న్యూఢిల్లీ: ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఎన్నికల సంఘం పనితీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.
ఈ నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని పలువురు విపక్ష నాయకులు కోరారు.
అయితే, ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఖండించారు. ఇవి రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.
2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ ప్రతిపక్షాలు వరుసగా ఓటమిని చవిచూస్తున్నాయని పాత్ర చెప్పారు.
ప్రజల మద్దతు పొందలేకపోవడంతో ఆయా పార్టీల ఉనికికే ముప్పు ఏర్పడిందని, అందుకే అవి రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతిపాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా ఎన్నికల్లో గెలవలేమని భావిస్తున్న కాంగ్రెస్, రాజ్యాంగ సంస్థలపై దాడి చేయడాన్ని, వాటి ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని తన ప్రధాన ఆయుధంగా మార్చుకుందన్నారు.
కాంగ్రెస్, దాని కూటమి భాగస్వాములు “అబద్ధాలను” ప్రచారం చేస్తున్నారని, “ఓట్ల చోరీ”, ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే వాదన కేవలం ఒక “అపోహ” మాత్రమేనని పాత్ర పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ 2025 ఫిబ్రవరి 19న నియమితులయ్యారని గుర్తుచేస్తూ, బీజేపీ “ఓట్ల చోరీ” ద్వారా ఎన్నికల్లో గెలుస్తోందన్న విపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు.
ఇలాంటి ఆరోపణలు, తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్, దాని కూటమి భాగస్వాములు ప్రచారం చేస్తున్న “అబద్ధాలను” గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇది బీజేపీకి ప్రయోజనం చేకూర్చడం కోసం కాదని, దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై బలమైన విశ్వాసం ఉండేలా చూడటమే లక్ష్యమని పాత్ర చెప్పారు.
2014 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ “చాలా సజావుగా సాగుతోందనడానికి” 2024 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కూడా ఆయన వాదించారు.
మీడియా కథనంలో లేవనెత్తిన అంశాలు
ఇదిలా ఉండగా, ది ఎక్స్ప్రెస్ కథనం వెలువడిన తర్వాత పలువురు విపక్ష నాయకులు జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కూడా కోరారు.
కథనం ప్రకారం, కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తాము పనిచేస్తున్న ఎన్నికల కమిషన్నే ప్రశ్నించినట్లు కనిపించింది.
లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేకుండా పోయిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన కీలక విషయాలపై వారికి స్పష్టమైన సమాచారం లేనట్లు కథనం పేర్కొంది.
ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం, ఫారమ్-6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్కు యాక్సెస్, ఎన్నికల సంఘం సొంత ఐటీ వ్యవస్థల పనితీరు వంటి అంశాలపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు కథనంలో ఉంది.
చర్చల ద్వారానే ఏకగ్రీవ నిర్ణయాలు
అయితే, ఎన్నికల కమిషనర్లు ప్రతి విషయానికీ ఏకీభవించినా, పరస్పరం లేఖలు రాసుకుని చర్చలు జరిపినా కాంగ్రెస్ దాన్ని “నియంతృత్వం”గా అభివర్ణిస్తోందని పాత్ర అన్నారు. దీనికి విరుద్ధంగా, కమిషనర్ల మధ్య ఇలాంటి చర్చలు, అభిప్రాయాల మార్పిడి జరగడమే “అసలైన ప్రజాస్వామ్యానికి సంకేతం” అని ఆయన చెప్పారు.
ఒక్కసారి పరిస్థితిని గమనించండి. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే, తమ అభిప్రాయాలను పంచుకోకపోతే, ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా ప్రతి విషయానికీ అంగీకరిస్తూ పోతే- అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని నియంతృత్వం అంటాయి.
ఈ ప్రభుత్వమే ఆ ముగ్గురు కమిషనర్లను నియమించిందని, అందుకే వారు ప్రభుత్వం చెప్పిన ప్రతిదానికీ తలూపుతున్నారని ఆరోపిస్తాయి.
కానీ, మీడియా కథనాల ప్రకారం ఈ ముగ్గురు కమిషనర్ల మధ్య 14 సార్లు అధికారికంగా లేఖల మార్పిడి, చర్చలు జరిగాయి.
బీజేపీ వెళ్లి వారి లేఖలు చదవడం లేదు. మీడియా కథనాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, ముగ్గురు కమిషనర్ల మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం.
ఎన్నికల సంఘం, ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ఉచ్చులో చిక్కుకున్నాయని నేను చెబుతాను. కానీ, వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది దీనికి భిన్నంగా ఉంది.
ముగ్గురు కమిషనర్ల మధ్య చర్చలు జరిగాయి. ఆ అధికారిక చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై తుది నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారని ఎన్నికల సంఘం తన పత్రంలోని మొదటి పేరాలోనే స్పష్టం చేసింది.
అంటే, ముగ్గురు కమిషనర్లూ ఒకే నిర్ణయానికి వచ్చారు. వారి మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేదా అసమ్మతి లేవు. ముగ్గురూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు.
మొత్తంగా చూస్తే, భారత ఎన్నికల సంఘం గానీ, దేశంలోని మరే రాజ్యాంగ సంస్థ గానీ నియంతృత్వ పద్ధతిలో పనిచేయడం లేదు. అవి ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్నాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయన్నారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై నూతన చట్టం
ఎన్నికల కమిషనర్లను నియమించే సెలెక్షన్ కమిటీ ఏర్పాటుపై వస్తున్న ప్రశ్నలపైనా పాత్ర స్పందించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి “ఇష్టాయిష్టాల” మేరకే ఎన్నికల కమిషనర్లు నియమితులయ్యారని, 2023లో కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాతే ఈ విధానంలో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2023 వరకు ప్రధానమంత్రి తన ఇష్టానుసారంగా నేరుగా ఎన్నికల కమిషనర్లను నియమించేవారు.
అయితే, ఇప్పుడు తొలిసారిగా ఒక సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంలో ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునేలా ఈ కమిటీలో ఆయనకు చోటు కల్పించారని పాత్ర అన్నారు.
అయితే, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత విధానం ఎలా ఏర్పడిందన్న దానిపై మరో ముఖ్యమైన అంశం ఉంది.
2023 మార్చిలో అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ, కొత్త చట్టం వచ్చే వరకు ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక తాత్కాలిక విధానాన్ని సూచించింది.
ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరగాలని కోర్టు సూచించింది.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు సూచించిన కమిటీలోని సీజేఐ స్థానాన్ని తొలగించారు. దాని స్థానంలో ప్రధానమంత్రి, ఆయన నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన సెలెక్షన్ కమిటీ సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్లను నియమించేలా నిబంధనలు రూపొందించారు.
అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలోని నియామక విధానాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నారు. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి కూడా అప్పగించారు.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
