సాధారణంగా యంత్రాలు మనుష్యుల స్థానాన్ని ఆక్రమిస్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన చెందరు. శ్రమను ఆదా చేసే సాంకేతికతకు ఉద్యోగాల తొలగింపు అనేది అసలు మూలం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిని మార్చడం ప్రారంభిస్తోంది. 17 మంది నోబెల్ బహుమతి గ్రహీతలతో సహా 1,000 మందికి పైగా ఆర్థికవేత్తలు, ఇటీవల స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎరిక్ బైన్జోల్ఫ్సన్ ప్రచారంలోకి తెచ్చిన ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. AI నుండి “భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు” జరుగుతుందని హెచ్చరిస్తూ, చర్యలు తీసుకోవాలని వారు పాలకులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎలాంటి చర్యలు? విధాన నిర్ణయాలు చేసే వారిలో కాకపోయినా, ఆర్థికవేత్తలలో విస్తృత మద్దతు పొందుతున్న ఒక నిర్దిష్ట పరిష్కారం ఉంది. శ్రమ కంటే మూలధనానికి ప్రాధాన్యత నిచ్చే పన్నుల విధానాన్ని నిలిపివేయడం.
ఇది అమెరికా తో పాటు చాలా అభివృద్ధి చెందిన దేశాలలో దశాబ్దాలుగా ఉన్న పన్ను విధానానికి విరుద్ధంగా ఉంది. పెట్టుబడులను ఆకర్షించడానికి, వృద్ధిని పెంపొందించడానికి వారు లాభాలు, వ్యాపార పెట్టుబడులు, మూలధన లాభాలు, డివిడెండ్ లపై పన్నులను తగ్గించారు.
సాధారణ పరిస్థితుల్లో సరైనదిగా అనిపించే మూలధనంపై తక్కువ పన్నులు, క్షేత్ర స్థాయిలో ఉద్యోగాలను ఊడ్చిపారేసే సాంకేతికత దృష్ట్యా సంర్ధనియం కాదు. “AI ఆవిర్భావంతో, మరింత మూలధన పెట్టుబడిని ప్రోత్సహించడం కంటే శ్రమ డిమాండ్‌ను పరిరక్షించడం చాలా ముఖ్యం. అందుకే మూలధన పన్నులు ఎక్కువగా ఉండవచ్చనేదానికి ఒక సహేతుకమైన కారణం ఉంది” అని హార్వర్డ్ ఆర్థికవేత్త, కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ డౌగ్ ఎల్మెండోర్ఫ్ చెప్పారు.
జాతీయ భద్రత, కంప్యూటర్ నెట్ వర్క్‌లకు AI ముప్పు భయపెడుతోంది. కానీ సహాయ కరమైన ఉత్పత్తుల యొక్క ప్రతికూల దుష్ప్రభావాలను నియంత్రించడంలో మనకు అనుభవం ఉంది. ఉదాహరణకు అణు విద్యుత్.
ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పు చాలా సంక్లిష్టమైనది. శ్రమను ఆదా చేసే సాంకేతికత మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుంది. కాలక్రమేణా ఇది పరిశ్రమాధిపతులను మరింత ఉత్పాదకత, సంపన్నులుగా చేస్తుంది. స్వల్పకాలంలో కొన్ని ఉద్యోగాలు నశించినప్పటికీ, సుదీర్ఘకాలంలో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయి.
చారిత్రకంగా చూస్తే అంతే. AIతో, ఆర్థికవేత్తలకు నిజమైన అనుమానాలు ఉన్నాయి. మార్చిలో ప్రచురించబడిన ఒక ప్రధాన సర్వే ప్రకారం, “AI వ్యవస్థలు చాలా మేధో పరమైన, శారీరక పనులలో మనుషులను భర్తీ చేసే” అవకాశం లేని, కానీ సంభవించే అవకాశం ఉన్న ఒక దృశ్యంలో, 2050 నాటికి శ్రామిక శక్తి నుండి శ్రామిక జనాభాలో దాదాపు 3% మంది అదృశ్యమవుతారని, 10 మిలియన్ల మంది ఉద్యోగాలను శాశ్వతంగా నష్టపోతారని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రముఖ సాంకేతిక ఆర్థికవేత్త బైన్జోల్ఫ్సన్ మాట్లాడుతూ, కార్మికులను AIతో భర్తీ చేయడానికి బదులుగా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం పారిశ్రామిక వేత్తల బాధ్యత అని చెప్పారు. “మేము ప్రస్తుతం సరైన దిశలో మార్గ దర్శనం చేస్తున్నాము” అని ఆయన అన్నారు.
కానీ కార్మికులను భర్తీ చేయడం కంటే వారికి అనుబంధంగా పనిచేసేలా చేయడం మరింత లాభదాయకంగా ఉంటే, విజయవంతమైన సంస్థలు ప్రభుత్వ జోక్యం లేకుండానే ఆ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఒకవేళ భర్తీ చేయడమే మరింత సమర్థవంతమైన మార్గమైతే, ఉద్యోగాలను తగ్గించడానికి నిరాకరించే సంస్థ నష్టపోయే సంస్థగా మారుతుంది.
AI ద్వారా స్థానభ్రంశం చెందిన వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన విధాన ప్రతిపాదన. కానీ కార్మికులకు దేనిలో శిక్షణ ఇవ్వాలో స్పష్టత లేదు. ఐదేళ్ల క్రితం, “కోడింగ్ నేర్చుకోండి” అని అందరికీ చెప్పారు, అని యేల్ ఆర్థికవేత్త పాస్క్యుయల్ రెస్త్రెపో అన్నారు. “ఆ కెరీర్ సలహా ఇప్పుడు నిరుపయోగమైంది. AI ఏ క్రమంలో అభివృద్ధి చెందుతుందో, ఎలాంటి దూకుడు మార్పులు చేస్తుందో మనకు తెలియదు. “వేతన భీమా” లేదా “సార్వత్రిక ప్రాథమిక ఆదాయం” (Universal Basic Income) వంటి ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిహారం అందించే ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఉపాధిని పరిరక్షించలేవు.
AI ఆధారిత ఉద్యోగాల భర్తీని నిజంగా నిరుత్సాహ పరచడానికి, కొందరు “కంప్యూట్” లేదా “రోబోట్” పన్ను విధించాలని పిలుపునిస్తున్నారు. బహుశా టోకెన్ల ఆధారంగా (AI వినియోగ యూనిట్) పన్ను విధించవచ్చు. అయినప్పటికీ, ఇది రూపకల్పన, నిర్వహణకు తీవ్రమైన సవాలుగా మారవచ్చు. కొత్త ఔషధాల ఆవిష్కరణ వంటి మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చే AI వినియోగాన్ని నిరుత్సాహ పరచవచ్చు.
ఇది మనల్ని పన్ను వ్యవస్థ వైపు తీసుకెళ్తుంది. మూలధనంపై తక్కువ పన్నులు విధించాలని చెప్పేవారు “ఇది పెట్టుబడులను, ఉత్పాదకతను, చివరికి వేతనాలను పెంచుతుంది” అని చెప్తారు.
తక్కువ మూలధన పన్నుల కోసం ద్విపక్ష పోరాటం దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. వేగవంతమైన త్వరిత క్షీణత (అంటే, భవనాలు, పరికరాలు క్షీణించే కంటే వేగంగా పన్ను మినహాయింపు పొందుతాయి) 1954లో పెట్టుబడి పన్ను క్రెడిట్ 1962లో ప్రారంభమ య్యాయి. 1980ల నుండి 2000ల వరకు డిప్రిసియేషన్ ఫండ్ మరింత ఉదారంగా మారింది. పెట్టుబడిపై లాభాలు, డివిడెండ్ లపై పన్నులు తగ్గించబడ్డాయి.
మరింత భారీ తగ్గింపులు 2017 పన్ను బిల్లులో వచ్చాయి. ఇది కార్పొరేట్ పన్ను రేటును 35% నుండి 21%కి తగ్గించింది. కొత్తగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు కొంతకాలం 100% మినహాయింపు ఇచ్చింది.
ఆ 100% తాత్కాలిక మినహాయింపు నిబంధన గతేడాది పునరుద్ధరించబడి శాశ్వత పెట్టుబడిగా మార్చబడింది. ఫలితంగా, 2017 నుండి కొత్త పరికరాల పై పన్ను రేటు 14% నుండి 4%కి పడిపోగా, శ్రమపై పన్ను రేటు 29% నుండి 27%కి మాత్రమే తగ్గిందని CBO తెలిపింది.
సిద్ధాంతపరంగా, పెట్టుబడిపై పన్ను విధించడం AI విస్తరణను నెమ్మదింప జేస్తుంది. ఇది AI యేతర పెట్టుబడులను కూడా నిరుత్సాహ పరుస్తుంది. ఇది ఒక ప్రతికూల అంశం. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే, పన్ను రేట్లు పెట్టుబడి నిర్ణయాలను ఎంతవరకు మారుస్తాయనేది స్పష్టంగా లేదు. ఒక అధ్యయనం ప్రకారం, 2017 పన్ను తగ్గింపుల ద్వారా పెట్టుబడులు పెరిగాయి. కానీ సుదీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి 1% కంటే తక్కువగానే ఉంది.
అయినప్పటికీ, మూలధన పన్నులు AI విస్తరణపై స్వల్ప ప్రభావాన్ని చూపినప్పటికీ, మరొక పరిశీలన ఉంది. శ్రమకు బదులుగా పెట్టుబడికి వెళ్లే జాతీయ ఉత్పత్తి వాటా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. AI దీనిని మరింత పైకి తీసుకెళ్తానని హామీ ఇస్తోంది. పెట్టుబడిపై పన్ను రేట్లు తక్కువగా ఉన్నంత కాలం, అది ఖజానాలోకి కొత్త రాబడి రావడాన్ని పరిమితం చేస్తుంది. పెట్టుబడి, శ్రమపై పన్నులలో ఉన్న అసమానత ను తగ్గించడం అనేది సుదీర్ఘకాలం పాటు నిద్రాణంలో (రికార్డు స్థాయిలో ఉన్న శాంతియుత కాలపు) లోటును ఎదుర్కోవడానికి ఒక మార్గం.
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో.
అనువాదం: ది వైర్ తెలుగు టీమ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
