భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పరిశీలించినప్పుడు రాజకీయ స్వాతంత్ర్యం కోసం పోరాడటంతో పాటు, సమాజంలోని కుల వివక్ష, అంటరానితనం, స్త్రీలపై వివక్ష, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలను తొలగించేందుకు జీవితాలను అంకితం చేసిన అనేకమంది మహనీయులు కనిపిస్తారు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కర్త, సాహితీవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ.సెప్టెంబర్ 25 వారి వర్ధంతి.
తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన ‘మాలపల్లి’ నవల ఆయనకు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ రచయితగా చూడటంతో పాటు ఆయన స్త్రీ విద్య, వితంతు వివాహాలు, దళితుల సామాజిక అభ్యున్నతి, జాతీయోద్యమం, విద్య, సామాజిక సంస్కరణ ఇలా అనేక రంగాల్లో ఆయన ప్రత్యక్షంగా పనిచేశారు.
జననం – బాల్యం:
ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1877 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలోని వేములూరు పాడు గ్రామంలో శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు చిన్ననాటి నుంచే విద్య, పఠనం, సమాజం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే అభ్యసించారు. తరువాత గుంటూరులో విద్య కొనసాగించారు. ఉపాధ్యాయ వృత్తితో ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. పఠనాభిలాష, సామాజిక సమస్యలపై అవగాహన, సమాజాన్ని మార్చాలనే తపనతో క్రమంగా ఆయన సంఘ సంస్కరణ వైపు దృష్టి కేంద్రీకరించారు.
వీరేశలింగం ప్రభావం – సామాజిక సంస్కరణకు శ్రీకారం:
ఉన్నవ లక్ష్మీనారాయణపై కందుకూరి వీరేశలింగం పంతులు ప్రభావం బాగా ఉంది. ఆ కాలంలో బాల్య వివాహాలు, వితంతువుల దుర్భర జీవితం, స్త్రీ విద్యకు నిరాకరణ వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవి. వీటిని విమర్శించకుండా ఆచరణలో మార్పు తీసుకురావాలని ఉన్నవ భావించారు. 1902లో వీరేశలింగం పంతులు అధ్యక్షతన ఒక వితంతు వివాహాన్ని నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తరువాత గుంటూరులో అనేక వితంతు వివాహాలను ప్రోత్సహించిన సంఘ సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. ఈ కారణంగానే ఆయనను గుంటూరు ప్రాంతంలో ‘గుంటూరు వీరేశలింగం’గా కూడా పిలుస్తారు.
సామాజిక సంస్కరణ అనేది కేవలం ఉపన్యాసాల ద్వారా కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఆచరించాల్సిన విలువ అని ఆయన ఆచరణలో నిరూపించారు.
ఉన్నత విద్య – బారిష్టర్‌గా:
విద్యాభ్యాసాన్ని కొనసాగించడం లో భాగంగా ఉన్నవ లక్ష్మీనారాయణ 1916లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో బారిష్టర్ విద్యను అభ్యసించారు. ఐర్లాండ్‌లోని జాతీయోద్యమ వాతావరణం, స్వపరిపాలన కోసం అక్కడ సాగిన ఉద్యమాలు ఆయనపై ప్రభావం చూపాయి. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత 1917లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అయితే న్యాయ వృత్తి ఆయన జీవితానికి ప్రధాన లక్ష్యం కాలేదు. సమాజం, దేశం, జాతీయోద్యమం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
శారదా నికేతన్ – స్త్రీ విద్యకు ఉద్యమం:
ఉన్నవ లక్ష్మీనారాయణ జీవితంలో మరో విశిష్ట లక్షణం స్త్రీ విద్యాభివృద్ధి. స్త్రీలకు విద్య అవసరం లేదని భావించే సామాజిక పరిస్థితుల్లో ఆయన స్త్రీ విద్యను గట్టిగా ప్రోత్సహించారు. 1922లో గుంటూరులో ‘శారదా నికేతన్’ను స్థాపించడంలో ఆయన, ఆయన భార్య లక్ష్మీ బాయమ్మ ముఖ్య పాత్ర పోషించారు. ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు. బాలికలకు విద్యతో పాటు స్వావలంబనకు అవసరమైన శిక్షణ కల్పించే కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో స్త్రీలకు విద్య అందించడం అంటే కేవలం ఒక కుటుంబాన్ని మార్చడం కాదు. తర తరాలను మార్చే సామాజిక పెట్టుబడి. ఈ విషయాన్ని ఉన్నవ దంపతులు ముందుగానే గుర్తించారు.
దళిత జనోద్ధరణ – అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం:
ఉన్నవ లక్ష్మీనారాయణ సామాజిక సంస్కరణలో అత్యంత ముఖ్యమైన అంశం అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన కృషి. కులం ఆధారంగా మనుషులను వేరు చేయడం మానవత్వానికి విరుద్ధమని ఆయన భావించారు. దళితులకు విద్య, గౌరవం, సామాజిక సమానత్వం లభించాలనే లక్ష్యంతో కృషి శారు.
సామాజికంగా వెలివేయ బడిన పిల్లలను ఆదరించడం, వారితో సహ పంక్తి భోజనం చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యలను ఆయన స్వయంగా చేపట్టారు. ఈ కారణంగా ఆయనకు, ఆయన భార్యకు తమ స్వంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ వారు లెక్క చేయక దాని కొనసాగించారు. సామాజిక సంస్కరణ అంటే ఇతరులకు చెప్పడమే కాదు. మనం స్వయంగా ఆచరించాలి అనేది వారి జీవితంలో కీలక అంశం.
స్వాతంత్ర్యోద్యమంలో ఉన్నవ:
ఉన్నవ లక్ష్మీనారాయణ జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. జైలు జీవితంతో ఆయన నిరుత్సాహ పడకపోగా ఆయన సాహిత్య కారుడిగా మారారు.
‘మాలపల్లి’ – తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి:
ఉన్నవ లక్ష్మీనారాయణ పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆయన రచించిన ‘మాలపల్లి’ నవల. 1920లలో రచించిన ఈ నవలలో భారత జాతీయోద్యమం, గాంధేయ భావాలు, కుల వివక్ష, దళితుల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, గ్రామీణ జీవితం, బ్రిటిష్ పాలన, సామాజిక మార్పు వంటి అనేక అంశాలను ఆయన కథారూపంలో చిత్రించారు. ‘మాలపల్లి’ కేవలం ఒక కథ కాదు. ఒక కాలం యొక్క సామాజిక, రాజకీయ చరిత్రకు ప్రతి రూపం. కుల వివక్షకు వ్యతిరేకత, అంటరానితనం నిర్మూలన, దళితుల సామాజిక గౌరవం, జాతీయ స్వాతంత్ర్యం, గాంధేయ ఆలోచనలు, సామాజిక సమానత్వం, గ్రామీణ పేదల జీవితం, బ్రిటిష్ వలస పాలనపై విమర్శ, మానవతా విలువలు మాలపల్లి ప్రధాన ఇతివృత్తాలు. అందువల్లే ‘మాలపల్లి’ తెలుగు సామాజిక నవలా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
బ్రిటిష్ ప్రభుత్వం ‘మాల పల్లి’ పై నిషేధం:
‘మాల పల్లి’ లోని రాజకీయ, సామాజిక భావాలను బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
1923 ఏప్రిల్ 5న బ్రిటిష్ ప్రభుత్వం ఈ నవలపై నిషేధం విధించింది. తరువాత శాసనమండలిలో దీనిపై చర్చలు జరిగాయి. కొన్ని భాగాలను తొలగించిన తరువాత 1928లో ప్రచురణకు అనుమతి లభించింది. అయితే 1936లో బ్రిటిష్ ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించింది. 1937లో మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ నిషేధం తొలగించబడింది. ఒక సాహిత్య రచనను వలస ప్రభుత్వం రెండుసార్లు నిషేధించడం, ఆ రచనలోని రాజకీయ-సామాజిక చైతన్యం ఎంత బలంగా ఉందో సూచిస్తుంది.
తరువాత ‘మాలపల్లి’ సంక్షిప్త రూపాలు, అనువాదాలు వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ఈ రచనను ప్రచురించింది.
ఇతర రచనలు:
ఉన్నవ లక్ష్మీనారాయణ రచనా ప్రపంచం ‘మాలపల్లి’ కి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, బావ తరంగాలు వంటి రచనలు చేశారు. ఆయన రచనల్లో దేశభక్తి, సామాజిక విమర్శ, మానవ సమానత్వం, జాతీయ చైతన్యం ప్రధానంగా ఇతివృత్తాలు.
గాంధేయ భావాల ప్రభావం:
ఉన్నవ లక్ష్మీనారాయణ జీవితంలో గాంధేయ భావజాలం ఒక ప్రత్యేకత. అహింస, సత్యం, స్వదేశీ, సామాజిక సమానత్వం, హరిజనోద్ధరణ, గ్రామీణ సమాజ అభ్యున్నతి వంటి అంశాలు ఆయన భావాలు. అయితే ఆయన కేవలం సిద్ధాంతాలను ప్రచారం చేయలేదు. స్త్రీ విద్య, వితంతు వివాహం, దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం వంటి అంశాల్లో ఆచరణాత్మక కార్యక్రమాలు చేపట్టారు.
భార్య లక్ష్మీ బాయమ్మ సహకారం:
ఉన్నవ లక్ష్మీనారాయణ జీవిత ప్రయాణంలో ఆయన జీవిత భాగస్వామి లక్ష్మీ బాయమ్మ సహకారం అత్యంత కీలకం. స్త్రీ విద్య, సామాజిక సంస్కరణ, సామాజికంగా వెనుకబడిన వర్గాల పట్ల సేవ వంటి కార్యక్రమాలలో ఆమె ఆయనకు తోడుగా నిలిచారు. శారదా నికేతన్ వంటి కార్యక్రమాలలో ఆమె పాత్ర విశేషమైనది. సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఇద్దరూ తమ మార్గంలో కొనసాగడం వారి దృఢసంకల్పానికి నిదర్శనం.
రాజకీయాలకంటే ప్రజాసేవకు ప్రాధాన్యం:
ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ, అధికార పదవుల కోసం పరుగులు పెట్టలేదు.1923లో ఆయన స్వరాజ్య పార్టీలో చేరినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజా జీవితం అధికారాన్ని సంపాదించుకోవడానికి కాకుండా ప్రజల కోసం పనిచేయడానికి ఎంచుకున్నారు.
చివరి దశ – 1958 సెప్టెంబర్ 25:
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఉన్నవ లక్ష్మీనారాయణ సామాజిక సమస్యలపై తన దృష్టిని కొనసాగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేకమంది మాదిరిగానే ఆయన జీవితం కూడా త్యాగాలతో నిండింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు స్వాతంత్ర్యానంతరం లభించలేదు. 1958 సెప్టెంబర్ 25న, 80 సంవత్సరాల వయసులో ఉన్నవ లక్ష్మీనారాయణ కన్నుమూశారు.
దేశ స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు. మనిషి మనిషిని కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా తక్కువ చేసి చూడని సమాజాన్ని నిర్మించడం కూడా నిజమైన స్వాతంత్ర్యంలో భాగమేనని ఉన్నవ లక్ష్మీనారాయణ జీవితం నుండి నేర్చుకోవాలి. అందుకే ఆయనను స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా సామాజిక సమానత్వం కోసం పోరాడిన సంఘ సంస్కర్తగా చూడాలి.
‘మాలపల్లి’ ద్వారా ఆయన తన కాలంలోని సామాజిక వాస్తవాలను సాహిత్యంలో ప్రతిబింబించారు. తన వ్యక్తిగత జీవితంలో వితంతు వివాహాలను ప్రోత్సహించారు. స్త్రీ విద్య కోసం సంస్థను నిర్మించారు. దళితుల పట్ల వివక్షను వ్యతిరేకించారు. జాతీయోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
ముగింపు:
ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జీవితం తెలుగు సమాజ చరిత్రలో ఒక విలువైన అధ్యాయం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, సమాజంలోని దురాచారాలను ప్రశ్నించిన సంస్కర్త, స్త్రీ విద్యకు అశేష కృషి చేసిన విద్యాభిమానీ, దళితుల సామాజిక గౌరవం కోసం పనిచేసిన మానవతా వాది, తెలుగు సాహిత్యానికి ‘మాలపల్లి’ వంటి చిరస్థాయి రచనను అందించిన సాహితీవేత్తగా ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి. ఆయన మరణించి దశాబ్దాలు గడిచినా, సామాజిక సమానత్వం, స్త్రీ విద్య, కుల వివక్ష నిర్మూలన, మానవ గౌరవం, వంటి ఆయన ఆశయాలు నేటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
