స్వీడన్ దేశ పార్లమెంట్ ఎన్నికలు 2026 సెప్టెంబర్ 13న జరిగాయి. ఎన్నికల ఫలితాలను అధికారికంగా సెప్టెంబర్ 19న ప్రకటించారు.
ప్రతిపక్ష సోషల్ డెమోక్రటిక్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, మరొక రెండు పార్టీల కూటమి మెజారిటీ స్థానాలను సాధించాయి. దాంతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత మగ్దలేనా అండర్సన్‌ను నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని స్పీకర్ కోరారు. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీల కూటమి స్వీడన్లో అధికారంలోకి రానున్నది.
కమ్యూనిస్టు పార్టీ గతంలో 24 స్థానాలు ఉండగా ఇప్పుడు అదనంగా మరో 6 స్థానాలు గెలిచి మొత్తం 30 స్థానాలు దక్కించుకుంది. ఇది ఒక శుభ పరిణామం. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అవుతుందని అంచనా.
ఉత్తర యూరప్‌లోని స్వీడన్ సాధారణంగా సంక్షేమ రాజ్యం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కులు, ప్రజా ఆరోగ్యం, విద్య, సమానత్వం అంశాలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది.
అయితే గత దశాబ్దంలో స్వీడన్ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వలసలు, గ్యాంగ్ నేరాలు, ఆర్థిక ఒత్తిళ్లు, సంక్షేమ వ్యవస్థ, ఇంధన, వాతావరణ విధానాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, నాటో సభ్యత్వం వంటి అంశాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేశాయి.
పార్లమెంటరీ ఎన్నికలు – మారిన రాజకీయ పరిస్థితులకు నిదర్శనం
2026 సెప్టెంబర్ 13న జరిగిన ఎన్నికల్లో మొత్తం 6,834,413 మంది ఓటు వేశారు. ఓటింగ్ శాతం 84.9%. 2022లో ఓటింగ్ శాతం 84.21%. 2026లో స్వల్పంగా పెరిగింది.
సెప్టెంబర్ 19న స్వీడిష్ ఎలక్షన్ అథారిటీ తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. 349 స్థానాలున్న పార్లమెంట్(రిక్స్‌డాగ్)లో ఎనిమిది పార్టీలు ప్రాతినిధ్యం సంపాదించాయి.
ప్రతిపక్షంలోని నాలుగు పార్టీలు కలిపి 176 స్థానాలు, రైట్ సెంటర్ పార్టీల కూటమి (ఎన్నికలకు ముందు అధికారపక్షం) 173 స్థానాలు సాధించాయి.
అయితే రెండు కూటముల మధ్య తేడా కేవలం మూడు స్థానాలు కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కూడా అంత తేలిక కాదు.
స్వీడన్లో పార్లమెంటరీ ఎన్నికలు నాలుగేళ్ల కొకసారి జరుగుతాయి. ప్రధానంగా పార్టీ గుర్తుపై వచ్చిన ఓట్ల శాతం బట్టి పార్లమెంట్లో సీట్లు కేటాయించబడతాయి(దామాషా ప్రాతినిధ్యం).
సాధారణంగా ఒక పార్టీ దేశవ్యాప్తంగా కనీసం 4 శాతం ఓట్లు సాధిస్తే పార్లమెంట్లో స్థానాలు పొందేందుకు అర్హత ఉంటుంది.
2022 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితి
2022 ఎన్నికలు స్వీడన్ రాజకీయాల్లో కీలకమైన మలుపు. సోషల్ డెమోక్రాట్లు 30.33 శాతం ఓట్లతో 107 స్థానాలు, స్వీడన్ డెమోక్రాట్లు 20.54 శాతం ఓట్లతో 73 స్థానాలు, మోడరేట్స్ 19.10 శాతం ఓట్లతో 68 స్థానాలు, లెఫ్ట్ పార్టీ 6.75 శాతం ఓట్లతో 24 స్థానాలు, సెంటర్ పార్టీ 6.71 శాతం ఓట్లతో 24 స్థానాలు, క్రిస్టియన్ డెమోక్రాట్లు 5.34 శాతం ఓట్లతో 19 స్థానాలు, గ్రీన్ పార్టీ 5.08 శాతం ఓట్లతో 18 స్థానాలు, లిబరల్స్ 4.61 శాతం ఓట్లతో 16 స్థానాలు సాధించాయి. 2022లో రైట్ వింగ్ పార్టీలు అయిన మోడరేట్స్, స్వీడన్ డెమోక్రాట్లు, క్రిస్టియన్ డెమోక్రాట్లు, లిబరల్స్ కలిసి 176 స్థానాలు సాధించాయి.
సోషల్ డెమోక్రాట్ల నేతృత్వంలోని ప్రత్యామ్నాయ శక్తులకు 173 స్థానాలు వచ్చాయి. దీంతో 68 స్థానాలు గెలిచిన మోడరేట్స్ పార్టీ అధ్యక్షుడు ఉల్ఫ్ క్రిస్టర్సన్ నేతృత్వంలో మోడరేట్స్, క్రిస్టియన్ డెమోక్రాట్లు, లిబరల్స్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.
స్వీడన్ డెమోక్రాట్లు ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోయినా, రిక్స్‌డాగ్‌లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. టిడో ఒప్పందం ఆధారంగా ఈ ఏర్పాటు జరిగింది. ఇది స్వీడన్ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన పరిణామం. స్వీడన్ డెమోక్రాట్లు వలసలు, నేరాలు, జాతీయ గుర్తింపు వంటి అంశాలపై కఠిన వైఖరితో ఎదిగిన పార్టీ.
క్రిస్టర్సన్ ప్రభుత్వం స్వీడన్ డెమోక్రాట్ల సహకారంలో ఆరు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వృద్ధి, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, నేరాలు, గ్యాంగ్ హింస, వలసలు, సమీకరణ(ఇంటిగ్రేషన్), వాతావరణం, ఇంధనం, ఆరోగ్య సేవలు, విద్య అంశాలు టిడో ఒప్పందంలోని ప్రధాన రంగాలుగా ప్రభుత్వం పేర్కొంది.
స్వీడన్లో గత కొన్నేళ్లుగా గ్యాంగ్ సంబంధిత కాల్పులు, హింస ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. రైట్ వింగ్ పార్టీలు కఠినమైన శిక్షలు, పోలీసులకు అధిక అధికారాలు, నేర నియంత్రణ చర్యలను ముందుకు తెచ్చాయి.
వలసలు, శరణార్థుల విధానం కూడా ఎన్నికలలో ప్రధాన అంశం అయింది. 2010లలో స్వీడన్ అనుసరించిన ఉదార వలస విధానంతో పోలిస్తే తరువాతి సంవత్సరాల్లో దేశం కఠినమైన విధానాలు అమలు చేసింది. 2026 ఎన్నికల ప్రచారంలో కూడా ఇది ప్రధాన చర్చగా నిలిచింది.
మరోవైపు సోషల్ డెమోక్రాట్లు, లెఫ్ట్, గ్రీన్స్ తదితర పార్టీలు సంక్షేమ సేవలు, ప్రజా ఆరోగ్యం, సామాజిక సమానత్వం, కుటుంబాల ఆర్థిక భద్రత వంటి అంశాలను ప్రధానంగా ముందుకు తెచ్చాయి.
వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధనం, అణుశక్తి, పరిశ్రమల పోటీతత్వం కూడా ఎన్నికలలో చర్చకు వచ్చాయి.
స్వీడన్ భవిష్యత్, ఈయూ విధానంలో కూడా ఇవి ముఖ్యమైన అంశాలని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన యూరోపియన్ పరిశోధనా కేంద్రం ఎన్నికలకు ముందు పేర్కొంది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తరువాత స్వీడన్ భద్రతా విధానంలో భారీ మార్పు వచ్చింది. నాటో సభ్యత్వం, రక్షణ వ్యయం, ఉక్రెయిన్‌కు మద్దతు వంటి అంశాలు దేశ ఎన్నికలతో పాటు యూరోపియన్ రాజకీయాల్లో కూడా ప్రధాన అంశాలుగా ముందుకొచ్చాయి.
2022తో పోలిస్తే 2026లో వచ్చిన మార్పు
2022లో సోషల్ డెమోక్రాట్లు 107 స్థానాలు సాధించగా, 2026లో 8 స్థానాలు కోల్పోయి 99 స్థానాలకు పరిమితమైంది.
స్వీడన్ డెమోక్రాట్లు కూడా గతంలో సాధించిన 73లో 11 స్థానాలు కోల్పోయి 62కి పరిమితం అయ్యాయి. లెఫ్ట్ 6 స్థానాలు అదనంగా సాధించింది.
నాలుగు పార్టీలతో కూడిన ప్రతిపక్ష శిబిరంలో సోషల్ డెమోక్రాట్లు-99, లెఫ్ట్-30, సెంటర్-25, గ్రీన్స్-22, మొత్తం 176. 349 స్థానాల్లో మెజారిటీకి 175 అవసరం. 176 స్థానాలతో ఒక గ్రూపు, 173తో మరో గ్రూపు నిలిచాయి.
అయితే ఎన్నికల్లో గెలిచిన శిబిరంతో వెంటనే ప్రభుత్వం ఏర్పాటు అయినట్లు కాదు. స్వీడన్ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వం ఏర్పాటులో స్పీకర్‌కు ముఖ్యమైన పాత్ర ఉంటుంది.
ఎన్నికల అనంతరం సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మగ్దలెనా ఆండర్సన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించేందుకు స్పీకర్ ఆమెకు అన్వేషణ బాధ్యత అప్పగించారు.
176 స్థానాలు కలిగిన నాలుగు పార్టీల మధ్య కూడా విధానపరమైన తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా సెంటర్ పార్టీ, లెఫ్ట్ పార్టీల మధ్య కొన్ని ఆర్థిక, పన్నుల విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఎన్నికల ఫలితాలలో ఒక శిబిరానికి మెజారిటీ వచ్చినప్పటికీ, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు రాజకీయ చర్చలపై ఆధారపడి ఉంటుంది.
2021 నవంబర్ 10న ఆనాటి ప్రధాని స్టెఫన్ స్లోగన్ స్వచ్ఛందంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న సోషల్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మగ్దలెనా ఆండర్సన్ 2021 నవంబరు 30న ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ విధంగా దేశంలో ఒక మహిళ మొట్టమొదటి సారి ప్రధాన మంత్రి బాధ్యతలను స్వీకరించింది. ఇప్పుడు 2026 ఎన్నికల తరువాత మళ్లీ ఆమే ప్రధాన మంత్రి కానున్నది.
ఎన్నికల ఫలితాల వెనుక ప్రధాన సామాజిక ప్రశ్నలు
2026 ఎన్నికలను కేవలం “లెఫ్ట్ వింగ్–రైట్ వింగ్”గా చూడటం కాదు. ప్రజా భద్రత, గ్యాంగ్ హింసను ఎలా నియంత్రించాలి? వలసలు, శరణార్థుల సంఖ్య, సమీకరణ విధానం ఎలా ఉండాలి?
ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు ప్రభుత్వ ఖర్చు ఎంత ఉండాలి? కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని ఎలా తగ్గించాలి? ఆదాయ పన్నులు, సంక్షేమ వ్యయం, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత ఎలా సాధించాలి?
వాతావరణం, హరిత మార్పు, పరిశ్రమల పోటీ తత్వం, విద్యుత్ ధరల మధ్య సంబంధాన్ని ఎలా కాపాడాలి? నాటో, రక్షణ వ్యయం, ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో స్వీడన్ భవిష్యత్ విధానం ఏమిటి?
ఈ అంశాలన్నీ 2026 ఎన్నికల చర్చలో ప్రధాన సమస్యలు. కొత్తగా ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీల మధ్య ప్రధానంగా సోషల్ డెమోక్రాట్లు, లెఫ్ట్, సెంటర్, గ్రీన్స్ పార్టీల మధ్య కొన్ని అంశాలలో విభేదాలున్నాయి.
నాలుగు పార్టీలను ఒక ఉమ్మడి కార్యక్రమానికి అంగీకరింప చేయడం అతి పెద్ద సవాలు.
భారతదేశంతో పోలిస్తే స్వీడన్ ఎన్నికల వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన తేడా ఉంది. భారతదేశంలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరు సింపుల్ మెజారిటీ సాధిస్తారో ఆ అభ్యర్థి నెగ్గినట్లు ప్రకటిస్తారు.
స్వీడన్లో దామాషా ప్రాతినిధ్య విధానం అమలులో ఉంది. అంటే ఒక పార్టీ దేశవ్యాప్తంగా పొందిన ఓట్లకు అనుగుణంగా పార్లమెంటరీ స్థానాలు కేటాయిస్తారు. ఏ రాజకీయ పార్టీకి అయినా దేశం మొత్తంలో కనీసం నాలుగు శాతం ఓట్లు సాధిస్తేనే పార్లమెంట్లో దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉంటుంది.
2026లో జరిగిన ఎన్నికలకు అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. 2022లో అధికారంలోకి వచ్చిన రైట్ వింగ్- సెంటర్ వింగ్ ప్రభుత్వంలో మూడు సార్లు ప్రధాన మంత్రులు మారారు. 2026 ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయింది.
సోషల్ డెమోక్రాట్లు తమ స్థానాలు తగ్గినప్పటికీ దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచారు. స్వీడన్ డెమోక్రాట్లు తొలిసారి గత ఎన్నికతో పోలిస్తే 11 స్థానాలు కోల్పోయారు. లెఫ్ట్, గ్రీన్ పార్టీలు తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నాయి.
ఎన్నికల ఫలితం అత్యంత స్వల్ప తేడాతో ఉండటం వల్ల చిన్న, మధ్య తరహా పార్టీల పాత్ర కీలకంగా మారింది.
కొత్త రిక్స్‌డాగ్ సెప్టెంబర్ 28, 2026న సమావేశమవుతుంది. ఆ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 29న కొత్త పార్లమెంట్ సమావేశం అధికారికంగా ప్రారంభమవుతుంది.
2026 స్వీడన్ పార్లమెంటరీ ఎన్నికలను కేవలం ఒక ప్రభుత్వం మారి మరొక ప్రభుత్వ ఏర్పాటుగా మాత్రమే కాకుండా, స్వీడన్ రాజకీయాలలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న మార్పులకు సంకేతంగా చూడాలి.
“ఎవరు ఎన్ని స్థానాలు గెలిచారు?” అనే కోణంలో కాకుండా దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న కింది ప్రధాన సమస్యల పరిష్కారానికి తీసుకునే విధానాల ఆధారంగా చూడాలి.
సంక్షేమ రాజ్యం భవిష్యత్తు ఏమిటి? నేరాలు, వలసలపై విధానం? ఆర్థిక అసమానతలను ఎలా ఎదుర్కొంటారు?
వాతావరణ–ఇంధన విధానం ఎలా ఉంటుంది? నాటో–ఉక్రెయిన్ విధానం ఎలా కొనసాగుతుంది? బహుళ పార్టీ పార్లమెంటులో స్థిరమైన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? అనేవే రాబోయే కాలంలో స్వీడన్ రాజకీయాల దిశను నిర్ణయించనున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
