భారతదేశ రాజకీయ ముఖచిత్రంపై వామపక్ష భావజాలానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన అరుదైన మేధావి, ప్రజా నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. సంక్షోభ సమయాల్లో సంకీర్ణ రాజకీయాలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, పీడిత వర్గాల పక్షాన రాజీలేని పోరాటం చేసిన అలుపెరగని గళం ఆయనది. మతోన్మాదం, నయా ఉదారవాద విధానాలపై ఆయన సాగించిన సైద్ధాంతిక పోరాటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
2026 సెప్టెంబరు 12న కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి. దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసిన మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం సందర్భంలో కూడా వ్యక్తం కానంత భావోద్వేగాలు, అశ్రునయనాలు ఏచూరి మరణం పట్ల వ్యక్తమయ్యాయి.
ప్రజాతంత్ర, లౌకికవాదులు ఈ దేశం తన ప్రజలకు ఇంతకన్నా మెరుగైన జీవితాన్ని, సేవలను అందించవచ్చని భావించిన వారందరూ ఏచూరి ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అది అప్పుడే ఆగిపోవాల్సిన గళం కాదని ఉద్యమకారులు, తడారిపోవాల్సిన కలం కాదని సృజనకారులు వికలం చెందారు.
సంక్షోభ కాలంలో సంజీవిని లాంటి సలహాలు..
ఆయన రాజకీయ సహచరులు, రాజకీయ సంక్షోభ ఆపత్కాలంలో ఆయన సలహాలు సంజీవినిగా పనిచేసేవని తాల్కటోరా స్టేడియంలో జరిగిన సంతాప సభలో అన్నారు.
మారుతున్న కాలం గతిని గమనించి తగిన వ్యూహం, ఎత్తుగడలతో ఆ మార్పులను ఒడిసిపట్టి రాజ్యాంగంలో అందుబాటులో ఉన్నంతవరకైనా ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఉన్న పరిస్థితులను మధించడానికి అహర్నిశలు ఆలోచించిన మనసు అది.
ఏచూరి మరణం పట్ల దేశ విదేశాల్లో వ్యక్తమైన ప్రతిస్పందనలే దేశంలో వామపక్ష రాజకీయాలకు, ఆలోచనలకు ఉన్న బలమైన స్థానానికి ప్రతీకలు.
నయా ఉదారవాదం, మతోన్మాదాలపై పోరాటం..
భావి ప్రమాదాలను పసిగట్టగలిగిన శ్రేష్ఠుడు ఏచూరి. భారత రాజకీయాలలో ఏకకాలంలో ద్వంద్వ ప్రమాదాలు, ద్వంద్వ లక్షణాలు పొడచూపాయి. ఒకటి నయా ఉదారవాదం, రెండవది మతోన్మాదం.
1970వ దశకంలో బీజరూపంలో ఉన్న ఈ రెండు దుర్లక్షణాలు 1990 దశకం వచ్చేనాటికి భారత ప్రజాస్వామ్య పునాదులను సవాలు చేసే స్థాయికి ఎదిగాయి.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఆధారంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిన ఎన్నికల క్రమాన్ని అతలాకుతలం చేయడం ప్రారంభించాయి.
ఓటు బ్యాంకు రాజకీయాల వక్రీకరణ..
90వ దశకం కంటే ముందు అటు బూర్జువా పార్టీ ప్రతినిధులైనా, ఇటు కమ్యూనిస్టు పార్టీలో ప్రతినిధులైనా ప్రజా జీవితంతో పెనవేసుకున్నవారే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికలలో బరిలో దిగేవారు.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలుషితం చేసి, మసకబార్చే ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నివేళలా ప్రజాస్వామ్య పోరాటంలో అంతర్భాగాలే.
ఓటు బ్యాంకు రాజకీయాలు అన్న భావనకు నయా ఉదారవాద విధానాలు ఒక రకమైన నిర్వచనం ఇస్తే మతోన్మాద రాజకీయాలు మరొక రకమైన నిర్వచనాన్ని ప్రతిపాదించాయి. అప్పటి నుంచి ఓటు బ్యాంకు రాజకీయాలు ఒక అపప్రథగా మారిపోయాయి.
లౌకికతత్వంపై దాడి.. మేధావుల వక్రీకరణ..
ఈ కాలంలోనే తెరమీదకు వచ్చిన మరొక ప్రధాన చర్చ లౌకికతత్వం గురించి. భారతీయ సమాజాన్ని శతాబ్దాలుగా సమైక్యంగా నిలిపి ఉంచిన తాత్విక భావన లౌకికతత్వం.
లౌకికతత్వమే ఆయుధంగా సాగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం వలస పాలకుల వెన్నుల్లో వణుకు పుట్టించింది.
కాలక్రమంలో సమ్మిళిత రాజకీయాలకు, సమీకృత సమగ్ర అభివృద్ధి భావనలకు పునాదిగా మారింది.
అటువంటి లౌకికతత్వానికి చెదలు పట్టిన కాలం కూడా 1990 దశకమే. వేల ఏళ్లుగా ఈ దేశాన్ని కలిపి ఉంచిన లౌకికతత్వం అవగాహనకు తూట్లు పొడిచే ప్రయత్నం 1920లోనే మొదలైంది.
వందేళ్ల మేధోమథనం తరువాత లౌకికతత్వానికి ముందు “కుహనా” అనే ఒక పదం చేర్చడం ద్వారా మతోన్మాద రాజకీయాలు వేల ఏళ్ల చరిత్రను వక్రీకరించి ప్రచారం చేయడం మొదలుపెట్టాయి.
ఈ కార్యక్రమంలో చదువుకున్న మేధావులు, పౌర సమాజంగా పిలవబడే ప్రతినిధులు, వ్యాఖ్యాతలు, పరిశోధకులు లౌకికతత్వం, కుహనా లౌకికతత్వం మధ్య సారూప్యతలు, వ్యత్యాసాల గురించి పరిశోధనలు చేసి ప్రజల దృష్టిని మళ్లించడంలో తమ వంతు పాత్ర పోషించారు. మతోన్మాద రాజకీయాలు విసిరిన వలలో చిక్కుకుపోయారు.
రాజకీయాల్లో ధ్రువతార.. సైద్ధాంతిక మార్గదర్శి..
అటువంటి సంక్లిష్ట సమయంలో భారత రాజకీయ రంగంలో మెరిసిన ధ్రువతార సీతారాం ఏచూరి. ఈ కాలంలో ఆయన రాసిన రెండు వ్యాసాలు భారత పాలకవర్గాల స్వరూప స్వభావాలను కళ్లకు కట్టినట్టు విప్పి చూపాయి.
భారత ఆర్థిక సంస్కరణల వర్గ స్వభావం, హిందూ రాష్ట్ర అంటే ఏమిటి అన్నవే ఆ రెండు వ్యాసాలు. ఈ రెండు వ్యాసాలు తర్వాత కాలంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలకు ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికలుగా మారాయి.
ఆ ప్రణాళికల కోసం జరిగిన మేధో కసరత్తులో భాగంగానే ఆయిల్ పూల్ అకౌంట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా చమురు ధరల నిర్ణయం పేరుతో చేస్తున్న దోపిడీని ప్రజల ముందుంచారు కామ్రేడ్ ఏచూరి.
సంకీర్ణ రాజకీయాలకు వ్యూహకర్త..
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంలోనూ వామపక్షాలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేలా చూడటంలో సీతారాం ఏచూరి అందించిన మేధోపరమైన తోడ్పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ప్రత్యామ్నాయ సంకీర్ణ రాజకీయాలు, అందులోనూ బూర్జువా పార్టీలతో అనివార్యమవుతున్న సంకీర్ణ రాజకీయాల మనుగడ గురించి అనేకమంది లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా సీతారాం ఏచూరి ఒక మాట చెబుతూ ఉండేవారు.
“నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగలేకపోయాయి. అదే సంకీర్ణాల భవిష్యత్తు అని ఊరుకుంటే పదేళ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉనికిలోకి వచ్చేది కాదు.”
బీజేపీ, జనసంఘ్‌లు కూడా భాగస్వామిగా ఉన్న జనతా ప్రయోగం, 13 రోజుల వాజ్‌పేయి ప్రభుత్వం మొదలు 13 నెలల వాజ్‌పేయి ప్రభుత్వం వరకూ మితవాద సంకీర్ణాలు కూడా ఏకాఏకిన శాశ్వతంగా అధికారం కొనసాగించే స్థితికి చేరుకోలేదు.
అయితే బీజేపీ ఆధిపత్య మితవాద సంకీర్ణాలకు, కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక సంకీర్ణాలకు మధ్య ఒక తేడా ఉంది.
లౌకిక సంకీర్ణాల్లో భాగస్వాములైన పార్టీలు ఏవీ తమ పార్టీలు చీల్చుకునే దుస్థితికి చేరుకోలేదు అన్నదే భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల నడక, నడత, నైతికత మీద ఏచూరి విశ్లేషణ, అంచనా. ఈ అంచనా వాస్తవికమైనది అని చరిత్ర రుజువు చేస్తోంది.
హిందూ రాష్ట్ర అంటే ఏమిటి అన్న వ్యాసం దేశంలో సంఘ్ పరివారం గురించి అనేక పరిశోధనలకు తెరతీసింది.
సంఘ్ పరివారం అస్తిత్వ రాజకీయాల పరిశోధన నిపుణుడిగా గుర్తింపు, ప్రశంసలు పొందుతున్న క్రిస్టోఫర్ జాఫ్రెలాట్ ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ పతనానంతరం సాగించిన పరిశోధనలో భాగంగా ఏచూరితో విస్తృత చర్చలు జరిపారు. అనంతరం కూడా పారిస్ కేంద్రంగా జాఫ్రెలాట్ ఏర్పాటు చేసిన భారత అధ్యయనాల సంస్థ నిర్వహణలో ఏచూరి సలహా సంప్రదింపులు కొనసాగాయి.
అస్తిత్వ ఉద్యమాలు.. వామపక్ష దృక్పథం..
భారతదేశంలో మతోన్మాద రాజకీయాలకు విరుగుడు ఒకటేనని, వామపక్ష శక్తుల పలుకుబడి, ప్రభావం, పార్లమెంటరీ ప్రాతినిధ్యం కలిగిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే దానికి మార్గమని ఆయన నమ్మారు.
ఈ తరహాలో బలోపేతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముందు ముందు విప్లవ రాజకీయాలకు ఊతమిస్తుంది.
ఈ క్రమంలో వామపక్షాలు అస్తిత్వ భావనలలోని పురోగామి లక్షణాలను స్వాగతించాలని, తిరోగామి లక్షణాలను తిరస్కరించాలని ఏచూరి ప్రతిపాదించారు. ఈ అవగాహనను 1995లో చండీగఢ్‌లో జరిగిన సీపీఎం మహాసభ ఆమోదించింది. దాని అమలులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ, తర్వాతి కాలంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్, లాల్ నీల్ ఐక్యత వంటి కార్యాచరణ వ్యూహాలు పదునెక్కాయి.
కుల పీడనను రూపుమాపనిదే జనతా ప్రజాస్వామ్యం పురోగమించదు అన్న అవగాహనకు, కార్యాచరణ ప్రణాళికకు పునాది వేసింది సీతారాం ఏచూరి 1995లో ప్రతిపాదించిన అస్తిత్వ రాజకీయాల గురించి అవగాహనే.
అణగారిన వర్గాలకు శాశ్వత దిక్సూచి..
అస్తిత్వ ఉద్యమాలలోని ప్రగతిశీల ఆకాంక్షలు, మెరుగైన అవకాశాల చుట్టూ పెరుగుతున్న డిమాండ్లకు, ఈ ఉద్యమాలను బూర్జువా పాలకవర్గం చేతుల్లో పావులుగా మార్చే కుల సంఘాల అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వర్గ దృష్టితో, మార్క్సిస్టు అవగాహనతో నిగ్గుతేల్చి భారతదేశంలో అస్తిత్వ రాజకీయాల పట్ల వామపక్ష అవగాహనను మౌలికంగా మార్చడంలో కీలక సైద్ధాంతిక అవగాహనను సమకూర్చడమే కాక కార్యాచరణను కూడా రూపొందించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకానికి, వివిధ చారిత్రక సందర్భాలలో వారు సాగించే మేధోమథనానికి, రూపొందించే కార్యాచరణకు దిక్సూచిగా ఉంటారనడంలో సందేహం లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
