రాలకు మారిన ఈ కాలానికి మిస్టర్ ట్రంప్ విధానం పొంతన లేనిదిగా అనిపిస్తుంది.
యుద్ధం అవసరాన్ని తగ్గించడానికే నిర్బంధంతో కూడిన చట్టపరమైన వ్యవస్థలు నిర్మించబడ్డాయి.
కానీ అమెరికా ముందస్తు అంతర్జాతీయ ఆమోదం లేకుండా, తనకు నచ్చిన విధంగా ఆంక్షలను విధించడం ద్వారా వాషింగ్టన్ తనకున్న కొన్ని నిజమైన ప్రయోజనాలలో ఒకటైన – చట్టాన్ని తాను అనుకున్న విధంగా సాధనంగా మార్చుకునే సామర్థ్యాన్ని బలహీనపరచుకుంది.
ఈ ప్రక్రియలో, యుద్ధానికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి దశాబ్దాలుగా చేసిన కృషిని అమెరికా దెబ్బతీసింది.
ఐరోపా, జపాన్, దక్షిణ కొరియా, గల్ఫ్ భాగస్వాములతో పాటు కీలకమైన ఆర్థిక కేంద్రాలతో కలిసి ఇరాన్‌పై విస్తృతమైన ఆంక్షలను తీవ్రతరం చేయడం; మానవ హక్కులు, అక్రమ రవాణాకు సంబంధించిన పరిశోధనలను బ్యాంకింగ్, ఇంధన బాధ్యతలతో ముడిపెట్టేలా ఐక్యరాజ్యసమితి ఆదేశాలను మార్పు చేయడం, బీజింగ్, మాస్కోలతో కనీసం పరిమిత ఒప్పందాలనైనా కుదుర్చుకోవడానికి బదులుగా, అత్యంత కీలకమైన తరుణంలో అమెరికా ప్రభుత్వం బహుముఖ ఒత్తిడిని పెంచడంలో విఫలమైంది.
బహుపాక్షికవాదం, ఎఫ్ఏటీఎఫ్ పాత్ర..
అయితే, వాషింగ్టన్ ఒక భిన్నమైన బహుపాక్షికవాదాన్ని అనుసరించింది.
అందులో భాగంగా, చాలావరకు అపారదర్శకంగా ఉండే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్క(ఎఫ్ఏటీఫ్) బ్లాక్‌లిస్ట్‌లోకి ఇరాన్‌ను నెట్టివేసి, దాని బ్యాంకింగ్ లావాదేవీలపై ఒత్తిడిని పెంచింది.
అయినప్పటికీ ఐక్యరాజ్యసమితి బహిరంగ, సంప్రదింపుల ప్రక్రియకు భిన్నంగా, ఎఫ్ఏటీఫ్ రహస్య సమావేశాలు, నమోదుకాని చర్చలు దానిని ఒక అస్పష్టమైన ఆర్థిక యుద్ధ సాధనంగా మార్చాయి.
ఇరాన్ డాలరేతర మార్గాలను ఉపయోగించడం, రష్యా, చైనాలతో భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆ ఒత్తిడిని కూడా తగ్గించుకుంటూ, అందుకు అనుగుణంగా సర్దుకుపోయింది.
యుద్ధాన్ని ఆశ్రయించడం వెనుక ఆంతర్యం..
మరయితే, ఈ పెత్తనం ఎందుకు? బహుశా అది ఒక రాజకీయ నాటకం కావచ్చు, మిత్ర దేశ రాజధాని నుంచి వచ్చిన పిలుపు కావచ్చు, లేదా అంతర్జాతీయీకరణ లేని బలవంతపు పాలన స్పష్టమైన వైఫల్యం పట్ల కలిగిన నిరాశ కావచ్చు.
ఒకప్పుడు విదేశీ యుద్ధాలను అంతం చేస్తానని ప్రచారం చేసిన ట్రంప్, చివరికి సైనిక శక్తిని రాజనీతిలో ఒక ప్రాథమిక సాధనంగా పరిగణించడం మొదలుపెట్టారు.
కానీ వాస్తవానికి చట్టం, ఆర్థికం, దౌత్యం, ఐక్యరాజ్యసమితి వంటివి చేయాల్సిన కీలక బాధ్యతను కలిగి ఉన్న ఒక ఉన్నత స్థాయి నిచ్చెనలో యుద్ధాన్ని చివరి మెట్టుగా పరిగణించలేదు.
అనువాదం: పి నరసింహారావు
(వ్యాస రచయిత సఫీ అషన్ రిజ్వీ, ఐపీఎస్, ఐబీ- ఎన్డీఎంఎలో సేవలు అందించిన జాతీయ & వాతావరణ భద్రతలో ప్రత్యేకత సాధించిన రిస్క్ విశ్లేషకులు; ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి, మాజీ బ్యాంకర్. తన Substack అయిన ‘Risk and Resilience’లో మొదట ప్రచురించబడిన ఈ పోస్ట్, అనుమతితో తిరిగి ప్రచురించబడుతోంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
