ప్రజాసేవ అనేది తప్పనిసరిగా విచారకరమైనది కాకపోవచ్చు, కానీ అది అత్యంత ఒంటరితనంతో కూడుకున్నది కావచ్చు. విధి నిర్వహణను, అంతరాత్మను సమన్వయం చేసుకోవడానికి జీవితమంతా ప్రయత్నించడంలో దాగి ఉన్న భారమే ఈ ఒంటరితనం.
నిన్న ఒక మిత్రుడు నాకు వాట్సాప్ మెసేజ్ పంపాడు. “ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం విచారకరమైన విషయం కాదా?” అది దాదాపు ఒక ప్రశ్న కాదు. బహుశా అది ఒక సాధారణ వ్యాఖ్య కావచ్చు. బహుశా ఒక విమర్శ కావచ్చు. లేదా ఏదో ఖాళీ సమయ పరిశీలన కావచ్చు. అది ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలియదు. కానీ అది నాలో ఎలాంటి భావాన్ని కలిగించిందో నాకు తెలుసు. రాత్రంతా, నేను నా స్వంత ఉనికిని, నా ఉపయోగం, నా నమ్మకాలు, నా ఎంపికలు, చివరికి నా గుణాలను కూడా ప్రశ్నించుకున్నాను. నేను నా మిత్రుడికి చెప్పడానికి సమాధానం కోసం వెతకడం లేదు. నాలో నేను సమాధానం కోసం వెతుక్కుంటున్నాను.
విధి నిర్వహణ చుట్టూ ఉన్న నైతిక సందిగ్ధత:
విధి నిర్వహణ చుట్టూ ఉన్న నైతిక సందిగ్ధత శతాబ్దాలుగా తత్వవేత్తలను వెంటాడుతూనే ఉంది. మన ఇతిహాసాలు, అనేక విధాలుగా, ఈ వివాదం పైనే ఆలోచనా మథనాలు జరిగాయి. భీష్ముడి ప్రతిజ్ఞ, ద్రోణుడి విధేయతలు, కర్ణుడి విశ్వాస పాత్ర, విభీషణుడి తిరుగుబాటు ఇవన్నీ నైతిక నిశ్చయత కరిగిపోవడం ప్రారంభించినప్పుడు ‘విధి’ ఏం డిమాండ్ చేస్తుంది అనే ప్రశ్నతో పోరాడినవే. చివరికి చరిత్రలో నిండి ఉన్న పేరు లేని వేలాది మంది సైనికులు కూడా ఇదే సందిగ్ధతను ఎదుర్కొని ఉండాలి. అధికారం తానంతట తానే నైతికంగా అస్పష్టంగా మారినప్పుడు, ఒకరు ఆ అధికారానికి ఏమి రుణపడి ఉంటారు?
చరిత్ర కూడా ఇటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలనే అడుగుతుంది. నాజీ జర్మనీలో ఒక సాధారణ సివిల్ సర్వెంట్ ఏమి చేసి ఉండాలి? లేదా స్టాలిన్ పాలనలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి? లేదా పోల్ పాట్ యొక్క కాంబోడియాలో? లొంగిపోవడం/ఆజ్ఞా పాలన అనేది ఏ సమయానికి వచ్చేసరికి ఒక సద్గుణంగా ఉండటం ఆగిపోతుంది? విధేయత ఎక్కడ ముగుస్తుంది, నేర భాగస్వామ్యం (complicity) ఎక్కడ ప్రారంభమవుతుంది? ఒకరు ఎప్పుడు కట్టుబడి ఉండాలి, దేనికి కట్టుబడి ఉండాలి, ఎలా కట్టుబడి ఉండాలి?
ఇవి కేవలం చారిత్రక ప్రశ్నలు మాత్రమే కావు. అధికారం, అంతరాత్మ కలిసి ప్రయాణించే ప్రతి వ్యవస్థను వేధించే శాశ్వతమైన ప్రశ్నలు ఇవి.
హాస్యాస్పదంగా, భారతీయ సివిల్ సర్వీసెస్ పరీక్షలో నైతి కత (Ethics) ఒక కీలకమైన స్థానాన్ని ఆక్రమించింది. వేలాది మంది అభ్యర్థులు యెథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్’ పై జనరల్ స్టడీస్-IV పేపర్ కోసం నెలల తరబడి ప్రిపేర్ అవుతారు. సమాచారాన్ని లేదా విశ్లేషణ సామర్థ్యాన్ని గుర్తించే పేపర్లలా కాకుండా, ఇది అత్యంత వ్యక్తిగతమైన ఒక అంశాన్ని పరిశీలిస్తుంది. అభ్యర్థులను నైతిక సందిగ్ధతలను పరిష్కరించమని, నైతిక ఎంపికలను సమర్థించుకోమని, సమగ్రత, కరుణ, ప్రజా స్పృహను ప్రదర్శించమని అడుగుతారు. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా ప్రామాణికతను, నైతిక నమ్మకాన్ని ఆశిస్తుంది.
ఒక అభ్యర్థి ఈ ఆదర్శాలు కేవలం పరీక్షకు మాత్రమే పరిమితం కావు. వీటిని జీవితంలో ఆచరించాలని ఆశిస్తారని నమ్ముతూ ప్రజాసేవలోకి ప్రవేశిస్తాడు. కానీ భారతదేశంలో అత్యంత కష్టమైనది గా పిలవబడే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత ఏం జరుగుతుంది?
ఒకప్పుడు అంత నమ్మకంతో ఉన్న ఆదర్శాలను నిజంగా ఆచరించవచ్చా? పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రాజీ పడ లేనివిగా అనిపించిన నైతిక ప్రమాణాలను ఒకరు కాపాడు కోగలరా? పాలన యొక్క నిరంతర హడావుడి మధ్య అంతరాత్మ యొక్క నిశ్శబ్ద స్వరాన్ని ఒకరు వింటూనే ఉండగలరా?
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఈ ప్రశ్నలు మరింత కష్టతరం అవుతాయి. నేను నా సహోద్యోగులతో మాట్లాడినప్పుడు, నాకు అత్యంత సమర్థులైన, కష్టపడి పనిచేసే, నిజాయితీ గల అధికారులు కనిపిస్తారు. చాలామంది వ్యవస్థతో సర్దుకు పోయారు. అయితే, క్రమంగా మా సంభాషణల భాష ఆదర్శాల భాషగా కాకుండా లౌక్యత/వ్యాపార ధోరణి (pragmatism) భాషగా మారుతోంది. అత్యున్నత గుణంగా ఉన్న ఆదర్శవాదం స్థానంలో నెమ్మదిగా వాస్తవికత వస్తోంది. ఒక వాదన దాదాపు ఒక ఓదార్పు ఇచ్చే క్రమబద్ధతతో పదే పదే వినిపిస్తుంది.
“నువ్వు వ్యవస్థలోనే ఉంటే, ఇంకా కొంత మంచి చేయగలవు. నిన్ను బయటకు నెట్టి వేస్తే, నువ్వు ఏమీ చేయలేవు.” వ్యక్తుల కంటే వ్యవస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి కాబట్టి ఈ తర్కాన్ని తోసిపుచ్చడం కష్టం. వ్యవస్థలు ఆసమ్మతిని ఆశ్చర్యకరమైన సమర్థతతో తమలో విలీనం చేసుకుంటాయి. ఎంపిక అనేది తప్పు-ఒప్పు మధ్య ఎంపికగా చాలా అరుదుగా వస్తుంది. చాలా తరచుగా, ఇది అసంపూర్ణ రాజీకి, పూర్తి ప్రాముఖ్యత కోల్పోవడానికి (irrelevance) మధ్య ఎంపికగా ఉంటుంది.
ఒక విషయం కోసం బహిరంగంగా నిలబడే స్వేచ్ఛ:
అయినప్పటికీ లోపల ఏదో ఒకటి పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరిస్తూనే ఉంటుంది. మొన్న ఒకరోజు, నా అధికారిక వాహనంలో జనపథ్ మీదుగా వెళ్తుండగా, సమీపంలో విద్యార్థులు నిరసన తెలుపు తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నేను వారిని కిటికీ వెనుక నుండి చూశాను. నన్ను ఆకట్టు కున్నది నిరసన మాత్రమే కాదు, వారు అక్కడ నిలబడిన స్ఫూర్తి. వారిలో ఒక రకమైన ‘బెఫికర్ ‘, కోల్పోవడానికి ఏమీ లేని, ఆశించడానికి అన్నీ ఉన్నవారికి ఉండే ఒక భయం లేనితనం కనిపిస్తుంది. వారి నిశ్చయత కదిలించేది గానూ, ఒక అలజడిని కలిగించేది గానూ ఉంది.
ఒక క్షణం, నేను వారిని చూసి ఈర్ష్య పడ్డాను. వారు డిమాండ్ చేస్తున్న ప్రతి దానితో నేను ఏకీభవిస్తున్నానని కాదు, కానీ మొదట వ్యవస్థాగత పర్యవసానాలను లెక్కించకుండా ఏదో ఒకదాని కోసం బహిరంగంగా నిలబడే స్వేచ్ఛను వారు ఇంకా కలిగి ఉన్నందుకు. నా వాహనం నెమ్మదిగా ముందుకు సాగుతుండగా, ఏమి మారిందో నాకు అర్థమైంది. మారింది వారు కాదు, మారినది నేను. అధికారపు సుదీర్ఘమైన కారిడార్లలో ఎక్కడో, నేను లెక్కలు వేసుకునే వాడిగా, జాగ్రత్తపడే వాడిగా, ఆలోచించి అడుగులు వేసేవాడిగా మారిపోయాను. ఇప్పుడు నా ప్రతి వాక్యం ఒక కనిపించని ఫుట్ నోట్తో వస్తుంది. ప్రతి అభిప్రాయం సహజంగానే దాని పరిణామాలను అంచనా వేస్తుంది. ప్రతి విబేధం నిశ్శబ్దంగా తన పరిధులను చర్చించుకుంటుంది.
ఎవరికైనా సలహా ఇచ్చే అర్హత నాకు ఇక లేదని పించింది. బహుశా నేను ఇక ఇవ్వలేకపోవచ్చు. ఒకరి స్వంత ఎంపికలే నిరంతరం ప్రాక్టికాలిటీ (వాస్తవికత) ద్వారా ప్రభావిత మవుతున్నప్పుడు ధైర్యం గురించి మాట్లాడటం కష్టం. ఒకరు తమకు తామే ప్రేరణగా నిలుస్తున్నారో లేదో నిశ్చయంగా తెలియనప్పుడు ఇతరులను ప్రేరేపించడం కష్టం.
నేను నా యౌవనాన్ని కోల్పోయాను. ఒకప్పుడు ఒప్పు-తప్పుల మధ్య తేడాను గుర్తించిన ఆ నమ్మకాన్ని కోల్పోయాను. నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం దక్కుతుందని, వ్యవస్థలు సహజంగానే సద్గుణాన్ని గౌరవిస్తాయని, కేవలం ప్రామాణికత మాత్రమే వ్యవస్థలను మార్చగలదని నమ్మిన రోజులను నేను మిస్ అవుతున్నాను. ఒకప్పుడు నేను ప్రపంచాన్ని తీర్చి దిద్దిన ఆ నైతిక స్పష్టతను నేను మిస్ అవుతున్నాను.
వయస్సు అనుభవాన్ని తెచ్చింది. కానీ అనుభవం సంకోచాన్ని మరియు బహుశా భయాన్ని కూడా తెచ్చింది. ఇది సివిల్ సర్వెంట్లు ప్రత్యేకంగా బలహీను లైనందున కాదు. దానికి భిన్నంగా, చాలామంది ప్రజల కంటికి కనిపించని భారాలను మోస్తున్నారు. ప్రతి ఫైలు కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు. అది తరచుగా చట్టం, విధానం, రాజకీయ మార్గదర్శకత్వం, వ్యవస్థాగత పూర్వదర్శనం, వ్యక్తిగత అంతరాత్మల మధ్య జరిగే ఒక చర్చ. ప్రజలు సాధారణంగా ఫలితాన్ని మాత్రమే చూస్తారు. ఆర్గనైజేషన్ లోపలి పోరాటం చాలా అరుదుగా మాత్రమే బయటకు కనిపిస్తుంది.
మనుషులను మార్చే విచిత్రమైన మార్గం అధికారానికి ఉంది:
రాజీలు ఉండటం అనేది విషాదం కాదు. ప్రతి వ్యవస్థకూ సర్దుబాటు అవసరం. మరింత లోతైన విషాదం ఏమిటంటే, రాజీలు నెమ్మదిగా రాజీలుగా అనిపించడం ఆగిపోతాయి. అవి అలవాట్లుగా మారతాయి. భాష మారుతుంది. అంచనాలు తగ్గిపోతాయి. ఒకరు మనుగడ సాగించడమే విజయంగా వేడుక చేసుకోవడం ప్రారంభిస్తారు. మనుషులను మార్చే విచిత్రమైన మార్గం అధికారానికి ఉంది. అది నాటకీయంగా లొంగిపోవాలని చాలా అరుదుగా మాత్రమే డిమాండ్ చేస్తుంది. దానికి బదులుగా, అది చిన్న చిన్న సర్దుబాట్లను అడుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ప్రత్యేకంగా చూస్తే ప్రతిదీ సరైనదిగానే అనిపిస్తుంది. వాటి మొత్తం ప్రభావాన్ని మనం గమనించే సమయానికి, మార్పు అప్పటికే పూర్తయి పోతుంది.
ప్రతి ఎంపికకు ఒక వేల ఉంటుంది. మాట్లాడటానికి ఒక మూల్యం ఉంది. మౌనంగా ఉండటానికి ఒక మూల్యం ఉంది. నిరోధించడానికి (ఎదురించడానికి) ఒక మూల్యం ఉంది, సర్దుబాటు చేసుకోవడానికి ఒక మూల్యం ఉంది. అధికార కారిడార్లలోకి ప్రవేశించడానికి ఒక మూల్యం ఉన్నట్లే, ఆ కారిడార్ల నుండి బయటకు నడవడానికి కూడా ఒక మూల్యం ఉంది. అధికారం కేవలం నిర్ణయాలను మాత్రమే డిమాండ్ చేయదు. కాలక్రమేణా, అది ఆ నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని నిశ్శబ్దంగా పునర్నిర్మిస్తుంది.
ఇది వ్యవస్థ యొక్క సమర్థన కాదు. లేదా దానిలో సేవ చేస్తూనే ఉన్నవారిపై మోపిన నింద కాదు. ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రజా సంస్థలు అత్యంత అవసరం. వేలాది మంది సివిల్ సర్వెంట్లు ప్రతి ఒక్క రోజూ, ఎలాంటి గుర్తింపు లేకుండా, అపారమైన సమగ్రతతో అసాధారణమైన కార్యాలను నిర్వహిస్తున్నారు. కానీ ప్రజాసేవ యొక్క గొప్ప సవాలు కేవలం సమాజం యొక్క సమస్యలను పరిష్కరించడంలో మాత్రమే ఉందనుకోవడం అసత్యం అవుతుంది. కొన్నిసార్లు అత్యంత కష్టమైన యుద్ధం తనలో తాను నిశ్శబ్దంగా పోరాడేదే. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం విచారకర మైనదా అని నా మిత్రుడు అడిగినప్పుడు, విచారం అనేది సరైన పదం కాదని నేను గ్రహించాను. ప్రజాసేవ అనేది తప్పనిసరిగా విచారకరమైనది కాకపోవచ్చు, కానీ అది అత్యంత ఒంటరితనంతో కూడుకున్నది కావచ్చు. విధి నిర్వహణను, అంతరాత్మను సమన్వయం చేసుకోవడానికి జీవితమంతా ప్రయత్నించడంలో దాగి ఉండే భారమే ఈ ఒంటరితనం.
బహుశా అందుకే నేను ఈ ఆలోచనలను రాశాను. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నానని కాదు. కానీ ఆ గుర్తింపును పూర్తిగా నాదిగా అంగీకరించ లేకపోవడమే. వ్యవస్థల లోపల ఉన్న జీవితం మనకు నెమ్మదిగా నేర్పించే అనేక నిశ్శబ్ద రాజీలలో ఒకటిగా మారిపోయింది.
రచయిత పనిచేస్తున్న ఒక సివిల్ సర్వెంట్. వారి గుర్తింపును కాపాడటానికి పేరు గౌతమ్ కబీర్ గా
మార్చబడింది.
అనువాదం: ది వైర్ తెలుగు టీం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
