ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయటం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.
ప్రజాధనంతో రాజకీయ డ్రామా..
ఈ మేరకు కే రామకృష్ణ ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించి, ఆయనతో ప్రారంభించడం అందరూ స్వాగతించాల్సిందే. అందుకుగాను ఎన్నడూ లేనట్లుగా 30, 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి- 2, 3 లక్షల మంది జనాభాను సమీకరించడం, అంత పెద్ద ఎత్తున హంగామా చేయటం పక్కా రాజకీయ డ్రామాగా గోచరిస్తున్నది.
రాజకీయంగా ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు చేపట్టిన వేడుకే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన ఇంటి వద్ద, పార్లమెంటు వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ నిరసన తెలుపుతున్నారనేది అక్షర సత్యం. కానీ ఏపీలో చంద్రబాబు, పవన్‌లు మోదీని పొగడ్తలతో ముంచెత్తటం అవివేకం.
మోదీ కనీసం పార్లమెంట్లో జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎంలు మోదీని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకే రాకుండా అసలు ముఖం చాటేశారు.
ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం మోదీ వాళ్ళను పరామర్శించిన పాపాన పోలేదు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మోదీ పట్ల ఎటువంటి హంగామా చేయడం లేదు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి, ప్రజాధనం వృథా చేయటం, మోదీకి భజన చేయటం దుర్మార్గం.
సమస్యలు పక్కనపెట్టి భజన..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దేశ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మోదీ హయాంలో దేశం ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని బాకాలు ఊదటం సిగ్గుపడాల్సిన విషయం.
దేశంలో మోదీ పాలనలో పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతున్నాయి. మోదీ పాలనలో విద్యార్థులకు పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక పోయారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. రైతు సమస్యలు పరిష్కరించలేకపోయారు. అధిక ధరలు తగ్గించలేకపోయారు. పెద్ద ఎత్తున అవినీతి జరగటం, నల్లధనం పెరిగిపోవడం వంటివి తారాస్థాయికి చేరాయి.
మోదీ హయాంలో దేశాన్ని అప్పుల పాలుజేశారు. రూపాయి విలువ పడగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అభాసపాలు చేశారు. మొన్నటి వరకు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని బెదిరించిన మోదీ గ్రాఫ్ పడిపోయింది.
రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలె అధ్వానంగా దిగజారి పొగిడే వారిని గతంలో ఎన్నడూ చూడలేదు. తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎం కల్పించడం శోచనీయం.
చర్చకు సిద్ధమా?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టు పెడుతున్నారు. స్వార్థపర రాజకీయాల కోసం దేశంలో ఏమాత్రం జరగని అభివృద్ధిని జరిగినట్లుగా బాకాలు ఊదుతున్నారు.
నరేంద్ర మోదీ లాంటి పనికిమాలిన ప్రధానిని ఇంతవరకు చూడలేదని దేశమంతా కోడై కూస్తున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రికి పట్టకపోవడం విచారకరం.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదు. గత 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ హయాంలో దేశానికి ఏం ఒరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాం.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మోదీని పదేపదే పొగడ్తలతో ముంచెత్తడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
