ఆర్ఎస్ఎస్ ఆయన ప్రకటనను తమది కాదని తోసిపుచ్చినప్పటికీ, డెమోక్రటిక్ ప్రమాణాలను, మహిళా సమానత్వాన్ని కోరుకోదగినవి గా భావించని, వాటి పట్ల తిరస్కారాన్ని కలిగి ఉండే హిందూ జాతీయవాద సిద్ధాంతానికి ఆయన ప్రతినిధిగా నిలుస్తారు.
జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, ఈ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదు. అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి, వివిధ ప్రదేశాలలో అరెస్టు చేసిన వారిని ఇంకా విడుదల చేయలేదు. ఈ నిరసనల కోసం అరెస్టయిన వారిలో ఇతరులకంటే ముస్లింలే ఎక్కువగా ఉన్నారనే పరిశీలన కూడా ఉంది. జునైద్ భాయ్ కేసు చాలా ఆందోళన కలిగిస్తోంది. నిరసనకారులకు నీరు, ఆహారం అందించడానికి ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కృతజ్ఞతా పూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరించారు. అయితే, జునైద్, ఆయన కుటుంబ సభ్యులను వేధించడంలో పోలీసులు చాలా అత్యుత్సాహం, క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఆహార సరఫరాను ఏర్పాటు చేయడానికి జునైద్ కు డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఆయన కేవలం మంచి నీటి పంపిణీతో ప్రారంభించి, తరువాత కొద్దిమంది బంధువుల సహాయంతో ఆహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ తర్వాత, వివిధ దాతల నుండి ఆయనకు అనేక వస్తువులు రావడం ప్రారంభమైంది. ఆయన సంస్థ నిరసన వేదిక వద్ద ఈ ప్రాథమిక అవసరాన్ని తీర్చే ఒక కేంద్రంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసన కారులు నినాదాలు చేయడం స్వాగతించదగిన విషయం. సంతకం చేసిన ఒప్పందంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడం పట్ల యువత అప్రమత్తంగా ఉండటం మంచిది. దేశవ్యాప్తంగా, ఈ ఉద్యమం అపారమైన సానుకూల ప్రభావాన్ని చూపింది, దీనివల్ల ఉక్కిరిబిక్కిరి అయినట్లు భావించిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. కొంతవరకు తమ అభిప్రాయాలను వ్యక్త పరచ గలుగుతున్నారు. యువత స్ఫూర్తికి ప్రశంసలు తెలుపుతూ, ఈ నిరసన సగం పూర్తి చేసుకుంది. నిరంకుశ ప్రభుత్వ మొండి వైఖరిని ఆందోళన ద్వారా కొంత మేర దిగొచ్చేలా చేసినందుకు వారిని ప్రశంసించాలి.
ప్రశ్న ఏమిటంటే, ఇది నిలుస్తుందా? గత కొన్నేళ్లుగా పేరుకుపోతున్న ప్రజా నిరసనను సరైన మార్గంలో నడిపించడమే ఇక్కడ ప్రశ్న. విస్తృత రాజకీయ కూటములు దీనిని స్వీకరించి, ప్రజాస్వామ్య విలువలు కొంతవరకు పునరుద్ధరించ బడేలా చూస్తాయా లేదా అనేది ప్రశ్న.
ఈ నిరసన అనంతరం, భారతదేశానికి “2014లో స్వాతంత్ర్యం వచ్చింది” అని వ్యాఖ్యానించి, జెన్‌జీ ని “గుంట తరం” అని పిలిచిన భారతీయ జనతా పార్టీ ఎంపీ, హిందీ నటి కంగనా రనౌత్ వంటి వారు చాలా మంది ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శించబడిన సానుకూల, సృజనాత్మక సంస్కృతిని చూడ లేని అలాంటి వారిని చూస్తే సిగ్గు చేటు.
ఇక బీజేపీ యొక్క మేధావుల సెల్ మాజీ చీఫ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-బీజేపీ కి అనేక బాధ్యతలను మోసిన టి. మోహన్‌దాస్ వంటి వారు ఉన్నారు. వారు తమ రాజకీయ సిద్ధాంతం యొక్క అసలు రంగులను చూపించారు. “తన నియంత్రణలో ఉండి ఉంటే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన కారులను కాల్చి చంపి ఉండే వాడిని” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిరసనలో పాల్గొన్న మహిళలు “లా అత్యాచారానికి గురికావడానికి ఇష్టపడతారని, అలా జరిగినా ఫిర్యాదు కూడా చేయరు” అని కూడా ఆయన అన్నారు.
వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఆయన ప్రకటనను ఆర్ఎస్ఎస్ తోసిపుచ్చినప్పటికీ, తమ సభ్యులు ఘోరమైన పనులు చేసినప్పుడు లేదా మాటలు అన్నప్పుడు వారిని తోసిపుచ్చడంలో ఆర్ఎస్ఎస్ దిట్ట. నాథూరామ్ గాడ్సేకు తమతో ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ నిరాకరించిన మరచిపోలేని ఉదాహరణే దీనికి నిదర్శనం. నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే తన “మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్” పుస్తకంలో నాథూరామ్ తో సహా సోదరులందరూ ఆర్ఎస్ఎస్ శాఖల లోనే పెరిగారని పేర్కొన్నప్పటికీ ఈ నిరాకరణ జరిగింది.
హిందూ జాతీయవాద సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్‌దాస్, ప్రజాస్వామ్య ప్రమాణాలు, మహిళా సమానత్వం రెండింటినీ కోరుకోదగినవిగా భావించకుండా, వాటి పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తారు. జంతర్ మంతర్ వద్ద నిరసనను అదుపు చేసే కాలక్రమాన్ని ఆయన వివరిస్తారు. మొదట, ఆయన ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి ఉండేవారు, ఆపై చెదరిపోవాలని హెచ్చరిక ఇచ్చి ఉండేవారు, అది విఫలమైతే కాల్పులకు ఉత్తర్వులు జారీ చేసి, చనిపోయిన వారిని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి ఉండేవారు.
మోహన్‌దాస్ తిరస్కరిస్తున్న ప్రజాస్వామ్య ప్రమాణాలు, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలో ఉన్న గత 12-13 సంవత్సరాలుగా ఇప్పటికే స్పష్టంగా తెలిసాయి.
ప్రజాస్వామ్య ప్రమాణాలలో భారతదేశం యొక్క ర్యాంకింగ్‌ను చూపే ప్రపంచ సూచీలు ఏడాది కేదాడి పడిపోతున్నాయి. ఎంతగా అంటే ఇప్పుడు దాన్ని “ఎలక్టోరల్ ఆటోక్రసీ” (ఎన్నికల నిరంకుశత్వం) గా ముద్ర వేశారు. ఈ ప్రభుత్వం తీరు చూసి బీజేపీ ‘మార్గదర్శక్ మండి’ కూడా ఆందోళన చెందుతోంది. మొదట, లాల్ కృష్ణ అద్వానీ ఇది “ప్రకటించని అత్యవసర పరిస్థితి” అని పేర్కొన్నారు. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి నిరసనలను పోలీసులు నిర్వహించిన తీరును విమర్శిస్తున్నారు.
ఫ్రీడమ్ హౌస్ (వరల్డ్ ఇండెక్స్‌లో ఫ్రీడమ్) ప్రకారం రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛలపై ఉన్న ఒత్తిళ్ల కారణంగా భారతదేశం 100 నుండి 62 కి పడేసి దేశాన్ని “పాక్షికంగా స్వేచ్ఛ కలిగినది”గా పేర్కొంది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డెమోక్రసీ ఇండెక్స్) భారతదేశాన్ని “లోపభూయిష్ట ప్రజాస్వామ్యం”గా వర్గీకరించింది. వి-డెమ్ ఇన్స్టిట్యూట్ (డెమోక్రసీ రిపోర్ట్స్) పౌర స్థలం, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గణనీయంగా తగ్గడాన్ని ఎత్తి చూపుతూ భారతదేశ పాలనా నిర్మాణాన్ని “ఎలక్టోరల్ ఆటోక్రసీ”కి దగ్గరగా వర్గీకరించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్) 180 దేశాలలో భారతదేశానికి 157 వ స్థానాన్ని ఇచ్చింది. ఇది మీడియా స్వతంత్రత, పాత్రికేయుల భద్రతపై పెరుగుతున్న ఆంక్షలకు నిదర్శనం.
జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న అమ్మాయిలు, మహిళల గురించి మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరిత దుర్భాషలు, వ్యాఖ్యల జాబితా నుండి నేరుగా వచ్చినవి. మోహన్‌దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ఎస్ఎస్, రాచరిక, పితృస్వామ్య విలువలలో లోతుగా వేళ్లూనుకుంది. ఇందులో సూత్రప్రాయంగా మహిళలను పురుషుడి ఆస్తిగా పరిగణిస్తారు. కోమత్వ రాజకీయం మహిళల శరీరాలపై ఆడబడుతుంది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులతో కూడిన పురుషుల సంస్థ. దాని అనుబంధ మహిళా సంస్థ ‘రాష్ట్ర సేవికా సమితి’. ఇక్కడ మహిళలు కేవలం ‘సేవికలు’ (సేవకులు) గా మాత్రమే ఉండ గలరు.
సావీ మ్యాగజైన్ (ఏప్రిల్ 1994)లో, బీజేపీకి చెందిన మృదులా సిన్హా, కట్నం తీసుకోవడం, ఇవ్వడం ఓకే అని, భార్యను కొట్టడం ఓకే అని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంటే తప్ప మహిళలు బయట పనిచేయ కూడదని అంగీకరించారు. మహిళల జీవితాలు వంటగది, పిల్లలు, చర్చి చుట్టూ తిరగాలని హిట్లర్ ఇచ్చిన ఆదేశాలకు ఇది పూర్తిగా అనుగుణంగా ఉంది.
హిందూత్వ ప్రధాన సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్, శివాజీ సైన్యం ఆయనకు కానుకగా తెచ్చిన బస్సేన్ రాజు కోడలిని తిరిగి పంపినందుకు ఉదాత్త రాజు శివాజీని నిరసిస్తారు. ఆయన ప్రకారం, పగ తీర్చుకోవడానికి ముస్లిం మహిళలపై అఘాయిత్యాలు అవసరం.
ఆర్ఎస్ఎస్ వంచన భాష ద్వారా తన నిజమైన సిద్ధాంతాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నది. కానీ సత్యం మళ్లీ మళ్లీ బయటపడుతుంది. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఇంతకుముందు జరిగిన అవినీతి నిరోధక నిరసనను కాంగ్రెస్‌ను బద్నామ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ తెలివిగా ప్రోత్సహించింది. ఈసారి మనం జాగ్రత్త వహించాలి. తగిన సమయంలో, ప్రజాస్వామ్య శక్తులు ఒక్కటిగా నిలిచి, టి. మోహన్‌దాస్ వంటి వారు, వారి సైద్ధాంతిక మూలాలు ఈ నిరసనను తమ చేతుల్లోకి తీసుకోకుండా, హిందూ జాతీయ వాదం యొక్క విభజన రాజకీయాలను బలోపేతం చేయకుండా జాగ్రత్త వహించాలి.
ఖచ్చితంగా, ఈ దేశంలో చాలామంది ప్రస్తుత పాలనతో విసిగి పోయారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే లౌకిక ప్రజాస్వామ్యంలో వారికి స్థానం ఉండదు. మోహన్‌దాస్ ప్రకటన మరొక మోహన్‌దాస్ యొక్క రాజకీయాలకు పూర్తిగా భిన్నమైనది. నేతాజీ సుభాష్ బోస్ బాటలో మనం ఆయనను ‘జాతిపిత’ అని పిలుస్తాము.
రచయిత
రామ్ పునియాని.
ఐఐటీ బొంబాయిలో బోధించిన మానవ హక్కుల కార్యకర్త.
ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు.
తెలుగు అనుయాయడం: ది వైర్ తెలుగు టీమ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
