Writers' Building: Bengal's Administrative History and Future
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, రైటర్స్ బిల్డింగ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయంగా మారింది.
ఒకప్పుడు బ్రిటిష్ అధికారుల ప్రధాన కార్యాలయంగా పనిచేసిన అదే భవనంలో పశ్చిమ బెంగాల్ మంత్రులు, అధికారుల కార్యాలయాలు కొలువుదీరడం విశేషం.
పశ్చిమ బెంగాల్‌లోని కొత్త ప్రభుత్వం(భవిష్యత్తులో ఏర్పడొచ్చని భావిస్తున్న బీజేపీ) ఈ భవనాన్ని మరోసారి తమ మహాకరణ్గా(ప్రధాన సచివాలయం) మార్చాలని నిర్ణయించడంతో రైటర్స్ బిల్డింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
‘నువ్వు టీ తాగుతావా?’ అని అండర్ సెక్రటరీ కుర్చీలో కూర్చున్న నా బ్యాచ్‌మేట్ అడిగాడు. ‘టీ అంటే ఏమిటి?’ అని తెలుసుకోవడానికి అతని వైపు తిరిగాను.
‘అది టీనో, కాఫీనో నాకు ఇంకా అర్థం కావడం లేదు. అందుకే టీ’ అన్నాడు. 34 ఏళ్ల క్రితం ఆ మే నెల ఉదయం గానీ, ఆ తర్వాత ఎప్పుడూ గానీ నాకూ అది అర్థం కాలేదు. సాధారణంగా ‘రైటర్స్’ అని పిలిచే రైటర్స్ బిల్డింగ్‌కు సంబంధించిన నా తొలి జ్ఞాపకాల్లో అదొకటి.
1992 మే నెలలో బంగాళాఖాతంలోని కాంటాయ్ సబ్-డివిజన్ నుంచి అస్సాం సరిహద్దులోని అలీపుర్దువార్ సబ్-డివిజన్‌కు నన్ను ఆకస్మికంగా బదిలీ చేశారు.
అయితే, అలీపుర్దువార్లో ఉన్న సబ్-డివిజనల్ అధికారి ఇంకా బదిలీ కాకపోవడంతో, ప్రభుత్వం నన్ను ‘కంపల్సరీ వెయిటింగ్’లో(తప్పనిసరి నిరీక్షణ) ఉంచింది.
ఆకాశానికీ, భూమికీ మధ్య త్రిశంకువులా వేలాడుతూ కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌లో ఉన్న పర్సనల్ డిపార్ట్మెంట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఆ రోజుల్లో ఎదురుచూడటమే నా పని. పరిస్థితులు ఎలా ఉన్నా ఏ క్షణమైనా ఆదేశాలు రావచ్చని కొత్త పోస్టింగ్ కోసం ఎదురుచూస్తూ, భవనాన్ని అన్వేషిస్తూ కొన్ని రోజులు గడిపాను.
అంతకుముందు నేను ఆ భవనానికి రెండు మూడు సార్లు మాత్రమే వెళ్లాను. అప్పుడు నా ప్రవేశం ప్రధాన భవనం మొదటి అంతస్తులో ఉన్న అదనపు కార్యదర్శి గదికి మాత్రమే పరిమితమై ఉండేది.
వీఐపీల విభాగాలు.. సిబ్బంది తీరు..
ఈ మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి, ఎంపిక చేసిన శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కొందరు సీనియర్ కార్యదర్శుల కార్యాలయాలు ఉండేవి.
ఇవి 120 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పు ఉన్న వరండాలోకి తెరుచుకునేవి.
రైటర్స్ హాల్ ముందు ఉన్న ఈ విభాగం, ముఖ్యంగా మొదటి అంతస్తు వీఐపీలది కావడంతో, అత్యంత శుభ్రంగా, జనసమూహం లేకుండా ప్రశాంతంగా ఉండేది.
ప్రవేశం కట్టుదిట్టంగా ఉండి మూడు ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు కాపలా ఉండేవారు.
అయితే, కొత్త, పాత భవనాల్లోని మిగిలిన విభాగాల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉండేది.
లోపల ఉన్న మిగిలిన 12 విభాగాలలో అధికారుల కోసం చిన్న గదులు, సిబ్బంది కోసం బల్లలు, కుర్చీలతో నిండిన పెద్ద హాళ్లు ఉండేవి.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయంలో వెళ్లినా, ఫైళ్ల బరువుతో నిండిపోయిన బల్లలు కనిపించేవి.
రైటర్స్ ఆఫీసులోని ఉద్యోగుల ప్రవర్తన, వైఖరి ఇతర రాష్ట్రాల సచివాలయాల్లో కనిపించేదానిలాగే ఉండేది.
ఇక్కడ కూడా ఆఫీసుకు రావడం కంటే, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికే ఎక్కువ తొందరపడేవారు.
అధికారికంగా పనివేళలు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:30 వరకు అయినప్పటికీ, ఏ పనైనా పూర్తి చేయడానికి ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య సమయమే అత్యంత అనుకూలంగా ఉండేది.
ఈ సమయంలో కూడా, ఏ హాల్ 100 శాతం లేదా కనీసం 80 శాతం నిండి ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు.
ఆ గదుల్లోకి అడుగుపెట్టిన వెంటనే, కాలం స్తంభించిపోయినట్లు అనిపించేది.
అయినప్పటికీ, “కాజెర్ చాప ఎతో బేశీ…” (పని భారం చాలా ఎక్కువ), “ఆర్ పారా జచ్చే నా…” (ఇక నావల్ల కాదు) అనే రెండు ఫిర్యాదులు తరచుగా వినిపించేవి.
ఆ కారిడార్లు.. ఆ నినాదాలు..
కార్యాలయాల లోపల కాలం స్తంభించిపోయినట్లు అనిపించినప్పటికీ, బయట కారిడార్లు మాత్రం ఎప్పుడూ సందడిగా ఉండేవి.
అక్కడ కేవలం ప్రభుత్వ అధికారుల రాకపోకలే కాదు, అలసిపోయిన ఉద్యోగులు సేదతీరేందుకు మూలల్లో ఉండే చిన్న టీ దుకాణాలు ఆకర్షించేవి.
అక్కడ టీతో పాటు రకరకాల రంగురంగుల కేకులు, బిస్కెట్లు, స్నాక్స్ ఆస్వాదించేవారు.
ఆ ఆహారం సరిపోనట్లుగా, కింది అంతస్తులో మూడు క్యాంటీన్లు ఉండేవి. భోజన సమయంలో, టీ, కబుర్లు, నవ్వులతో పాటు ఈ కారిడార్లలో “చోల్బే నా, చోల్బే నా… (ఇది సాగదు, ఇది సాగదు…)”, “దితే హోబే, దితే హోబే …(ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే…)” వంటి విప్లవ నినాదాలు మారుమోగేవి.
నబన్నకు మార్పు: కారణాలు – ప్రచారాలు..
2013 నాటికి, ఈ భవనం నిర్మించిన 236 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా రైటర్స్ బిల్డింగ్ వైభవం క్షీణించింది.
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చారిత్రాత్మక భవనానికి మరమ్మతులు, పునరుద్ధరణ అవసరమని భావించారు.
ఆ తర్వాత కొన్ని వారాలకే హడావుడిగా మహాకరణ్ను(ప్రధాన సచివాలయాన్ని) హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున కొత్తగా నిర్మించిన 14 అంతస్తుల భవనానికి తరలించారు.
వాస్తవానికి అక్కడ రద్దీగా ఉండే మార్కెట్‌ను తరలించాల్సి ఉంది. మమతా బెనర్జీ ఈ కొత్త సచివాలయానికి “నబన్న” (కొత్త ఆహారం) అని పేరు పెట్టారు.
ముఖ్యమంత్రి రైటర్స్ బిల్డింగ్‌ను అశుభంగా భావించడమే ఈ తరలింపునకు ప్రధాన కారణమని కొందరు అంటారు. దానికి కారణం.. 1993 జూలై 21న ఓటర్ ఐడీ కార్డుల సాధన కోసం మమతా బెనర్జీ ఒక భారీ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించి రైటర్స్ బిల్డింగ్‌లోకి దూసుకెళ్లారు.
ఆ ఆందోళనను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా, 13 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
ఒక జ్యోతిష్యుడి సలహా మేరకే ముఖ్యమంత్రి ఈ మార్పు చేశారని కూడా ప్రచారంలో ఉంది.
కారణం ఏదైనప్పటికీ, పదమూడేళ్లు గడిచినా ఈ అద్భుతమైన వారసత్వ భవనం పునరుద్ధరణకు నోచుకోలేదన్నది వాస్తవం.
రైటర్స్, నబన్న భవనాల మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒక పోలిక ఉంది: ఈ రెండు భవనాలు వాస్తవానికి వాణిజ్య అవసరాల కోసమే నిర్మించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి చారిత్రక ప్రస్థానం..
రైటర్స్ బిల్డింగ్ మళ్ళీ వార్తల్లోకి రావడం ఇదేమీ కొత్త కాదు. ఈ భవనం నిర్మించినప్పటి నుంచీ వార్తల్లోనే ఉంది.
1757 ప్లాసీ యుద్ధం తరువాత, ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివానీని(పన్నులు వసూలు చేసే హక్కు) సొంతం చేసుకుంది.
పన్నుల వసూలు, ఇతర పరిపాలనా విధులను నిర్వహించడానికి ‘రైటర్స్'(గుమాస్తాలు, అకౌంటెంట్లు) సంఖ్యను భారీగా పెంచింది.
1776-77 సమయంలో లార్డ్ హేస్టింగ్స్ వీరికి ఒక నివాసాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
అది 1780లో పూర్తయింది. దీని వాస్తుశిల్పి థామస్ లయన్. ఆయన పేరు మీదుగానే రైటర్స్ బిల్డింగ్ వెనుక ఉన్న మార్గాన్ని “లయన్ రేంజ్” అని పిలుస్తారు.
కోల్‌కతాలో మొట్టమొదటి మూడు అంతస్తుల భవనం ఇదే. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం, ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచింది.
పంతొమ్మిదవ శతాబ్దంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుంచి సామ్రాజ్యంగా ఎదుగుతున్న క్రమంలో, ఈ భవనం బెంగాల్ పరిపాలనకు కేంద్ర కార్యాలయంగా మారింది. అసలు నిర్మాణానికి కొత్త విభాగాలు జోడించారు. 1879 – 1906 మధ్య ఈ భవనం గొప్ప వాస్తు పరివర్తనకు గురైంది.
ఆ సమయంలోనే ప్రస్తుతమున్న గంభీరమైన నవ్య-శాస్త్రీయ(నియో-క్లాసికల్) రూపాన్ని సంతరించుకుని, బ్రిటిష్ సామ్రాజ్య శక్తికి ఒక అద్భుత చిహ్నంగా మారింది.
కొత్తగా నిర్మించిన మూడు విభాగాల ముఖభాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కొరింథియన్ స్తంభాలు, తోరణాలు, యూరోపియన్ శైలి శిల్పాలను ఏర్పాటు చేశారు.
ఎర్ర ఇటుకలతో దీని ముఖభాగాన్ని నిర్మించారు. భవనం మధ్యలో రోమన్ జ్ఞాన దేవత ‘మినర్వా’ విగ్రహాన్ని, పైకప్పుపై వాణిజ్యం, వ్యవసాయం, విజ్ఞానం, న్యాయానికి ప్రతీకగా నిలిచే ఇతర విగ్రహాలను ఉంచారు.
ప్రపంచంలోనే అత్యంత దోపిడీ సామ్రాజ్యమైన బ్రిటిష్ వారు.. తమ విశాల వలస రాజ్యాల్లో వ్యవసాయం, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విజ్ఞానశాస్త్ర సహాయంతో న్యాయాన్ని స్థాపించామని గొప్పలు చెప్పుకోవడానికి ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. నేడు, ఈ విగ్రహాలు ఆ వైరుధ్యానికి కఠోరమైన సాక్ష్యాలుగా మిగిలాయి.
జాతీయోద్యమం – విప్లవ వీరుల సాహసం..
1930 డిసెంబర్ 8న, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక చారిత్రాత్మక సంఘటనకు ఈ భవనం సాక్ష్యంగా నిలిచింది.
బినయ్ బసు, బాదల్ గుప్తా, దినేష్ గుప్తా అనే ముగ్గురు యువ విప్లవకారులు రైటర్స్ బిల్డింగ్‌లోకి ప్రవేశించి, అత్యంత క్రూరుడైన జైళ్ల ఐజీ కల్నల్ ఎన్ఎస్ సింప్సన్‌ను కాల్చి చంపారు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు బాదల్ సైనైడ్ మింగగా, బినయ్, దినేష్ తమను తాము కాల్చుకున్నారు.
ఆ తర్వాత బినయ్ ఆసుపత్రిలో మరణించగా, ప్రాణాలతో మిగిలిన దినేష్‌కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన బెంగాల్ జాతీయవాద ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది.
స్వాతంత్ర్యం తర్వాత, ఆ ముగ్గురి విప్లవ వీరుల (బినయ్, బాదల్, దినేష్) జ్ఞాపకార్థం డల్హౌసీ స్క్వేర్ పేరును “బీబీడీ బాగ్”గా మార్చారు.
పరిపాలనా కేంద్రంగా ‘రైటర్స్’..
రైటర్స్ బిల్డింగ్ 1937 నుంచి 1947 వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేసింది.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయంగా మారింది. ఒకప్పుడు బ్రిటిష్ అధికారుల ప్రధాన కార్యాలయంగా ఉన్న అదే భవనం, మన మంత్రులు, అధికారులకు కేంద్రంగా మారడం గమనార్హం.
అది అధికార కేంద్రంగానే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు వేదికగా కూడా ఉండేది. అక్కడే నిర్ణయాలు తీసుకునేవారు, విధానాలు రూపొందించేవారు. కానీ, వాటిలో చాలా వరకు అధికారుల జాప్యంలో చిక్కుకుని నీరుగారిపోయేవి. కాలక్రమేణా ‘రైటర్స్’ అనే పదం రాష్ట్ర ప్రభుత్వానికి పర్యాయపదంగా మారిపోయింది.
కొత్తగా ఏర్పడనున్న బీజేపీ ప్రభుత్వం ఈ భవనాన్ని మరోసారి ప్రధాన సచివాలయంగా మార్చుకోవాలని భావిస్తుండటంతో, ఈ మధ్య కాలంలో రైటర్స్ బిల్డింగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటిది, 1780ల నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుంచి 2013 వరకు రైటర్స్ బిల్డింగ్ బెంగాల్ పరిపాలనా కేంద్రంగా ఉంది. బెంగాల్ ప్రజలకు ప్రభుత్వం అంటే ఠక్కున గుర్తొచ్చే చిహ్నం ఇదే.
రెండవది- ఈ చారిత్రక వారసత్వాన్ని, పరిపాలనా సంప్రదాయాన్ని తాము ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పడమే కాకుండా, బెంగాల్ స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకువస్తామని చాటి చెప్పడం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
