డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో పలువురు సోషలిస్టు అభ్యర్థులు విజయం సాధించారు.
దీంతో వారు డెమోక్రాట్లకు బలమైన మద్దతు ఉన్న నియోజకవర్గాల నుంచి అమెరికా కాంగ్రెస్‌కు చేరే దారిలో నిలిచారు.
అదే సమయంలో ఈ విజయాలు డెమోక్రాటిక్ పార్టీకి కొత్త రాజకీయ సవాళ్లను కూడా సృష్టిస్తున్నాయి.
ఈ అభ్యర్థులందరూ డెమోక్రాటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా(డీఎస్ఏ)తో అనుబంధం కలిగినవారు. నవంబర్ ఎన్నికల్లో వీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
ఇదే సమయంలో మిషిగన్, మిస్సౌరీ లాంటి రాష్ట్రాల్లో డీఎస్ఏ మద్దతు పొందిన మరికొందరు అభ్యర్థులు ఇంకా ప్రైమరీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ అభ్యర్థులు డెమోక్రాటిక్ ఓటర్లలో ఏర్పడిన మార్పును, కొత్త ఉత్సాహాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
అయితే, డెమోక్రాట్లు అతివాద వామపక్షానికి వెళ్లిపోయారని, అందువల్ల వారిని నమ్మలేమని ఆరోపించేందుకు రిపబ్లికన్ పార్టీకి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తోంది.
డీఎస్ఏ అమెరికాలో అతిపెద్ద సోషలిస్టు సంస్థ. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ లాంటి ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఇది రాజకీయ పార్టీ కాదు, సభ్యత్వ సంస్థ. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, సంపదపై అధిక పన్నులు వీరి ప్రచార నినాదాలు.
2024 అక్టోబర్‌లో మమ్దానీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించిన తర్వాత డీఎస్ఏ సభ్యుల సంఖ్య దాదాపు రెట్టింపై లక్ష మందిని దాటింది.
అయినప్పటికీ, వెర్మాంట్‌కు చెందిన స్వతంత్ర సెనేటర్ బెర్నీ శాండర్స్ లాంటి కొందరు ప్రముఖ ప్రగతిశీల నాయకులు మాత్రం డీఎస్ఏ సభ్యులు కాదు.
అభ్యర్థులను పరిచయం చేసుకుందాం..
మెలాట్ కిరోస్, 29
కొలరాడోలోని డెమోక్రాటిక్ ప్రైమరీలో మెలాట్ కిరోస్, తన పుట్టుక కంటే చాలా కాలం ముందునుంచి ఆ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి డయానా డిగెట్ను ఓడించింది.
చాలా కాలంగా అధికారంలో కొనసాగుతున్న ఈ ప్రగతిశీల నాయకురాలు ప్రజలకు దూరమైన పాత వ్యవస్థకు చెందిన డెమోక్రాట్‌గా మారిపోయిందని, ఆమె సమయం ముగిసిందని కిరోస్ ప్రచారం చేసింది.
ఎన్నికల ప్రచార సమయంలో కిరోస్ డీఎస్ఏ సభ్యురాలైంది. ఆమె సార్వత్రిక ఆరోగ్య సేవలు, పిల్లల సంరక్షణ, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) సంస్థను రద్దు చేయడం, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయడం లాంటి అంశాలను సమర్థించింది.
రాజకీయాల్లోకి రాకముందు ఆమె కార్పొరేట్ న్యాయ రంగంలో పనిచేసింది. 2022లో దేశంలోని ప్రముఖ కార్పొరేట్ న్యాయ సంస్థల్లో ఒకటైన సిడ్లీ ఆస్టిన్‌లో ఆమె పూర్తి స్థాయి న్యాయవాదిగా చేరింది.
అయితే, ఇజ్రాయెల్ ఉనికిని ప్రశ్నించడం అంటే ఆటోమేటిక్‌గా యూదు వ్యతిరేకి (ఆంటీ-సెమిటిజం)గా పరిగణించకూడదని వాదిస్తూ వ్యాస రూపంలో లేఖ రాసిన కొద్దికాలానికే ఆమె ఉద్యోగం కోల్పోయింది.
ఆ వ్యాసంలో 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్‌పై చేసిన దాడుల అనంతరం కళాశాల ప్రాంగణాల్లో జరిగిన “యూదు వ్యతిరేక వేధింపులు, విధ్వంసం, దాడులను” ఖండిస్తూ 100కుపైగా అమెరికా న్యాయ సంస్థలు విడుదల చేసిన లేఖను కూడా ఆమె విమర్శించింది. ఆ లేఖపై ఆమె పనిచేసిన సంస్థ కూడా సంతకం చేసింది.
క్రిస్ ర్యాబ్, 56
క్రిస్టోఫర్ ఎం. ర్యాబ్ 2016 నుంచి పెన్సిల్వేనియా రాష్ట్ర ప్రతినిధుల సభ సభ్యుడిగా ఉన్నారు. మే 19న జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీలో రాష్ట్ర సెనేటర్ షరీఫ్ స్ట్రీట్, బైడెన్ మాజీ ప్రభుత్వ ఆరోగ్యాధికారి ఆలా స్టాన్ఫోర్డ్లను ఓడించి 44 శాతానికి పైగా ఓట్లు సాధించారు.
పెన్సిల్వేనియా అసెంబ్లీలో అత్యంత ప్రగతిశీల సభ్యుల్లో ఒకరిగా ర్యాబ్ పేరు పొందారు. గంజాయి చట్టబద్ధీకరణ, మరణశిక్ష రద్దు లాంటి అంశాలకు ఆయన మద్దతు తెలిపారు.
2021లో మూడో సంతానం తర్వాత లేదా 40 ఏళ్లు వచ్చిన తర్వాత పురుషులు వాసెక్టమీ చేయించుకోవాలని ప్రతిపాదించే బిల్లుకు సంబంధించిన మెమోను విడుదల చేశారు. అనంతరం అది మహిళల శరీరాలపై ప్రభుత్వం విధించే నియంత్రణలోని ద్వంద్వ ప్రమాణాలను చూపించేందుకు చేసిన వ్యంగ్య ప్రయత్నమని ఆయన వివరించారు.
ర్యాబ్ ఎన్నికల ప్రణాళికలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కిరాణా దుకాణాలు, ఉచిత ప్రజా రవాణా, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడం, ఐసీఈ రద్దు లాంటి అంశాలు ఉన్నాయి.
క్లేర్ వాల్డెజ్, 36
క్లేర్ వాల్డెజ్ ఒక కళాకారిణి, కార్మిక ఉద్యమ నిర్వాహకురాలు. ఆమె 2025 నుంచి న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె అమెరికా పౌరసత్వంతో పాటు టెక్సాస్‌లోని స్థానిక అమెరికన్ స్వయంప్రతిపత్తి కలిగిన య్స్లెటా డెల్ సుర్ ప్యూబ్లో జాతి పౌరురాలు కూడా.
నిడియా వెలాజ్క్వెజ్ రిటైర్మెంట్తో ఖాళీ చేసిన న్యూయార్క్ ఏడవ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నలుగురు అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో 56 శాతం ఓట్లతో ఆమె విజయం సాధించింది.
ఈ నియోజకవర్గంలో క్వీన్స్, ఉత్తర బ్రూక్లిన్‌లోని యువత, ఉన్నత విద్యావంతులు, వేగంగా మారుతున్న పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.
వాల్డెజ్ తన ప్రచారంలో ఐసీఈ రద్దు, పాలస్తీనీయులతో సంఘీభావం, జీవన వ్యయాన్ని తగ్గించడం, సార్వత్రిక ఆరోగ్య సేవలు, వారానికి నాలుగు రోజుల పని విధానం, అద్దె నియంత్రణ లాంటి అంశాలను ప్రాధాన్యంగా ప్రస్తావించింది.
2025లో జరిగిన నిరసనల్లో ఆమెను రెండుసార్లు అరెస్టు చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయానికి అనుకూలంగా ఓటు వేసిన సెనేటర్లు చక్ షూమర్, కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఒకసారి, మాన్హాటన్లోని ఐసీఈ నిర్బంధ కేంద్రంలో జరిగిన ధర్నాలో ఒకసారి అరెస్ట్ అయ్యారు.
డారియాలిజా అవిలా షెవాలియర్, 32
డాక్టరేట్ విద్యార్థిని, సామాజిక కార్యకర్త అయిన డారియాలిజా అవిలా షెవాలియర్ డొమినికన్ వలసదారుల కుమార్తె. ఆమె తన తొలి ప్రయత్నంలోనే జూన్‌లో జరిగిన ప్రైమరీలో ప్రగతిశీల డెమోక్రాట్, డొమినికన్-అమెరికన్ నాయకుడు అడ్రియానో ఎస్పైలాట్ను ఓడించింది. ఎస్పైలాట్ దాదాపు పదేళ్లుగా న్యూయార్క్ 13వ కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
అవిలా షెవాలియర్ 2025లో డీఎస్‌ఏలో చేరింది. ప్రభుత్వ నిధులతో ఆరోగ్య సేవలు, అద్దెదారుల రక్షణ, ఐసీఈ రద్దు, ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయం నిలిపివేయడం, కాంగ్రెస్ సభ్యులు షేర్ల వ్యాపారం చేయకుండా నిషేధించడం ఆమె ప్రధాన విధానాలు.
ఆమెపై వచ్చిన వివాదాల్లో ఎక్కువ భాగం కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం, ప్రస్తుతం తొలగించబడిన తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టుల వల్లే ఏర్పడ్డాయి.
2020, 2021లో చేసిన ట్వీట్లలో ఆమె అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ను “అత్యాచారి”గా పేర్కొనడం, “కమలా హారిస్‌కు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించడం, కోవిడ్-19ను “యూరోపియన్ మహమ్మారి”గా పేర్కొంటూ దాని మూలం ఫ్రాన్స్ అని చెప్పడం కనిపించింది.
తర్వాత అవిలా షెవాలియర్ ఆ ట్వీట్లపై తాను విచారం వ్యక్తం చేసినప్పటికీ, ఆ ఖాతాను ఎన్నికల ప్రచారం కారణంగా కాకుండా సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తొలగించానని తెలిపింది.
అనువాదం: డి వెంకన్న
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
