(జంతర్ మంతర్ వద్ద ఒక యువతి పార్లమెంటరీయేతర పదాలను ఉపయోగించింది. అవును, ఆ పదాలు విమర్శించదగినవే. కానీ బహుళ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, సంబంధిత అధికార పరిధి లేని పోలీస్ స్టేషన్లో, బాధితుడు కాని వ్యక్తి (లోకస్ స్టాండీ లేని వ్యక్తి) దాఖలు చేసిన కేసు వల్ల అంతకంటే ఎక్కువ హాని జరుగుతుంది.)
నేరుగా విషయానికి వద్దాం. జూలై 23న జంతర్ మంతర్ వద్ద ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనాగరికంగా ఉన్నాయి.
అవి ప్రభుత్వ విధానం పై విమర్శా కాదు, ఏ వాదనకూ సమాధానమూ కాదు.
ఉద్యమం ద్వారా ఇప్పటికే ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసేలా ఒత్తిడి చేసిన నిరసనను ఈ వ్యాఖ్యలు బలహీనపరిచాయే తప్ప, ఉద్యమానికి ఎంతమాత్రం తోడ్పడేవి కాదు. అవి ఖండనార్హమే.
జూలై 29న, నోయిడా పోలీసులు ఆ వ్యాఖ్యలు చేసిన యువతిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జీరో ఎఫ్ఐఆర్ అంటే స్థానిక అధికార పరిధి లేని స్టేషన్లో నమోదు చేసి, ఆపై సంబంధిత స్టేషన్‌కు- ఈ కేసులో ఢిల్లీకి- బదిలీ చేసేది.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 352, 353(1), 356(1) సెక్షన్లను చేర్చారు.
ఇవి వరుసగా అవమానం, ప్రజా సమస్యాత్మక ప్రవర్తన(పబ్లిక్ మిస్చీఫ్), పరిహసించడం లేదా మాననష్టం (డిఫమేషన్)కు సంబంధించినవి.
ఈ ఫిర్యాదు సదరు వ్యాఖ్యలకు గురైన వ్యక్తి దాఖలు చేయలేదు. కేవలం ఒక వీడియో చూసిన లాయర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని తగ్గించాయనేది కారణంగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్లోని సెక్షన్ల మూలాలు – మెకాలే కోడ్..
ఈ ఎఫ్ఐఆర్లో లోపమేమిటో తెలుసుకోవడానికి, ఈ మూడు నిబంధనలు ఎక్కడి నుండి వచ్చాయో చూడండి.
ఇవన్నీ 1860లో రూపొందించిన మెకాలే పీనల్ కోడ్ (ఐపీసీ) నుండి వచ్చినవే. సెక్షన్ 356 (మాననష్టం) అనేది ఆ కోడ్‌లోని సెక్షన్ 499.
మెకాలే ఇంగ్లీష్ చట్టంలోని ‘లైబెల్’, ‘స్లాండర్’ అనే రెండు విభాగాలను ఒకే నేరంగా కలిపి, ఒక వ్యక్తి కీర్తికి భంగం కలిగించడాన్ని నేరంగా మార్చాడు.
సెక్షన్ 352 అనేది పాత సెక్షన్ 504: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం. సెక్షన్ 353 అనేది పాత సెక్షన్ 505: ప్రజలలో భయాందోళనలు రేకెత్తించే లేదా గొడవలకు ప్రేరేపించే ప్రకటనలు.
వీటిని కలిపి చదివితే స్పష్టంగా ఏం అర్థమవుతుంది. ప్రతి నిబంధన కూడా ప్రత్యక్ష హాని, కీర్తి నాశనం, గొడవలు రేపి ప్రజాశాంతికి భంగం వాటిల్లకుండా రక్షణ కల్పిస్తుంది.
వీటిలో ఏ ఒక్క సెక్షను కూడా ఒక రాజ్యాంగ పదవి గౌరవాన్ని రక్షించడానికి ఉద్దేశించినది కాదు.
సుప్రీంకోర్టు ఈ సెక్షన్లను ఆ ఉద్దేశానికే పరిమితం చేసింది. అవమానానికి సంబంధించి, కేవలం తిట్టడం లేదా అసభ్యంగా మాట్లాడటం నేరం కాదని దశాబ్దాలుగా పేర్కొంటోంది.
ఆ పదాలు అవమానించబడిన వ్యక్తిని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రేరేపించే విధంగా ఉండాలి.
ప్రజా సమస్యాత్మక ప్రవర్తన విషయానికి వస్తే, నేరపూరిత ఉద్దేశమే ఈ నేరానికి ప్రధానం.
సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?..
బల్వంత్ సింగ్(1995) కేసులో, ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజు సాయంత్రం చండీగఢ్‌లో వేర్పాటువాద నినాదాలు చేసిన ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
గొడవలు రేకెత్తించే ఉద్దేశం లేదా ధోరణి లేకుండా సాధారణంగా చేసిన నినాదాలు నేరం కాదని పేర్కొంది.
ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చట్టాన్ని అమలు చేసే వారి అతిసున్నితత్వమే సమస్యలను తెచ్చిపెడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
సుబ్రమణియన్ స్వామి(2016) కేసులో సుప్రీంకోర్టు మాననష్టం నిబంధనను సమర్థించినప్పుడు, అది ఒక వ్యక్తి కీర్తి ఆ వ్యక్తి వ్యక్తిగత గౌరవంలో భాగమనే సంకుచిత ప్రాతిపదికన మాత్రమే చేసింది. మరోమాటలో చెప్పాలంటే, కీర్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించినది.
జంతర్ మంతర్ ఘటనలో చట్టం వర్తిస్తుందా?
ఇప్పుడు దీన్ని జంతర్ మంతర్ వద్ద మాట్లాడిన పదాలకు వర్తింపజేయండి. ఆ పదాలు నిస్సందేహంగా నిందార్హమైనవి, కానీ అంతమాత్రాన అవి చట్ట ప్రకారం నేరాలు కావు.
ముందుగా అవమానం(ఇన్సల్ట్) తీసుకోండి. అవమానించబడిన వ్యక్తిని గొడవకు ప్రేరేపించేలా ఉంటేనే అది నేరం అవుతుంది.
కానీ ప్రస్తుత కేసులో అది ఎంతమాత్రం సాధ్యం కాదు. ఆ వ్యాఖ్యలకు గురైన వ్యక్తి జంతర్ మంతర్ వద్ద లేరు.
ఒక వీడియో చూసి ఆయన వీధి గొడవకు దిగే అవకాశం లేదు. పైగా, ఆయన తన సొంత వీడియో సందేశంలో నిందితురాలిని క్షమించానని ప్రకటించారు కూడా.
జనాల స్పందన ఇక్కడ ముఖ్యం కాదు. చట్టం ఉద్దేశించిన వ్యక్తి స్పందనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.
తర్వాతిది, ప్రజా సమస్యాత్మక ప్రవర్తన(పబ్లిక్ మిస్చీఫ్). ఇది కూడా నిలబడదు.
ఈ నేరానికి ప్రజల్లో భయం రేకెత్తించే ఉద్దేశం లేదా ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉద్దేశం ఉండాలి.
ఒక నిరసనలో నాయకుడిని తీవ్రంగా నిందించడం ఎంత అసహ్యంగా ఉన్నప్పటికీ, ప్రజాశాంతికి విఘాతం కలిగించదు.
చివరగా, మాననష్టం(డిఫమేషన్). ఈ మూడింటిలోనూ ఇది అత్యంత విచిత్రమైనది. కీర్తి అనేది వ్యక్తులకు చెందుతుంది, సంస్థలకు లేదా పదవులకు కాదు. ఒక పదవి గౌరవాన్ని మాననష్టం చేయడం సాధ్యం కాదు.
బాధిత వ్యక్తి కాకుండా ఇతరులు ఫిర్యాదు చేయవచ్చా?
చట్టం ప్రకారం ఎవరు ఫిర్యాదు చేయవచ్చో చాలా స్పష్టంగా ఉంది. నేర విచారణను నియంత్రించే కొత్త ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ ప్రకారం, బాధిత వ్యక్తి ఫిర్యాదు చేస్తేనే కోర్టు మాననష్టం కేసును స్వీకరిస్తుంది.
ఇక్కడ ఆ వ్యక్తి ప్రధాని అయినప్పుడు, కేవలం వీడియో చూసి వేరొకరి గౌరవానికి కాపలాదారుగా మారిన ఒక లాయర్ ఫిర్యాదు చేయడం కుదరదు. ప్రధాని ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, ఈ మోపబడిన మోసపూరితమైన నేరంలో సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఫిర్యాదు చేసే హక్కు(లోకస్ స్టాండీ) ఇతరులు ఎవరికీ ఉండదు.
చట్టం దుర్వినియోగం కాకూడదు..
ఇవేవీ ఆ యువతి చేసిన వ్యాఖ్యలను సమర్థించడానికి ఉద్దేశించినవి కావు. జంతర్ మంతర్ నిరసన ఒక మంత్రిని పదవి నుండి తప్పుకునేలా చేసేంత శక్తివంతమైనది. అలాంటి ఉద్యమానికి ఇటువంటి అనుచిత వ్యాఖ్యల అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో చెడు వ్యాఖ్యలకు సమాధానం ఖండించడం, మెరుగైన వాదన వినిపించడమే.
నేర విచారణ చట్టం అనేది ఒక ఆయుధం లాంటిది, ఒక ఉన్నత పదవి గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ సెక్షన్లు రూపొందించబడలేదు. హేళన చేసే వ్యక్తి నుండి ఉన్నత పదవి గౌరవాన్ని కాపాడటానికి మన కొత్త నేర విచారణ చట్టాలను అడ్డం పెట్టుకోవడమే అసలైన ప్రజా సమస్యాత్మక ప్రవర్తన (పబ్లిక్ మిస్చీఫ్).
సౌరభ్ గుప్తా, ఆదిత్య ప్రసన్న భట్టాచార్య
(గుప్తా భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్, అలాగే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ సీనియర్ కోర్ట్‌ల సొలిసిటర్. భట్టాచార్య విధి బెంగాల్ లీడ్.)
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: కే సత్యరంజన్..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
