కార్పొరేట్ కుబేరుల ధనబలాన్ని చిత్తుచేస్తూ మిషిగాన్ సెనేట్ ప్రైమరీలో నెగ్గిన ముస్లిం విప్లవ నాయకుడు!
ఓటమి నుంచి ఉద్యమం వరకు… ప్రజా కోపాన్ని ప్రజా విజయంగా మార్చిన కొత్త తరం నాయకుడు
మిషిగాన్ నుంచి అమెరికా రాజకీయాలకు కొత్త సందేశం!
ఆధునిక అమెరికన్ రాజకీయ చరిత్ర పుటల్లో ఓ సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ధనబలం, పదవీ బలం, అధికార యంత్రాంగం, కార్పొరేట్ పక్షపాత మీడియా అంతా ఒకవైపు నిలిచినా… ప్రజల వైపు నిలబడిన ఒక ప్రజాసంక్షేమ నాయకుడు సాధించిన సంచలనాత్మక విజయమిది. మిషిగాన్ రాష్ట్ర యు.ఎస్. సెనేట్ డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో 41 ఏళ్ల ప్రజారోగ్య నిపుణుడు, విప్లవాత్మక ఆలోచనల నాయకుడు డాక్టర్ అబ్దుల్ అల్సయీద్ సాధించిన గెలుపు అమెరికా రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా మారింది. ఏడేళ్ల క్రితం ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి… నేడు అమెరికా రాజకీయాల్లో ప్రగతిశీల శక్తులకు ఆశాకిరణంగా మారడం నిజంగా చరిత్ర సృష్టించిన ఘట్టమే.
ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చేస్తున్న కార్పొరేట్ శక్తులకు, వాషింగ్టన్ పెద్దలకు అబ్దుల్ అల్సయీద్ రూపంలో ఓ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి’ అని నిరూపిస్తూ, కోట్లాది డాలర్ల వ్యయాన్ని చిత్తు చేసి ఆయన సాధించిన ఈ ప్రైమరీ విజయం రాబోయే నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ ఆలోచనలకు ఊపిరిపోసింది.
శతాబ్దాల చరిత్ర కలిగిన డెమోక్రటిక్ పార్టీలోని ప్రాచీన సంప్రదాయాలను, వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ పెద్దల వ్యూహాలను తలక్రిందులు చేస్తూ అల్సయీద్ ఎదిగిన తీరు అద్భుతం. ముహమ్మద్ ఆలీ చారిత్రాత్మక వ్యాఖ్య ‘మేము ప్రపంచాన్ని ఊపేసాం’ (We shook up the world) అని గెలుపు అనంతరం డెట్రాయిట్ వేదికగా ప్రకటించిన అల్సయీద్ సంచలన ప్రయాణపు సమగ్ర విశ్లేషణ ఇది.
రాజకీయ అనామకత్వం నుంచి ప్రభంజనం వైపు
2018లో మిషిగాన్ గవర్నర్ ప్రైమరీ పోరులో పోటీ చేసి 20 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి అబ్దుల్ అల్సయీద్.. ఆ పరాజయాన్ని రాజకీయ ముగింపుగా కాకుండా ప్రజల మధ్య కొత్త ప్రయాణానికి ప్రారంభంగా మలిచారు. ఏ రాజకీయ అనుభవమూ లేకపోవడం, ఎస్టాబ్లిష్మెంట్ మద్దతు లేకపోవడంతో ఆనాడు ఆయన ఓటమిపాలయ్యారు. కానీ, ఆ ఓటమితో ఆయన వెనుకంజ వేయలేదు. ప్రజారోగ్య అధికారిగా, వాయిస్ ఆఫ్ పీపుల్ పాడ్‌కాస్టర్‌గా, నిరుపేదల స్వరంగా నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఏడేళ్ల తర్వాత అదే మిషిగాన్ గడ్డపై డెమోక్రటిక్ పార్టీకి చెమటలు పట్టిస్తూ తిరుగులేని నేతగా రీ-ఎంట్రీ ఇచ్చారు.
60 మిలియన్ల డాలర్లు కొండను పిండి చేసిన ధీరుడు
ఈ ఎన్నిక ఏమాత్రం సమానమైన పోటీ కాదు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ అగ్రనేతలు, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్, విరమించుకుంటున్న సెనేటర్ గ్యారీ పీటర్స్, సెనేట్ డెమోక్రటిక్ లీడర్ చక్ షుమర్ మద్దతు పొందిన రిప్రజెంటేటివ్ హేలీ స్టీవెన్స్ నిలిచారు. ఆమె వెనుక ఏకంగా 60 మిలియన్ డాలర్లకు పైగా కార్పొరేట్, బయటి నిధుల వర్షం కురిసింది. కానీ, అల్సయీద్ వెనుక ఉన్నది కార్పొరేట్ కుబేరులు కాదు… సామాన్య ప్రజానీకం. ప్రతి పైసాను కార్పొరేట్లకు దూరంగా ఉంచి సాధించిన ఈ విజయం డబ్బును ఓడించిన ప్రజాశక్తికి నిదర్శనం.
ఎఐపిఎసి కుబేరులకు తగిలిన దిమ్మతిరిగే షాక్
ఈ పోరులో అమెరికా-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ (AIPAC) ప్రత్యక్షంగా రంగానికీ దిగింది. ఇజ్రాయెల్ దురాక్రమణను, గాజాలో జరుగుతున్న నరమేధాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యలు చేసిన అల్‌సయీద్‌ను ఓడించడానికి ఎఐపిఎసి ఏకంగా 30 మిలియన్ల డాలర్లకు పైగా నిధులను నీళ్లలా ఖర్చు చేసింది. తన ప్రత్యర్థి స్టీవెన్స్‌ను గెలిపించేందుకు వందలాది ప్రకటనలు గుప్పించింది. అయినా, ప్రజలు ఎఐపిఎసి ధనబలాన్ని తోసిరాజని, అల్సయీద్ వైపు నిలిచారు. ‘మీకు ఇంకా ఓటమి బాధ కావాలా?” అని గెలుపు తర్వాత అల్సయీద్ విసిరిన సవాలు ఎఐపిఎసి శక్తులకు మింగుడుపడటం లేదు.
తీవ్ర ఉత్కంఠ… ఆఖరి క్షణం దాకా ధర్మసందేహం!
మంగళవారం రాత్రి ఓట్ల లెక్కింపు సమయంలో వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. గెలుపు ఖాయమని భావించినా, వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉండటంతో అల్సయీద్ విజయాన్ని ముందే ప్రకటించలేదు. బుధవారం ఉదయానికి గానీ స్పష్టత రాలేదు. సేకరించిన 15 లక్షలకు పైగా ఓట్లలో అల్సయీద్ 14,893 ఓట్ల తేడాతో—అంటే కేవలం 1 శాతానికంటే తక్కువ ఓట్ల మెజారిటీతో—ఘన విజయం సాధించారు. మిషిగాన్ ప్రైమరీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం.
’ఆధునిక అమెరికా చరిత్రలోనే అత్యద్భుతం’
బర్నీ శాండర్స్ ప్రశంసలు
ఈ విజయాన్ని చూసి అమెరికన్ ప్రొగ్రెసివ్ ఉద్యమ పితామహుడు, సెనేటర్ బర్నీ శాండర్స్ హృదయపూర్వక హర్షం వ్యక్తం చేశారు. ‘ఆధునిక అమెరికన్ రాజకీయంలో నేను చూసిన అత్యంత అద్భుతమైన, అసమానమైన విజయం అబ్దుల్ అల్సయీద్ది’ అని కొనియాడారు. బర్నీ శాండర్స్, అలెక్సాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ (ఎఒసి) వంటి నాయకుల ప్రొగ్రెసివ్ ఆలోచనా విధానం అమెరికన్ యువతలో ఎంతగా వేరూనుకుందో ఈ విజయం నిరూపించింది.
కార్పొరేట్ విరాళాలకు నో… ‘మెడికేర్ ఫర్ ఆల్‘ కు యెస్!
అల్సయీద్ ఎజెండా చాలా స్పష్టమైంది. ‘రాజకీయాల నుంచి కార్పొరేట్ డబ్బును తోసేయండి… ప్రజల జేబుల్లో డబ్బులు ఉంచండి… అందరికీ ఉచిత ఆరోగ్యం (Medicare for All) అందించండి’ అనే నినాదంతో ఆయన విరుచుకుపడ్డారు. అమెరికాలో 36 శాతానికి పైగా ప్రజలను నలిపేస్తున్న వైద్య రుణాల రద్దుకు, మందుల ధరల తగ్గింపునకు ఆయన మద్దతుగా నిలిచారు.
సాధారణ శ్రామిక వర్గం పడుతున్న ఆవేదనను తన ఎజెండాగా మార్చుకోవడం ఆయన గెలుపుకు కీలక సూత్రమైంది.
ముస్లిం ఓటర్ల ఐక్యత – ‘సిఐఆర్’ కీలక పాత్ర
మిషిగాన్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం అమెరికన్ సమాజం ఈ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారింది. ‘కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్’ (సిఎఐఆర్) పోలింగ్ చివరి గంటల్లో 13,000 ముస్లిం కుటుంబాలను, దాదాపు 29,000 మంది రిజిస్టర్డ్ ఓటర్లను ఫోన్ కాల్స్ ద్వారా భాగస్వాములను చేసింది. ఈ చివరి నిమిషపు ముమ్మర ప్రచారం అల్సయీద్ విజయంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఎస్టాబ్లిష్మెంట్ కుప్పకూలింది… భవిష్యత్తుపై కొత్త ఆలోచనలు!
ఈ గెలుపు డెమోక్రటిక్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ నేతలకు, ముఖ్యంగా గవర్నర్ విట్మర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. 2028 ప్రెసిడెన్షియల్ రేసులో నిలవాలని భావిస్తున్న విట్మర్, స్టీవెన్స్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అమెరికన్ ప్రజలు ఇప్పుడు పాతకాలపు ప్రాగ్మాటిజం (ప్రాక్టికల్ పాలిటిక్స్) కంటే, మార్పును ఆకాంక్షించే ప్రొగ్రెసివ్, పాపులిస్ట్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ప్రైమరీ స్పష్టం చేసింది.
చేతులు కలుపుదాం… సవాలును జయిద్దాం
ప్రైమరీ పోరు ఎంత దారుణంగా సాగినా, విజయం సాధించిన వెంటనే అల్సయీద్ డెమోక్రటిక్ పార్టీని ఏకం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ‘మన మధ్య ఉన్న తేడాల కంటే, నవంబర్‌లో మనం ఎదుర్కొనే సవాళ్లే పెద్దవి’ అని పిలుపునిచ్చారు. ఓటమిని అంగీకరించిన హేలీ స్టీవెన్స్ కూడా అల్సయీద్కు మద్దతు ప్రకటించారు. అలాగే, సీనియర్ సెనేటర్ చక్ షుమర్ కూడా అల్సయీద్కు శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ సార్వత్రిక పోరులో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
నవంబర్ పోరు మరింత కీలకం
ఇప్పుడు అబ్దుల్ అల్సయీద్కు అసలు పరీక్ష ప్రారంభమవుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌తో జరిగే తుది ఎన్నిక అమెరికా సెనేట్ ఆధిపత్యాన్ని నిర్ణయించే కీలక పోరాటాల్లో ఒకటి. డెమోక్రటిక్ పార్టీ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగగలిగితే ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.
రిపబ్లికన్ల కలవరం – ట్రంప్ పరివారంలో కంపరం
అల్సయీద్ విజయం ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీని తీవ్ర కలవరానికి గురిచేసింది. రాబోయే నవంబర్ 3న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అల్సయీద్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ మధ్య పోరు జరగనుంది. డోనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్న మైక్ రోజర్స్, అల్‌సయీద్‌ను తీవ్రవాదిగా చిత్రించేందుకు ఇప్పటికే కుట్రలు మొదలుపెట్టారు. అల్సయీద్ విజయం ట్రంప్ పరివారంలో కంపరాన్ని పుట్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చరిత్ర సృష్టించే దిశగా… యు.ఎస్. సెనేట్‌లో తొలి ముస్లిం?
నవంబర్ ఎన్నికల్లో అబ్దుల్ అల్సయీద్ గెలిస్తే, అమెరికా చరిత్రలోనే యు.ఎస్. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం లీడర్‌గా ఆయన చరిత్ర సృష్టిస్తారు. ఇది కేవలం అమెరికాలోని ముస్లింలకు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా శాంతిని, మానవ హక్కులను కోరుకునే ప్రతి ఒక్కరికీ శుభవార్త. ఇజ్రాయెల్ దురాక్రమణలను వ్యతిరేకించే, పాలస్తీనా ప్రజల హక్కులకై గొంతు విప్పే నాయకుల సంఖ్య యు.ఎస్. సెనేట్‌లో పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమెరికా రాజకీయాలకు వచ్చిన కొత్త సందేశం
అబ్దుల్ అల్సయీద్ విజయం చెప్పిన సందేశం ఒక్కటే—ప్రజలు ఇక పాత రాజకీయాలను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కార్పొరేట్ నిధులు, లాబీయింగ్, రాజకీయ వారసత్వాల కంటే ప్రజల సమస్యలను మాట్లాడే నాయకత్వానికే భవిష్యత్తు ఉందని ఈ ఎన్నిక స్పష్టం చేసింది. వ్యవస్థపై విసుగు చెందిన ఓటర్లు మార్పు కోసం ఓటేశారని ఈ ఫలితం చెబుతోంది.
ప్రజాస్వామ్యానికి కొత్త ఆశ
డాక్టర్ అబ్దుల్ అల్సయీద్ విజయం ఒక వ్యక్తి రాజకీయ పునరాగమనం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యంలో ఆశ, పట్టుదల, ప్రజల విశ్వాసం ఇంకా సజీవంగానే ఉన్నాయని నిరూపించిన చారిత్రక ఘట్టం. నవంబర్‌లో ఆయన విజయం సాధిస్తే అది ఒక ముస్లిం నాయకుడి వ్యక్తిగత విజయమే కాదు. వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని విశ్వసించే కోట్లాది మంది ప్రజల విజయంగా చరిత్రలో నిలిచిపోతుంది.
అశాంతి మబ్బుల్లో ఆశల వెలుగు
ప్రస్తుతం అమెరికాలో కేవలం 23 శాతం మంది ప్రజలు మాత్రమే దేశం వెళ్తున్న తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని గాలప్ సర్వేలు చెబుతున్నాయి. ఇటువంటి తీవ్ర నైరాశ్యంలో, వ్యవస్థను మార్చే దిశగా అబ్దుల్ అల్సయీద్ సాగిస్తున్న సమరం ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోస్తోంది. ధనబలం, కుట్రలు, సామ్రాజ్యవాద శక్తులన్నింటినీ దాటుకుని, నవంబర్ ఎన్నికల్లో అల్సయీద్ విజయం సాధించి యు.ఎస్. సెనేట్ అడుగుపెట్టాలని, మానవీయ విలువల గొంతుకగా మారాలని కోరుకుందాం!
కృష్ణ కానూరి,
7981305779
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
