'Cockroach Party' Creates a Stir in India... A New Headache for the Modi Government.
వరుస ప్రాంతీయ ఎన్నికల విజయాల తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఊహించని మూలం నుంచి సవాలును ఎదుర్కొంటున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఏఐ ద్వారా రూపొందించిన “కాక్రోచ్ జనతా పార్టీ”(బొద్దింక పార్టీ) ఇప్పుడు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రపంచ ప్రసిద్ధ దినపత్రికలలో ఒకటైన ‘ఫైనాన్షియల్ టైమ్స్’ యూరప్ ఎడిషన్ మొదటి పేజీలోనే ఈ వార్తను ప్రచురించింది. “ది వైర్ తెలుగు” పాఠకుల కోసం దాని పూర్తి అనువాదం ఇక్కడ అందిస్తున్నాం.
నిస్పృహ చెందిన యువతే మోదీ ఎదుర్కొనబోయే ముప్పు..
అసహ్యకరమైన కీటకాన్ని(బొద్దింక) తన చిహ్నంగా స్వీకరించిన ఒక వ్యంగ్య నిరసన ఉద్యమం ఇటీవల భారత్‌లో వైరల్ అయింది.
పేదరికం, ఆర్థిక అసమానతలు, అధిక నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై యువతలో పెరుగుతున్న నిరాశకు ఇది ప్రతిబింబం. ఇది ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 కోట్ల మంది అనుచరులను సంపాదించుకుంది.
“కాక్రోచ్ జనతా పార్టీ” అనేది మోదీ భారతీయ జనతా పార్టీపై ఒక వ్యంగ్యాస్త్రం. అమెరికాలో నివసిస్తున్న భారతీయ పోస్ట్‌గ్రాడ్యుయేట్ అభిజిత్ దీప్కే దీనిని సృష్టించారు.
“వారు మనపై అడుగు వేయడానికి ప్రయత్నించారు. కానీ మేము తిరిగి వచ్చాము” అనేది ఈ పార్టీ ప్రధాన నినాదాలలో ఒకటి.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై ప్రతిస్పందన..
నిరుద్యోగ యువతను “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అని పోల్చి దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే దీప్కే ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
అయితే, తాను నకిలీ డిగ్రీలు కలిగిన యువ నిపుణుల గురించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని జస్టిస్ కాంత్ తర్వాత వివరణ ఇచ్చారు.
సూట్ వేసుకున్న బొద్దింక పోడియం దగ్గర నిలబడిన చిత్రాలను ఉపయోగిస్తూ, ఈ ఉద్యమం తనను తాను “సోమరిపోతుల, నిరుద్యోగుల వాయిస్” అని పిలుచుకుంటోంది.
“నిరంతరం సోమరిగా ఉంటూ, ఆన్లైన్లో ప్రస్తుతం బొద్దింకలు అని పిలవబడుతున్న” యువత కోసం ఒక వేదికను నిర్మించడమే తన లక్ష్యమని వ్యవస్థాపకుడు పేర్కొంటున్నారు.
పార్టీ ఐదు ప్రధాన డిమాండ్లు..
ఈ బొద్దింక పార్టీ ఐదు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చింది. వాటిలో పార్లమెంటు, మంత్రివర్గంలో లింగ సమానత్వం సాధించడం ఒకటవుతే.. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియాకు దారి ఇవ్వడం కోసం భారత్‌లోని ఇద్దరు అతి సంపన్నులైన వ్యాపారవేత్తలు గౌతమ్ అదాని, ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని మీడియా సంస్థలన్నింటి లైసెన్స్‌లను రద్దు చేయడం మరొకటి.
పెరుగుతున్న నిరుద్యోగం – ప్రభుత్వ చర్యలు..
ప్రస్తుతం భారత్‌లో యువత తీవ్ర నిరుద్యోగ సవాలును ఎదుర్కొంటోంది. ఉన్నత చదువులు చదివిన గ్రాడ్యుయేట్లు కూడా మంచి వేతనాల ఉద్యోగాల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో వచ్చినట్లుగా భారత్‌లో యువత నిరసన ఉద్యమాలు ఇంకా రోడ్లపైకి రాలేదు.
అయినప్పటికీ, ఈ బొద్దింక పార్టీ ఆన్లైన్లో వేగంగా విస్తరించడం పాలకుల్లో ఆందోళన కలిగిస్తోంది. జాతీయ భద్రతను దెబ్బతీసే ఆన్లైన్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రయోగిస్తూ, అధికారులు ఈ ఉద్యమపు అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాను బ్లాక్ చేయాలని ఆదేశించారు.
కుట్ర అన్న బీజేపీ.. మరణ బెదిరింపులు వస్తున్నాయన్న వ్యవస్థాపకుడు..
మరోవైపు, సీనియర్ బీజేపీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ ఉద్యమాన్ని “ముందే పన్నిన కుట్ర ఫలితం” అని ఖండించారు.
బీజేపీ చిహ్నమైన తామర పువ్వును బొద్దింక తింటున్న చిత్రాలను షేర్ చేసినందుకు గానూ తనకు ప్రస్తుతం మరణ బెదిరింపులు వస్తున్నాయని వ్యవస్థాపకుడు దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎక్స్(ట్విట్టర్)లో స్పందిస్తూ.. “ఈ ఉద్యమం దేశ యువతలోని ఒక ముఖ్యమైన జాతీయ అసంతృప్తి తీగను తాకిందనే విషయాన్ని నిరాకరించలేం.
ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఒకచోట కూర్చుని, వారి మాట వినాలి. యువతలోని అంతర్లీన అసంతృప్తిని పరిష్కరించాలి” అని రాశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
