జూన్ పద్నాలుగు చేగువేరా జయంతి, వారికి విప్లవ జోహార్లు. లాటిన్ అమెరికా విప్లవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు చేగువేరా.
ఆయన పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డే లా సెర్నా. ప్రపంచవ్యాప్తంగా ఆయనను “చే గువేరా” లేదా “చే” అని పిలుస్తారు.
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్ల ఆయన ఒక విప్లవ చిహ్నంగా నిలిచిపోయారు.
జననం, కుటుంబ నేపథ్యం..
రొసారియో నగరంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున చేగువేరా జన్మించారు. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్.
తల్లి సెలియా డే లా సెర్నా. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరి ఇంట్లో సాహిత్యం, రాజకీయాలు, సామాజిక అంశాలపై చర్చలు జరిగేవి.
చిన్ననాటి నుంచే చేగువేరా తీవ్రమైన ఆస్తమా వ్యాధితో బాధపడేవారు. అయినప్పటికీ చదువులో, క్రీడల్లో, పుస్తక పఠనంలో ఆసక్తి చూపారు.
ముఖ్యంగా చరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు.
చే గువేరా బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. పంతొమ్మిది వందల ఏభై మూడులో వైద్య పట్టా పొందారు.
వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ, ఆయన జీవితాన్ని మార్చింది ఆయన చేసిన లాటిన్ అమెరికా పర్యటన.
మోటార్ సైకిల్ యాత్ర – జీవితంలో మలుపు..
పంతొమ్మిది వందల ఏభై ఒకటి-ఏభై రెండులో తన స్నేహితుడు అల్బెర్టో గ్రనడోతో కలిసి దక్షిణ అమెరికా దేశాలలో మోటార్ సైకిల్ యాత్ర చేశారు.
ఈ ప్రయాణంలో పేదరికం, నిరుద్యోగం, భూస్వాముల దోపిడీ, విదేశీ కంపెనీల ఆధిపత్యం వంటి సమస్యలను ప్రత్యక్షంగా చూశారు.
ప్రత్యేకించి చిలీ గనుల కార్మికులు, పెరూ ఆదివాసీలు, కుష్ఠు రోగుల కాలనీల పరిస్థితులు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
సమాజంలో అసమానతలకు మూల కారణం పెట్టుబడిదారీ వ్యవస్థేనని ఆయన భావించారు.
మార్క్సిస్టు భావజాలం వైపు..
ఈ అనుభవాల తరువాత చే గువేరా మార్క్సిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. సామాజిక మార్పు కోసం విప్లవమే మార్గమని నమ్మడం ప్రారంభించారు.
పంతొమ్మిది వందల ఏభై నాలుగులో గ్వాటిమాలాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అమెరికా మద్దతుతో కూల్చివేయడాన్ని చూసిన తరువాత ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి అంకితమయ్యారు.
ఫిడెల్ కాస్ట్రోతో పరిచయం..
పంతొమ్మిది వందల ఏభై ఐదులో మెక్సికోలో చే గువేరా, ఫిడెల్ కాస్ట్రోను కలిశారు. క్యూబాలో నియంత ఫుల్జెన్సియో బాటిస్టా పాలనను కూల్చడానికి కాస్ట్రో సన్నాహాలు చేస్తున్నారు.
చే గువేరా ఆ ఉద్యమంలో చేరి వైద్యుడిగానే కాకుండా యోధుడిగా కూడా పనిచేశారు.
క్యూబా విప్లవం..
పంతొమ్మిది వందల ఏభై ఆరులో “గ్రాన్మా” అనే పడవలో ఎనభై రెండు మంది విప్లవకారులు క్యూబాకు చేరుకున్నారు. సియెర్రా మాయెస్ట్రా పర్వత ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. చే గువేరా ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలతో త్వరగా ప్రముఖ కమాండర్‌గా ఎదిగారు. పంతొమ్మిది వందల ఏభై ఎనిమిదిలో జరిగిన సాంటా క్లారా యుద్ధంలో ఆయన నేతృత్వంలోని దళాలు కీలక విజయం సాధించాయి.
పంతొమ్మిది వందల ఏభై తొమ్మిది జనవరి ఒకటవ తేదీన క్యూబా విప్లవం విజయం సాధించింది. బాటిస్టా దేశం విడిచి పారిపోయాడు.
విప్లవానంతర బాధ్యతలు..
విప్లవ విజయం తర్వాత చే గువేరా క్యూబా ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. భూ సంస్కరణల అమలు, జాతీయ బ్యాంకు అధ్యక్షుడు, పరిశ్రమల మంత్రి, విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, క్యూబాలో అక్షరాస్యత పెంపు, ఉచిత వైద్యం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన విశేషంగా కృషి చేశారు.
అంతర్జాతీయ విప్లవ దృక్పథం..
చే గువేరా అభిప్రాయం ప్రకారం ఒక దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న ప్రజలు విముక్తి కోసం పోరాడాలి. ఆయన ప్రసిద్ధ నినాదం “రెండు, మూడు, ఎన్నో వియత్నాంలను సృష్టించండి.” అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగో, బొలీవియా పోరాటాలు..
పంతొమ్మిది వందల అరవై ఐదులో చే గువేరా క్యూబాను విడిచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విప్లవ ఉద్యమానికి సహాయం చేశారు.
అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత బొలీవియాలో గెరిల్లా ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ అక్కడి పరిస్థితులు అనుకూలించలేదు.
మరణం..
పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఎనిమిదిన బొలీవియా సైన్యం చే గువేరాను పట్టుకుంది. మరుసటి రోజు అక్టోబర్ తొమ్మిదిన లా హిగువేరా గ్రామంలో ఆయనను కాల్చి చంపారు. మరణించే ముందు ఆయన చెప్పినట్లు ప్రసిద్ధి చెందిన మాట “నన్ను కాల్చండి. మీరు ఒక మనిషిని మాత్రమే చంపగలరు, ఆలోచనను కాదు.”
చే గువేరా మంచి రచయిత కూడా. మోటార్ సైకిల్ డైరీస్, గెరిల్లా వార్ఫేర్, రెమినిసెన్సెస్ ఆఫ్ ది క్యూబన్ రివల్యూషనరీ వార్ వంటి ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి.
ప్రపంచవ్యాప్త ప్రభావం..
చే గువేరా ఫోటో ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రాజకీయ చిత్రాలలో ఒకటి. క్యూబన్ ఫోటోగ్రాఫర్ అల్బెర్టో కోర్డా తీసిన ఆయన చిత్రం ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు, స్వేచ్ఛ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది.
చే గువేరా గురించి ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయనను ప్రజల విముక్తి కోసం పోరాడిన మహా విప్లవకారుడిగా గౌరవిస్తారు. పేదరికం, అసమానత, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా ఆయన పేరు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
చే గువేరా కేవలం క్యూబా విప్లవ నాయకుడు మాత్రమే కాదు. సమానత్వం, సామాజిక న్యాయం, అణచివేతకు వ్యతిరేక పోరాటానికి ప్రతీక. ఆయన జీవితం నేటికీ ప్రపంచవ్యాప్తంగా యువతను, సామాజిక ఉద్యమాలను ప్రభావితం చేస్తూనే ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
