చిన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంలో అంతరాయం ఏర్పడితే, అది వారి పోషకాహారం పైనే కాకుండా వారి హాజరు, అభ్యసన ఫలితాలపై కూడా ప్రభావం చూపుతుందని ఈ ఉద్యమం పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాలో కొనసాగుతున్న అంతరాయం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం సాధారణ తయారీకి ఆటంకం కలుగుతోందన్న వార్తలను ప్రస్తావిస్తూ, ఈ పథకానికి ప్రాధాన్యతనిచ్చి మరింత సమన్వయంతో గ్యాస్‌ను సరఫరా చేయాలని ‘ఆహార హక్కు ఉద్యమం‘ కోరింది.
లక్షలాది మంది పిల్లలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు, పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు వారికి అందే అత్యంత పోషక విలువలున్న ఆహారమని మార్చి 17న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సంస్థ గుర్తుచేసింది.
ఈ చొరవలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా అది చిన్న పిల్లల హాజరు, అభ్యసన ఫలితాలపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఇబ్బందులు పడుతున్న పాఠశాలలు
పిల్లలకు మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా అందేలా చూడటానికి పాఠశాలలు పడుతున్న ఇబ్బందులను పలు వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి.
ఎల్పీజీ అయిపోతుందన్న ఆందోళనతో ఉండటం, సిలిండర్ బుకింగ్ లేదా రీఫిల్ చేయడంలో ఇబ్బందులు పడటం, మెనూలో మార్పులు చేయడం, లేదా భోజనం వండటానికి గ్యాస్‌కు బదులుగా కట్టెల పొయ్యిని ఉపయోగించడం వంటివి చేస్తున్నాయి.
“ఇలాంటి అంతరాయాలు ఈ కార్యక్రమ కొనసాగింపు, నాణ్యతకు తీవ్ర ముప్పును తెచ్చిపెడతాయి” అని ప్రచార సంఘం పేర్కొంది.
“ఆహార తయారీలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది పిల్లల పోషకాహారాన్ని దెబ్బతీయడమే కాకుండా, అట్టడుగు వర్గాల పిల్లల పాఠశాల హాజరు, నేర్చుకునే సామర్థ్యం(అభ్యసన ఫలితాలు), వారి సమగ్ర శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.”
మధ్యాహ్న భోజన పథకం(దీనిని అధికారికంగా పీఎం-పోషణ్ పథకం అని పిలుస్తారు) వంట ఏర్పాట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవడం కేవలం పిల్లల ఆహార హక్కును మాత్రమే కాకుండా వారి విద్యా హక్కును కాపాడటానికి కూడా అత్యవసరమని ఆ సంఘం పేర్కొంది.
ప్రభుత్వాలకు విజ్ఞప్తి
మధ్యాహ్న భోజన పథకానికి ఆహారం అందించే వంటశాలలకు, స్వయం సహాయక బృందాలకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని ఎల్పీజీ కంపెనీలను కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఉద్యమం ప్రశంసించింది.
“అయితే, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా మరింత సమన్వయంతో కూడిన, క్రమబద్ధమైన స్పందన అవసరమని తెలుస్తోంది” అని ప్రచార సంఘం పేర్కొంది.
మధ్యాహ్న భోజనం, సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకాలకు ఎల్పీజీ కేటాయింపులో ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలు, అంగన్వాడీలకు సమయానికి గ్యాస్ సరఫరా, రీఫిల్స్ అందేలా పంపిణీదారులను ఆదేశించాలని డిమాండ్ చేసింది.
అలాగే గ్యాస్ బఫర్లను ఏర్పాటు చేసి, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ బ్లాక్ మార్కెటింగ్, మళ్లింపులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది.
అత్యవసర సేవగా పరిగణించాలి
“ఈ కార్యక్రమాలకు అందించే ఎల్పీజీ సరఫరాను ప్రభుత్వం అత్యవసర ప్రజా సేవగా పరిగణించాలి మరియు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి శ్రమిస్తున్న వంట మనుషులు, సహాయకులు, ఉపాధ్యాయులు మరియు సామాజిక సంఘాలకు ‘ఆహార హక్కు ఉద్యమం’ సంఘీభావం తెలుపుతోంది. ఏ చిన్నారీ తన హక్కుగా రావాల్సిన భోజనాన్ని కోల్పోకుండా అధికారులు తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాము” అని ఆ సంస్థ రాసుకొచ్చింది.
‘ఆహార హక్కు ఉద్యమం’ అనేది భారతదేశంలో ఆహార హక్కును సాకారం చేసే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తుల అనధికారిక ఉమ్మడి వేదిక.
భౌగోళిక రాజకీయాల ప్రభావం
తమపై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం ఇరాన్ దిగ్బంధించిన హార్ముజ్ జలసంధి పైనే భారతదేశ ఎల్పీజీ దిగుమతులు భారీగా ఆధారపడి ఉన్నాయి.
గృహ వినియోగదారులకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం- రెస్టారెంట్లు, తినుబండారాల వంటి వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
