భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మహిళల పాత్ర అత్యంత విశిష్టమైనది. దేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర స్వరాన్ని వినిపించిన ధైర్యవంతులలో మేడమ్ భీకాజీ రుస్తమ్ కామా ప్రముఖురాలు.
సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించిన ఆమె సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
ఆమె సామాజిక సేవ, జాతీయోద్యమ ప్రచారం, ప్రవాస భారతీయుల సమీకరణ, విప్లవకారులకు సహాయం, పత్రికా రచన, మహిళల హక్కుల పట్ల అవగాహన వంటి అనేక రంగాలలో చురుకైన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 24న ఆమె జయంతి.
జననం, కుటుంబ నేపథ్యం
భీకాజీ కామా 1861 సెప్టెంబర్ 24న బొంబాయిలో ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు.
ఆమె తండ్రి సోరాబ్జీ ఫ్రామ్జీ పటేల్ ప్రముఖ వ్యాపారి, సామాజికంగా గౌరవనీయమైన వ్యక్తి. తల్లి జైజీ బాయి.
భీకాజీకి చిన్ననాటి నుంచే మంచి విద్య లభించింది.
ఆమె వివిధ భాషలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపడంతో పాటు, సమాజం, దేశ పరిస్థితులపై కూడా ఆసక్తి పెంచుకున్నారు.
1885లో ఆమె రుస్తమ్ కామాను వివాహం చేసుకున్నారు.
అయితే ఆమె సామాజిక, రాజకీయ ఆసక్తులు, జాతీయవాద భావాలు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపాయి.
కరువు, ప్లేగు సమయంలో ప్రజాసేవ
1896లో బొంబాయి ప్రాంతంలో తీవ్రమైన కరువు, ఆ తరువాత ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు భీకాజీ కామా బాధితులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు.
ప్లేగు బాధితులకు సేవ చేస్తూ ఆమె కూడా వ్యాధి బారిన పడ్డారు. కోలుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది.
వైద్య చికిత్స కోసం యూరప్‌కు వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఈ ప్రయాణమే ఆమె జీవితాన్ని భారత స్వాతంత్య్రోద్యమ అంతర్జాతీయ వేదిక వైపు మళ్లించింది.
చికిత్స కోసం యూరప్‌కు వెళ్లిన తరువాత ఆమె దాదాభాయ్ నౌరోజీ వంటి భారత జాతీయవాద నాయకులతో పరిచయం పెంచుకున్నారు.
బ్రిటిష్ పాలన భారతదేశంపై చూపుతున్న ఆర్థిక, రాజకీయ ప్రభావాలను ఆమె పూర్తిగా అర్ధం చేసుకున్నారు.
అదే సందర్భంలో ఆమె శ్యామ్‌జీ కృష్ణవర్మ, లాలా హర్దయాల్ తదితర జాతీయ వాదులతో పరిచయాలు పెంచుకున్నారు.
భారత స్వాతంత్య్రానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం ఒక ముఖ్య లక్ష్యంగా ఆమె ఎంచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం
విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేయడానికి భీకాజీ కామా కృషి చేశారు.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఉన్న పేదరికం, కరువు, రాజకీయ అణచివేత, ప్రజల హక్కుల సమస్యలను విదేశీ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
అమెరికాలో కూడా పర్యటించి భారత స్వాతంత్ర్యానికి మద్దతు కోరుతూ ప్రసంగాలు చేశారు.
స్టుట్‌గార్ట్‌లో చారిత్రక ఘట్టం
భీకాజీ కామా జీవితంలో ప్రసిద్ధి కెక్కిన సంఘటన 1907 ఆగస్టు 22న జరిగింది.
జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు కాంగ్రెస్‌లో భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన పరిస్థితులను అంతర్జాతీయ ప్రతినిధుల ముందు ఆమె వివరించారు.
అనంతరం భారత స్వాతంత్ర్యానికి ప్రతీకగా రూపొందించిన ఒక జెండాను ఆవిష్కరించారు.
భారత ప్రభుత్వ ప్రచురణ ‘న్యూ ఇండియా సమాచార్’ ప్రకారం, భారత జెండా విదేశీ గడ్డపై మొదటిసారిగా ఆవిష్కరించబడిన సందర్భం ఇదే.
అయితే అది నేటి భారత జాతీయ పతాకం కాదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో రూపొందిన తొలి జాతీయ పతాక రూపాలలో ఒకటి.
భారత ప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో కూడా ఆమెను “విదేశీ గడ్డపై భారత జెండాను ఎగురవేసిన మొదటి వ్యక్తి”గా పేర్కొంది.
పారిస్ కేంద్రంగా పత్రికా రచన, విప్లవకారులకు ఆశ్రయం
ఆ తరువాత భీకాజీ కామా పారిస్‌లో నివసిస్తూ భారత స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. ఆమె రచనలు, ప్రచురణలు, కరపత్రాల ద్వారా బ్రిటిష్ వలస పాలనను విమర్శిస్తూ భారత స్వాతంత్ర్యానికి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించారు. ఆమె నివాసం కూడా కొంతమంది ప్రవాస భారత జాతీయ వాదులు, విప్లవకారులకు ఆశ్రయంగా మారింది.
భీకాజీ కామా భారత స్వాతంత్ర్యోద్యమ ప్రచారంలో పత్రికా రచన, ప్రచురణను ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు.
పారిస్ నుంచి ‘వందేమాతరం’ అనే ప్రచురణను తీసుకొని రావడానికి ఆమె కృషి చేసింది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న ఉద్యమాలు, విప్లవ కార్యకలాపాలు, జాతీయవాద భావాలను ప్రచారం చేయడమే దాని ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి.
భారత స్వాతంత్య్రోద్యమంలోని కొంతమంది విప్లవకారులకు ఆమె ఆర్థికంగా, ప్రచార పరంగా, ఇతర మార్గాల్లో సహాయం చేశారు.
విదేశాల్లో ఉండి కూడా భారతదేశంలోని ఉద్యమకారులతో సంబంధాలు కొనసాగించడం విశేషం. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయుల కోసం విదేశాల్లో మద్దతు కూడ గట్టడానికి ఆమె ప్రయత్నించారు.
మహిళా చైతన్యం
భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి భీకాజీ కామా జీవితం ఒక నిదర్శనం.
ఆ కాలంలో భారతీయ మహిళలు రాజకీయ రంగంలోకి రావడం ప్రారంభ దశలోనే ఉంది.
అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళగా విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం, జెండాను ఆవిష్కరించడం, రాజకీయ ప్రచారం నిర్వహించడం ఆమె ధైర్యానికి నిదర్శనం.
దీర్ఘకాలం విదేశాల్లో నివసించిన తరువాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో భీకాజీ కామా చివరకు భారతదేశానికి తిరిగి వచ్చారు.
ఆమె జీవితంలోని చివరి దశ కూడా దేశం పట్ల అదే నిబద్ధతతో సాగింది. 13 ఆగస్టు 1936న బొంబాయిలో ఆమె మరణించారు.
మేడమ్ భీకాజీ కామా జీవితం దేశభక్తి, త్యాగం, ప్రజాసేవ, అంతర్జాతీయ ప్రచారం, మహిళా చైతన్యం వంటి అనేక అంశాల సమ్మేళనం.
ఆమె చేతితో ఆవిష్కరించబడిన పతాకం నేటి జాతీయ పతాకం కాదు. కానీ భారతదేశం స్వతంత్రం పొందాలి, భారతీయులకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ఉండాలి అనేది దాని లక్ష్యం.
ఈ మహనీయురాలు, భారత స్వాతంత్య్రోద్యమాన్ని దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ వేదికపై వినిపించిన ప్రముఖ మహిళా నాయకురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
ఢిల్లీలో ఒక పెద్ద ప్రాంతానికి “భికాజీ కామా ప్లేస్” అని పేరు పెట్టారు.
