భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంతగా భ్రష్టుపట్టిపోయాయో, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి ఒడిగడుతున్నారో స్పష్టం చేయడానికి నోయిడా జిల్లా కలెక్టర్(డీఎం) మేధా రూపమ్ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం.
ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలు, చర్యలతో దేశ ప్రజాస్వామ్య పునాదులు ఊగిసలాడుతున్న వేళ, ఆయన కుమార్తె ఐఏఎస్ అధికారిణి మేధా రూపమ్ సాగించిన నిరంకుశ పాలన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రజాసేవ చేయాల్సిన బ్యూరోక్రసీ, పాలక వ్యవస్థల అహంకారానికి, ఏకపక్ష అధికార ప్రదర్శనకు గులాంగిరీ చేస్తూ సామాన్య పౌరుల హక్కులను కాలరాస్తున్న తీరు వ్యవస్థల నైతిక పతనానికి అద్దం పడుతోంది.
న్యాయబద్ధ డిమాండ్‌పై ‘ఎన్ఎస్ఏ’ రాక్షసాస్త్రం
అసలు ఈ అన్యాయానికి బీజం ఎక్కడ పడింది? 2026 ఏప్రిల్‌లో నోయిడాలో కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన 25 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించి, కార్మికుల కనీస హక్కుల కోసం గళమెత్తడమే ఆ విద్యార్థిని చేసిన నేరమన్నట్లు నోయిడా జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ వ్యవహరించారు.
కనీస విచక్షణ, పరిశీలన లేకుండానే అత్యంత దారుణమైన, కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని(ఎన్ఎస్ఏ) ఆమెపై ప్రయోగించి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
దేశ రక్షణకు వాడాల్సిన చట్టాన్ని, ఒక విద్యార్థిని గొంతు నొక్కడానికి వాడటం అధికార యంత్రాంగపు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం.
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. బ్యూరోక్రసీకి మిగిలింది చీత్కారమే
అక్రమ నిర్బంధాన్ని సవాలు చేస్తూ ఆకృతి చౌదరి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ అతూల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ నిరంకుశత్వంపై నిప్పులు చెరిగింది.
2026 సెప్టెంబర్ 2న చారిత్రాత్మక తీర్పునిస్తూ — పోలీసుల కల్పిత కథనాల ఆధారంగా, విచక్షణ రహితంగా జారీ చేసిన ఈ ఎన్ఎస్ఏ నిర్బంధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన పౌర స్వేచ్ఛకు దారుణమైన విఘాతమని స్పష్టం చేసింది.
మేధా రూపమ్ చర్యలను తీవ్రంగా తప్పుపడుతూ, ఆమె ప్రవర్తన ‘ఈసడించుకోదగినది’ అని ఈసడించుకుంది.
బ్యూరోక్రాట్లు నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నశించి ఉత్తరప్రదేశ్ ఒక ‘నియంతృత్వ రాజ్యంగా’ మారే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించింది.
రూ 5 లక్షల జరిమానా: జీతాల నుంచే వసూలు చేయాలని ఆదేశం
అలహాబాద్ హైకోర్టు కేవలం విమర్శలతో ఆగలేదు. రాజ్యాంగ ప్రమాణ వచనాన్ని ఉల్లంఘించి, అక్రమంగా నిర్బంధించినందుకు విద్యార్థినికి రూ 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన కలెక్టర్ మేధా రూపమ్, కేసు నమోదు చేసిన ఎస్హెచ్ఓ సహా సంబంధిత పోలీసు అధికారుల వ్యక్తిగత జీతాల నుంచే వసూలు చేయాలని సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చింది.
పైగా ఈ విచారకరమైన వ్యవహారాన్ని వారి సర్వీస్ రికార్డుల్లో(ఆఫ్‌లైన్/ఆన్లైన్ సీఆర్లలో) ప్రత్యేకంగా నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
సుప్రీంకోర్టు జోక్యం: తాత్కాలిక ఊరట… కానీ విడుదల యథాతథం
హైకోర్టు కఠిన తీర్పును సవాలు చేస్తూ మేధా రూపమ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని(సుప్రీంకోర్టు) ఆశ్రయించాయి.
సెప్టెంబర్ 23న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపడుతూ, ఒక ఎన్ఎస్ఏ నిర్ణయం బహుళ స్థాయిల పరిశీలన దాటి వస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా డీఎమ్‌పై జరిమానా విధించడం, సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయడంపై తాత్కాలిక స్టే విధించింది.
అయితే, ఆకృతి చౌదరిపై ఎన్ఎస్ఏ నిర్బంధాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ప్రాథమిక తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయలేదు. అంటే విద్యార్థిని అక్రమ నిర్బంధం నుంచి విడుదల కావడం చట్టబద్ధంగా ఖరారైంది, కేవలం ఐఏఎస్ అధికారికి రూ 5 లక్షల జరిమానా నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
సీజేఐకు లేఖ.. ‘రోస్టర్ ఉల్లంఘన’పై విరుచుకుపడ్డ రాజ్యాంగ న్యాయవాదుల సంఘం
ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన తీరు మరో పెద్ద వివాదానికి తెరతీసింది. సెప్టెంబర్ 24న రాజ్యాంగ న్యాయవాదుల సంఘం(ఎల్ఎఎఫ్సీ) భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ఒక బహిరంగ లేఖ రాసింది.
“జూలై 13 నుంచి అమలులో ఉన్న సుప్రీంకోర్టు రోస్టర్ ప్రకారం హెబియస్ కార్పస్, ఎన్ఎస్ఏ వంటి నిర్బంధ కేసులను విచారించాల్సిన మొదటి నాలుగు బెంచ్‌లను దాటవేసి, ఈ కేసును క్రమం తప్పించి ప్రత్యేకంగా ఒక బెంచ్‌కు ఎలా కేటాయిస్తారు?” అని ఆ లేఖలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
“ఆమె సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె కావడం వల్లే ఈ ప్రత్యేక ప్రాధాన్యత లభించిందా” అని ప్రశ్నిస్తూ, ఇది తీవ్రమైన తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆడియో మ్యూట్ వివాదం… వీఐపీ సంస్కృతికి అద్దం పడుతున్న విమర్శలు
విచారణ సమయంలో పారదర్శకతకు సంకేతంగా ఉండే లైవ్ స్ట్రీమింగ్ ఆడియోను హఠాత్తుగా మ్యూట్ చేయడం, విలేకరులకు, డిజిటల్ మాధ్యమాలకు ప్రసార ప్రాప్యతను నిరోధించడంపై న్యాయవాదుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధికారం ఉన్న ఉన్నతాధికారులకు, రాజ్యాంగ ప్రముఖుల పిల్లలకు న్యాయవ్యవస్థలో దక్కే ఈ ‘ప్రత్యేక పరిగణన’ పౌరుల్లో వ్యవస్థలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని విపక్షాలు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఒక సామాన్య పౌరుడికైతే దక్కని వేగం, సౌలభ్యం వీఐపీల కుటుంబ సభ్యులకు మాత్రమే ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో, న్యాయ వర్గాల్లో పదునైన చర్చగా మారాయి.
సమాజానికి హెచ్చరిక.. హక్కుల రక్షణకై మేల్కొనాల్సిన సమయం
ఈ ఉదంతం కేవలం ఒక ఐఏఎస్ అధికారిణి చేసిన తప్పు మాత్రమే కాదు.. భారత బ్యూరోక్రసీ ఏ స్థాయి ఆధిపత్య ధోరణితో, బాధ్యతారాహిత్యంతో కొట్టుమిట్టాడుతోందో చూపించే ప్రమాదకర హెచ్చరిక.
తండ్రి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థను, కుమార్తె జిల్లా పాలనా వ్యవస్థను తమ ఇష్టారాజ్యంగా మలుచుకోవడానికి ప్రయత్నించడం దేశ ప్రజాస్వామ్యానికి కలుగుతున్న తీవ్ర ముప్పు.
అధికారంలో ఉన్నవారు తమ సీటును రక్షించుకోవడానికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకుంటే, ప్రశ్నించే ప్రతి గొంతునూ తొక్కిపడేస్తే సమాజంలో న్యాయం, స్వేచ్ఛ అనే పదాలకు అర్థమే ఉండదు.
ఈ వ్యవస్థల భ్రష్టత్వానికి వ్యతిరేకంగా పౌరులు, పౌర సమాజం గళమెత్తకపోయినా, న్యాయస్థానాలు కఠినంగా నిలబడకపోయినా ప్రజాస్వామ్యం అలంకారప్రాయంగా మిగిలిపోతుంది.
‘అధికారం అంధత్వానికి దారితీస్తే, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తే… ఆ నిరంకుశత్వాన్ని ప్రశ్నించడం, రాజ్యాంగ ఆత్మను కాపాడుకోవడం ఈ దేశ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
