Fighting Superstition Was His Life Mission: Dr Narendra Dabholkar, a Symbol of Rationalism and Scientific Temper
భారతదేశంలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలపై పోరాడేందుకు జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ సామాజిక ఉద్యమ కారుల్లో డాక్టర్ నరేంద్ర దభోల్కర్ ఒకరు. నవంబర్ 1 ఆయన జయంతి.
సమాజంలో పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, సామాజిక అసమానతలు ఉన్నప్పుడు వాటిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ప్రజల బలహీనతలను దోపిడీ చేస్తుంటారు. ముఖ్యంగా మంత్రాలు, తంత్రాలు, చేత బడులు, దైవశక్తుల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేయడం, అమానుషమైన ఆచారాలకు బలిచేయడం వంటి వాటిని దభోల్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆయన పోరాటం ఏ మతానికి వ్యతిరేకంగా కాదు. మతం పేరుతో జరిగే మోసాలు, దోపిడీ, అమానవీయ ఆచారాలకు వ్యతిరేకంగా సాగింది. ప్రజలు ప్రశ్నించే స్వభావాన్ని అలవరుచుకోవాలని, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా పరిశీలించాలని ఆయన కోరుకున్నారు.
బాల్యం, విద్యాభ్యాసం:
నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ 1945 నవంబర్ 1న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. చదువులో ఆసక్తి కలిగిన ఆయన వైద్యవిద్యను అభ్యసించి 1970లో MBBS పట్టా పొందారు. వైద్యుడిగా సుమారు 12 సంవత్సరాల పాటు పనిచేశారు. వైద్య వృత్తిలో ఉన్నప్పుడు సమాజంలోని పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, మూఢనమ్మకాల ప్రభావాన్ని దగ్గరగా గమనించారు.
ప్రజల అనారోగ్యానికి సరైన వైద్య చికిత్స అందించాల్సిన సమయంలో కొందరు మంత్రగాళ్లు, బాబాలు, దొంగ స్వామీజీలు వారిని మోసం చేయడం ఆయనను కలచివేసింది. క్రమంగా వైద్య వృత్తి కంటే సమాజంలో శాస్త్రీయ చైతన్యం పెంపొందించడం ముఖ్యమని భావించారు. 1982 నుంచి పూర్తికాల సామాజిక ఉద్యమకారుడిగా మారారు.
సామాజిక ఉద్యమాల్లో ప్రవేశం:
దభోల్కర్ కేవలం మూఢనమ్మకాల నిర్మూలనకే పరిమితం కాలేదు. ప్రారంభ దశలో సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, గ్రామీణ ప్రజల సమస్యలు, ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన విశ్వసించారు. అందుకే ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని తన ప్రధాన కార్యాచరణగా ఎంచుకున్నారు.
మహారాష్ట్ర అంధ శ్రద్ధ నిర్మూలన సమితి స్థాపన:
1989లో నరేంద్ర దభోల్కర్ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి (Maharashtra Andhashraddha Nirmoolan Samiti – MANS) ను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు
- మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను నిర్మూలించడం.
- ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం.
- చేతబడులు, మంత్ర తంత్రాల పేరుతో జరిగే మోసాలను బయటపెట్టడం.
- దొంగ బాబాలు, మతం పేరుతో ప్రజలను దోపిడీ చేసే వ్యక్తులను ప్రశ్నించడం.
- ప్రజలకు ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించడం.
- మహిళలు, పిల్లలు, దళితులు, బలహీన వర్గాలపై మూఢనమ్మకాల పేరుతో జరిగే హింసను అరికట్టడం.
- రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడం.
ఈ సంస్థ మహారాష్ట్రలో అనేక గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. సభలు, ప్రదర్శనలు, చర్చలు, శిక్షణా శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది.
మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కోసం పోరాటం:
దభోల్కర్ జీవితంలో అత్యంత ముఖ్యమైన పోరాటాల్లో ఒకటి మహారాష్ట్రలో మూఢనమ్మకాలు, చేతబడులు, మంత్రతంత్రాల పేరుతో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడం. దీనికోసం ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రచారం చేశారు. చట్టం తీసుకురావడాన్ని వ్యతిరేకించిన కొన్ని రాజకీయ, మతపరమైన సంస్థలు ఈ బిల్లును మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా చిత్రీకరించాయి. అయితే
మతాన్ని విశ్వసించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ మతం పేరుతో ఇతరులను మోసం చేయడం, హింసించడం, ఆర్థికంగా దోపిడీ చేయడం, అమానవీయ ఆచారాలను కొనసాగించడం ఎవరికీ హక్కు కాదు అని దభోల్కర్ వాదించారు. 2013లో ఆయన హత్యకు గురైన నాలుగు రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల వ్యతిరేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అనంతరం అదే ఏడాది డిసెంబరులో చట్టంగా అమలులోకి వచ్చింది.
దీనిని మహారాష్ట్రలో Maharashtra Prevention and Eradication of Human Sacrifice and Other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013 అని పిలుస్తారు. ఈ చట్టం మత విశ్వాసాలను నిషేధించదు. జాబితా చేసిన అమానవీయ, మోసపూరిత చర్యలను నేరాలుగా పరిగణిస్తుంది.
శాస్త్రీయ దృక్పథం – భారత రాజ్యాంగం:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) ప్రకారం ప్రతి పౌరుడి ప్రాథమిక విధుల్లో ఒకటి శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, పరిశోధనాత్మక స్వభావం, సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించడం. ఈ రాజ్యాంగ బాధ్యతను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు దభోల్కర్ కృషి చేశారు.
ఆయన అభిప్రాయం ప్రకారం ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఏదైనా విషయం చెప్పినంత మాత్రాన నమ్మకూడదు. దానికి ఆధారాలు ఏమిటి, శాస్త్రీయ వివరణ ఏమిటి అని పరిశీలించాలి. ఈ ఆలోచనా విధానం ప్రజాస్వామ్యానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రశ్నించని సమాజంలో అజ్ఞానం, భయం, దోపిడీ పెరిగే ప్రమాదం ఉంది.
రచయితగా నరేంద్ర దభోల్కర్:
దభోల్కర్ అనేక పుస్తకాలు రచించారు. మూఢనమ్మకాలు, హేతువాదం, శాస్త్రీయ ఆలోచన, ఆరోగ్యకరమైన జీవన విధానం ఆయన రచనల్లో ప్రధాన అంశాలు. ఆయన రచనల్లో ముఖ్యమైనవి అంధశ్రద్ధ: ప్రశ్నచిహ్న్ ఆణి పూర్ణవిరామ్, అసే కసే జాలే భోందూ, అంధశ్రద్ధ వినాశాయ. ఆయన మరాఠీ వారపత్రిక 'సాధన'కు 1998లో సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టారు. సామాజిక సంస్కరణ, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి అంశాలపై రచనలు చేశారు.
హత్య – దేశవ్యాప్తంగా సంచలనం:
2013 ఆగస్టు 20న పుణే నగరంలో ఉదయం నడకకు వెళ్లిన సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. శాస్త్రీయ దృక్పథం కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తిని హత్య చేయడం ప్రజాస్వామ్యానికి, బావ ప్రకటన స్వేచ్ఛకు, మానవ హక్కులకు జరిగిన దాడిగా అనేక ప్రజాసంఘాలు, మేధావులు ఖండించారు. ఆయన హత్య అనంతరం మహారాష్ట్రలో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం అమలుకు మార్గం సుగమమైంది. 2014లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
నేటి సమాజంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్నాం. వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కృత్రిమ మేధస్సు, డిజిటల్ విప్లవం మన జీవితాలను మార్చుతున్నాయి. అయినప్పటికీ సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, మతం పేరుతో దోపిడీ, కుల వివక్ష, మహిళలపై వివక్ష కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా కూడా తప్పుడు వైద్య సమాచారం, అద్భుత చికిత్సలు, నకిలీ శాస్త్రీయ ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దభోల్కర్ ఆలోచనలు మరింత అవసరం.
ముగింపు: నరేంద్ర దభోల్కర్ ఒక వైద్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, సమాజానికి శాస్త్రీయ ఆలోచనలను అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనను హత్య చేయగలిగారు కానీ ఆయన ప్రారంభించిన ప్రశ్నించే ఆలోచనా విధానాన్ని అంతం చేయలేకపోయారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
