కేవలం నాలుగు రౌండ్లు మాత్రమే కాల్పులు జరిగాయన్న బీహార్ పోలీసుల వాదనకు ఆల్ట్ న్యూస్ (Alt News) పరిశోధన ఫలితాలు విరుద్ధంగా ఉన్నాయి. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మరో అడుగు ముందుకు వేసి, నిరసన కారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఎప్పుడూ AK-47లను ఉపయోగించలేదని వ్యాఖ్యానించారు.
పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై బీహార్‌లో ప్రారంభమైన యువజన ఉద్యమం, జులై 25న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ బీహార్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా సివాన్ హింసాత్మకంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 22న పాట్నాలో విద్యార్థులు చేపట్టిన భారీ యువజన ప్రదర్శనపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌కు నిరసనగా ఈ బంద్‌ను నిర్వహించారు.
సివాన్ లోని జె.పి. చౌక్ సమీపంలో నిరసన కారులు పోలీసులతో ఘర్షణ పడటంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణ సమయంలో, పోలీసు సిబ్బంది AK-47 అసాల్ట్ రైఫిల్లు, పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్, 21 ఏళ్ల ఆకాష్ యాదవ్, 20 ఏళ్ల బులెట్ కుమార్ గోండ్లుగా గుర్తించారు. ముగ్గురినీ మొదట సివాన్ సదర్ ఆసుపత్రిలో చేర్పించి, అనంతరం గాయాల తీవ్రత దృష్ట్యా పాట్నాలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే, రక్తం ఓడుతున్న ఆకాష్, ఆరిఫ్‌లను రిక్షాలో ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి.
గాయపడిన వారి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఈ ముగ్గురిలో ఎవరూ హింసాత్మక నిరసనలో పాల్గొన లేదు. ఒక స్థానిక దుకాణంలో పనిచేసే ఆరిఫ్, బంద్ కారణంగా షాపు మూసేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన మెడలో తుపాకీ గుండు తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఆకాష్, తన నిశ్చితార్థురాలితో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడానికి సివాన్ వచ్చాడు. కేక్ కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి.
కులం, నివాస ధృవీకరణ పత్రాలు పొందడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుండగా తన కాలుకి తుపాకీ గుండు తగిలిందని బులెట్ కుమార్ గోండ్ చెప్పారు. అంతేకాకుండా, తనకు తుపాకీ దెబ్బ తగిలిన తర్వాత కూడా పోలీసులు ఫైబర్‌గ్లాస్ లాఠీలతో తనపై దాడి చేశారని, ఒక కాలుపై గెంతు కుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చేలా బలవంతం చేశారని ఆయన ఆరోపించారు. “అంబులెన్స్ పిలిచే ముందు నేను సుమారు ఒక గంట పాటు నొప్పితో విలవిలలాడాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం పోలీస్ కానిస్టేబుల్ AK-47 రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో బీహార్ పోలీసులు కానిస్టేబుల్ అభిషేక్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. జులై 27న విడుదల చేసిన ప్రకటనలో, ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం నిరసన కారులు చుట్టుముట్టిన తర్వాత కానిస్టేబుల్ గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని సివాన్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని కూడా పోలీసులు చెప్పారు. ఈ ఘటన పై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు. కాల్పులకు ఎవరు అనుమతి ఇచ్చారో కూడా విచారణలో పరిశీలిస్తామని సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పూరన్ కుమార్ ఝా తెలిపారు.
అయితే, ఆల్ట్ న్యూస్ (Alt News) జరిపిన విశ్లేషణ పోలీసుల అధికారిక వివరణపై పలు అనుమానాలు, ప్రశ్నలను లేవనెత్తుతోంది. దగ్గర లోని ప్రజలు వేర్వేరు కోణాల నుండి తీసిన వీడియోలను ఆల్ట్ న్యూస్ పరిశీలించింది. ఆ దృశ్యాల జియో లొకేషన్ వెరిఫికేషన్ నిర్వహించింది. పోలీసులు రెండు వేర్వేరు ప్రదేశాలలో AK-47 రైఫిళ్ల నుండి కనీసం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఈ పరిశోధనలో తేలింది. దీనికి అదనంగా, పోలీసు సిబ్బంది పిస్టళ్లతో కాల్పులు జరిపిన రెండు వేర్వేరు సంఘటనలు కూడా కెమెరాలో రికార్డయ్యాయి. జులై 25 నాటి హింసాత్మక సంఘటనల సమయంలోనే ఈ వీడియోలు కూడా సివాన్ లో రికార్డ్ అయినట్లు జియో లొకేషన్ విశ్లేషణ ధృవీకరించింది.
సివాన్ డిస్ట్రిక్ట్ కమాండెంట్ ఆఫీస్ ముందు ఎనిమిది రౌండ్ల కాల్పులు:
ఒక పోలీస్ కానిస్టేబుల్ AK-47 రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలను చూపే వీడియోలను ఆల్ట్ న్యూస్ మూడు వేర్వేరు కోణాల నుండి సేకరించింది. ఈ దృశ్యాల ద్వారా అతను కనీసం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పష్టమవుతోంది. మూడు వీడియోలలో కనిపిస్తున్న దుకాణాలు, భవనాలను సరి పోల్చడం ద్వారా, ఈ వీడియో దృశ్యాలు సివాన్ లోని డిస్ట్రిక్ట్ కమాండెంట్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై రికార్డ్ అయినట్లు ఆల్ట్ న్యూస్ ధృవీకరించింది.
సివాన్ లోని నయా బజార్, కాగ్జీ మొహల్లా వైపు వెళ్లే రోడ్డుపై ఒక రౌండ్ కాల్పులు:
రెండవ ప్రదేశంలో, ఒక పోలీసు అధికారి AK-47 రైఫిల్ నుండి కనీసం ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు ఆల్ట్ న్యూస్ గుర్తించింది. ఈ సంఘటనకు సంబంధించి రెండు వేర్వేరు కోణాల నుండి తీసిన వీడియోలను ఆ సంస్థ సంపాదించింది.
రచయిత: అభిషేక్ కుమార్ (ఆల్ట్ న్యూస్)
తెలుగు అనువాదం: ది వైర్ తెలుగు టీమ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
