ప్రజలు లేదా ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల న్యాయసమ్మతమైన సమస్యలను సకాలంలో ప్రభుత్వం పరిష్కరిస్తే, ఆయా తరగతుల ప్రజలు ఆందోళనలు చేయాల్సిన అవసరమే ఉండదు కదా.
చట్టబద్ధంగా చేయాల్సిన పనులు చేయకపోగా, లేని సమస్యలను ప్రభుత్వమే సృష్టిస్తే, ఆ సమస్యలను పరిష్కరించమని ఆందోళనలు చేయడం సహజం, అది ప్రజల హక్కు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు ఉపక్రమించిన తర్వాత రెండు డీఏలు మంజూరు చేసి, కొద్దిగా ఉపశమనం కలిగించారు.
డీఏలు చట్టబద్ధంగా ఎప్పుడైనా చెల్లించాల్సిందే. లేదా, బకాయి పెరుగుతూనే ఉంటుంది. అది ప్రజలపై రుణ భారాన్ని పెంచుతూనే ఉంటుంది. సకాలంలో డీఏలు చెల్లిస్తే, ప్రజల రుణభారం పెరగదు కదా.
చిరు ఉద్యోగులపై చిన్నచూపు తగదు
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయసమ్మతమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే, వాళ్ళు ఆందోళన చేయాల్సిన అవసరమే ఉండదు కదా. వాళ్ళు చిరు ఉద్యోగులు. ఉద్యోగ సంఘాలు వాళ్ళను సరిగా పట్టించుకోవు.
ప్రభుత్వం వాళ్ళ చేత గాడిద చాకిరీ చేయించుకుంటూ, వారి న్యాయసమ్మతమైన కోర్కెలను, సమస్యలను పరిష్కరించకుండా చిన్నచూపుతో జాప్యం చేస్తే, ఆందోళన చేయక, నోరుమూసుకుని కూర్చోవాలా. వాళ్ళు ఆందోళన చేస్తే, వాళ్ళను ఎవరో రెచ్చగొట్టి, ఆందోళన చేయిస్తున్నారని నోరుపారేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందా.
వైద్య కళాశాలల అధ్యాపకుల సమస్యలపై నిర్లక్ష్యం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006 నుంచి యూజీసీ వేతనాలు చెల్లించడం మొదలుపెట్టింది.
కేంద్ర ప్రభుత్వ వేతన సవరణకు అనుగుణంగా 2016లో యూజీసీ వేతనాలను సవరించింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల వేతనాలను సవరించింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించాల్సి వస్తుందని, వాటిని ఎగగొట్టడానికి, “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్కేల్స్” అంటూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
బకాయిలు చెల్లించమని, అధ్యాపకులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ న్యాయసమ్మతమైన కోర్కెను ప్రభుత్వం పరిష్కరించలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల అధ్యాపకులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.
ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను కూడా రెండు, మూడు సార్లు ఉత్తరాలు రాశాను. పట్టించుకోలేదు. ప్రభుత్వ డాక్టర్ల సంఘం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేస్తే, “నాట్ ఫీజిబుల్” అని సమాధానం ఇచ్చారు.
అధ్యాపకులకు మరో మార్గంలేక శాంతియుతంగా చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు చేస్తుంటే, ఉన్నతాధికారులు హెచ్చరికలతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి గర్హనీయం.
ఆరోపణలతో సమస్యలు పరిష్కారం కావు
ప్రతి నిరసన, ఆందోళన వెనుక ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉన్నవారు ఆరోపణలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు న్యాయసమ్మతమైన హక్కుల కోసం, కోర్కెల సాధన కోసం ఆందోళనలు, పోరాటాలు చేయకుండా మౌనంగా ఉండరని ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
