విప్లవ సిధ్ధాంత సృష్టి కర్త కార్ల్ మార్క్స్ ప్రియ స్నేహితుడు
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ వర్ధంతి ఆగస్టు 5.
ఈ సందర్భం కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ మైత్రి వారి ఇరువురు కలిసి తయారు చేసిన మార్క్సిస్టు సిద్ధాంతం తదితర విషయాలను తెలుసుకుందాం.
“ప్రపంచ కార్మికుల విముక్తి కోసం తన సంపదను, మేధస్సును, జీవితాన్నే అంకితం చేసిన మహామనిషి ఫ్రెడ్రిక్ ఎంగెల్స్.” ప్రపంచ చరిత్రలో కొంతమంది వ్యక్తులు తమ జీవితకాలాన్ని మించి యుగాలపై ప్రభావం చూపుతారు. అలాంటి మహనీయులలో ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ఒకరు. ఆయనను కేవలం కార్ల్ మార్క్స్ సహచరుడిగా పేర్కొనడం ఆయన చేసిన సేవలను చిన్నబుచ్చినట్లే అవుతుంది. మార్క్సిజం అనే శాస్త్రీయ సిద్ధాంతానికి ఆయన సహనిర్మాత. కార్మిక వర్గ విముక్తి కోసం జీవితాంతం శ్రమించిన మేధావి. గొప్ప రచయిత, సమాజ శాస్త్రవేత్త, రాజకీయ ఆర్థికవేత్త, అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి మార్గదర్శి. ఎంగెల్స్ జీవితం ఒక విశేషమైన వైరుధ్యానికి ప్రతీక. ఒకవైపు ఆయన ధనిక పారిశ్రామికవేత్త కుమారుడు. మరోవైపు అదే పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీని శాస్త్రీయంగా విశ్లేషించి, దానిని ఎలా రద్దు చేయాలీ, దోపిడి రహిత సమ సమాజ స్థాపనకు మార్గ నిర్దేశం చేసి, కార్మిక వర్గ విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవకారుడు.
జననం:
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ 1820 నవంబర్ 28న జర్మనీలోని రైన్ ప్రావిన్స్‌లో ఉన్న బార్మెన్ (ప్రస్తుత వుప్పెర్టాల్) పట్టణంలో జన్మించారు. ఆ కాలంలో జర్మనీ నేటిలా ఒకే దేశంగా లేదు. అనేక చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. పారిశ్రామికీకరణ ప్రారంభమవుతున్నప్పటికీ భూస్వామ్య అవశేషాలు, రాజరిక పాలన, మతాధిపత్యం సమాజంపై బలమైన ప్రభావం చూపుతున్నాయి.
కుటుంబ నేపథ్యం:
ఎంగెల్స్ తండ్రి ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ సీనియర్ ప్రముఖ వస్త్ర పరిశ్రమ యజమాని. జర్మనీతో పాటు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో కూడా ఆయనకు పరిశ్రమలు ఉండేవి. తల్లి ఎలిజబెత్ ఫ్రాన్సిస్కా మౌరిషియా వాన్ హార్ విద్యావంతురాలు, సాహిత్యాభిమాని. ఆమె ప్రభావంతో ఎంగెల్స్ చిన్ననాటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్నారు.
కుటుంబం ప్రొటెస్టంట్ క్రైస్తవ మతాన్ని అనుసరించేది. క్రమశిక్షణ, కఠోర శ్రమ, వ్యాపార నైతికతలకు ప్రాధాన్యం ఇచ్చేది. అయితే యువకుడైన ఎంగెల్స్ మతపరమైన కట్టుబాట్లను ప్రశ్నించడం ప్రారంభించాడు. ప్రశ్నించడం ఆయన స్వభావమైంది. చిన్నప్పటి నుంచే ఆయనకు అసాధారణ జ్ఞాపకశక్తి ఉండేది. సాహిత్యం, చరిత్ర, తత్వశాస్త్రం, భాషలు, సంగీతం వంటి అనేక రంగాలపై ఆసక్తి చూపేవారు. జర్మన్‌తో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, లాటిన్, గ్రీకు భాషలను నేర్చుకున్నారు. తరువాత రష్యన్ భాషను కూడా అభ్యసించారు. జీవితాంతం అనేక భాషల్లో రచనలు చదివి, ప్రపంచ రాజకీయ పరిణామాలను అధ్యయనం చేశారు.
విద్యాభ్యాసం:
ఎంగెల్స్ స్థానిక పాఠశాలలో ప్రతిభ కనబరిచారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన కోరుకున్నప్పటికీ, కుటుంబ వ్యాపారంలో చేరాలని తండ్రి నిర్ణయించ డంతో విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేయలేక పోయారు. అయితే అది ఆయన జ్ఞానార్జనకు అది అడ్డంకి కాలేదు. స్వయం కృషితో తత్వశాస్త్రం, రాజకీయ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, ప్రకృతి శాస్త్రాలు, సాహిత్యం వంటి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. ఈ స్వయం అధ్యయనం వల్లే ఆయన తర్వాత కాలంలో ప్రపంచ ప్రఖ్యాత మేధావిగా ఎదిగారు.
ఎంగెల్స్పై హెగెల్ ప్రభావం:
ఆ కాలంలో జర్మనీలో జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ తత్వశాస్త్రం గొప్ప ప్రభావం చూపుతోంది. హెగెల్ ప్రతిపాదించిన “గతితార్కిక” ఆలోచనా విధానం ఎంగెల్స్‌ను ఆకర్షించింది. అయితే హెగెల్ భావవాద దృక్పథాన్ని యథాతథంగా స్వీకరించ కుండా, సమాజాన్ని భౌతిక పరిస్థితుల ఆధారంగా అర్థం చేసు కోవాలని ఆయన క్రమంగా అభివృద్ధి చెందారు. ఇదే తరువాత మార్క్స్‌తో కలిసి “గతితార్కిక భౌతికవాదం” రూపు దిద్దు కోవడానికి పునాది అయింది.
యువకుడిగా ఉన్నప్పుడే ఎంగెల్స్ పత్రికల్లో వ్యాసాలు రాయడం ప్రారంభించారు. సమాజంలోని అసమానత లు, కార్మికుల జీవితం, రాజకీయ పరిస్థితులపై ఆయన రచనలు అప్పటికే విమర్శనాత్మక దృష్టిని ప్రతి బింబించాయి. బ్రెమెన్ నగరంలో వ్యాపార శిక్షణ పొందుతున్న సమయంలో ఆయన పత్రికలకు మారు పేరుతో వ్యాసాలు పంపే వారు. రచయితగా ఆయన ప్రతిభ త్వరగా గుర్తింపు పొందింది.
జర్మనీ రాజకీయ పరిస్థితులు:
ఎంగెల్స్ యువకుడిగా ఎదుగుతున్న కాలంలో జర్మనీ ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పారిశ్రామికీ కరణతో కొత్త కార్మిక వర్గం ఏర్పడు తుండగా, పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా వేగంగా విస్తరిస్తోంది. సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృత మవు తుండగా, కార్మికులు తక్కువ వేతనాలతో, ఎక్కువ గంటలు పనిచేస్తూ తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. పరిస్థితులు ఎంగెల్స్ ను బాగా ప్రభావితం చేశాయి.
వ్యాపారవేత్త కుమారుడు – కార్మికుల మిత్రుడు:
కుటుంబ వ్యాపారంలో పనిచేస్తూనే, కర్మాగార కార్మికుల జీవన పరిస్థితులను పరిశీలించడం ఎంగెల్స్ అలవాటు చేసుకున్నారు. లాభాల వెనుక దాగి ఉన్న శ్రమ దోపిడిని ఆయన గమనించారు. “సంపదను సృష్టిం చేది కార్మికుడే. కానీ అత్యంత పేద వాడిగా ఎందుకు జీవిస్తున్నాడు?” అనే ప్రశ్న ఆయనను జీవితాంతం వెంటాడింది. ఈ ప్రశ్నకే సమాధానం వెతుకు తూ ఆయన శాస్త్రీయ పరిశోధన ప్రారంభించారు. ఈ తొలి అనుభవాలే ఎంగెల్స్‌ను మాంచెస్టర్ కు తీసు కెళ్లాయి. అక్కడ ఆయన పారిశ్రామిక విప్లవం యొక్క నిజస్వరూ పాన్ని ప్రత్యక్షంగా చూశారు. అదే అనుభవం ఆయనను కార్ల్ మార్క్స్‌కు అత్యంత సన్నిహితుడిగా మార్చింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన వారి మేధో భాగస్వామ్యం అక్కడి నుంచే ప్రారంభమైంది.
మాంచెస్టర్ పారిశ్రామిక విప్లవం–కార్మిక వర్గ జీవితం:
“ఒక యువ పారిశ్రామికవేత్త కుమారుడిని ప్రపంచ కార్మిక వర్గ మేధావిగా మార్చిన నగరం – మాంచెస్టర్.” ఎంగెల్స్ జీవితంలో అత్యంత నిర్ణయాత్మక మైన మలుపు ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ నగరంలో ప్రారంభమైంది. ఈ నగరమే ఆయనకు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అసలు స్వరూపాన్ని చూపించింది. తరువాత ఆయన రాసిన ప్రతి ప్రధాన రచనకు, మార్క్స్‌తో కలిసి నిర్మించిన శాస్త్రీయ సామ్య వాద సిద్ధాంతానికి కూడా మాంచెస్టర్ అనుభవాలే బలమైన పునాదిగా నిలిచాయి.
పారిశ్రామిక విప్లవం–కొత్త యుగం, కొత్త వైరుధ్యాలు:
18వ శతాబ్దం చివరి నుండి ఇంగ్లాండ్ లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక మహత్తర మార్పు తెచ్చింది. యంత్రాలు, ఆవిరి ఇంజిన్లు, పెద్ద కర్మా గారాలు, కొత్త ఉత్పత్తి విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చి వేశాయి. మాంచెస్టర్ ను అప్పట్లో “కాటన్ పోలిస్” అని పిలిచేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి పరిశ్రమల కేంద్రంగా అది ఎదిగింది. కానీ ఒక వైపు పరిశ్రమల యజమానులు అపారమైన సంపదను కూడ బెట్టగా, మరోవైపు కార్మికులు దరిద్ర్యం, ఆకలి, అనారోగ్యం, అసురక్షిత జీవితం మధ్య బతుకుతున్నారు.
ఈ వైరుధ్యం ఎంగెల్స్‌ను తీవ్రంగా కలచివేసింది.
కుటుంబ వ్యాపారంలో ఉద్యోగం:
1842లో ఎంగెల్స్ తన తండ్రి భాగస్వామిగా ఉన్న Ermen & Engels సంస్థలో పనిచేయ డానికి మాంచెస్టర్‌కు వచ్చారు. తండ్రి ఆశయం ఒక విజయవంతమైన వ్యాపార వేత్తను తయారు చేయడం. కానీ కుమారుడు మాత్రం కర్మాగారాల లాభనష్టాల కంటే, అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల జీవితాలనే ఎక్కువగా గమనించడం ప్రారం భించాడు. ఎంగెల్స్ కేవలం కార్యాలయంలో కూర్చొని నివేదికలు చదవలేదు. కర్మాగారాలను సందర్శించారు. కార్మికులతో మాట్లాడారు. వారి ఇళ్లకు వెళ్లారు. మురికివాడల్లో తిరిగారు. అక్కడ ఆయన చూసిన దృశ్యాలు భయానక మైనవి. రోజుకు 14–16 గంటల పని. ఐదు, ఆరు సంవత్సరాల చిన్న పిల్లలతో కూడా కఠినమైన పని. మహిళలకు పురుషుల కంటే తక్కువ వేతనం. ప్రమాదకర యంత్రాల వల్ల తరచూ ప్రమాదాలు. పరిశుభ్రమైన తాగునీరు లేకపోవడం. ఒకే గదిలో పెద్ద కుటుంబాలు జీవించడం. కలరా, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధుల విజృంభణ. ఆయన తరువాత ఇలా వ్యాఖ్యానించారు. “పెట్టుబడిదారీ సంపద పెరుగుతున్న కొద్దీ, కార్మికుల దారిద్ర్యమూ పెరుగుతోంది.”
మాంచెస్టర్ లో ఎంగెల్స్ జీవితంలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి మేరీ బర్న్స్. మేరీ ఐరిష్ కార్మిక కుటుంబానికి చెందిన యువతి. ఆమెకు మాంచెస్టర్ కార్మిక ప్రాంతాలపై మంచి అవగాహన ఉండేది. మేరీ ఎంగెల్స్‌ను అధికారిక అతిథులు ఎప్పుడూ చూడని ప్రాంతాలకు తీసుకెళ్లింది. కార్మికులు ఎలా జీవిస్తున్నారో, వారి కుటుంబాలు ఎలా బతుకు తున్నాయో, పిల్లలు ఎలా పని చేస్తున్నారో ప్రత్యక్షంగా చూపించింది. ఎంగెల్స్ తరువాత తన పరిశోధనల్లో మేరీ చేసిన సహాయాన్ని ఎంతో విలువైనది గా భావించారు. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మేరీ బర్న్స్ లేకపోతే “The Condition of the Working Class in England” వంటి గ్రంథం ఆ రూపంలో వెలువడేది కాదు.
ఎంగెల్స్ కేవలం భావోద్వేగం తో స్పందించలేదు. ఆయన ఒక పరిశోధకుడి లా పని చేశారు. ఆయన ప్రభుత్వ నివేదికలు అధ్యయనం చేశారు. వైద్యుల నివేదికలను సేకరించారు. జనాభా గణాంకాలను విశ్లేషించారు. కార్మిక సంఘాల నాయకుల తో మాట్లాడారు. ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా నోట్స్ తయారు చేసి కున్నారు. అందుకే ఆయన రచనలు భావోద్వేగ ప్రసంగాలు గా కాకుండా శాస్త్రీయ సామాజిక విశ్లేషణలు గా నిలిచాయి.
ఇంగ్లాండ్ లో కార్మిక వర్గ పరిస్థితి:
1845లో వెలువడిన ఈ గ్రంథం సామాజిక శాస్త్ర చరిత్రలో ఒక మైలురాయి. ఈ గ్రంధం లో ఎంగెల్స్ కేవలం దారిద్ర్యాన్ని మాత్రమే వర్ణించ లేదు. దానికి కారణమైన ఆర్థిక వ్యవస్థను విశ్లేషించారు. ఆయన ప్రధాన నిర్ధారణ లు-కార్మికుల పేదరికం వ్యక్తిగత వైఫల్యం కాదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే దోపిడీ అంతర్భాగం. సంపదను సృష్టిం చేది కార్మికులు. కానీ ఆ సంపదపై హక్కు పెట్టుబడిదారులకు మాత్రమే దక్కుతోంది. కార్మిక వర్గం సంఘటిత మైతేనే పరిస్థితి మారుతుంది. ఈ గ్రంథాన్ని నేటికీ ప్రపంచవ్యాప్తంగా కార్మిక చరిత్రపై అత్యంత ప్రామాణిక రచనలలో ఒకటిగా పరిగణిస్తారు.
మాంచెస్టర్–మార్క్స్ ఆలోచనలకు పునాది:
మాంచెస్టర్ లో సేకరించిన అనుభవాలు, గణాంకాలు, పరిశీలనలు తరువాత మార్క్స్ తో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించాయి. వర్గ పోరాటం, అదనపు విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాల పై ఇద్దరూ మరింత లోతైన అధ్యయనం చేయడానికి ఈ అనుభవాలు దోహద పడ్డాయి. ఎంగెల్స్ కు వ్యాపారం అంటే ఆసక్తి లేదు. అయినప్పటికీ, మార్క్స్ కు ఆర్థిక సహాయం చేయాలనే సంకల్పంతో అనేక సంవత్సరాలు వ్యాపారంలో కొనసాగారు. తరువాత ఆయన ఒక లేఖలో ఇలా రాశారు. “వ్యాపారం నా అభిరుచి కాదు, కానీ మార్క్స్ తన పరిశోధన కొనసాగించా లంటే నేను దీనిని భరించాల్సి వచ్చింది.”
ఎంగెల్స్ కు మాంచెస్టర్ కేవలం ఒక ఉద్యోగ స్థలం కాదు. అదే ఆయన విశ్వవిద్యాలయం. అక్కడే ఆయన కార్మిక వర్గాన్ని అర్థం చేసుకున్నారు. అక్కడే శాస్త్రీయ పరిశోధకుడిగా ఎదిగారు. అక్కడే పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించే సిద్ధాంతానికి బలమైన పునాది వేశారు. అందుకే చరిత్రకారులు ఇలా అంటారు-“మార్క్సిజం పుట్టుకకు లండన్ ఎంత ముఖ్యమో, దాని రూపకల్పనకు మాంచెస్టర్ అంత ముఖ్యమైనది.”
కార్ల్ మార్క్స్‌తో చారిత్రాత్మక మైత్రి–కమ్యూనిస్టు మానిఫెస్టో ఆవిర్భావం:
“చరిత్రలో కొన్ని స్నేహాలు ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాదు, యుగాల గమనాన్ని కూడా మార్చి వేస్తాయి. మార్క్స్–ఎంగెల్స్ మైత్రి అలాంటి అపూర్వ ఉదాహరణ.” 19వ శతాబ్దం లో ప్రపంచ సామాజిక, రాజకీయ, ఆర్థిక ఆలోచన లను అత్యంత ప్రభావితం చేసిన ఇద్దరు మహా మేధావులు కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిక్ ఎంగెల్స్. వారి స్నేహం వ్యక్తిగత అనుబంధం మాత్రమే కాదు, అది ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను మలిచిన మేధో భాగస్వామ్యం.
మార్క్స్ తో తొలి పరిచయం:
ఎంగెల్స్, మార్క్స్ తొలిసారిగా 1842లో జర్మనీలోని కొలోన్ నగరంలో కలుసుకున్నారు. ఆ సమయంలో మార్క్స్ రైనిషే సైటుంగ్ (Rheinische Zeitung) పత్రికకు సంపాదకుడిగా పని చేస్తున్నారు. ఆ తొలి భేటీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించి నప్పటికీ, సుదీర్ఘ చర్చ జరగ లేదు. కానీ చరిత్ర అక్కడితో ఆగలేదు. 1844 ఆగస్టులో ఎంగెల్స్ మాంచెస్టర్ నుండి తిరిగి వస్తూ పారిస్ లో మార్క్స్ ను కలిశారు. ఈసారి వారి సంభాషణ దాదాపు పది రోజుల పాటు కొనసాగింది. ఈ చర్చలలో ఇద్దరూ గ్రహించిన దేమంటే సమాజాన్ని అర్థం చేసు కోవాలంటే ఆర్థిక సంబంధా లను విశ్లేషించాలి. చరిత్రను ముందుకు నడిపేది రాజుల చరిత్ర కాదు ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటాల చరిత్ర. కార్మిక వర్గమే సమాజ మార్పుకు ప్రధాన శక్తి. ఈ సమావేశం తరువాత ఇద్దరూ జీవితాంతం విడదీయరాని సహచరు లయ్యారు. ఎంగెల్స్ కు పరిశ్రమల అనుభవం, కార్మికుల జీవితంపై ప్రత్యక్ష అవగాహన ఉండేది. మార్క్స్ కు రాజకీయ ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్రం, చరిత్రపై అసాధారణ విశ్లేషణా సామర్థ్యం ఉండేది. ఈ రెండు శక్తులు కలిసి శాస్త్రీయ సామ్యవాద సిధ్ధాంతం రూపు దిద్దుకుంది.
ది హోలీ ఫ్యామిలీ:
1845లో ఇద్దరూ కలిసి రచించిన “ది హోలీ ఫ్యామిలీ” వారి మొదటి ప్రధాన ఉమ్మడి రచన. ఈ గ్రంథంలో వారు జర్మన్ భావ వాద తత్వ శాస్త్రాన్ని విమర్శిస్తూ, వాస్తవ జీవితంలోని భౌతిక పరిస్థితు ల ప్రాముఖ్యతను వివ రించారు.1845–46లో ఇద్దరూ కలిసి “ది జర్మన్ ఐడియాలజీ” రచించారు. ఈ గ్రంథం లోనే వారు మొదటి సారిగా చారిత్రక భౌతికవాదం సిద్ధాంతాన్ని సమగ్రంగా వివరించారు. వారి దృష్టిలో సమాజ అభివృద్ధికి మూలం ఉత్పత్తి విధానాలు. ఆర్థిక నిర్మాణమే రాజకీయ, న్యాయ, సాంస్కృతిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ప్రతి చారిత్రక యుగంలో వర్గాల మధ్య సంఘర్షణ సమాజ మార్పుకు కారణమవుతుంది. ఈ రచన ఆ సమయంలో ప్రచురించ బడక పోయినా, తరువాత మార్క్సిస్టు సిద్ధాంతానికి పునాదిగా గుర్తించబడింది.
మార్క్స్ కుటుంబానికి ఎంగెల్స్ అండ:
మార్క్స్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. పిల్లల వైద్య ఖర్చులు కూడా భరించలేని పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. ఈ సమయంలో ఎంగెల్స్ తన వ్యాపార ఆదాయంలో పెద్ద భాగాన్ని మార్క్స్ కుటుంబానికి పంపేవారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన మార్క్స్ కు నిరంతర ఆర్థిక సహాయం అందించారు. మార్క్స్ ఒకసారి ఇలా రాశారు-“ఎంగెల్స్ లేకపోతే నేను నా పరిశోధనలను పూర్తి చేయలేక పోయే వాడిని.” ఈ మాటలు వారి స్నేహ గాఢత కు నిదర్శనం.
కమ్యూనిస్టు లీగ్-కమ్యూనిస్టు మానిఫెస్టో:
1847లో ఇద్దరూ కమ్యూనిస్టు లీగ్ లో చేరారు. ఈ సంస్థ వారికి ఒక చారిత్రక బాధ్యత అప్పగించింది. సంస్థ సిద్ధాంతాన్ని వివరించే కార్యక్రమ పత్రం (Manifesto) రూపొందించడం. 1848 ఫిబ్రవరిలో వెలువడిన “కమ్యూనిస్టు మానిఫెస్టో” ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ శీల రాజకీయ గ్రంథాలలో ఒకటి. ప్రపంచం లోని అనేక భాషలలోకి అనువదించి లక్షల సంఖ్యలో ముద్రించ బడ్డాయి. దాని ప్రారంభ వాక్యం “ఒక భూతం యూరప్ ను వెంటాడుతోంది—కమ్యూనిజం అనే భూతం.” ముగింపు పిలుపు: “ప్రపంచ కార్మికులారా, ఏకం కండి! మీకు కోల్పోవడానికి సంకెళ్లు తప్ప మరేమీ లేవు. గెలుచు కోవాల్సిన ఒక ప్రపంచం ఉంది.” ఈ నినాదం ప్రపంచ కార్మిక ఉద్యమానికి శాశ్వత చిహ్నంగా మారింది.
మానిఫెస్టో ప్రధాన భావాలు:
ఈ గ్రంథంలో మార్క్స్, ఎంగెల్స్ వివరించిన ముఖ్యాంశాలు- ఇప్పటివరకు ఉన్న సమాజ చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్ర. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేసి నప్పటికీ, తీవ్రమైన అస మానతలను కూడా సృష్టించింది. కార్మిక వర్గం సంఘటితమై సమాజాన్ని మార్చ గలదు. ఉత్పత్తి సాధనాల పై సామాజిక యాజమాన్యం అవసరం. అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతే భవిష్యత్ సమాజ నిర్మాణానికి పునాది.
మానిఫెస్టో ప్రచురితమైన కొద్ది రోజులకే యూరప్ లో విప్లవాలు ప్రారంభ మయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ తదితర దేశాలలో ప్రజలు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడారు. మార్క్స్, ఎంగెల్స్ ఈ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. విప్లవాలు తాత్కాలికంగా ఓడిపోయినా, కార్మిక వర్గ రాజకీయ చైతన్యం మరింత బలపడింది.
ఉత్తర ప్రత్యుత్తరాలు:
మార్క్స్, ఎంగెల్స్ జీవితకాలంలో వందలాది లేఖలు ఒకరికొకరు రాసు కున్నారు. ఆ లేఖల లో ఆర్థిక సిద్ధాంతాల పై చర్చలు, రాజకీయ పరిణామాల విశ్లేషణ, అంతర్జాతీయ కార్మిక ఉద్యమ వ్యూహాలు, శాస్త్రీయ పరిశోధనలు, వ్యక్తిగత సమస్యలు వివరంగా కనిపిస్తాయి. నేటికీ ఈ లేఖలు 19వ శతాబ్దపు అత్యంత విలువైన మేధో పత్రాలుగా పరిగణించబడు తున్నాయి.
ప్రపంచ చరిత్రలో అరుదైన మైత్రి:
చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ ఒక సందర్భంలో మార్క్స్–ఎంగెల్స్ సంబంధాన్ని ప్రపంచ మేధో చరిత్రలో అత్యంత సృజనాత్మక భాగస్వామ్యాల లో ఒకటిగా పేర్కొన్నారు. వారిద్దరి మధ్య అసూయ లేదు. వ్యక్తిగత కీర్తి కోసం పోటీ లేదు. లక్ష్యం ఒక్కటే కార్మిక వర్గ విముక్తి. 1844లో పారిస్ లో ప్రారంభమైన ఈ మైత్రి, మార్క్స్ మరణించే వరకు కొనసాగింది. మార్క్స్ సిద్ధాంత నిర్మాణానికి ఎంగెల్స్ మేధస్సు, అనుభవం, ఆర్థిక సహాయం, సంఘటనా నైపుణ్యం వెన్నెముకగా నిలిచాయి. అందువల్ల ప్రపంచ చరిత్రలో మార్క్స్ పేరు ఎక్కడ ఉంటుందో, అక్కడే ఎంగెల్స్ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది.
గతితార్కిక భౌతిక వాదం – చారిత్రక భౌతికవాదం – వర్గ పోరాట సిద్ధాంతం:
“తత్వవేత్తలు ఇప్పటివరకు ప్రపంచాన్ని విశ్లేషించి వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు. కానీ అసలు అవసరం ప్రపంచాన్ని మార్చడం.” ఈ భావానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన వారిలో ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ఒకరు. మార్క్స్, ఎంగెల్స్ కు ముందు కూడా సమానత్వ సమాజం గురించి అనేక మంది ఆలోచించారు. కానీ వారు ప్రధానంగా నైతిక విలువలు, మానవతా దృక్పథం ఆధారంగా ఆదర్శ సమాజాన్ని ఊహించారు. ఎంగెల్స్, మార్క్స్ మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. వారు ఇలా ప్రశ్నించారు. సమాజం ఎలా మారుతుంది? అసమానతలు ఎందుకు ఏర్పడతాయి? ఆర్థిక వ్యవస్థ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? కార్మిక వర్గం ఎందుకు పేదరికం లోనే ఉంటుంది? ఈ ప్రశ్నలకు చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సమాజ శాస్త్రం ఆధారంగా సమాధానాలు వెతికారు. అందుకే వారి సిద్ధాంతాన్ని “శాస్త్రీయ సామ్యవాదం” అని పిలుస్తారు.
గతితార్కిక భౌతికవాదం:
ఈ భావనను అర్థం చేసుకోవడానికి రెండు పదాలను విడిగా చూడాలి.
- గతి తార్కికం. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రకృతి మారుతుంది. సమాజం మారుతుంది. మనిషి ఆలోచనలు మారుతాయి. మార్పు అనేది ప్రకృతి ధర్మం. చిన్నచిన్న మార్పులు ఒక దశలో పెద్ద గుణాత్మక మార్పుకు దారితీస్తాయి. ఉదాహరణకు నీటిని వేడి చేస్తే మొదట ఉష్ణోగ్రత మాత్రమే పెరుగుతుంది. 100°C వద్ద అది ఆవిరిగా మారుతుంది. ఇది పరిమాణా త్మక మార్పు గుణాత్మక మార్పుగా మారడం. ఎంగెల్స్ తన “Dialectics of Nature” గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలతో ప్రకృతిలో మార్పు సూత్రాలను వివరించారు.
- భౌతికవాదం. మనుషుల ఆలోచనలు మాత్రమే చరిత్రను నిర్మించవు. వారి జీవన పరిస్థితులు, ఉత్పత్తి విధానం, ఆర్థిక సంబంధాలే సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే “ముందు జీవనాధారం, తరువాత తత్వం.” ఆహారం, వస్త్రం, నివాసం వంటి అవసరాలను తీర్చే ఉత్పత్తి వ్యవస్థ సమాజానికి పునాది అని ఎంగెల్స్ వివరించారు.
చారిత్రక భౌతికవాదం:
ఇది మార్క్స్, ఎంగెల్స్ ల అత్యంత ప్రసిద్ధ సిద్ధాంతాలలో ఒకటి. దీని ప్రకారం చరిత్ర అనేది రాజులు, యుద్ధాలు, మహా నాయకుల చరిత్ర మాత్రమే కాదు. అది ఉత్పత్తి విధానాల మార్పుల చరిత్ర. మార్క్స్, ఎంగెల్స్ ల ప్రకారం మానవ సమాజం ప్రధానంగా ఈ దశల ద్వారా అభివృద్ధి చెందింది. ఆదిమ సామూహిక సమాజం. బానిస సమాజం. భూస్వామ్య సమాజం. పెట్టుబడిదారీ సమాజం. సోషలిస్ట్ సమాజం. కమ్యూనిస్టు సమాజం. ప్రతి దశలో ఉత్పత్తి సంబంధాలు మారాయి. అందుకు అనుగుణంగానే రాజకీయ వ్యవస్థలు, చట్టాలు, సంస్కృతి కూడా మారాయి.
వర్గ పోరాట సిద్ధాంతం:
“ఇప్పటివరకు ఉన్న సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే.”ఈ వాక్యం కమ్యూనిస్టు మానిఫెస్టోలో అత్యంత ప్రసిద్ధమైనది. చరిత్రలో బానిసలు × యజమానులు, రైతులు × భూస్వాములు, కార్మికులు × పెట్టుబడిదారులు మధ్య ప్రయోజన వైరుధ్యాలు ఉన్నాయని వారు విశ్లేషించారు. ఈ వైరుధ్యాలే సామాజిక మార్పులకు దారి తీస్తాయని వారు సిధ్ధాంతీ కరించారు.
పెట్టుబడి దారీ వ్యవస్థపై ఎంగెల్స్ విశ్లేషణ:
ఎంగెల్స్ పెట్టుబడిదారీ వ్యవస్థను ఒకే కోణంలో చూడలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ సాధించిన పురోగతి-భారీ ఉత్పత్తి, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి, ప్రపంచ మార్కెట్ నిర్మాణం, రవాణా, సమాచార రంగాల విస్తరణ. ఇవి చారిత్రకంగా ప్రగతిశీల పరిణామాలే. అయితే ఇందులో అనేక వైరుధ్యా లున్నాయి. అంతర్గత వైరుధ్యాలు- సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకరణ. కార్మిక శ్రమ దోపిడీ. నిరుద్యోగం. ఆర్థిక సంక్షోభాలు. ఉత్పత్తి పెరిగినా కొనుగోలు శక్తి తగ్గడం. సంపద పెరుగుతుండగా అసమానతలు మరింత పెరగడం వైరుధ్యాలను ఆయన విశ్లేషించారు.
తన ప్రసిద్ధ గ్రంథం “The Origin of the Family, Private Property and the State”లో ఎంగెల్స్ దేశం గురించి విస్తృతంగా చర్చించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశం శాశ్వత సంస్థ కాదు. సమాజంలో వర్గ విభజనలు ఏర్పడిన తరువాత అది అభివృద్ధి చెందింది. చరిత్రలో దేశ రూపాలు మారుతూ వచ్చాయి. ఈ విశ్లేషణ సామాజిక శాస్త్రాలలో విస్తృత చర్చకు దారితీసింది.
ఎంగెల్స్ కుటుంబ వ్యవస్థను కూడా చారిత్రక దృష్టితో పరిశీలించారు. ఆయన అభిప్రాయం ప్రకారం కుటుంబ రూపాలు కాలానుగుణంగా మారాయి. వ్యక్తిగత ఆస్తి అభివృద్ధి కుటుంబ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. మహిళల స్థానం కూడా ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంది. ఈ ఆలోచనలు తరువాత మహిళా అధ్యయనాలపై కూడా ప్రభావం చూపాయి.
ఎంగెల్స్కు కేవలం రాజకీయాలపై మాత్రమే ఆసక్తి లేదు. ఆయన భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, భూగర్భ శాస్త్రం వంటి అనేక రంగాలను అధ్యయనం చేశారు. ప్రకృతి శాస్త్రాల్లో జరుగుతున్న కొత్త ఆవిష్కరణలను సమాజ తత్వంతో అనుసంధానించ డానికి ప్రయత్నించారు.
ఎంగెల్స్ సిద్ధాంతాల పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి. కొంతమంది చరిత్రకారులు ఆయన విశ్లేషణలు ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకోవ డంలో ఎంతో ఉపయోగ కరమని భావిస్తారు. మరికొందరు కొన్ని అంశాల్లో ఆయన చేసిన అంచనాలు పూర్తిగా నిజం కాదని విమర్శిస్తారు. అయితే, పారిశ్రామిక సమాజం, కార్మికుల జీవితం, అసమానత లపై ఆయన చేసిన అధ్యయనాలు సామాజిక శాస్త్రాలలో ఇప్పటికీ విస్తృతంగా చర్చించబ డుతున్నాయి.
నేటి ప్రపంచంలో ఎంగెల్స్ ప్రాసంగికత:
నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశాలు ఆదాయ అసమానతలు. కార్మిక హక్కులు. గిగ్ ఆర్థిక వ్యవస్థ. నిరుద్యోగం. కార్పొరేట్ కేంద్రీకరణ. ఉద్యోగ భద్రత. సామాజిక భద్రత. ఈ సమస్యలపై చర్చలలో ఎంగెల్స్ రచనలు ఇప్పటికీ ప్రామాణీక మే. ఆయన ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని అందరూ అంగీకరించక పోయినా, ఆధునిక పెట్టుబడిదారీ సమాజాన్ని విశ్లేషించడం లో ఆయన రచనలు ప్రభావ వంత మైన మేధో సంపదగా కొనసాగు తున్నాయి.
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ గొప్పతనం కేవలం ఒక సిద్ధాంతాన్ని ప్రతి పాదించడంలో లేదు. చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సమాజ శాస్త్రం, ప్రకృతి శాస్త్రాల అధ్యయ నాన్ని కలిపి సమాజాన్ని అర్థం చేసుకునే ఒక విశ్లేషణాత్మక పద్ధతిని అభివృద్ధి చేయ డంలో ఉంది. అందువల్లనే ఆయనను ప్రపంచ సామాజిక శాస్త్ర చరిత్రలో అత్యంత ప్రభావ శీల మేధావుల లో ఒకరిగా in గుర్తిస్తారు.
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ప్రధాన గ్రంథాలు – సమగ్ర విశ్లేషణ:
“ఒక రచయిత గొప్పతనం అతను ఎన్ని పుస్తకాలు రాశాడనే దానిలో లేదు; ఆ పుస్తకాలు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయనే దానిలో ఉంది.” ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ రచనలు రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, కుటుంబ వ్యవస్థ, ప్రకృతి శాస్త్రం వంటి అనేక రంగాలను స్పృశిం చాయి. ఆయన ప్రతి గ్రంథం ఒక నిర్దిష్ట సమస్యను పరిశీలించి నప్పటికీ, వాటన్నింటినీ కలిపే ఒక ప్రధాన లక్ష్యం ఉంది. అదే సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం.
The Condition of the Working Class in England (1845):
1842–1844 మధ్య మాంచెస్టర్ లో గడిపిన కాలంలో ఎంగెల్స్ వేలాది కార్మికుల జీవితాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వారి నివాసాలు, పని వేళలు, ఆరోగ్య పరిస్థితులు, బాల కార్మిక వ్యవస్థ, మహిళా కార్మికుల దుస్థితి వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితమే ఈ గ్రంథం. ఇందులోని ప్రధాన అంశాలు-పారిశ్రామిక విప్లవం వల్ల ఏర్పడిన సామాజిక మార్పులు. పట్టణీకరణ తో వచ్చిన ఆరోగ్య సమస్యలు. కార్మిక వర్గ దారిద్ర్యం. బాల కార్మిక వ్యవస్థ. మహిళలపై ఆర్థిక దోపిడీ. గృహ వసతి సమస్యలు. ఈ గ్రంథం భావోద్వేగ రచన కాదు. ప్రభుత్వ నివేదికలు, గణాంకాలు, ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా రూపొందిన సామాజిక పరిశోధన. నేటికీ ఇది ప్రపంచ కార్మిక వర్గ చరిత్రలో ఒక క్లాసిక్ గ్రంథంగా పరిగణించబడుతోంది.
2.The Holy Family (1845):
ఈ గ్రంథాన్ని ఎంగెల్స్, మార్క్స్ కలిసి రచించారు. ఇందులో వారు ఆ కాలంలోని జర్మన్ భావ వాద తత్వ వేత్తల అభిప్రాయాలను విమర్శించారు. ప్రధానంగా వారు చెప్పిన విషయం “సమాజాన్ని మార్చేది కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, వాస్తవ జీవన పరిస్థితులు కూడా అంతే ముఖ్యమైనవి.”
3.The German Ideology (1845–46):
ఈ గ్రంథం మార్క్స్–ఎంగెల్స్ ఉమ్మడి రచనలలో అత్యంత ముఖ్యమైనది. ఇందులోని ప్రధాన అంశాలు చారిత్రక భౌతికవాదం. ఉత్పత్తి విధానాల పాత్ర. వర్గ పోరాటం. సమాజ వికాస దశలు. ఈ గ్రంథం వారి తాత్విక ఆలోచనలకు పునాది వేసింది.
4.Anti-Dühring (1878):
ఇది ఎంగెల్స్ అత్యంత విస్తృతమైన రచనలలో ఒకటి. ఆ కాలంలో ప్రముఖ రచయిత యూజెన్ డ్యూరింగ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను విమర్శిస్తూ ఈ గ్రంథం రాశారు. కానీ ఇది కేవలం విమర్శ మాత్రమే కాదు. ఇందులో చర్చించిన అంశాలు-తత్వశాస్త్రం, రాజకీయ ఆర్థిక శాస్త్రం, సామ్యవాద సిద్ధాంతం, విజ్ఞాన శాస్త్రం, సమాజ వికాసం. ఈ గ్రంథాన్ని చాలామంది “మార్క్సిజానికి విశ్వకోశం” అని కూడా అభివర్ణిస్తారు.
5.Socialism: Utopian and Scientific (1880):
ఇది Anti-Dühring గ్రంథంలోని కొన్ని అధ్యా యాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన చిన్న పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా చదివిన ఎంగెల్స్ రచనలలో ఇదొకటి. ఇందులో ప్రధానంగా చర్చించింది “ఆదర్శ సామ్యవాదం” (Utopian Socialism) మరియు “శాస్త్రీయ సామ్యవాదం” (Scientific Socialism) మధ్య తేడా ఏమిటి? ఎంగెల్స్ అభిప్రాయం ప్రకారం కేవలం మంచి సమాజాన్ని ఊహించడం సరిపోదు. సమాజం ఎలా మారుతుందో శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంబంధాలు, చరిత్ర, వర్గాల పాత్రను అధ్యయనం చేయాలి. ఈ పుస్తకం మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సాధారణ పాఠకులకు పరిచయం చేసిన ప్రముఖ రచన.
6.The Origin of the Family, Private Property and the State (1884):
ఇది ఎంగెల్స్ అత్యంత ప్రభావ శీల రచనలలో ఒకటి. అమెరికన్ మానవ శాస్త్రవేత్త లూయిస్ హెచ్. మోర్గాన్ పరిశోధనలను ఆధారంగా చేసుకుని ఆయన ఈ గ్రంథాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు-కుటుంబ వ్యవస్థ పరిణామం. వ్యక్తిగత ఆస్తి ఆవిర్భావం. దేశం నిర్మాణం. మహిళల సామాజిక స్థానం. ఈ గ్రంథం సమాజ శాస్త్రం, మానవ శాస్త్రం, మహిళా అధ్యయనాల పై విశేష ప్రభావం చూపింది. అయితే, మోర్గాన్ కాలం తర్వాత పురావస్తు, మానవ శాస్త్ర పరిశోధనల్లో వచ్చిన కొత్త ఆధారాల వెలుగులో ఈ గ్రంథంలోని కొన్ని చారిత్రక నిర్ధారణ లపై నేటి పండితు ల్లో చర్చలు, భిన్నాభి ప్రాయాలు కూడా ఉన్నాయి.
7.Dialectics of Nature:
ఈ గ్రంథం ఎంగెల్స్ మరణానంతరం ప్రచురించబడింది. ఇందులో ఆయన ప్రకృతి శాస్త్రాలు, జీవ పరిణామం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి రంగాలను తాత్విక దృక్పథంతో విశ్లేషించారు. ఇందులో ఆయన ప్రకృతి కూడా నిరంతర మార్పు లోనే ఉంటుందని వివరించారు.
8.The Peasant War in Germany:
ఈ గ్రంథంలో 16వ శతాబ్దపు జర్మన్ రైతాంగ తిరుగు బాటును విశ్లేషించారు. ఎంగెల్స్ అభిప్రాయం ప్రకారం రైతాంగ ఉద్యమాలను వాటి సామాజిక, ఆర్థిక నేపథ్యంతో అర్థం చేసుకోవాలి. మతపర మైన నినాదాల వెనుక కూడా ఆర్థిక కారణాలు ఉండవచ్చు. చరిత్రను వర్గ దృక్పథంతో విశ్లేషించిన రచనలలో ఇది ప్రముఖ మైనది.
9.లుద్విగ్ ఫ్యూర్బాఖ్ – జర్మన్ సాంప్రదాయ తాత్వికతకు ముగింపు:
1886లో ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ రచించిన ఈ గ్రంథం జర్మన్ తత్వశాస్త్ర పరిణామాన్ని విశ్లేషించే ఒక ప్రముఖ రచన. ముఖ్యంగా ఇమ్మాన్యు యేల్ కాంత్, హెగెల్, లుద్విగ్ ఫ్యూర్ బాఖ్ తాత్విక భావజాలాన్ని సమీక్షిస్తూ, మార్క్స్–ఎంగెల్స్ అభివృద్ధి చేసిన గతితార్కిక భౌతిక వాదం ఎలా రూపు దిద్దు కుందో వివరిస్తుంది.
హెగెల్ తత్వశాస్త్రం లో హెగెల్ “గతి తర్కం” అనే గొప్ప పద్ధతిని అభివృద్ధి చేశాడు. కానీ ఆయన భావ వాది. అంటే, భావాలే ప్రపంచానికి మూలమని నమ్మాడు. హెగెల్ గతి తర్క పద్ధతి గొప్ప దైనా, దానిని భావ వాదానికి పరిమితం చేశాడు. లుద్విగ్ ఫ్యూర్ బాఖ్ పాత్రపై ఫ్యూర్ బాఖ్ భావ వాదాన్ని విమర్శించి భౌతిక వాదానికి ప్రాధాన్యం ఇచ్చాడు. మతం మనిషి సృష్టే నని, దేవుడు మానవుని ఊహల ప్రతిబింబ మని వాదించాడు. అయితే, ఫ్యూర్ బాఖ్ సమాజం, చరిత్ర, వర్గ సంబంధాలపై తగినంత దృష్టి పెట్టలేదని ఎంగెల్స్ విమర్శిం చాడు. హెగెల్ నుంచి గతి తర్కాన్ని, ఫ్యూర్ బాఖ్ నుంచి భౌతిక వాదాన్ని స్వీకరించారు. ఈ రెండింటిని సమన్వయ పరచి గతితార్కిక భౌతిక వాదాన్ని అభివృద్ధి చేశారు.
సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం ప్రకృతిని కాదు, ఉత్పత్తి సంబంధాలు, వర్గ పోరాటం, చారిత్రక మార్పులను కూడా అధ్యయనం చేయాలని వివరించారు.
10.మార్క్స్ రచనల సంపాదకుడు: ఎంగెల్స్ స్వయంగా గొప్ప రచయిత మాత్రమే కాదు. మార్క్స్ మరణం (1883) తరువాత ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిన ముసాయిదా లను క్రమ బద్ధీకరించి “దాస్ కాపిటల్” రెండవ, మూడవ సంపుటాలను ప్రచురించారు. ఇందుకు ఆయన అనేక సంవత్సరాలు శ్రమించారు.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ కృషి లేకపోతే మార్క్స్ ఆర్థిక సిద్ధాంతంలో పెద్ద భాగం ప్రపంచానికి అందకుండా ఉండి పోయేదనే అభిప్రాయం కూడా ఉంది.
ప్రపంచవ్యాప్త ప్రభావం:
ఎంగెల్స్ రచనలు అనేక భాషల్లోకి అనువదించ బడ్డాయి. ఆ రచనల ప్రభావం వివిధ రంగాలపై ఉంది. ముఖ్యంగా కార్మిక సంఘాల ఉద్యమాలు. సామాజిక శాస్త్ర పరిశోధనలు. రాజకీయ ఆర్థిక శాస్త్రం. చరిత్ర రచన. మానవ శాస్త్రం. మహిళా అధ్యయ నాలు. అదే సమయంలో, ఆయన సిద్ధాంతా లపై అనేక విమర్శలు, ప్రత్యామ్నాయ విశ్లేషణలు కూడా వెలు వడ్డాయి. ఈ కారణంగా ఆయన రచనలు ఇప్పటికీ విద్యా, రాజకీయ, సామాజిక చర్చల్లో ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ రచనలు కేవలం ఒక రాజకీయ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే గ్రంథాలు మాత్రమే కావు. అవి పారిశ్రామిక సమాజం, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ నిర్మాణం, దేశం, చరిత్ర, ప్రకృతి వంటి అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి చేసిన విస్తృత మేధో ప్రయత్నాలు. ఆయన నిర్ధారణ లతో పూర్తిగా ఏకీభవించినా, ఏకీభవించక పోయినా, ఆధునిక సామాజిక శాస్త్రాల అభివృద్ధిలో ఆయన స్థానాన్ని విస్మరించడం సాధ్యం కాదు.
భారతదేశంపై ఫ్రెడ్రిక్ ఎంగెల్స్–మార్క్స్ అభిప్రాయాలు:
19వ శతాబ్దంలో భారతదేశం గురించి లోతుగా అధ్యయనం చేసిన యూరోపియన్ మేధావు లలో కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ముఖ్యులు. వారు భారతదేశానికి ఎప్పుడూ రాకపోయినా, బ్రిటిష్ పార్లమెంట్ పత్రాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ నివేదికలు, ప్రభుత్వ గణాంకాలు, ప్రయాణీకుల వర్ణనలు, ఆర్థిక సమా చారాన్ని అధ్యయనం చేసి భారతదేశంపై అనేక వ్యాఖ్య లు చేశారు. ముఖ్యంగా మార్క్స్ 1850లలో New York Daily Tribune కోసం భారతదేశంపై అనేక వ్యాసాలు రాశారు. ఎంగెల్స్ కూడా భారతదేశానికి సంబంధించిన రాజకీయ, సైనిక, ఆర్థిక పరిణామా లపై మార్క్స్ తో విస్తృతంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. మార్క్స్, ఎంగెల్స్ అభిప్రాయం ప్రకారం, పారిశ్రామిక విప్లవానికి ముందు భారతదేశం ప్రపంచం లోని ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. వారు ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు-బెంగాల్ నూలు వస్త్రాలు, ఢాకా ముస్లిన్, దక్షిణ భారత పత్తి పరిశ్రమ, చేతివృత్తుల నైపుణ్యం, గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థ. ఈ పరిశ్రమలు ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించా యని వారు పేర్కొన్నారు.
_ఈస్ట్ ఇండియా కంపెనీపై విమర్శ:
మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను తీవ్రంగా విమర్శించారు. వారి విశ్లేషణ లోని ప్రధానాంశాలు-భారత సంపదను ఇంగ్లాండ్ కు తరలించడం. అధిక భూమి పన్నులు. సంప్రదాయ పరిశ్రమల పతనం. రైతుల అప్పుల బారిన పడటం. స్థానిక ఉత్పత్తి వ్యవస్థల విధ్వంసం. ఈ అభిప్రాయాలు తరువాత భారత జాతీయవాద ఆర్థిక వేత్తల రచనలతో కొన్ని అంశాల్లో సారూప్యత కలిగి ఉన్నాయని చరిత్రకారులు గమనించారు.
భారత వస్త్ర పరిశ్రమ పతనం:
ఎంగెల్స్ ప్రత్యేకంగా వస్త్ర పరిశ్రమపై ఆసక్తి చూపారు, ఎందుకంటే ఆయన స్వయంగా వస్త్ర పరిశ్రమలో పనిచేశారు. ఆయన గమనించిన అంశాలు భారతీయ చేనేత దారులు యంత్ర పరిశ్రమతో పోటీ పడలేక పోయారు. బ్రిటిష్ విధానాలు స్థానిక పరిశ్రమలకు ప్రతికూలంగా మారాయి. లక్షలాది చేతి వృత్తి కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ విశ్లేషణ ఆధునిక ఆర్థిక చరిత్రలో కూడా చర్చనీయాంశంగా కొనసాగుతోంది.
రైల్వేలపై అభిప్రాయం:
మార్క్స్, ఎంగెల్స్ రైల్వేల గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఒక వైపు రైల్వేలు భారతదేశంలో మార్కెట్ ను ఏకీకృతం చేశాయి. రవాణా సౌకర్యా లను విస్తరించాయి. సమాచార మార్పిడిని వేగవంతం చేశాయి. మరో వైపు వాటి ప్రధాన ఉద్దేశ్యం బ్రిటిష్ వాణిజ్య ప్రయోజ నాలను బల పరచడమే. ముడి సరుకును నౌకా శ్రయాలకు తరలించడం. వలస పాలన పరిపాలనను సులభతరం చేయడం. అంటే, వారు రైల్వేలను పూర్తిగా ఖండించలేదు. అలాగే పూర్తిగా ప్రశంసించ లేదు. వాటి చారిత్రక పాత్రను వైరుధ్యాల తో కూడినది గా విశ్లేషించారు.
1857 భారత తిరుగుబాటు:
1857 సంఘటనలపై మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ ఆసక్తిగా స్పందించారు. వారు దానిని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనగా భావించారు. అయితే, దాని స్వరూపం పై తరువాత చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొందరు దానిని “సిపాయిల తిరుగుబాటు”గా, మరికొందరు “మొదటి స్వాతంత్ర్య సమరం”గా అభివర్ణించారు. మార్క్స్, ఎంగెల్స్ రచనలు ఈ చర్చలో ఒక చారిత్రక మూలంగా ఉపయోగించ బడు తున్నాయి.
గ్రామీణ భారతదేశంపై పరిశీలనలు:
మార్క్స్, ఎంగెల్స్ భారత గ్రామాలను “స్వయం సమృద్ధి గ్రామ సమాజాలు”గా వర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం గ్రామాలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉండేవి. కానీ కులవ్యవస్థ, సామాజిక స్థిరత్వం వంటి అంశాలు కూడా వాటిలో బలంగా ఉండేవి. ఆధునిక చరిత్రకారులు ఈ విశ్లేషణ లోని కొన్ని అంశాలను అంగీకరిస్తూ, మరికొన్ని అంశాలపై భిన్న దృక్కోణా లను ప్రతిపాదించారు.
భారతదేశంపై వారి దృక్పథం
సమతుల్య అవగాహన:
మార్క్స్, ఎంగెల్స్ రచనలను చదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వారు 19వ శతాబ్దంలో అందుబాటులో ఉన్న సమాచారం తోనే విశ్లేషణ చేశారు. తరువాతి కాలంలో పురావస్తు, ఆర్థిక చరిత్ర, సామాజిక చరిత్ర రంగాలలో వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలు కొన్ని అంశాలపై వారి అభిప్రాయా లను సవరించే అవసరాన్ని సూచించాయి. అయినా కూడా వలస పాలన ఆర్థిక ప్రభావా లపై, భారత పరిశ్రమల పతనం పై, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో భారతదేశ స్థానం గురించి వారి రచనలు చారిత్రక చర్చలో ఇప్పటికీ ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించ బడుతున్నాయి.
భారతీయ ఆలోచనా పరులపై ప్రభావం:
20వ శతాబ్దంలో భారత దేశంలోని అనేక మంది కార్మిక నాయకులు, వామపక్ష ఉద్యమ కారులు, సామాజిక శాస్త్రవేత్తలు మార్క్స్–ఎంగెల్స్ రచనలను అధ్యయనం చేశారు. అలాగే, వారి అభిప్రాయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించిన భారతీయ చరిత్రకారులు, ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. ఈ విధంగా వారి రచనలు భారత మేధో ప్రపంచంలో చర్చకు, పరిశోధనకు ప్రేరణగా నిలిచాయి.
19వ శతాబ్దం–కార్మిక ఉద్యమాల ఆవిర్భావం:
పారిశ్రామిక విప్లవం తరువాత యూరప్ లో లక్షలాది మంది కర్మాగారా లలో పనిచేయడం ప్రారంభించారు. కానీ వారి పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉండేది. రోజుకు 12–16 గంటల పని, తక్కువ వేతనాలు, ప్రమాదకర పని వాతావరణం, మహిళలు, బాల కార్మికుల దోపిడీ, కార్మిక సంఘాలకు చట్టబద్ధ రక్షణ లేకపోవడం. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాలలో కార్మిక సంఘాలు ఏర్పడడం ప్రారంభమైంది.
మొదటి అంతర్జాతీయ కార్మిక సంఘం (First International):
1864లో లండన్‌లో International Workingmen’s Association (IWA) స్థాపించబడింది. దీనినే తరువాత First International అని పిలిచారు. ఈ సంస్థ లక్ష్యాలు-వివిధ దేశాల కార్మిక సంఘాల మధ్య ఐక్యత. అనుభవాల పరస్పర మార్పిడి. కార్మిక హక్కుల కోసం ఉమ్మడి పోరాటాలు. అంతర్జాతీయ సంఘీభావం. మార్క్స్ ఈ సంస్థ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించ గా, ఎంగెల్స్ దాని వ్యూహాత్మక, సంఘటనా, సిద్ధాంత పర కార్యకలాపాలకు బలమైన మద్దతు ఇచ్చారు. ఎంగెల్స్ అనేక భాషలలో నిష్ణాతుడు. జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ వంటి భాషల్లో సునాయాసంగా సంభాషించ గలిగేవారు. దీని వల్ల వివిధ దేశాల కార్మిక నాయకులతో సంబంధాలు నెలకొల్పడం సులభమైంది. ఆయన నిర్వహించిన బాధ్యతలు. వివిధ దేశాల ఉద్యమాలపై సమాచారం సేకరించడం, నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, సంస్థ వ్యూహాలపై సలహాలు, సిద్ధాంత పర వివరణలు, రాజకీయ పరిస్థితుల విశ్లేషణ.
ట్రేడ్ యూనియన్ల పై ఎంగెల్స్ అభిప్రాయం:
ఎంగెల్స్ దృష్టిలో ట్రేడ్ యూనియన్లు అత్యంత ప్రముఖమైన సంస్థలు. ఆయన అభిప్రాయం ప్రకారం అవి కార్మికుల తక్షణ సమస్యల పరిష్కారానికి అవసరం. వేతనాలు, పని గంటలు, భద్రత వంటి అంశాలపై పోరాడాలి. అదే సమయంలో కార్మికులకు సామాజిక, రాజకీయ చైతన్యం కూడా కల్పించాలి. 19వ శతాబ్దంలో ఎనిమిది గంటల పని దినం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఎంగెల్స్ అభిప్రాయం ప్రకారం కార్మికుడికి విశ్రాంతి హక్కు ఉంది. కుటుంబంతో గడిపే సమయం అవసరం. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి అవకాశం ఉండాలి. తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎనిమిది గంటల పని దినం చట్ట బద్ధ మవడంలో ఈ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి.
1871 – పారిస్ కమ్యూన్:
1871లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన పారిస్ కమ్యూన్ ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక మలుపు. సుమారు రెండు నెలల పాటు పారిస్ నగర పాలన కార్మికులు, ప్రజా ప్రతినిధుల చేతుల్లో ఉంది. కమ్యూన్ చేపట్టిన కొన్ని చర్యలలో ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం, కొన్ని పరిపాలనా సంస్కరణలు, సామాజిక సంక్షేమ చర్యలు, స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం వంటివి ప్రధాన మైనవి. అయితే, ఫ్రెంచ్ ప్రభుత్వం సైనిక బలం తో కమ్యూన్ ను అణచి వేసింది. వేలాది మంది కాల్చివేయ బడ్డారు. అనేక మంది నిర్బంధించ బడ్డారు. ఎంగెల్స్ పారిస్ కమ్యూన్ ను ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప అనుభవంగా అభివర్ణించారు. ఆయన అభిప్రాయం ప్రకారం కమ్యూన్ ప్రజాస్వామ్య ప్రయోగంగా చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. అయితే దాని వ్యూహాత్మక బలహీనతల నుంచీ కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఆయన దృష్టిలో చరిత్ర విజయాల నుంచే కాదు, వైఫల్యాల నుంచీ కూడా పాఠాలు నేర్పుతుంది. ఎంగెల్స్ అన్ని దేశాలకు ఒకే విధమైన మార్గాన్ని సూచించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రతి దేశ చరిత్ర భిన్నం. రాజకీయ పరిస్థితులు భిన్నం. ప్రజాస్వామ్య వ్యవస్థల అభివృద్ధి స్థాయి కూడా భిన్నం. కాబట్టి కార్మిక ఉద్యమ వ్యూహాలు కూడా దేశాను సారం మారవచ్చని ఆయన భావించారు. ఎంగెల్స్ తరచుగా ఒక విషయం నొక్కి చెప్పేవారు. ఒక దేశంలోని కార్మికుల సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. అందువల్ల అంతర్జాతీయ సంఘీభావం, అనుభవాల పంచుకోవడం, పరస్పర మద్దతు, అత్యంత అవసరమని ఆయన విశ్వసించారు.
సైనిక వ్యూహాలపై ఆసక్తి:
ఎంగెల్స్ కు సైనిక చరిత్రపై కూడా విశేష ఆసక్తి ఉండేది. యుద్ధాల పై ఆయన చేసిన విశ్లేషణల వల్ల కొంతమంది సమ కాలీనులు ఆయనను “ది జనరల్” అనే ముద్దు పేరుతో పిలిచేవారు. అయితే, ఈ ఆసక్తి యుద్ధాన్ని- రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడేది.
సంఘటనా నైపుణ్యం:
ఎంగెల్స్ గొప్ప నిర్వాహకుడు కూడా. ఆయన ప్రత్యేకతలు-విభేదాల మధ్య మధ్యవర్తిత్వం, స్పష్టమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, దీర్ఘకాల వ్యూహాత్మక ఆలోచన, వ్యక్తిగత కీర్తి కన్నా ఉద్యమ ప్రయోజనాలకు ప్రాధాన్యం. ఈ లక్షణాలు అంతర్జాతీయ కార్మిక ఉద్యమంలో ఆయనకు విశేష గౌరవాన్ని తీసుకువచ్చాయి.
నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంస్థలు ఎంగెల్స్ రచనలను అధ్యయనం చేస్తున్నాయి. అయితే, ఆధునిక కార్మిక ఉద్యమాలు, మారిన ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్, సేవారంగం, గిగ్ ఆర్థిక వ్యవస్థ వంటి కొత్త సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఎంగెల్స్ ఆలోచనలను నేటి పరిస్థితులకు అనుగుణంగా కర్తవ్యాలను రూపొందిచు కోవలసి ఉంది.
‘దాస్ కాపిటల్’ సంపాద కత్వం–ప్రపంచ మార్క్సిస్టు ఉద్యమానికి మార్గదర్శి:
“మహానుభావుడి మరణంతో ఒక యుగం ముగిసింది. కానీ ఆయన ఆలోచనలను ప్రపంచానికి అందించడం నా జీవిత బాధ్యత.” ఈ భావన తోనే ఎంగెల్స్ తన చివరి పన్నెండు సంవత్సరాలను గడిపారు.
1883 మార్చి 14 ప్రపంచ సామాజిక, రాజకీయ చరిత్రలో ఒక విషాదకరమైన రోజు:
కార్ల్ మార్క్స్ లండన్ లో కన్నుమూశారు. నలభై సంవత్సరాల పాటు కలిసి పనిచేసిన తన అత్యంత సన్నిహిత మిత్రుడిని కోల్పోవడం ఎంగెల్స్ కు వ్యక్తిగతం గానూ, మేధో పరంగానూ పెద్ద దెబ్బ. మార్క్స్ అంత్యక్రియల సందర్భంగా ఎంగెల్స్ చేసిన ప్రసంగం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు. “డార్విన్ ప్రకృతి వికాస నియమాన్ని కనుగొన్నట్లే, మార్క్స్ మానవ చరిత్ర వికాస నియమాన్ని కనుగొన్నారు.” ఈ మాటలు మార్క్స్ పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తాయి. మార్క్స్ మరణించినప్పుడు ఆయన ప్రధాన రచన “దాస్ కాపిటల్” మొదటి సంపుటం మాత్రమే ప్రచురితమైంది. రెండవ, మూడవ సంపుటాలు వేలాది పేజీల ముసాయి దాల రూపంలో మాత్రమే ఉన్నాయి. వాటిలో అసంపూర్ణ అధ్యాయాలు, వివిధ కాలాల్లో రాసిన గమనికలు, లెక్కలు, పట్టికలు, వ్యాఖ్యలు ఉండేవి. ఈ మహత్తర బాధ్యతను ఎంగెల్స్ తన భుజాలపై వేసుకున్నారు. మార్క్స్ ముసాయిదా లను సంవత్సరాల పాటు పరిశీలించిన తరువాత, ఎంగెల్స్ 1885లో ‘దాస్ కాపిటల్’ రెండవ సంపుటిని ప్రచురించారు. ఎంగెల్స్ లక్ష్యం తన అభిప్రాయాలను జోడించడం కాదు. మార్క్స్ ఆలోచనలను అత్యంత నమ్మకంగా అందించడం. మూడవ సంపుటి పని ఇంకా కష్టమైనది. మార్క్స్ గమనికలు పూర్తిగా సిద్ధంగా లేవు. చాలా చోట్ల అసంపూర్ణ వాక్యాలు, సంక్షిప్త సూచనలు, పునర్వి మర్శించాల్సిన భాగాలు ఉన్నాయి. అయినప్పటికీ, దాదాపు పదకొండు సంవత్సరాల శ్రమ తరువాత ఎంగెల్స్ 1894లో మూడవ సంపుటిని ప్రచురించారు. చరిత్రకారులు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఎంగెల్స్ తనను రచయితగా నిలబెట్టు కోవడానికి ప్రయత్నించలేదు. ఆయన మార్క్స్ శైలిని కాపాడారు. అవసరమైన చోట మాత్రమే సంపాదకీయ గమనికలు ఇచ్చారు. సందేహాస్పద భాగాలను స్పష్టంగా గుర్తించారు. తన అభిప్రాయాలను మార్క్స్ పేరుతో ప్రచురించలేదు. ఈ మేధో నిజాయితీ ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
1883తరువాత ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, సామ్యవాద పార్టీలు, యువ నాయకులు ఎంగెల్స్ కు లేఖలు రాయడం ప్రారంభించారు. వారు అడిగిన ప్రశ్నలు-మార్క్స్ సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వివిధ దేశాల రాజకీయ పరిస్థితుల్లో ఏ వ్యూహం అనుసరించాలి? ట్రేడ్ యూనియన్ల పాత్ర ఏమిటి? రైతాంగం తో సంబంధం ఎలా ఉండాలి? ఎంగెల్స్ వందలాది లేఖల ద్వారా వాటికి సమాధానాలు ఇచ్చారు. ఈ లేఖలు నేటికీ చారిత్రక పత్రాలుగా భద్రపరచ బడ్డాయి.
1889లో Second International స్థాపనకు ఎంగెల్స్ నైతిక, మేధో పరమైన మద్దతు అందించారు. ప్రపంచంలోని అనేక సామ్యవాద పార్టీలు ఈ వేదికపై కలిశాయి. ఎంగెల్స్ ప్రత్యక్ష నిర్వాహకుడి గా కాకపోయినా, ఆయన సూచనలు విస్తృత ప్రభావం చూపాయి. ఎంగెల్స్ యువ నాయకులతో ఓర్పుగా చర్చించేవారు. అయితే ఒక విషయాన్ని ఎప్పుడూ హెచ్చరించే వారు. “మార్క్స్ రచనలను సిద్ధంగా ఉన్న సూత్రాల పుస్తకంలా చదవవద్దు. ప్రతి దేశపు చరిత్ర, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని అన్వయించాలి.” ఈ హెచ్చరిక ఆయన ఆలోచన లలోని సౌలభ్యాన్ని, చారిత్రక దృష్టిని ప్రతిబింబిస్తుంది.
రష్యాపై ఆసక్తి:
ఎంగెల్స్ రష్యాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనించారు. రష్యన్ భాషను కూడా అభ్యసించారు. రష్యన్ సామాజిక ఉద్యమాల నాయకులతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగించారు. రష్యా అభివృద్ధి మార్గం పై ఆయన అనేక విశ్లేషణలు చేశారు. ఎంగెల్స్ రచనలు మహిళా విముక్తి, కుటుంబ నిర్మాణం, ఆస్తి సంబంధాలపై జరిగిన తరువాతి చర్చలకు కూడా ప్రభావం చూపాయి. ప్రత్యేకించి “The Origin of the Family, Private Property and the State” గ్రంథం అనేక దేశాలలో మహిళా అధ్యయనాల కు ఒక ముఖ్యమైన చారిత్రక ఆధారంగా ఉపయోగించ బడింది, అయితే దానిలోని కొన్ని చారిత్రక నిర్ధారణ లపై ఆధునిక పరిశోధనలు భిన్న అభిప్రాయాలను కూడా ప్రతి పాదించాయి.
చివరి సంవత్సరాలు:
1890తరువాత ఎంగెల్స్ ఆరోగ్యం క్రమంగా బలహీన పడింది. అయినప్పటికీ ఆయన లేఖలు రాశారు. వ్యాసాలు ప్రచురించారు. ప్రపంచ రాజకీయ పరిణామా లను విశ్లేషించారు. యువ నాయకులకు సలహాలు ఇచ్చారు. చివరి రోజుల వరకు మేధో కృషిని కొనసాగించారు. ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ గురించి సమ కాలీనులు చెప్పిన మొదటి మాట “ఆయన అత్యంత స్నేహశీలి.” ఆయనలో గంభీరత ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఉల్లాసంగా ఉండేవారు. స్నేహితులతో చమత్కారాలు చేయడం, సుదీర్ఘ సంభాషణలు సాగించడం, సంగీతం, సాహిత్యం, కవిత్వం గురించి చర్చించడం ఆయనకు ఇష్టమైన విషయాలు. మార్క్స్ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా గడిపే వారని వారి కుటుంబ సభ్యులు తమ జ్ఞాపకాలలో పేర్కొన్నారు. ఎంగెల్స్ కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. గుర్రపు స్వారీ, కొండ ప్రాంతాల్లో విహారం, వేట (ఆ కాలపు యూరోపియన్ సంప్రదాయంలో భాగంగా) ప్రకృతి పరిశీలన వంటి అభిరుచులు ఆయనకు ఉండేవి. అలాగే గణితం, ప్రకృతి శాస్త్రాలు, ఖగోళ శాస్త్రంపై కూడా ఆసక్తి కనబరిచారు. ఎంగెల్స్ పని విధానం చాలా క్రమబద్ధంగా ఉండేది. ప్రతిరోజూ పుస్తకాలు చదవడం, వార్తాపత్రికలు పరిశీలించడం, ఉత్తరా లకు సమాధానాలు రాయడం, పరిశోధన గమనికలు తయారు చేయడం వంటి పనులను క్రమ బద్ధంగా నిర్వహించేవారు. సిద్ధాంత చర్చలలో గంభీరంగా కనిపించినప్పటికీ, ఎంగెల్స్ కు మంచి హాస్య చతురత ఉండేది. మార్క్స్ తో పరస్పరం రాసుకున్న లేఖ లలో చమత్కారాలు, సరదా వ్యాఖ్యలు తరచుగా కనిపిస్తాయి. ఈ లేఖలు వారి మానవీయ కోణాన్ని తెలియ జేస్తాయి. తన కుటుంబ వ్యాపారం ద్వారా ఎంగెల్స్ మంచి ఆదాయం సంపాదించారు. ఆ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని మార్క్స్ కుటుంబానికి సహాయం చేయడానికి, పరిశోధనలకు, ఉద్యమ కార్యకలాపాలకు వినియోగించారు. వ్యక్తిగత విలాసవంతమైన జీవితం కంటే, సామాజిక లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన జీవిత చరిత్రలు సూచిస్తాయి.
విమర్శలను స్వీకరించే ధోరణి:
ఎంగెల్స్ తన ఆలోచనలను తుది సత్యాలు గా ప్రకటించలేదు. వివిధ దేశాల పరిస్థితులను బట్టి సిద్ధాంతాలను అన్వయిం చాల్సిన అవసరాన్ని ఆయన పలు మార్లు ప్రస్తావించారు. అందువల్ల ఆయన రచన లలో చర్చ, వాదన, పరిశీలన కు ప్రాధాన్యం కనిపిస్తుంది. ఎంగెల్స్ ను చూసిన అనేక మంది సమ కాలీనులు ఆయన గురించి ఇలా పేర్కొన్నారు. విశాల పాండిత్యం కలిగిన వ్యక్తి. అసాధారణ జ్ఞాపకశక్తి. స్పష్టమైన రచనా శైలి. విశ్వసనీయ స్నేహితుడు. ఉదార స్వభావం. క్రమశిక్షణ గల పరిశోధకుడు. ఈ లక్షణాలే ఆయనను తన కాలంలోని ప్రముఖ మేధావు లలో ఒకరిగా నిలబెట్టాయి. ఎంగెల్స్ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవు తుంది. ఆయన రాసిన సిద్ధాంతాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయలేదు. స్నేహం, సహకారం, అధ్యయనం, క్రమశిక్షణ, ఉద్యమం ఈ ఐదు అంశాలను జీవితాంతం ఆచరణలో చూపడానికి ప్రయత్నించారు.
చివరి రోజులు–మరణం:
“మనిషి జీవితకాలం పరిమితమే; కానీ అతని ఆలోచనలు తర తరాలపై ప్రభావం చూప గలవు.” 1894లో దాస్ కాపిటల్ మూడవ సంపుటి ప్రచురణ తో ఎంగెల్స్ తన జీవితంలోని ఒక మహత్తర బాధ్యతను పూర్తి చేశారు. అప్పటికే ఆయన వయస్సు 74 సంవత్సరాలు. 1895లో ఎంగెల్స్ కు గొంతు క్యాన్సర్ (Cancer of the larynx) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాధి వేగంగా పెరిగింది. చివరి నెలల్లో మాట్లాడటం కష్టమైంది. ఆహారం తీసుకోవడం కూడా బాధాకర మైంది. అయినప్పటికీ, ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించారు. 1895 ఆగస్టు 5 న లండన్ లోని తన నివాసంలో ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ప్రశాంతంగా కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ప్రపంచ కార్మిక ఉద్యమం తన గొప్ప మేధావుల్లో ఒకరిని కోల్పోయింది. ఎంగెల్స్ తన వీలునామా లో ఒక ప్రత్యేక కోరిక వ్యక్తం చేశారు. తన మరణానంతరం శరీరానికి దహన సంస్కారం చేయాలి. చితాభస్మాన్ని సముద్రంలో చల్లాలి. ఆయన కోరికను స్నేహితులు గౌరవించారు. 1895 ఆగస్టు 27న, ఇంగ్లాండ్ లోని ఈస్ట్‌బోర్న్ సముద్ర తీరానికి సమీపంలోని బీచీ హెడ్ ప్రాంతంలో పడవలో వెళ్లి ఆయన చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. ఆ కార్యక్రమానికి ఆయన సన్నిహితులు, సహచరులు హాజరయ్యారు. ఈ ఘటన ఆయన ప్రకృతి ప్రేమను, ఆడంబరాలకు దూరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
నేటి ప్రపంచంలో ఎంగెల్స్:
21వ శతాబ్దంలో ప్రపంచం అసమానతలు, కార్మిక హక్కులపై దాడి, గ్లోబలైజేషన్, గిగ్ ఆర్థిక వ్యవస్థ, AI, సాంకేతిక మార్పులు, సామాజిక భద్రత తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. సంపద కేవలం 5 అతి పెద్ద కార్పొరేట్ల వద్ద కేంద్రీకృతమైంది. అడవులు, భూమి, గనులు వగైరాలు ఎంపిక చేసిన ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ అధిపతులకు ధారాదత్తం చేయబడుతున్నాయి. మరొక వైపు అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు యుద్ద్ధోన్మాదాన్ని రెచ్చ గొడు తున్నాయి. ప్రపంచ ప్రజానీకం వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎక్కడికక్కడ విడి విడి గా పోరాడుతున్నారు.
భారత దేశం లో కూడా అవే సమస్యలతో అన్నీ తరగతుల ప్రజలు అల్లాడుతున్నారు. అందులో భాగమే 13 నెలల పాటు జరిగిన రైతు ఉద్యమం, ప్రభుత్వ నిర్బంధ కాండ, అందులో 750 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ప్రభుత్వం తాత్కాలికంగా కొంత వెనక్కి తగ్గింది. కానీ సమస్యల, వాగ్దానాల పరిష్కారానికి పూను కోవడం లేదు. ఇటీవల విద్యార్ధులు, యువజనులు చేసిన చారిత్రాత్మక ఉద్యమం, ప్రభుత్వ దమన కాండ, ఎట్టకేలకు విద్య శాఖ మంత్రి రాజీనామా చేయడం చూశాం. ఇలాంటి పరిస్థితులను 140 సంవస్తరాల క్రితమే మార్క్స్, ఎంగెల్స్ లు ఊహించడమే కాదు, దాస్ కాపిటల్ లో సోదాహరణంగా వివరించారు. నేడు అవి అక్షర సత్యాలని రుజువు అవుతున్నది. వీటి శాశ్వత పరిష్కారానికి, దోపిడి రహిత సమాజ స్థాపనకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ద్వారా మార్క్స్, ఎంగెల్స్ లు పరిష్కారాలను ప్రపంచ ప్రజానీకం ముందు ఉంచారు. వారు ప్రతిపాదిం చిన సిద్ధాంతం సరైనది, ఆచరణ సాధ్యమని రష్యా లో లెనిన్ రుజువు చేసి నిరూపించారు. అదే నేటి ప్రపంచ ప్రజానీకానికి అసలైన పరిష్కారం. మార్క్స్, ఎంగిల్స్ లు ప్రతిపాదించిన సిధ్ధాంతా లని అధ్యయనం చేయడం, ఆచరణలో కార్యాచరణకు సన్నద్ధం కావడమే మార్క్స్, ఎంగిల్స్ లకు మనం అర్పించే నిజమైన నివాళి.
ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
