ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబేలో సాహిల్ వాకోడే బలవన్మరణానికి పాల్పడడంపై గత వారంలో చాలా చర్చ జరిగింది.
గత దశాబ్దంలో ఈ క్యాంపస్‌లో కొన్నేళ్లపాటు గడిపిన పూర్వ విద్యార్థులుగా, ఈ వార్త వినగానే మా మనస్సులో మెదిలిన మొదటి ఆలోచన – “మా పరిస్థితి కూడా ఇలాగే అయి ఉండేదేమో”.
క్యాంపస్‌లోని తీవ్రమైన ఒత్తిడి, పోటీ వాతావరణం ఉన్నప్పటికీ మేము అదృష్టవశాత్తూ బయటపడగలిగాము. కాబట్టి, ఉన్నత విద్యా సంస్థలను విద్యార్థులకు, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందినవారికి సురక్షితమైన నెలవులుగా తీర్చిదిద్దడం పై జరుగుతున్న చర్చకు మా వంతు సహకారం అందించే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఆందోళనకరమైన మరణాల సంఖ్య
దురదృష్టవశాత్తూ, సాహిల్ మరణం మాత్రమే ఈ ఏడాది ఐఐటీ బాంబేలో నమోదైన మొదటి బలవన్మరణం కాదు.
ఫిబ్రవరి, జూలై నెలల్లో నమన్ అగర్వాల్, సోహిల్ సంగ్వాన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ జాబితా ఇక్కడితో ఆగదు. గత 20 ఏళ్లలో అన్ని ఐఐటీలలో కలిపి చూస్తే 171 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందులో 70 శాతం మరణాలు గత పదేళ్లలోనే సంభవించాయి.
ఇది ఆందోళనకరమైన ధోరణి. ఈ దేశంలోని ప్రతిభావంతులైన యువ మేధావులను కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు, పౌర సమాజం, విస్తృత ప్రజానీకం ఈ సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.
మనం దీన్ని చూసీచూడనట్లు వదిలేస్తే, మనం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిన వారమవుతాము. మన దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వారమవుతాము.
ప్రవేశానికి ముందే మొదలయ్యే ఒత్తిడి
సమస్య విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశించక ముందే ప్రారంభమవుతుంది. భారతదేశంలో అత్యంత ‘ప్రతిష్టాత్మకమైన’ క్లిష్టమైన పరీక్షగా పరిగణించబడే ఐఐటీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఈఈ)కి బడా ప్రైవేట్ కోచింగ్ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది.
ఈ పరీక్షకు సాధారణ పాఠశాల విద్య సరిపోదని భావించడంతో, విద్యార్థులు ప్రత్యేక కోచింగ్ తరగతులకు హాజరు కావాల్సి వస్తుంది.
ఆర్థిక, సామాజిక లేదా లింగపరమైన ప్రతికూలత ఎదుర్కొంటున్న వ్యక్తులతో సహా, సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విషయంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ఆశావహ మధ్యతరగతి కుటుంబాలు కూడా తమ పిల్లలను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి భారీగా అప్పులు చేస్తాయి.
భవిష్యత్తులో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు వస్తే ఈ అప్పులు తీరిపోవడమే కాకుండా బిడ్డలకు మంచి భవిష్యత్తు, మంచి జీవితం దొరుకుతుందని వారు ఆశిస్తారు.
అందువల్ల, గత కొన్నేళ్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కూడా బలవన్మరణాలు పెరగడం ప్రమాదవశాత్తూ సంభవిస్తున్నవి కాదు. “భారతదేశపు ఆత్మహత్యల నగరం” అని పిలువబడే కోటా(రాజస్థాన్) దీనికి ఒక నిదర్శనం.
క్యాంపస్‌లో కుల వివక్ష, సామాజిక సవాళ్లు
ఐఐటీలలో ప్రవేశించిన తర్వాత ఈ ఒత్తిడి ముగుస్తోందా అంటే ముగియదు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా కేటాయించిన రిజర్వేషన్ల ద్వారా ప్రవేశం పొందిన వారి విషయంలో ఇది మరిన్ని సవాళ్లను ముందుకు తెస్తుంది. ఐఐటీలలో మీ కులం గురించి ఎవరూ నేరుగా అడగరు. దానికి బదులుగా మీ జెఈఈ ర్యాంక్ ఎంత అని అడుగుతారు.
ఒక విద్యార్థి కులాన్ని గుర్తించడానికి ఇది ఒక ‘కోడ్’గా పనిచేస్తుంది. చివరికి సామాజిక, విద్యాపరమైన తలాల నుండి వ్యవస్థాగతమైన వెలివేత ప్రక్రియల వరకు వర్గ, కుల ప్రాధాన్యతలు ఆధిపత్యం చెలాయించే సంస్థలో తమ ఉనికిని చాటుకోవడానికి అవసరమైన సామాజిక పెట్టుబడి, పరిజ్ఞానం లేకపోవడం వల్ల దళిత, ఇతర వెనుకబడిన తరగతులు, ఆదివాసీ, కార్మికవర్గ వర్గాలకు చెందిన విద్యార్థులే తరచుగా అధిక సీజీపీఏ సాధించే రేసులో వెనుకబడిపోతుంటారు.
ఈ అగ్రశ్రేణి సంస్థల ‘మెరిట్’ను పాడు చేస్తున్నారని నెపంతో ప్రొఫెసర్లు పరోక్షంగా ప్రదర్శించే వివక్ష కారణంగా, మా స్నేహితుల సర్కిల్లోనే ఎంతోమంది విద్యార్థులు కేవలం ఒక కోర్సును పూర్తి చేయడానికి అదనంగా ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చిన వైనాలు మాకు గుర్తుకు వచ్చాయి.
ప్లేస్మెంట్లు, ఆర్థిక భారం
మంచి సీజీపీఏతో గౌరవప్రదంగా ఉత్తీర్ణత సాధించాలనే ఒత్తిడికి తోడు, వారి మెడపై మరొక ఉరి తాడు వేలాడుతూ ఉంటుంది.
అదే ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం. ఐఐటీలలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించినప్పటికీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, కన్సల్టెంట్లుగా అధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలను సంపాదించడానికి సాగే వెర్రి వ్యామోహపు పరుగు గురించి దాదాపు 12 ఏళ్ల క్రితమే రాహుల్ మాగంటి రాశారు.
విద్య వ్యాపారీకరణ కావడం, ఉన్నత విద్యాసంస్థల ‘స్వయంసమృద్ధి’పై అనిల్ కాకోద్కర్ కమిటీ చేసిన సూచనల తర్వాత ఐఐటీలలో ట్యూషన్ ఫీజు 2008(సుమారు రూ 25,000) నుంచి 2016(సుమారు రూ 2 లక్షలు) నాటికి ఎనిమిది రెట్లు పెరిగింది. దీని మూలంగా సహజంగానే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సాధించాలనే ఒత్తిడి విద్యార్థుల మీద మరింత పెరుగుతుంది.
ఈ ఒత్తిడి అందరి విద్యార్థుల మీద ఒకే రకంగా ఉండదు. పేద, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ రుగ్మత తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొంటారని వేరే చెప్పనవసరం లేదు.
పెట్టుబడిదారీ ప్రభావం, నిరుద్యోగం
దురదృష్టవశాత్తూ, మనం జీవిస్తున్న పెట్టుబడిదారీ ప్రపంచపు సంక్షోభం, దానివల్ల ఏర్పడే నిరుద్యోగం ఐఐటీల పరిధిలోకి కూడా వ్యాపిస్తోంది.
దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు కూడా ఈ సమస్య నుండి తప్పించుకునే పరిస్థితిలో లేరు. ఐఐటీ బాంబే 2023-24 ప్లేస్మెంట్ నివేదిక ప్రకారమే(దీనిని పూర్తి నిజమని నమ్మలేము), ప్లేస్మెంట్ శాతం కేవలం 74.53 శాతం మాత్రమే ఉంది. ఈ గణాంకాలు 2020-21 నుండి క్రమేపీ దిగజారుతూ వస్తున్నాయి.
ఉన్నత విద్యా వ్యవస్థలో పెట్టుబడిదారీ ప్రపంచపు వైరుధ్యాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, అధిక ట్యూషన్ ఫీజులు ఉన్నప్పటికీ, ఏదో ఒక రోజు తమ దయనీయమైన ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడగలమనే ఆశతో మధ్యతరగతి, పేద వర్గాలు తమ పొదుపు మొత్తాన్ని విద్యా రుణాలలో పెట్టుబడి పెట్టడానికి నిరుత్సాహపడటం లేదు.
నిజానికి, గత కొన్ని నెలలుగా దేశంలో విద్యా సంస్కరణలను డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల పరంపర ఈ వైరుధ్యానికి ఒక నిదర్శనం.
సాహిల్ మరణం తర్వాత ఐఐటీ బాంబేలో జరిగిన విద్యార్థుల నిరసనల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాం.
యాజమాన్యం జవాబుదారీతనం లేమి
సాధారణంగా ఐఐటీలలో, ముఖ్యంగా ఐఐటీ బాంబేలో, అధికారులను, పాలనా యంత్రాంగాన్ని జవాబుదారీగా చేసే ప్రజాస్వామ్య, పారదర్శక ప్రక్రియలు లేనే లేవు. ఉన్న కొద్దిపాటి జవాబుదారీతనం కూడా కేవలం కాగితాలకే పరిమితమై ఉంది. నిర్ణయాధికార సంస్థలలో ఎటువంటి నిజమైన శాసన అధికారాలు లేకుండా, ప్రతినిధులు కేవలం పరిపాలనాపరమైన బ్యూరోక్రటిక్ పనుల్లో చిక్కుకుపోయేలా విద్యార్థి మండలి రూపుదిద్దుకుంది.
‘రాజకీయాలు’ అనే మాటనే పెద్ద బూతుగా పరిగణిస్తారు. చాలా మంది ప్రతినిధులు ప్రాంతీయ, కుల, సామాజిక ప్రాతిపదికన ఎన్నుకోబడతారు. అందువల్ల, ఎనిమిదేళ్లలో ట్యూషన్ ఫీజు ఎనిమిది రెట్లు పెరిగినప్పుడు ఏ ఐఐటీలోనూ చెప్పుకోదగ్గ నిరసనలు జరగకపోవడానికి కారణం లేకపోలేదు.
అదీ గాక, విద్యార్థి ప్రతినిధులు తరచుగా తమ రెజ్యూమ్‌లను మెరుగుపరచుకోవడానికి, క్యాంపస్ లో పదవి సాధించడం ద్వారా గుర్తింపు పొందాలని చూస్తుంటారు.
ఐఐటీ వాతావరణంలో ఎంతగానో కోరుకునే ‘కీర్తి’, ‘సామాజిక హోదా’కు ఈ పదవులు చిహ్నం. ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఈ మండలిలో చాలామంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉంటారు.
యాజమాన్యం కూడా నిరసన గళం విప్పే, రాజకీయ స్పృహ కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అణుకువగా ఉండే అండర్ గ్రాడ్యుయేట్లు మధ్య ఈ వ్యత్యాసాన్ని మరింత ప్రోత్సహిస్తుంది.
గత కొన్ని రోజులుగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ప్రతినిధి యాజమాన్యానికి విధేయత ప్రదర్శిస్తుండగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇంకా నిరసన కొనసాగించడంలో మనకు ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సంస్థ పూర్వ విద్యార్థులుగా, న్యాయం కోసం పోరాటాన్ని వదులుకోని విద్యార్థులకు మద్దతు ఇస్తూనే, ఐఐటీ బాంబే యాజమాన్యాన్ని నిలదీయడం, సమాధానాలు డిమాండ్ చేయడం ముఖ్యమని మేము విశ్వసిస్తున్నాము.
నిర్మాణాత్మక చర్యల ఆవశ్యకత
కులం, విద్య వ్యాపారీకరణ, తగ్గుతున్న ఉద్యోగావకాశాలకు పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలకు మధ్య ప్రత్యక్షంగా సంబంధం ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి తీవ్రతను పరిష్కరించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా యాజమాన్యాన్ని జవాబుదారీగా నిలబెట్టాలి.
ఈ సంస్థ పూర్వ విద్యార్థులు డైరెక్టర్‌కు రాసిన లేఖ లో అటువంటి కొన్ని నిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించారు. వాటిని పరిగణలోకి తీసుకుని తక్షణం తగిన చర్యలు చేపట్టకపోతే ఈ విచారకరమైన దయనీయ పరిస్థితి సమీప భవిష్యత్తులో అంతం కాకపోవచ్చు.
(రాహుల్ మాగంటి – బీటెక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్సెస్, ఐఐటీ-బాంబే, 2015. ఉషక్ రహమాన్ – పీహెచ్డీ ఫిజిక్స్, ఐఐటీ-బాంబే, 2018.)
మీకు తెలిసిన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఆత్మహత్య ఆలోచనలతో ఉంటే, దయచేసి వారిని సంప్రదించండి. ‘సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్’ వద్ద వారు అజ్ఞాతంగా మాట్లాడటానికి ఫోన్ నంబర్ల జాబితా ఉంది. టిస్స్ ద్వారా నడపబడుతున్న ‘ఐకాల్’ అనే కౌన్సెలింగ్ సేవ, దేశవ్యాప్తంగా ఉన్న థెరపిస్ట్‌ల సమాచార జాబితాను నిర్వహిస్తోంది. లేదా మీరు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లవచ్చు.
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
