భారతదేశం ఆహార కొరతతో విదేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన దేశంగా ఎదగడంలో డా. ఎం. ఎస్. స్వామినాథన్ పాత్ర చారిత్రాత్మకమైనది. ఆయనను భారతదేశంలో “హరిత విప్లవ పితామహుడు” (Father of India’s Green Revolution)గా గౌరవిస్తారు. ఆగుస్ట్ 7 వారి జయంతి. ఈ సందర్భంగా వారిని గురించి, భారత దేశ వ్యవసాయ రంగానికి వారి సేవలు తెలుసుకుందాం.
బాల్యం–విద్య:
డా. స్వామినాథన్ (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి వైద్యుడు. 1943 బెంగాల్ కరువు లక్షలాది మంది ప్రాణాలను బలి గొనడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. దేశంలో ఆకలి సమస్యను నిర్మూలించాలంటే వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిశోధనలు అవసరమని భావించి వ్యవసాయ శాస్త్రాన్ని తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. తరువాత ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI), కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తదితర సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
హరిత విప్లవానికి నాయకత్వం :
1960వ దశకంలో భారతదేశం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సమయంలో అధిక దిగుబడి ఇచ్చే గోధుమ, వరి విత్తనాలను భారత పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసి రైతులకు అందించడంలో డా. స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ (నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ అమెరికన్ దేశస్థుడు. ప్రపంచ వ్యవసాయ చరిత్రలో అత్యంత ప్రభావ శీలమైన శాస్త్రవేత్తలలో ఒకరు. ఆయనను ప్రపంచవ్యాప్తంగా “హరిత విప్లవ పితామహుడు” (Father of the Green Revolution) అని పిలుస్తారు.) తో కలిసి పనిచేస్తూ భారత వ్యవసాయంలో శాస్త్రీయ మార్పులకు నాయకత్వం వహించారు. భారత వ్యవసాయ రంగానికి వారు విశిష్ట సేవ చేశారు. ప్రధానంగా గోధుమ, వరి అధిక దిగుబడి రకాల వ్యాప్తికి నాయకత్వం వహించారు. ఎరువులు, సాగునీరు, ఆధునిక సాగు పద్ధతుల వినియోగాన్ని ప్రోత్సహించారు. భారతదేశాన్ని ఆహార ధాన్యాల దిగుమతి దేశం నుంచి స్వయం సమృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని “ఎవర్గ్రీన్ రివల్యూషన్” (శాశ్వత హరిత విప్లవం) భావనను ప్రతిపాదించారు.
హరిత విప్లవం ఆరంభంతోనే భారతదేశంలో వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ సంబంధాలు వెళ్లూనుకునే క్రమం ఉధృతి పెరిగింది. అదే విధంగా వ్యవసాయంలో ఆధునిక క్రిమి సంహారక ఎరువువులు రసాయనాలు వినియోగం పెరిగింది. వీటితో పాటు ఆహారధాన్యాల మిగులు ఉత్పత్తి, వాటి సేకరణ నిల్వ కోసం ఎఫ్ సిఐ చట్టం, కనీస మద్దతు ధర విధానాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిణామాలు అన్నీ కలిసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో ఒక కుదుపుకు పెట్టుబడిదారీ రైతాంగం ఆవిర్భావానికి పునాదులు వేసింది.
ICRISAT (International Crops Research Institute for the Semi-Arid Tropics) ను నేటి తెలంగాణలోని పటాన్చెరు వద్ద 1972లో స్థాపించడం లో డాక్టర్ స్వామినాథన్ విశేష కృషి చేశారు. ఈ సంస్థ
ప్రధానంగా ఈ పంటలపై పరిశోధనలు చేస్తుంది:
2004లో వామపక్షాల మద్దతుతో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు అంగీకరించిన కనీస ఉమ్మడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ రైతుల కమిషన్ (National Commission on Farmers) కు ఆయన అధ్యక్షత వహించారు. రైతులకు పంటల కనీస మద్దతు ధర (MSP), వ్యవసాయ పెట్టుబడుల తగ్గింపు, భూ సంరక్షణ, నీటి నిర్వహణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై విలువైన సిఫార్సులు చేశారు. ఆ సిఫారసుల అమలుకు రైతాంగం గత దశాబ్ద కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
డా. స్వామినాథన్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1987లో ఆయనకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన World Food Prize లభించింది. దానికి వచ్చిన నగదు బహుమతిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా, 1988లో M. S. Swaminathan Research Foundation (MSSRF) అనే స్వతంత్ర పరిశోధనా సంస్థను చెన్నైలో స్థాపించారు. డా. స్వామినాథన్ ఈ సంస్థను కేవలం వ్యవసాయ పరిశోధన కోసం కాకుండా “శాస్త్రాన్ని పేదల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించాలి”, శాస్త్రం ద్వారా గ్రామీణ అభివృద్ధి, స్థిరమైన వ్యవసాయం, పోషకాహార భద్రత అనే సిద్ధాంతంతో స్థాపించారు.ఇది లాభాపేక్ష లేని స్వాతంత్ర్య సంస్థ.
డా. స్వామినాథన్ పెద్ద కుమార్తె డా. సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత శిశు వైద్య నిపుణురాలు, ప్రజారోగ్య శాస్త్రవేత్త. ఆమె భారత ప్రభుత్వ ICMR (Indian Council of Medical Research) డైరెక్టర్ జనరల్ గా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో Deputy Director-General for Programmes, గా అనంతరం WHO Chief Scientist గా పనిచేశారు. COVID-19 మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణానంతరం 2023 ఫిబ్రవరి 1 నుండి ఆమె తన తండ్రి స్థాపించిన M. S. Swaminathan Research Foundation (MSSRF) కు ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు.
ముగింపు:
డా. ఎం. ఎస్. స్వామినాథన్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆకలితో బాధపడే ప్రజల కోసం శాస్త్రాన్ని అంకితం చేసిన మహనీయుడు. భారతదేశ ఆహార భద్రతకు ఆయన వేసిన పునాదులు నేటికీ దేశ వ్యవసాయ రంగాన్ని నిలబెడుతున్నాయి. రైతు సంక్షేమం, శాస్త్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ ఈ మూడు లక్ష్యాలను సమన్వయం చేసిన దూరదృష్టి గల మహోన్నత వ్యక్తిగా ఆయన చిరస్మరణీయులు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
