2024 లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావలసిన కొద్ది రోజుల ముందు అకస్మాత్తుగా జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అప్పటివరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అరుణ్ గోయల్ అంతే ఆకస్మికంగా రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. గత పది నెలలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వస్తున్న ప్రకటనలు అన్నీ మెజారిటీ ఎన్నికల సంఘం కమిషనర్ల ఆమోదం లేకుండానే విడుదలవుతూ వచ్చాయన్నది ఆ ప్రకటన సారాంశం.
గత పది నెలల కాలంలో భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై మిగిలిన ఎన్నికల సంఘం కమిషనర్లు కనీసం 14 సార్లు అభ్యంతరం తెలియజేశారు.
భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఖరారు అవుతున్న ఓటర్ల జాబితా విషయంలో ఈ 10 నెలల కాలం అత్యంత కీలకమైనది. భారత ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితా వెన్నెముక.
ఈ 10 నెలల కాలంలో 12 కోట్ల మంది భారతీయులు ఓటర్ల జాబితాలో స్థానం కోల్పోయారు.
అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు, కోర్టు కేసుల నడుమ తమను ఓటర్ల జాబితా నుంచి వివక్షపూరితంగానే తొలగించారని ఈ 12 కోట్ల మంది భారతీయులు భావిస్తున్నారు.
తాజాగా వెల్లడైన సమాచారం ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని 324వ అధికరణానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తేటతెల్లం అవుతుంది.
“సాధ్యమైనంత వరకు అన్ని నిర్ణయాలు కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లు ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సిందే” అని రాజ్యాంగంలోని 324వ అధికరణం ఆదేశిస్తుంది.
ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే కనీసం మెజారిటీ ఎన్నికల సంఘం కమిషనర్లు నిర్ణయం చేయాలి అన్నది రాజ్యాంగ అధికరణం ఆదేశపు సారాంశం.
రాజ్యాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చిందే తప్ప ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కాదు.
కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లను మోడీ ప్రభుత్వమే నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించే విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తికి ఎటువంటి స్థానమూ లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ చట్టం ఆధారంగా ఈ ఎన్నికల కమిషనర్లు నియమితులయ్యారు.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో నిష్పాక్షికతను పాటించడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తిని ఈ ఎంపిక బృందంలో సభ్యుడిగా చేశారు.
ఇంతకీ జ్ఞానేష్ కుమార్ ఎవరు?
కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి.
కాన్పూర్ ఐఐటీ నుంచి బీటెక్ పట్టా పొందిన తరువాత జ్ఞానేష్ కుమార్ బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ కూడా చదివారు.
కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాబట్టి అనివార్యంగా మలయాళం ధారాళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. అయినప్పటికీ పోలింగ్ బూత్‌లలోని సమాచారం, పోలింగ్ కేంద్రం పరిసరాలలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి అంటూ వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ “తల్లి, చెల్లి, కోడళ్లు ఓటు వేసేటప్పుడు వాళ్ల వీడియోలు రికార్డ్ చేస్తామా” అంటూ హిందీలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడటంతో హిందీ భాషా ప్రాంతాలలో విస్తృతమైన గుర్తింపు పొందారు.
కేరళ ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో బాధ్యతలు నెరవేర్చిన జ్ఞానేష్ కుమార్ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలలో అనేక శాఖలకు నాయకత్వం వహించారు.
కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శిగాను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన బాధ్యతలు అనివార్యంగా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ ప్రత్యక్ష సంబంధాలలో ఉండటం కారణంగా ఆయనకు ఈ పదోన్నతి దక్కిందని కొంతమంది అభిప్రాయం.
జ్ఞానేష్ కుమార్ గురించిన వివరాలను పొందుపరిచిన న్యూస్‌లాండ్రీ కథనం ప్రకారం ఈయన కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేయడానికి ఉన్న పాలనాపరమైన అడ్డంకులను పరిష్కరించే బృందంలో కూడా ఒక సభ్యుడు.
మోడీ సన్నిహిత బృందంలో భాగస్వామిగా ఉన్న బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రచురించిన ఒక పుస్తకంలో రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేయడం నేపథ్యం గురించి రాసిన సందర్భంలో జ్ఞానేష్ కుమార్ ప్రస్తావన కూడా ఉన్నదని న్యూస్‌లాండ్రీ ప్రస్తావించింది.
బ్లూ క్రాఫ్ట్ ప్రచురించిన పుస్తకం ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను కూడా ఇంటర్వ్యూ చేసింది.
ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిలో మరికొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. వీరందరూ ఆ పరిణామానికి సంబంధించిన విషయాలను మసక మసకగా వెల్లడించారు.
కీలక ప్రాజెక్టులలో బాధ్యతలు
కేంద్ర హోంశాఖ, సహకార మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేష్ కుమార్ మోడీ ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన ప్రాజెక్టులలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి ప్రియమైన ప్రాజెక్టులలో రామ్ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు కూడా ఒకటి. ఆరంభ దశలో ఈ ట్రస్ట్‌లో జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగారు.
ప్రస్తుతం ఇదే రామ్ మందిర్ ట్రస్ట్ చందా చోరీ వివాదంలో తీవ్రంగా ప్రతిష్ట పాలయ్యింది.
జ్ఞానేష్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. సహకార మంత్రిత్వ శాఖలో ఈయన కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 2023లో బహు రాష్ట్రాల సహకార సంఘాల చట్టాన్ని సవరించి అమలులోకి తెచ్చింది. ఆ తర్వాతనే దేశవ్యాప్తంగా మూడు సహకార సంస్థలను నెలకొల్పింది.
సహకార సంఘాలు భారతదేశంలో అత్యంత వికేంద్రీకృత వేదికలు. వీటన్నింటినీ ఏకీకృత పరిపాలనా పరిధిలోకి తీసుకురావడంలో జ్ఞానేష్ కుమార్ పాత్ర కీలకం.
ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియామకము కాకముందు జ్ఞానేష్ కుమార్ అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర సహకార సంఘ మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు.
ఆకస్మిక రాజీనామాలు, నియామకాలు
ఐఏఎస్ బాధ్యతల నుంచి 2024 జనవరిలో పదవీ విరమణ పొందిన తరువాత రెండు నెలలలోపే మార్చి 15న కేంద్ర ప్రభుత్వం ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది.
2024 పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేసిన సందర్భాన్ని పాఠకులకు గుర్తు చేయాలి. అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఏకపక్ష ధోరణులకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు అరుణ్ గోయల్ రాజీనామా చేశారు.
మర్యాద కోసం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
అసలు కేంద్ర ఎన్నికల సంఘంలో ఏం జరుగుతోందని ఏమాత్రం ప్రశ్నించకుండానే అప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోయల్ రాజీనామాను ఆమోదించారు.
రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎటువంటి ప్రశ్నలు రాలేదు కాబట్టి గోయల్ కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
ఇదే సమయంలో నోయిడా కలెక్టర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్ కూతురు మేధా రూపం డిగ్రీ చదువుతున్న చరిత్ర విద్యార్థి ఆకృతి చౌదరిని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చట్టం కింద అరెస్టు చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు.
ఈ చర్యపై స్పందిస్తూ అలహాబాద్ హైకోర్టు ఆమె నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి గదిగా మారుస్తోందని ధ్వజమెత్తింది.
కట్టు కథలతో ఆకృతిని జైలు పాలు చేసిందని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆకృతి చౌదరిని జైలు పాలు చేయడంలో రూపం చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను ఆమెకు అలహాబాద్ హైకోర్టు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ విషయంపై మేధా రూపం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
వివాదాస్పదమైన ఎన్నికల కమిషనర్ల నియామకం
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకపు చట్టం(సవరణ) 2023 పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత నియమించబడ్డ తొలి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.
2023లో మోడీ ప్రభుత్వం ఆమోదించిన ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం చట్టం 1991 నాటి చట్టాన్ని రద్దు చేస్తుంది.
1991 నాటి చట్టం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం, వేతనాలు, తొలగింపులు వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఇస్తుంది.
2023 నాటి తాజా చట్ట సవరణ తరువాత ఎన్నికల కమిషనర్లను నియమించడంలో కీలక బాధ్యతలు పోషించే కమిటీలో కేవలం ప్రధానమంత్రి, హోం మంత్రి తోపాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అంటే ఏ రకంగా చూసినా ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుంది.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదించడానికి లోబడి కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను నియమించాలి.
రాజ్యాంగ సభలో జరిగిన చర్చలలో ఎన్నికల సంఘం నిర్వహణ, నియామకాలను ప్రభుత్వ పలుకుబడి, అజమాయిషీకి దూరంగా ఉంచాలని డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం నియామకాన్ని పార్లమెంట్ విచక్షణకు వదిలేయడానికి రాజ్యాంగ పరిషత్ సభ్యులు సిద్ధపడ్డారు.
1991లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం(ఎన్నికల కమిషనర్ల సర్వీసు నిబంధనలు, విధి విధానాలు) సవరణ చట్టాన్ని ఆమోదించింది.
ఈ చట్టం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల బాధ్యతలు, వేతన భత్యాల గురించి స్పష్టం చేసింది తప్ప నియామకాల గురించి ప్రస్తావించలేదు. దాంతో అప్పటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం జరుగుతూ వచ్చింది.
మార్చి 2023లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్ విచారణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నియామకం కేవలం కేంద్ర ప్రభుత్వం విచక్షణకు పరిమితం కాకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం పలుకుబడి, ప్రభావాల పరిధికి బయట ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించేంతవరకు అమలులో ఉండాల్సిన నియామకపు విధివిధానాలను సుప్రీంకోర్టు రూపొందించింది.
ఈ విధివిధానాల ప్రకారం నియామకపు కమిటీ సిఫార్సులను ఆధారంగా రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించాలని సూచించింది.
సూచన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ప్రధానమంత్రి, హోం మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండాలని ఆదేశించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 10వ తేదీన పార్లమెంటులో ఒక ముసాయిదా చట్టాన్ని ప్రతిపాదించింది.
ఈ సవరణ చట్టం ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే సారాంశంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించే బాధ్యత ఉన్న కమిటీలో ప్రధానమంత్రి, హోం మంత్రి, ప్రతిపక్ష నేత మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అధీర్ రంజన్ చౌదరి, రాహుల్ గాంధీ లోక్‌సభలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వివరించింది.
