సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదాలకు సంబంధించిన విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
“బొద్దింకల వంటి యువకులు కొందరు ఉన్నారు, వారికి ఎలాంటి ఉపాధి లభించదు, వృత్తిలో వారికి స్థానం ఉండదు. వారిలో కొందరు మీడియా అవుతారు, కొందరు సోషల్ మీడియా అవుతారు, కొందరు ఆర్టీఐ కార్యకర్తలు అవుతారు, మరికొందరు ఇతర కార్యకర్తలు అవుతారు. వీరికి ప్రభుత్వాన్ని విమర్శించడమే పని. ఇటువంటి వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే సమాజంలో చాలా మంది ఉండగా, మీరు వారితో చేరాలనుకుంటున్నారా?” అంటూ న్యాయవాదుల పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ అలా మాట్లాడడం సరికాదని చాలామంది మేధావులు ఖండించారు.
సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సంచలనం..
కానీ అభిజిత్ దీప్కె అనే యువకుడు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఏకంగా ఒక సోషల్ మీడియా వేదికనే ఏర్పాటు చేశాడు.
ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కేవలం 6 రోజుల వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశంలో సోషల్ మీడియాను ఇప్పుడు ఒక కుదుపు కుదుపుతోంది.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8.7 మిలియన్స్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కి 13.2 మిలియన్స్ మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.
దీనితో బీజేపీ ఇప్పటికే సీజేపి ఎక్స్ అకౌంట్‌ను నిలిపివేయగా- ఈ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నిలిపివేయాలనుకుంటోంది.
మరోవైపు బీజేపీ అనుబంధ సంఘాలు పాకిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్ నుంచే అత్యధికులు ఫాలోవర్లుగా ఉన్నారని ఆరోపణలు చేస్తున్నాయి.
అయితే, ఇదంతా ఫేక్ ప్రచారమని సీజేపి ఫౌండర్ అభిజిత్ పేర్కొంటున్నారు.
తన ఫాలోవర్లకు సంబంధించిన ఒరిజినల్ డేటాను ఆయన పంచుకున్నారు. అందులో ఇండియా నుంచే 94.7 శాతం మంది ఫాలోవర్లు ఉన్నారు.
దీనితో ఇంకొంతమంది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్- “అభిజిత్ ఆప్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌లో గతంలో పనిచేసేవాడు, అందులో నుంచి బయటకు వచ్చి కావాలనే బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు” అని అంటున్నారు.
ఈ వాదనలో కొంత వాస్తవం ఉందనేది మనం అంగీకరించాల్సిందే. అలాగని బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని దేశంలో లక్షలాది ప్రజలు, ముఖ్యంగా యువత సమర్థిస్తున్నారు అంటే అందులో అంతరార్థం కూడా మనం గమనించాలి.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో రగులుతున్న యువత..
అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా ఉద్యమం ఏదో కావాలని చేస్తే వచ్చింది కాదు. ఇది బీజేపీ పరిపాలనలో దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో వస్తున్న అసంతృప్తికి నిదర్శనం.
యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం గ్రాడ్యుయేట్ నిరుద్యోగం. దేశంలో చదువుకోని వారి కంటే, డిగ్రీలు/పీజీలు పూర్తి చేసిన యువతలోనే నిరుద్యోగం అత్యధికంగా ఉంది.
గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగత దాదాపు 29.1% గా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువతలో మొత్తం నిరుద్యోగ రేటు 15.3% కి పెరిగింది. ఇందులో యువతుల పరిస్థితి మరీ ఘోరంగా (18.7%) ఉంది.
మరోవైపు ప్రస్తుతం దేశంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.48% గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 4.2% ఉంది.
రూపాయి విలువ పడిపోవడం, నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల సామాన్యుడి చేతిలో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది.
ఈ అసంతృప్తే అంతమంది ఫాలోవర్స్‌ను కూడగట్టిందనేది జగమెరిగిన సత్యం.
ఇకపోతే సీజేపి పార్టీ 5 అంశాల ఎజెండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రతిపక్ష నాయకులు, వామపక్షవాదులను మరింత ఆలోచింపజేసింది.
బీజేపీ ఈ మధ్యకాలంలో అనుసరించిన మార్గాలే ఈ ఎజెండా కావడం విశేషం.

న్యాయమూర్తులకు పదవీ విరమణానంతరం ప్రతిఫలాలు ఉండవు..
మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ తన పదవీకాలంలో పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు. డిసెంబర్ 6, 1992లో కొంతమంది హిందూ కార్యకర్తలు, జాతీయవాద సంస్థలు కలిసి బాబ్రీ మసీదును కూల్చివేశారు.
అప్పటి నుంచి వివాదంలో ఉన్న ఆ కేసు 2019లో తుది తీర్పునిస్తూ వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ మందిర నిర్మాణం కోసం హిందూ పిటిషనర్లకు కేటాయించగా, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని ఆదేశించారు.
ఫ్రాన్స్-ఇండియా రఫేల్ ఒప్పందం కేసులో 2016లో డాసాల్ట్ నిర్మించిన 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కుదిరిన 7.87 బిలియన్ల అంతర్-ప్రభుత్వ ఒప్పందంలో అవినీతి, పక్షపాతం, విధానపరమైన ఉల్లంఘనలను తోసిపుచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేశారు.
చొరబాటుదారులు అన్న నెపంతో ఈ దేశ ప్రజలనే విదేశీయులు అని చెబుతూ చాలామంది పౌరసత్వం రద్దు చేసిన జాతీయ పౌర పట్టికను అమలు చేసిన మొదటి, ఏకైక రాష్ట్రం అస్సాం. అందులో ఎన్ఆర్సీ ప్రక్రియను పర్యవేక్షించిన ప్రధాన న్యాయమూర్తుల్లో ఈయన ఒకరు.
2011లో కేరళలో కదులుతున్న ప్యాసింజర్ రైలులో 23 ఏళ్ల సౌమ్య దారుణమైన అత్యాచారం, హత్యకు గురయ్యింది.
ఈ కేసులో గోవిందచామికి మరణశిక్షను స్థానిక కోర్టు విధిస్తే దాన్ని రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చి శిక్షను తగ్గించారు.
ఇలా అనేక కేసులు బీజేపీకి అనుకూలంగా వాదించినందుకు గానూ పదవీ విరమణ అనంతరం ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించింది.
అందుకే సీజేపి దీనికి వ్యతిరేకంగా మొట్టమొదటి ఎజెండాగా “న్యాయమూర్తులకు పదవీ విరమణానంతరం ప్రతిఫలాలు ఉండవు” అని ప్రకటించింది.
ప్రతి చట్టబద్ధమైన ఓటు రక్షించబడుతుంది..
ఎన్నికల కమిషన్ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది.
కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయింది.
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు అడ్డం పడుతున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను కూల్చాలని కంకణం కట్టుకుంది.
అందుకనే ఎస్ఐఆర్ ద్వారా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కేరళలో 53,229; తమిళనాడులో 74,07,207; పశ్చిమ బెంగాల్లో 90 లక్షలకు పైగా అర్హులైన వేలాది మంది ఓట్లను రద్దు చేసింది.
దీనిని దృష్టిలో ఉంచుకునే- ప్రధాన న్యాయమూర్తి పాలిత రాష్ట్రంలో గానీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రంలో గానీ ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే, పౌరుల ఓటు హక్కును హరించడం తీవ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదు కాబట్టి, యూఏపీఏ(UAPA) కింద సీఈసీని అరెస్టు చేయాలని ప్రకటన చేసింది.
మహిళలకు 50% రిజర్వేషన్..
106వ రాజ్యాంగ సవరణ(నారీ శక్తి వందన్ అధినియం-2023) ఆమోదం పొందినప్పటికీ, మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయడాన్ని ఇప్పటి వరకు బీజేపీ అమలు చేయలేదు.
తీరా లోక్‌సభ సీట్ల గరిష్ట సంఖ్యను 550 నుంచి 850కి పెంచాలన్న డీలిమిటేషన్‌కు మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం వలన అది వీగిపోయింది.
ఆ బిల్లు ఓడిపోతుందనే విషయం బీజేపీకి ముందుగానే తెలిసినప్పటికీ రెండింటినీ ముడిపెట్టి ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం అన్నట్టు చిత్రీకరించారు.
అందుకే దేశంలో సగభాగంగా ఉన్న మహిళలకు పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా, 33% కాకుండా 50% రిజర్వేషన్ కల్పించాలి.
అదనంగా, క్యాబినెట్‌లోని అన్ని పదవులలో 50% మహిళలకు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
స్వతంత్ర మీడియా.. గోదీ మీడియా కాదు..
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, బీజేపీ కేవలం మీడియా ప్రకటనల కోసమే రూ 460 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి నివేదించింది.
2024-2025 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఎన్నికల ప్రచారం, సాధారణ ప్రచారం కోసం ఏకంగా రూ 3,335.36 కోట్లు ఖర్చు చేసింది.
ఈ మొత్తంలో సుమారు 68% (రూ 2,257 కోట్లు) కేవలం ప్రకటనలు, ప్రచారం, పబ్లిసిటీ కోసమే ఖర్చు చేయబడ్డాయి.
ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా(టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు) కోసం రూ 1,124.96 కోట్లు వెచ్చించారు.
ఈ రకంగా ఎన్నికల్లో తమ పార్టీ ప్రచారానికి పెద్ద మొత్తంలో ప్రజా సంపదను దుర్వినియోగం చేస్తోంది. ఇందులో అత్యధికం బడా పెట్టుబడిదారులుగా ఉన్న అదానీ, అంబానీలవే.
మరోవైపు గోదీ మీడియా అబద్ధపు ప్రచారాలను విపరీతంగా వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. అందుకే సీజేపి పార్టీ దీనికి భిన్నంగా నిజమైన స్వతంత్ర మీడియాకు మార్గం సుగమం చేసేందుకు, అంబానీ, అదానీల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలను విచారించాలని ప్రకటించింది.
రాజకీయ ఫిరాయింపులపై 20 ఏళ్ల నిషేధం..
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో పెట్టిన ముఖ్యమంత్రులు అందరూ ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన వారే.
అంతేకాకుండా సామాన్యుల గొంతుక అవుతారు అనుకున్న రాఘవ చద్దా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆప్‌ని విడిచి బీజేపీలో చేరారు. అందుకనే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే- 20 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టడానికీ అనర్హులు అవుతారని ప్రకటించింది.
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ఉద్యమం బీజేపీ ఒత్తిడిని తట్టుకొని ఎంతకాలం కొనసాగగలదో కానీ, ఈ యువత ఇదే చైతన్యంతో ఉంటే కచ్చితంగా మార్పు తీసుకురాగలరు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
