‘కృత్రిమ మేధ’(‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’) అనే మాట- భారత దేశంలో 7, 8 ఏళ్ళ కింద మొదలైంది.
గత 4, 5 ఏళ్ళుగా బాగా నానిన పదంగా, ఒక ఊతపదంగా, ఫ్యాషన్ పదంగా, దాని గురించి ఎటువంటి విమర్శా లేకుండా మాట్లాడడం ఒక వేలం వెర్రిగా తయారైంది. పత్రికలు కూడా ఈ పదాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చాయి.
‘కృత్రిమ మేధ’ అంటే ఏమిటో వివరించాలంటే, ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవాలి. గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణాంకాల శాస్త్రం, అలా కొన్ని శాస్త్రాల గురించి వివరిస్తే తప్ప- పూర్తిగానూ, సరిగానూ అర్ధం చేసుకోవడం కష్టం. అవన్నీ, ఇక్కడ చెప్పుకోలేము.
క్లుప్తంగా, వీలైనంత తేలిక మాటల్లో చెప్పాలంటే, ఒక పనిని మనుషులు ఎలా అయితే చేస్తారో, ఆ రకంగా పనిచేసేలా, కంప్యూటర్లకీ, రకరకాల యంత్రాలకీ నేర్పే సూత్రాల సమాహారం. దానిని ఉపయోగించి రకరకాల పనులు వీలైనంత తక్కువ సమయంలో, చాలా ఎక్కువ పనిని, మనుషులకున్నంత తెలివితో, వేగంగా, నైపుణ్యంగా యంత్రాలు చెయ్యవచ్చును. లేదా, ఆ యంత్రాలతో చేయించవచ్చు.
ఒక రకంగా ఏఐ కూడా ఒక ‘శ్రమ సాధనం’. ఉదాహరణకు, బట్టలు కుట్టడం అనే పనిలో ‘సూది’ ఒక శ్రమ సాధనం. కోట్ల కోట్ల విషయాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే పని చేసిపెట్టే పనిలో కంప్యూటరు ఒక శ్రమ సాధనం.
సూదీ, కంప్యూటరూ- రెండూ రెండు రకాల శ్రమ సాధనాలు. కంప్యూటరు సాయంతో పని జరగాలంటే, ఆ కంప్యూటరుకు కొన్ని సూచనలు నేర్పాలి. అలా నేర్చుకున్న తెలివినే, ‘కృత్రిమ మేధ’ అనొచ్చు.
ఒకప్పుడు ‘సూది’తో బట్టలు కుట్టే పని జరిగితే, ఈ నాడు ‘కృత్రిమ మేధ’ని ఒక శ్రమ సాధనంగా ఉపయోగించి, బట్టల తయారీకి సంబంధించిన అనేక పనులు వేగంగా, ఎక్కువ మొత్తంలో, తక్కువ సమయంలో, తక్కువ మంది కార్మికులతో, అతి నైపుణ్యంగా చెయ్యవచ్చు.
కృత్రిమ మేధ సాయంతో, బట్ట వృధా కాకుండా, సరైన కొలతలతో, కత్తిరించి, దారం తెగకుండా, కావలిసిన రకరకాల డిజైన్ల ప్రకారం, ఎన్ని వందల బట్టలనైనా కుట్టవచ్చు.
ఒక రంగం అని కాదు. అన్ని రంగాలలోనూ, కృత్రిమ మేధని శ్రమ సాధనాల్లో ఒకటిగా ఉపయోగించి ఎన్నో పనులు చెయ్యవచ్చు.
రోగ నిర్ధారణ యంత్రాలకి, కృత్రిమ మేధని ఉపయోగించి, డాక్టర్లు రిపోర్టుల్ని తయారు చెయ్యవచ్చు. ఒక వ్యాసం రాయడానికీ, ఒక సంపాదకీయం రాయడానికీ, ఒక బొమ్మ గీయడానికీ, ఒక పాఠం చెప్పడానికీ, ఒక సంగీత స్వరం తయారు చేయడానికీ, మనుషుల బొమ్మలు గీయడానికీ, మారణాయుధాలను తయారు చేయడానికీ, వాటిని ప్రయోగించడానికీ- ఇలా రక రకాల పనుల్లో, శ్రమ సాధనంగా పనిచేస్తుంది.
‘కుట్టు మిషను’ అనేది, ఎలా అయితే అనేకమంది గతంలో చేసిన శ్రమల కలయికో, కృత్రిమ మేధ కూడా అలాంటి గత శ్రమల కలయిక. దాన్ని నిర్జీవ శ్రమ అనవచ్చు. అలా ఎందుకు అనవచ్చంటే, సూత్రాల(కంప్యూటర్ ప్రోగ్రాముల) రూపంలో వున్న ‘మేధ’, తనంతట తను పనిచెయ్యలేదు కాబట్టి. అదొక పనిముట్టు.
శ్రమ సాధనం. ఆ సాధనంతో సజీవమైన మనుషులు చేసే శ్రమ కావాలి. అదే కొత్తగా జరిగే సజీవ శ్రమ. అంటే, నిర్జీవ శ్రమని ఉపయోగించి, సజీవ శ్రమ(అంటే ప్రాణం వున్న శ్రామికుల శ్రమ) కొత్త ఉత్పత్తిని, లేదా పనిని చేస్తుంది.
కృత్రిమ మేధ యజమానులెవరు?
సూది అయినా, కుట్టు మిషనైనా, ఇంకేదైనా పెద్ద యంత్రం అయినా, కృత్రిమ మేధ అయినా, అన్నీ శ్రమ సాధనాలే. వీటిని తయారు చేసేది మేధా శ్రామికులూ, శారీరక శ్రామికులూనూ.
శ్రమ సాధనాల యజమానులు మాత్రం పెట్టుబడిదారులే. వాళ్ళకి శ్రమ సాధనాల మీద యజమానితనం ఎలా వచ్చింది అనే విషయం ‘పెట్టుబడి పుట్టుక’ చరిత్రలో దొరుకుతుంది.
తక్కువ మంది కార్మికులతో, ఎక్కువ పని జరగడానికి వీలునిచ్చే కొత్త కొత్త శ్రమ సాధనాల్ని కనిపెట్టే పనిని ఇంజినీర్ల వంటి మేధా శ్రామికులకి పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు పురమాయిస్తూ ఉంటారు.
‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో, మార్క్సూ ఎంగెల్సులు వివరించినట్టు, “శ్రమ సాధనాలలో నిరంతరాయంగా విప్లవం తేకుండా పెట్టుబడిదారీ వర్గం మనలేదు.”
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఒకప్పుడు శ్రమ సాధనాలలో, ఆవిరి యంత్రం, మరమగ్గం వంటివి విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు కంప్యూటరూ, కృత్రిమ మేధా అనేవి శ్రమ సాధనాలలో ఒక విప్లవాన్ని సృష్టించాయి.
మెరుగైన శ్రమ సాధనాల వల్ల, అతి తక్కువ మంది కార్మికులు, గతంలో కంటే, అతి తక్కువ సమయంలో, యజమానులు తమకి ఇచ్చే జీతాల విలువకన్నా ఎంతో ఎక్కువ విలువగలిగిన శ్రమలు చేస్తారు. అలా అని యజమానులు, శ్రామికుల పని గంటలను మాత్రం తగ్గించరు. దానివల్ల, పెట్టుబడిదారీ యజమానులకు లాభాలే, లాభాలు.
అంతేకాదు. ఇప్పుడున్న కార్మికులే, గతంలో కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నప్పుడు, కొత్తగా కార్మికుల్ని పెట్టుకోవలిసిన అవసరం ఉండదు.
మెరుగైన శ్రమ సాధనాలు వచ్చినప్పుడల్లా, ఉన్న కార్మికులలో కొందరికి ఉద్యోగాలు పోతాయి. కొత్త వారికి ఉద్యోగాలు రావు. దాంతో, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది.
కృత్రిమ మేధ అనే కొత్త శ్రమ సాధనం, ఇప్పుడు అదే సమస్యని సృష్టిస్తోంది. కృత్రిమ మేధకు కావల్సిన‘డాటా’ని(సమాచారాన్ని) నిలవజేసి పెట్టే కేంద్రాల్ని ‘డాటాసెంటర్లు’ అంటారు. వీటిల్లో పెద్ద పెద్ద కంప్యూటర్ల వంటి డబ్బాలలో, ఒక క్రమపద్ధతిలో ‘డాటా’ ఉంటుంది. ఆ డబ్బాలన్నీ ఒకరకమైన ఎలక్ట్రానిక్ డబ్బాలు. వాటిని సర్వర్లని అంటారు.
ఇవి భద్రంగా ఉండడానికీ, సమాచారం వున్న ‘చిప్పులు’ పాడవకుండా ఉండడానికీ, నిరంతరం కరెంటూ, నీళ్ళూ కావాలి.
ఈ మధ్య, కృత్రిమ మేధ అనే మాట మారుమోగిపోతున్నట్టు, ‘డేటా సెంటర్లు’ అనే మాటకూడా, బాగా ప్రచారంలోకి వస్తోంది.
ప్రభుత్వాలు చెప్పే మాయమాటలు
ఏ పేరుతో, ఏ టెక్నాలజీ (సాంకేతికత) వస్తేనేమీ, అదంతా మేధా శ్రామికుల్ని తగ్గించే స్వభావంతో ఉంటుంది. అలా తగ్గించే శ్రమ సాధనాల్నే పెట్టుబడిదారీ యజమానులు ఏర్పాటు చేసుకుంటారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వాలు, కొత్త టెక్నాలజీ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, నైపుణ్యాలు పెరుగుతాయనీ, జనాలకి మాయమాటలు చెపుతారు. అవి మాయమాటలని రుజువు చేసే ఉదాహరణలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.
కొన్ని వార్తల్ని బట్టి ఆ విషయం తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధని ఉపయోగించే సాఫ్ట్ వేర్ కంపెనీలూ, బ్యాంకులూ, రకరకాల వస్తువులు తయారుచేసే పరిశ్రమలూ, ప్రతీ మూడు-నాలుగు నెలలకు ఒకసారి రకరకాల సాకులు చెప్పి, కొన్ని లక్షలమందిని ఉద్యోగాలలోనించీ తీసివేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ తెలిసిన వారిని వందలలోనూ, అది లేని పాత ఉద్యోగుల్ని లక్షలలోనూ, ప్రపంచవ్యాప్తంగా తీసివేస్తున్న వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం గత ఏడాది కాలంలో, 2025 – 2026కీ మధ్య, కృత్రిమ మేధని ప్రవేశపెడుతున్నామనే పేరుతో, టెక్నాలజీని మారుస్తున్నామనే పేరుతో, దాదాపు లక్ష మంది ఉద్యోగుల్ని తీసేసినట్టు కొన్ని సర్వే సంస్తలు లెక్కలిచ్చాయి. అందుకే అనేది, ఇది ‘కృత్రిమ మేధ కాదు.. పెట్టుబడిదారీ మేధ..’ అని.
నిరుద్యోగాన్ని నిరంతరం పెంచే ‘పెట్టుబడిదారీ మేధే’ కృత్రిమ మేధ
టెక్ రంగంలో ఉద్యోగాల కోత లెక్కలు కొన్ని ఇలా ఉన్నాయి. 2025లో, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో 1,22,606 మంది ఉద్యోగులను తొలగించారు. ఇందులో దాదాపు 16 శాతం(సుమారు 19,500 కంటే ఎక్కువ) ఉద్యోగాల కోతలకు కృత్రిమ మేధే కారణమని చెప్పారు.
కేవలం ఈ ఏడాదిలోనే, ఇప్పటివరకూ, టెక్ రంగంలో లేఆఫ్స్ భారీగా పెరిగి 1 లక్షా, 29వేల,153కి పైగా ఉద్యోగాలు పోయాయి. వీటిలో ఏకంగా 36 శాతం(దాదాపు 46,000 మంది) ఉద్యోగాలు కోల్పోవడానికి కంపెనీలు కృత్రిమ మేధ వైపు మళ్లడమే కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టడం కోసమే ఉద్యోగాల్ని తీసెయ్యడం. కంపెనీలు నష్టాల్లో ఉండటం వల్ల కాకుండా, మనుషులకంటే ‘చిప్స్’ కోసం, డేటా సెంటర్లకోసం, కృత్రిమ మేధ ఉపయోగించడానికి అవసరమైన సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి గదా- అని చెప్పి, కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మైక్రో సాఫ్ట్, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, మెటా వంటి దిగ్గజ సంస్థలు అనేక విభాగాల్లో వేలాది మందిని ఉద్యోగాల్లోనించీ తీసేసి, వారి స్థానాల్లో, వారిలాగే పనిచేసే కృత్రిమ మేధకి సంబంధించిన కొన్ని శ్రమ సాధనాల్ని ప్రవేశపెట్టాయి.
‘ప్రపంచ ఆర్ధిక వేదికా’, ‘గోల్డ్మన్ శాక్స్’లాంటి పెద్ద ఆర్థిక సంస్థల తాజా నివేదికల ప్రకారం: కృత్రిమ మేధ కారణంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల, 20 లక్షల ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఇలాంటి భయం కొలిపే వార్తల్ని నీరుగార్చ డానికీ, నిరుద్యోగుల్లో భ్రమలు కలిగించడానికీ, పెట్టుబడిదారీ ప్రభుత్వాలూ, ఆర్ధిక వేత్తలూ, ‘భవిష్యత్తులో, కృత్రిమ మేధ మీద పట్టు ఉన్న వారికోసం సుమారు 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి’-అని మాయ మాటలు చెపుతున్నారు.
అవి మాయమాటలు అని ఎందుకు అనుకోవాలంటే: అసలు కృత్రిమ మేధని గానీ, అలాంటి ఇంకో టెక్నాలజీని గానీ, పెట్టుబడిదారీ కంపెనీలు ఎందుకు ప్రవేశపెడతాయి? అతి తక్కువ మంది మేధా శ్రామికులతో, వీలైతే, వీలవ్వదుగానీ, కొన్ని వందల మంది చేసే పనిని, ఒకే ఒక్క శ్రామికుడితోనే, కృత్రిమ మేధని ఉపయోగించి, లాభాలు సంపాదించాలని కలలు కంటారు.
కృత్రిమ మేధని ఉపయోగించిన చోట్ల ఉద్యోగాలు పోయినా, కృత్రిమ మేధని మరింత అభివృద్ధి పరిచే పనుల్లోనూ, డేటా సెంటర్లలోనూ, కొత్త ఉద్యోగాలు వచ్చి, ఆ నష్టాన్ని భర్తీ చెయ్యవచ్చునని వాదిస్తారు.
ఇలాంటి వాదనను, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీని వాడని కాలంలో, ఆటోమేటిక్ యంత్రాలతో భారీ పరిశ్రమలు నడిచే కాలంలో కూడా, పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు అనేకమంది చేసినట్టు, మార్క్సు తన ‘పెట్టుబడి’ పరిశోధనలో వివరించాడు. అది నిజం కాదనీ, “మహా అయితే, యంత్రాల నిర్మాణం, వాటి వినియోగం వల్ల తొలగించిన వారికన్నా తక్కువ మందికే పని కల్పిస్తుంది” అని మార్క్సు నిరూపించారు.
అంతేనా, అలా ఉద్యోగాలు పోయిన కార్మికులు, ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటారో, “ఏ పారిశ్రామిక శాఖలోనైనా ఉద్యోగాలు పోయిన కార్మికులు ఇంకో శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు- వారికి పని దొరికినా, వారి పరిస్థితి ఎంత దయనీయమైనది.. పాపం… ఈ దౌర్భాగ్యులకు తమ పాత వృత్తి వెలుపల ఎంత విలువ లేకుండా పోతుందంటే, తక్కువ రకం పరిశ్రమలు కొన్నింటిలో తప్ప, మరే పరిశ్రమల్లోనూ వారిని చేర్చుకోరు. ఆ తక్కువ రకం పరిశ్రమలకు కూడా, తక్కువ జీతంతో పనిచేసే కార్మికులు, కావలిసిన దానికన్నా ఎక్కువగా దొరుకుతారు” అని ‘యంత్రాలూ, ఆధునిక పరిశ్రమలూ’ అనే అధ్యాయంలో వివరిస్తారు.
మార్క్సు వర్ణించిన దుస్థితి ఈనాడు కూడా మనం చూడవచ్ను. ఎంతమందో బీటెక్ చదివిన వారూ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినవారూ, ఈ నాడు, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ఓలా వంటి, తమ చదువులకూ, తమ నైపుణ్యానికీ సంబంధం లేని, పనులలో, అతి తక్కువ జీతాలకు పని చేస్తున్నారు. ఆ పనులకు కూడా విపరీతమైన పోటీ ఉందని వార్తలున్నాయి.
ప్రభుత్వాధినేతల సూక్తి ముక్తావళి
ఇలా కృత్రిమ మేధ అనే టెక్నాలజీని విపరీతంగా వాడడం వల్ల, ఉద్యోగాలు పోతాయి గదా-అని ఎవరైనా అడిగితే, ప్రభుత్వాధినేతలు ఏవేవో సూక్తులు చెపుతారు.
వాటిని తెలుసుకోవాలంటే, 7 నెలల కిందట భారత దేశంలో, కృత్రిమ మేధ మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో, కొందరు దేశాధినేతలు, ముఖ్యంగా భారత ప్రధాని మోదీ ఇచ్చిన ఉపన్యాసం వినాల్సిందే. ఆ ఉపన్యాసం ఎవరు రాసిచ్చారో గానీ, చాలా చమత్కారాలతో, వేదాలనించీ, పురాణాలనించీ, ప్రాచీన భారత తత్వవేత్తలనించీ సేకరించిన నినాదాలతో, నీతి సూత్రాలతో, నిరుద్యోగ సమస్యని ఎలా పరిష్కరించాలో తప్ప, సమస్తమూ మనకి ఆ ఉపన్యాసంలో కనిపిస్తాయి. ఆ ఉపన్యాసాన్ని, ప్రధానమంత్రి కార్యాలయం వారి వెబ్సైట్లో చూడవచ్చు.
2026 ఫిబ్రవరి 19 నాటి ప్రధాని ఉపన్యాసంలో, కిందటి సంవత్సరం, అంటే 2025లో, భారతదేశంలో ఐటీ రంగానికి సంబంధించి దాదాపు 22,000 మంది వైట్ కాలర్ ఉద్యోగుల్ని తీసేసిన సంగతి మాట వరసకు కూడా ప్రస్తావించలేదు.
అంతే కాదు, అప్పటికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్ని ఎన్ని వేలమందిని తీసేసిందో కూడా మాటవరసకు కూడా ఎత్తలేదు.
ఉదాహరణకు ఈ సదస్సు జరిగేనాటికి, ఏఏ కంపెనీలు ఎంతమందిని తీసేశాయో చూడండి.(ఈ లెక్కలు అనేక పత్రికల్లో వచ్చాయి. ప్రత్యేకంగా లే-ఆఫ్ల గురించి వివరాలిచ్చే వెబ్సైట్లలో కూడా చూడవచ్చు. అలాగే, 9-7-2026 నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో, 2024నించీ, 2026 జులై వరకూ పోయిన ఉద్యోగాల గురించి వివరాలున్నాయి.)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: ఏఐ ఆటోమేషన్ కారణంగా మధ్య స్థాయీ, పైస్థాయీ ఉద్యోగాల్ని దాదాపు 12,000 నుంచీ 23,000పైగా తగ్గించడమో, మొత్తానికే తీసెయ్యడమో చేసింది.
విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి సంస్థలు, తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు 7,000 వరకు తగ్గించుకున్నాయి.
భారతదేశంలో అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఏఐ మీద పెట్టుబడులు పెంచే పేరుతో, ఖర్చులు తగ్గించాలనే పేరుతో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఉద్యోగాల కోత విధించాయి.
ఒరాకిల్: భారతదేశంలో రకరకాల విభాగాలలో దాదాపు 2 వేల నుంచీ 3 వేల మంది ఉద్యోగుల్ని తీసేసింది. అమెజాన్, పేపాల్ వంటి కంపెనీలు, చెన్నై, బెంగళూరు కేంద్రాల్లో వందలాది మంది ఉద్యోగులను తీసేశాయి.
కాగ్నిజెంట్, యాక్సెంచర్- ఈ రెండు కంపెనీలూ కూడా, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల్ని తగ్గించి, కొందరిని తొలగించాయి.
నిరుద్యోగానికి సంబంధించి ఇన్ని ఘోరాలు జరుగుతూ వుంటే, ఉద్యోగాల గురించి, దేశ ప్రధాని అన్న మాటలు వినండి: “మిత్రులారా. ఇంటర్నెట్ మొదలైనప్పుడు ఎన్ని ఉద్యోగాలు సృష్టి అవుతాయో, ఏ ఒక్కరూ ఊహించివుండరు. ఇదే, ‘ఏఐ’కీ వర్తిస్తుంది. ఈ రంగంలో, ఏ రకం ఉద్యోగాలు తలెత్తుతాయో జోస్యం చెప్పడం కష్టం.”
ఏమి కష్టం? కేంద్ర ప్రభుత్వంలోనే 2 మంత్రిత్వ శాఖలున్నాయి, ఉద్యోగాలకూ, నిరుద్యోగానికీ సంబంధించి సర్వేలు చేసి, అధికారికంగా లెక్కలు ప్రకటించేవి. గణాంకాల శాఖా, ఉపాధి శాఖా. పైగా, దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న పత్రికలూ, వెబ్సైట్లూ, కొన్నాళ్ళకోసారి, ఏఐ వల్లగానీ, కొత్త రకం టెక్నాలజీ వల్ల గానీ, ఏ రకం ఉద్యోగాలు, ఎన్నెన్ని వేలల్లో పోతున్నాయో, వివరాలు ప్రకటిస్తూనే ఉన్నాయే.
పైగా, ఏఐ గురించి భారత ప్రభుత్వానికి ఉన్న దృక్పథం ‘సర్వజన హితాయ. సర్వజన సుఖాయ.’ అట. అంటే, “మనుషులందరీకీ మేలు జరగాలి. మనుషులందరూ సుఖంగా ఉండాలి” -ఈ ‘సూక్తి ముక్తావళి’ వినడానికి బాగానే ఉంటుంది.
ఈ దేశంలో గానీ, సదస్సుకి వచ్చిన ప్రతినిధుల దేశాల్లో గానీ, ‘సర్వజనులూ’ ఒకే రకంగా ఉన్నారా? వర్గాలుగా, వర్గ విభాగాలుగా, విడిపోయి ఉన్నారే.
ఏఐ వంటి శ్రమ సాధనాలను స్వంత ఆస్తిగా కలిగివున్న జనులు వేరూ, ఆ సాధనాల మీద ఎటువంటి హక్కూ లేకుండా, వాటితో పనిచేసే వేతన కార్మిక జనాలు వేరూనూ.
మేధా శ్రామికుల ఆత్మహత్యలూ, మానసిక సమస్యలూ
భారతదేశంలో 2017కీ, 2025కీ మధ్య 8 ఏళ్ళ కాలంలో కనీసం 227 మంది ఐటీ రంగ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు కొన్ని పత్రికలూ, ఇతర సంస్థలూ జరిపిన సర్వేల వల్ల తెలుస్తున్నది.
కృత్రిమ మేధా, టెక్నాలజీలో వేగంగా జరిగే మార్పుల కారణంగా ఉద్యోగ భద్రత కరువడం, విపరీతమైన పని ఒత్తిడి, అకస్మాత్తుగా జరిగే లేఆఫులూ వంటి కారణాల వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి.
ఐటీ రంగంలో ఆత్మహత్యల లెక్కలూ, నమోదైన కేసులూ: ‘రెస్ట్ ఆఫ్ ది వరల్డ్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం, 2017–2025 మధ్య కాలంలో భారతదేశంలో 227 మంది ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి ఏడాదీ, సగటున 25 నుంచి 30 ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి.
నమోదు కాని కేసులు ఎన్నో. అందరూ ఏమనుకుంటారో అనే కారణంతోగానీ, కంపెనీల ఒత్తిడి కారణంగా గానీ, చాలా మరణాలు, “పని ఒత్తిడి” వల్లా, లేదా “ఉద్యోగం పోవడం” వల్లా జరిగినట్లు రికార్డు కావడం లేదు. కాబట్టి ఆత్మహత్యల అసలు సంఖ్య, 227కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కొన్ని ప్రత్యేక ఉదాహరణలు: చెన్నైలో, పని ఒత్తిడి భరించలేక ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి 48 ఏళ్ల మేనేజర్ దూకి చనిపోయాడు.
పూణేలో ఉద్యోగ సమస్యల వల్ల 36 ఏళ్ల ఐటీ ఉద్యోగి, నదిలోకి దూకాడు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా, 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిప్రెషన్కులోనై కరెంట్ షాక్ పెట్టుకుని చనిపోయాడు.
టెక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలు: ‘ఏఐ’ రాకతో ఐటీ రంగం వేగంగా మారుతుండటం వల్ల ఉద్యోగుల మీద మానసిక భారం తీవ్రమైంది.
ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు కొన్ని: ఐటీ ఉద్యోగులలో నూటికి దాదాపు 83 మంది తీవ్రమైన మానసిక, శారీరక అలసటతో బాధపడుతున్నారు.
ప్రతీ నలుగురిలో ఒకరు వారానికి 70 గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తున్నారు.
అహమ్మదాబాదులోని ‘ఐఐఎం’, ఇతరులూ చేసిన సర్వేల ప్రకారం, నూటికి 68 మంది వైట్-కాలర్ ఉద్యోగులు రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందేమో అనే భయంలో బతుకుతున్నారు.
చాలా మంది టెక్ నిపుణులకు తమ ఉద్యోగమే వారి గుర్తింపు. ఏఐ కారణంగా ఆ ఉద్యోగం ఊడిపోగానే తాము సమాజంలో పనికిరాకుండా పోయామనే భావన వారిని వేధిస్తోంది.
జనాలలో ఆకర్షణా, ప్రత్యేకతా ఉన్న ఐటీ ఉద్యోగం పోయినప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక స్నేహితులకూ, కుటుంబ సభ్యులకూ దూరంగా ఒంటరిగా దిగులుగా ఉండిపోతున్నారు.
ఆరోగ్య సమస్యలు: ఒక సర్వే ప్రకారం, హైదరాబాద్లోని సుమారు 84శాతం మంది టెక్ ఉద్యోగులు సుదీర్ఘ పని వేళలూ, అధిక ఒత్తిడీ వల్ల లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
పెట్టుబడిదారీ మేధ నుంచి విముక్తి ఎప్పుడు?
పెట్టుబడిదారీ విధానంలో, శ్రమ సాధనాల రూపంలో వున్న ఏ రకపు టెక్నాలజీ అయినా, ఆ సాధనాల యజమానుల ఆస్తి కాబట్టి, అది వారికి శ్రమ దోపిడీ సాధనంగానే ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం, శ్రమ సాధనాలను, ఏ శ్రమా చెయ్యని యజమానులనించీ, తీసేసుకుని, ఆ శ్రమ సాధనాలతో, అందరూ శ్రమ చేసే లాంటి సమాజాన్ని ఏర్పరచుకోవడమే. కానీ, అదంతా జరగడానికి, ప్రపంచవ్యాప్తంగా, శ్రామిక జనాలు, నిలకడగా, నిరంతరం, ఎంతో కాలం ప్రయత్నిస్తే తప్ప, ఇప్పట్లో సాధ్యం కాదు.(“మానవ జాతికి కమ్యూనిజం ఓ కల”- ‘మ్యూజింగ్స్’లో చలం).
మరి, ఈ లోగా చిట్టిపొట్టి పోరాటాల ద్వారానైనా, కొన్ని మార్పుల కోసం, తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నాలు జరగాలి.
ఇలాంటి ప్రయత్నాలు 10, 12 ఏళ్లుగా, ప్రపంచంలో అక్కడక్కడా జరుగుతూ వస్తున్నాయి.
2014లో, అమెరికాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో, సిలికాన్ వ్యాలీలో, ‘టెక్ వర్కర్స్ కోయెలిషన్’ అని ఒక సంఘం ఏర్పడి కొన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉంది.
వారంలో 4 రోజులు మాత్రమే గానీ, ముప్పై గంటలు మాత్రమే గానీ, అదే జీతంతో, పని చేసేలా పని గంటల తగ్గింపు; వ్యక్తి స్వేచ్చకి భంగం కలిగే నిఘాకి సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు చేయడానికి నిరాకరించడం; మందగొడిగా పనిచెయ్యడం(ఫుట్ డ్రాగింగ్); ఏఐని పని స్థలంలో ఎంతవరకూ వాడాలీ అనే విషయంలో తమ పాత్ర కూడా ఉండాలని వాదించడం; అర్ధంతరంగా ‘లే-ఆఫ్’లు(ఉద్యోగాల్లోనించీ తీసెయ్యడం) ప్రకటించడాన్ని వ్యతిరేకించడం-మొదలైన కార్యక్రమాలు చెయ్యడానికి ప్రయత్నించారు. కొంతవరకూ సాధించుకున్నారు.
2018 నవంబరులో, అమెరికాలో, 50 నగరాల్లో, 20 వేలమంది గూగుల్ ఉద్యోగులు ప్రదర్శనలు జరిపారు. పని స్థలంలో జరుగుతున్న తప్పుడు పనులకు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రదర్శన, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, తమ సమస్యలమీద సంఘటితపడగలరు-అని నిరూపించింది.
ఈ ప్రదర్శనల తర్వాత, రెండు మూడేళ్ళకి, గూగుల్ ఉద్యోగులు ‘ది ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్’ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అమెరికాలోనే, ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో పనిచేసే ఉద్యోగులందరూ కలిసి, ‘ది టైమ్స్ టెక్ గిల్డ్’ అని ఒక సంఘం పెట్టుకుని, పని గంటలు, ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లూ, ఏఐ వాడకం- వంటి సమస్యల మీద చెప్పుకోదగిన సమ్మెలు లాంటివి చేసి, 2024 డిసెంబరులో చాలా కోర్కెలు సాధించుకున్నారు.
భారత దేశంలో కూడా, 2017లో, కర్నాటకలో, టెక్ ఉద్యోగులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, చిన్నవో, పెద్దవో, కొన్ని పోరాటాలు జరిపారు.
అకస్మాత్తుగా, అక్రమంగా, అడ్డగోలుగా ‘లే-ఆఫ్’లకు వ్యతిరేకంగానూ; 14 పని గంటల ప్రతిపాదనకు వ్యతిరేకంగానూ; ఆఫీసు పని అయ్యాక, మళ్ళీ ఆఫీసు పనికి సంబంధించి వచ్చే ఫోన్ కాల్స్ ని, డిస్ కనెక్ట్ చేసే హక్కుకోసమూ; కార్మిక చట్టాల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు దొరికే రక్షణలు లేకుండా చేసే ఉద్దేశంతో, ప్రభుత్వం ఐటీ కంపెనీలను మినహాయించడాన్ని వ్యతిరేకించడమూ; మహిళా ఉద్యోగులకి ప్రసూతీ, నెలవారీ సమస్యలకు సంబంధించిన సెలవుల కోసమూ-ఇలా కొన్ని ప్రయత్నాలు చేశారు.
ఈ సందర్భంగా, గద్దర్ ఎప్పుడో రాసిన, ‘సంఘం పెట్టర, ఓ కూలన్నా’ అన్న పాట గుర్తుకొస్తొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా కూలీలే. ‘సైబర్ కూలీలు’. (23 ఏళ్ళ కిందట, హరీష్ త్రివేదీ అనే ఇంగ్లీషు ప్రొఫెసరు మొదటిసారి ఈ మాట వాడాడు.)
జీతం మీద పనిచేసే ఎవ్వరైనా కూలీలే. ‘ఉద్యోగులు’, ‘కార్మికులు’, ‘సిబ్బంది’- వగైరా మాటలెన్ని ఉన్నా, అందరూ చేసేది ‘కూలి పనే’. ‘వేతనం’ అన్నా, ‘కూలి డబ్బులు’ అన్నా, ‘జీతం’ అన్నా అన్నీ, శ్రమ శక్తి విలువే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
