లాభాలు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి, పర్యావరణానికి అవి తలపెట్టే నష్టాన్ని సమాజం నెత్తిన రుద్దే పారిశ్రామిక నమూనా వల్ల అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రజలు తీవ్ర మూల్యం చెల్లిస్తున్నారని మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
ఆయా ప్రత్యేక ఆర్థిక మండలాల(సెజ్) ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డ, ఇతర కాలువల్లోకి విచక్షణారహితంగా వదులుతున్న ప్రదేశాలను, విసర్జన పైపులను గుర్తించి తక్షణం మూసివేయాలని హెచ్ఆర్ఎఫ్ తన ప్రకటనలో డిమాండ్ చేసింది.
ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించిన హెచ్ఆర్ఎఫ్ బృందం..
ఆ ప్రాంతంలో అడ్డూ ఆపు లేకుండా సాగుతున్న పారిశ్రామిక కాలుష్యం గురించి గత కొద్ది కాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలు, ఫిర్యాదుల నేపథ్యంలో- నలుగురు సభ్యులతో కూడిన హెచ్ఆర్ఎఫ్ బృందం మే 15న ఈ రెండు మండలాల్లో కాలుష్య ప్రభావిత గ్రామాలను సందర్శించింది.
అచ్యుతాపురం మండలంలోని పూడిమడక ప్రాంతాన్ని, రాంబిల్లి మండలంలోని సీతపాలెం, కంసాలి కాలనీ, లాలంకోడూరు, ఎరకన్నపాలెం గ్రామాలను బృందం సందర్శించి, రైతులు, మత్స్యకారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది.
పదుల సంఖ్యలో ఉన్న ఫార్మా, రసాయనిక కర్మాగారాల నుంచి అత్యంత ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలు పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లోకి పారడాన్ని బృందం ప్రత్యక్షంగా గుర్తించింది.
నియంత్రణ సంస్థల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం..
ఈ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల దుర్గంధం భరించలేనంతగా వ్యాప్తి చెందుతోందని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానిక గ్రామస్తులు గత కొన్నేళ్లుగా పదే పదే ఫిర్యాదు చేస్తున్నారు.
జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని, పాడిపంటలు దెబ్బతిన్నాయని, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని మొత్తుకుంటున్నా అధికారులు పెడచెవిన పెట్టారు.
అప్పుడప్పుడు తీసుకునే నామమాత్రపు చర్యల వల్ల పర్యావరణ వినాశనం ఆగడం లేదు.
ఇంత పెద్ద ఎత్తున, ఇంత సుదీర్ఘకాలం పాటు పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే- అది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఇతర నియంత్రణ సంస్థల అత్యంత నిర్లక్ష్య వైఖరి అయినా అయి ఉండాలి, ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడం లేదా వారితో కావాలని కుమ్మక్కవ్వడం అయినా అయి ఉండాలని హెచ్ఆర్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది.
విషతుల్యమవుతున్న గెడ్డలు.. సముద్ర పర్యావరణానికి ముప్పు..
కొన్నేళ్ల క్రితం వరకు పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డల్లో స్వచ్ఛమైన నీరు పారేదని, అవి తాగునీటికి, గృహావసరాలకు, సేద్యానికి పనికొచ్చేవని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
సెజ్ ప్రాంతంలో పరిశ్రమల సంఖ్య పెరిగిపోవడంతో ఆ గెడ్డలు అత్యంత ప్రమాదకర మురుగు కాలువలుగా మారిపోయాయి.
పిల్లమ్మగెడ్డ తూర్పు దిక్కు ప్రవహించి ఉప్పరిగెడ్డలో కలిసి, పూడిమడక దగ్గర ఉప్పుటేరులో, అనంతరం సముద్రంలో కలుస్తుంది.
దీనివల్ల, విషపూరిత నీటి ప్రభావం కేవలం మంచినీటి చెరువులపైనే కాకుండా అత్యంత సున్నితమైన తీర ప్రాంతంపైన, సముద్ర పర్యావరణ వ్యవస్థలపైన కూడా పడుతోంది.
దీనివల్ల మత్స్య సంపదపై, తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పూడిమడక మత్స్యకారులు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
పూడిమడక వద్ద ఏర్పాటు చేసిన పారిశ్రామిక మురుగునీటి శుద్ధి కర్మాగారం తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందనడానికి, మురుగునీరు సహజసిద్ధంగా కాలువల్లో కలిసిపోవడమే నిదర్శనం.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: హెచ్ఆర్ఎఫ్ డిమాండ్లు..
ఇది కేవలం ఒక చెదురుమదురు సంఘటన కాదని, ఒక పద్ధతి ప్రకారం నీటి వనరులను, వ్యవసాయ భూములను, ప్రజల ప్రాణాలను బుగ్గిపాలు చేయడమేనని హెచ్ఆర్ఎఫ్ విమర్శించింది.
సాంకేతిక కారణాలు చూపుతూ అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు తప్పించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
నీటి కాలుష్య నివారణ చట్టం(1974), పర్యావరణ పరిరక్షణ చట్టం(1986), హానికర వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలతో పాటు, చూసీచూడనట్లు వ్యవహరించిన ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులేనని పేర్కొంది.
దీనిపై తక్షణమే కోర్టు పర్యవేక్షణలో కానీ, స్వతంత్రంగా కానీ శాస్త్రీయ పరిశోధన జరిపించాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేసింది.
కాలుష్య ప్రభావిత గ్రామాల్లో సమగ్రమైన ఆరోగ్య, పర్యావరణ ప్రభావ అంచనా జరిపించాలని, ఉల్లంఘనులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని కోరింది.
పర్యావరణ నేరానికి సహకరించిన అధికారులపై స్వతంత్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణ నివేదికలను ప్రజలకు బహిర్గతం చేయడంతో పాటు, పాడైన భూములను, నీటి వనరులను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
జీవనోపాధి కోల్పోయిన రైతులు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట ప్రజలను బలిపశువులను చేయొద్దని హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే సుధా, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అనూరాధ, ఏపీ & టీజీ సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ ఈ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
