రాజకీయ నాయకులు రోజురోజుకూ నిట్ట నిలువునా చీలిపోతూ, పరస్పరం తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడుతున్న దేశంలో.. వేలాది మంది గ్రామీణ భారతీయులు మాత్రం వ్యక్తిగత దూషణలకు తావులేకుండా, పరస్పర గౌరవంతో సాగే వాద–ప్రతివాద పోటీల్లో పాల్గొంటూ, చర్చను ఆస్వాదించేందుకు ఒక్కచోట చేరుతున్నారు.
దేశంలోనే బహుశా అతిపెద్ద ప్రజా వాద–ప్రతివాద కార్యక్రమానికి వేదికగా నిలిచిన ప్రదేశం అచ్చమైన గ్రామీణ భారతాన్ని తలపించింది—పచ్చని వరి పొలాలు, ఓ చెరువు, ఓ దేవాలయం.
సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని అజ్గరా గ్రామంలో సాయంత్రం కాగానే ప్రజలు చెరువు గట్టున చేరి పంటల ధరలు, వాతావరణం, మేక దొంగతనం వంటి రోజువారీ విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు.
అయితే నెలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో మాత్రం వారి సాధారణ చర్చల స్థానాన్ని తత్వశాస్త్రం, నైతిక సందిగ్ధతలు ఆక్రమించాయి.
దుష్టుడైన శత్రువును ఓడించేందుకు మోసాన్ని ఆశ్రయించడం సమర్థనీయమేనా? ఒక ప్రాణాన్ని కాపాడేందుకు చెప్పే అబద్ధాన్ని సమర్థించవచ్చా? అసలు వాస్తవం అంటే ఏమిటి? వంటి విషయాలపై వాద ప్రతివాదాలు సాగాయి.
మహాభారత స్ఫూర్తితో రూపకల్పన
ఈ వాద–ప్రతివాద పోటీకి ఆలోచనను అందించి, దానికి రూపకల్పన చేసిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ పాండే.
రెండేళ్ల క్రితం ఆయన జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రాచీన భారతీయ ఇతిహాసం మహాభారతంతో ముడిపడిన విలువైన పురావస్తు సంపద ఈ ప్రాంతంలో విస్తారంగా ఉందని తెలుసుకున్నారు.
మహాభారత కథనమంతటా ప్రధాన పాత్రల్లో ఒకరైన యుధిష్ఠిరుడు మానవ అస్తిత్వం, జీవిత స్వభావం వంటి మౌలిక ప్రశ్నలపై తాత్వికంగా చర్చిస్తుంటారు.
అజ్గరా కథలోనూ తన నలుగురు సోదరుల ప్రాణాలను కాపాడుకోవడానికి అతడు వరుసగా ఎదురైన తాత్విక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది.
3,000 ఏళ్ల నాటి ప్రాచీన సంప్రదాయం
35 ఏళ్ల పాండే కూడా చాలామంది భారతీయుల మాదిరిగానే చిన్ననాటి నుంచే ఈ కథను వింటూ పెరిగారు. అందులోని సంభాషణల్లో దాగి ఉన్న లోతైన మేధోపరమైన ఆలోచనా సంపద ఆయనను ఎంతో గర్వపడేలా చేసేది.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్‌పై చదువుతున్న సమయంలో, దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన అక్కడి వాద–ప్రతివాద సంఘం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ప్రజల మధ్య ఉన్నతస్థాయి వాద–ప్రతివాదాలకు భారతదేశానికి ఉన్న సంప్రదాయం అంతకంటే ఎంతో పురాతనమైనది- 3,000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినది. అయితే ఈ గొప్ప సంప్రదాయం ఎందుకు కొనసాగలేదన్న ప్రశ్న పాండేను ఆలోచింపజేసింది.
“భారతీయులు శతాబ్దాలుగా ఎన్నో సంప్రదాయాలను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. మరి వాదించడం, ప్రశ్నించడం అనే మన సంప్రదాయ వారసత్వాన్ని జరుపుకోవడం ఎందుకు మానేశాం?” అని పాండే ప్రశ్నిస్తారు.
ప్రత్యేకించి ప్రజాస్వామ్యానికి వాదించడం, ప్రశ్నించడం అనేవి అత్యంత కీలకమైన అంశాలైనప్పుడు, ఈ గొప్ప సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడం సాధ్యమేనా?
ఈ ఆలోచనతోనే ప్రతి ఏడాది సెప్టెంబరులో అజ్గరాలో జరిగే జాతరను ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
జాతరకు సన్నాహకంగా పాండే, ఆయన బృందం జిల్లా వ్యాప్తంగా 1,500 వాద–ప్రతివాద కార్యక్రమాలను నిర్వహించింది.
హోరాహోరీగా సాగిన తుది పోటీలు
పాల్గొనడానికి వయస్సు, విద్యార్హతలు ఏవీ అడ్డంకి కాలేదు. పోటీలో పాల్గొన్న వారిలో అతి పిన్న వయస్కుడు పదేళ్ల పాఠశాల విద్యార్థి కాగా, అత్యంత పెద్దవాడు 80 ఏళ్ల రైతు.
ఒక ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదించే సమయంలో పాల్గొనేవారిని వారి తర్కబద్ధమైన ఆలోచనా విధానం, నైతిక స్పష్టత ఆధారంగా నిర్ణయించారు.
ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన పాండేను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వేలాది మంది పలు దశల్లో జరిగిన వాద–ప్రతివాదాల్లో పాల్గొన్నారు.
చివరకు వారిలో నుంచి ఎనిమిది మంది తుది పోటీదారులుగా ఎంపికయ్యారు—ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు.
బయట గ్రామస్థులు సందడిగా తిరుగుతున్నారు. రకరకాల వంటకాలను ఆస్వాదిస్తూ, జానపద నాటకాలను చూస్తూ, స్థానిక హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ, జెయింట్ వీల్‌పై తిరుగుతూ జాతరను ఆస్వాదిస్తున్నారు.
అదే సమయంలో, వాద–ప్రతివాదాల కోసం ఏర్పాటు చేసిన గుడారంలో మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
2026 సెప్టెంబర్ 17న జరిగిన ‘గ్రేట్ అజ్గరా డిబేట్’ తుది పోటీ దాదాపు ఆరు గంటల పాటు సాగింది.
హక్కులపై అవగాహన, హుందాతనం
వాద–ప్రతివాదాల్లో ఒక అంశం మహిళల హక్కులు. తుది పోటీదారుల్లో ఒకరైన వివేక్ సింగ్ వాదిస్తూ, కాగితాలపై మహిళలకు సమాన హక్కులు ఉన్నప్పటికీ, సమాజం వారి నుంచి ఆశించే పాత్రలు, ప్రవర్తనా ప్రమాణాలు ఆ హక్కులను వాస్తవ జీవితంలో వినియోగించుకోవడానికి అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొన్నారు.
మరో తుది పోటీదారు 24 ఏళ్ల ప్రజ్జ్వల్ శుక్లా మాత్రం అసలు ప్రశ్న మహిళలకు సమాజం ఎలాంటి పాత్రను నిర్దేశిస్తుందన్నది కాదని, ఆ ఎంపికను చేసుకునే అధికారం ఎవరిది అన్నదే అసలు ప్రశ్న అని వాదించారు.
ఒక మహిళ వృత్తిని ఎంచుకున్నా, ఇంటి బాధ్యతలను స్వీకరించినా, లేదా రెండింటినీ సమన్వయం చేసుకున్నా— ఆ నిర్ణయం ఆమె స్వంతం కావాలి; ఆ నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా ఆమెకే ఉండాలని ఆయన అన్నారు.
“నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది వాద–ప్రతివాదాల మేధోస్థాయి కాదు (అది నిజంగా అద్భుతంగా ఉంది); అక్కడ నెలకొన్న వాతావరణం. ప్రతి ఒక్కరూ ఒకరి మాటను మరొకరు ఎంతో గౌరవంగా, ఓపికగా విన్నారు. మధ్యలో ఎవరూ అడ్డుకోలేదు. ఎవరూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. గంటల తరబడి ప్రజలు కూర్చుని చర్చలను విన్నారు” అని పాండే చెప్పారు.
టీవీ చర్చలకు భిన్నంగా ఆరోగ్యకరమైన వాతావరణం
మార్క్స్ చెప్పిన “చరిత్ర తనను తాను పునరావృతం చేసుకుంటుంది—మొదట విషాదంగా, ఆ తర్వాత ప్రహసనంగా” అనే మాటలు, భారతదేశంలో ప్రత్యేకించి రాజకీయ రంగంలో వాద–ప్రతివాదాల స్థాయి ఒకప్పుడు ఉన్న గంభీరత నుంచి నేడు ఎలా ప్రహసన స్థాయికి దిగజారిందో చెప్పడానికి సరిగ్గా సరిపోతాయి.
టెలివిజన్ స్టూడియోల్లో జరిగే చర్చలను చూస్తే, అందరూ ఒకేసారి అరుస్తుంటారు. ఎవరూ తమ వాదనను పూర్తిగా చెప్పే పరిస్థితి ఉండదు.
ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, ఎద్దేవాలు చేసుకుంటుంటే, యాంకర్ వారిని మరింత రెచ్చగొడుతూ చర్చను అంతకంతకూ ఉన్మాద స్థాయికి తీసుకెళ్తుంటారు.
ప్రాచీన నాగరికత – భిన్న ఆలోచనల స్వీకారం
గ్రేట్ అజ్గరా డిబేట్ తుది దశకు చేరుకున్న ఇద్దరు మహిళల్లో ఒకరైన సాధనా ద్వివేది ఈ కొత్త తరహా చర్చా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
“ఇతరులు చెప్పేది వినడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి అభిప్రాయంలో కూడా విలువైన అంశం ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అన్ని అభిప్రాయాలూ వ్యక్తమవడం అత్యంత కీలకం. అప్పుడే మనం సత్యాన్ని చేరుకోగలం” అని ఆమె అంటారు.
ఆర్థికవేత్త అమర్త్య సేన్ తన ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’ పుస్తకంలో ప్రతిపాదించిన భావనకు అజ్గరా వాద–ప్రతివాద పోటీలకు లభించిన విశేష ప్రజాదరణ ఒక చక్కటి నిదర్శనంగా నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించడం, భిన్నమైన ఆలోచనలను స్వీకరించడం భారతదేశానికి సుదీర్ఘమైన, సమృద్ధమైన సంప్రదాయంగా ఉందన్నదే అమర్త్య సేన్ ఆ పుస్తకంలో వివరించిన ప్రధాన భావన.
అయితే ఇటీవలి సంవత్సరాల్లోనే భిన్నాభిప్రాయాలకు, అసమ్మతికి అణచివేత పెరిగిందని ఈ కథనం పేర్కొంటోంది.
ముఖ్యంగా హిందూత్వ జాతీయవాదాన్ని సమర్థించే అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏకరూపతకు ప్రాధాన్యం ఇస్తూ, భిన్నాభిప్రాయాలను అణచివేస్తోందన్నది ఇందులోని విమర్శ.
“ఇది ఒక విచిత్రమైన విరోధాభాసం. బీజేపీ హిందూ రాజ్యాన్ని పునర్నిర్మించాలని కోరుకుంటోంది. కానీ ప్రాచీన హిందూ నాగరికతలో భాగమైన వాద–ప్రతివాద సంప్రదాయం, భిన్నమైన ఆలోచనలను స్వేచ్ఛగా స్వీకరించే విశాల దృక్పథం వంటి సంప్రదాయాల గురించి ఆ పార్టీకి అసలు పరిచయమే లేదు” అని రచయిత, వ్యాఖ్యాత పర్సా వెంకటేశ్వరరావు జూనియర్ అన్నారు.
మేధో వీరులకు ఘన సత్కారం
పోటీ ముగిసే సమయానికి తుది దశకు చేరుకున్న ఎనిమిది మంది పోటీదారులకు పూలమాలలు వేసి, ప్రజల హర్షధ్వానాల మధ్య ఓపెన్ టాప్ కారులో ఊరేగించారు. వారిని “మేధో వీరులు”గా సత్కరించారు.
ఈ పోటీలో విజేతగా 24 ఏళ్ల శుక్లా నిలిచారు. ప్రస్తుతం ఆయన సివిల్ సర్వీసులో ప్రవేశించేందుకు నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
“శతాబ్దాల క్రితం మహాభారతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన అదే ప్రదేశంలో జరిగిన వాద–ప్రతివాద పోటీలో నేను విజేతగా నిలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇతరులు ఏమనుకుంటున్నారో, వారి ఆలోచనలు ఏమిటో వినాలనే ఉద్దేశంతోనే నేను ఈ పోటీలో పాల్గొన్నాను” అని ఆయన చెప్పారు.
ఈ పోటీకి ప్రజల నుంచి లభించిన అపూర్వమైన స్పందనను పాండే ఇప్పటికీ జీర్ణించుకుంటున్నారు.
“ప్రతిచోటా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం చూసి, పోలీసులను భారీగా మోహరించాలా అని నా డిప్యూటీ నన్ను అడిగారు. కానీ నేను నవ్వి, ‘అవసరం లేదు’ అన్నాను. అలా చేస్తే ఈ మొత్తం కార్యక్రమానికే ఒక విషాద ఛాయ వచ్చేది” అని పాండే చెప్పారు.
శాశ్వత చిహ్నంగా మిగిలిన గ్రేట్ అజ్గరా డిబేట్
ఈ వాద–ప్రతివాద కార్యక్రమాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు, చివరకు దేశవ్యాప్తంగా విస్తరించాలని పాండే ఆశిస్తున్నారు.
“వాదించడం, ప్రశ్నించడం అనే సంస్కృతిని మన సమాజంలో తిరిగి పెంపొందించాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన లక్షణం” అని ఆయన అన్నారు.
అయితే అజ్గరాలో మాత్రం తన ఆలోచనకు ఆయన ఇప్పటికే ఒక శాశ్వత గుర్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జరిగిన ప్రదేశంలో ఆయన నెలకొల్పిన రాతి పలకపై ఇలా చెక్కించారు:
“ది గ్రేట్ అజ్గరా డిబేట్
మొదటి వాద–ప్రతివాదం — క్రీ.పూ. 3152: యుధిష్ఠిరుడు
రెండో వాద–ప్రతివాదం — 2026: ప్రజ్జ్వల్ శుక్లా”
వేల ఏళ్ల క్రితం యుధిష్ఠిరుడి తాత్విక సంభాషణలకు వేదికగా నిలిచిన అదే నేలపై, 2026లో మరోసారి ప్రశ్నలు, తర్కం, భిన్నాభిప్రాయాలు ప్రజల మధ్యకు రావడం—అజ్గరా వాద–వివాదానికి అదే శాశ్వత చిహ్నంగా మిగిలింది.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
